Thursday, 20 November 2025








శివ స్తోత్రాలు

                   (29వ. భాగం)

                శివ మానస పూజ

గత 28రోజులుగా ఈ కార్తీక మాసం అంతా రోజూ ఒక స్తోత్రమో, కవచమో, దండకమో.. ఏదో ఓకటితో పరమేశ్వరుణ్ణి స్తుతిస్తున్నాము. 

మనలో చాలా మంది ప్రతీ రోజూ షోడశోపచా రాలలో లేదా పంచోపచారాలలో అనేక ద్రవ్యాలతో పూజలు చేస్తోనే ఉంటాము. అవన్నీ పరమేశ్వరుడు మనకి ఇచ్చినవే. ఇందులో మనవంటో ఏవీలేవు.సాధారణంగా అంతా యాంత్రికంగా ఒక తంతుగా జరిగిపోతూనే ఉంటుంది.  కొందరైతే ఎంతో ఆర్భాటంగా చేస్తూ ఉంటారు.

అసలు పరమేశ్వరునికి కావలసింది, మనదంటో అయినది ఒకటుందని ఎప్పుడైనా ఆలోచించామా?  అదే మన మనస్సు. దానిని అర్పించడం మానసపూజ. దాన్ని ఎల్లా అర్పించాలో  ఆది గురువులు శ్రీ శంకర భగవత్పాదులు ఈ శివమానస పూజలో చక్కగా విసిదేకరించారు.

అట్టి మహత్తర స్తోత్రరాజాన్ని ఈ రోజు మనం గానంచేసితరిద్దాము.

నేటికి శలవు. రేపు ఆఖరి స్తోత్రంతోకలుద్దాం.

             శివ మానస పూజ


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం

నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।

జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥


సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ ।

శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం

తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ॥ 2 ॥


ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం

వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా ।

సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా

సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ॥ 3 ॥


ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః ।

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ॥ 4 ॥


కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ ।

విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ

జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥ 5 ॥

****

 శివస్తోత్రాలు

                      (30వ. స్తోత్రం)

                    శివ మంగళాష్టకం

నేటితో కార్తీకమాసం పూర్తి అవుతోంది. పరమేశ్వరుని నిర్హేతుక కరుణా కటాక్షవీక్షణాభాగ్యంగా గత 29 రోజులుగా ఈ క్రింది శివ స్తోత్రాలు, కవచాలు, దండకాలు ఇత్యాది ప్రక్రియలు ఎన్నో చూసాము. చివరగా శివ మానస పూజా స్తోత్రాన్ని అవలోకించడం జరిగింది.  


1.శివ షడక్షరి…శ్రీ శంకరచార్య విరచితం

2.చంద్ర శేఖరాష్టం.. శ్రీ మార్కండేయ విరచితం.

3.అర్థనారీశ్వర స్తోత్రం..శ్రీ శంకరచార్య విరచితం

4.మార్గబంధు స్తోత్రం.. శ్రీ అప్పయ్య దీక్షితులు.

5.వైద్యనాథాష్టకం… శ్రీశంకరచార్య విరచితం.

6.ఉమామహేశ్వర స్తోత్రం..శ్రీశంకరచార్య విరచితం.

7.శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం.. రచయిత తెలియదు.

8.శ్రీకాశీ విశ్వనాథాష్టకం..శ్రీశంకరచార్య విరచితం

9.శ్రీశివ పంచాక్షరీ స్తోత్రం.శ్రీశంకరచార్య విరచితం

10.శ్రీశైల రగడ..రచయిత తెలియదు.

11.శివ గద్యం…శ్రీ నీలకంఠదీక్షితుల

12.ఉపమన్యు కృత శివ స్తోత్రం

13.శివరక్షాస్తోత్రం..శ్రీ యాజ్ఞవల్క్యవిరచితం.

14.శివ దండకం.. ఆదికవి నన్నయ్య.

15.శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్..శ్రీశంకరచార్య విరచితం.

16.శివతాండవ స్తోత్రం…రావణబ్రహ్మ విరచితం.

17.హరిహరాష్టోత్తరశతనామ స్తోత్రమ్.. యమప్రోక్తం.

18.శ్రీదక్షిణామూర్తి స్తోత్రం..శ్రీశంకరచార్య విరచితం

19.నటేశ స్తవం…రచయిత తెలియదు

20.శ్రీ గంగాధర స్తోత్రం..శ్రీ అప్పయ్య దీక్షితులు

21.శ్రీ రుద్ర కవచం.. దుర్వాస మహర్షి విరచితం.

22.శ్రీమహేశ్వర పంచరత్న స్తోత్రం..శ్రీశంకరచార్య విరచితం

23.శ్రీపతంజలి కృత

  చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం

24.దారిద్ర్య దహన శివ స్తోత్రం..శ్రీ వసిష్ఠ విరచితం

25.శ్రీఅగస్త్యాష్టకమ్

26.శ్రీకృష్ణార్జున కృత శివ స్తుతి

27.హిమాలయ కృత శివ స్తోత్రం

28.శ్రీబృహస్పతి కృత మహాదేవ స్తోత్రం

29.శివ మానస పూజ..శ్రీశంకరచార్య విరచితం.

చివరగా

30.శివ మంగళాష్టకం..శ్రీశంకరచార్య విరచితం

   భవానీ నీరాంజనం.. శ్రీ బేతవోలురామబ్రహ్మం

జగద్రక్షకుడైన శివుని మంగళాష్టకంతో పాటు జగజ్జననిపై శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు రాసిన అద్భుతమైన నీరాజనంతో ఈ శివస్తోత్రాలు శీర్షికను ముగించేముందర ఆ పురాణపురుషుల కారుణ్యాన్ని ఒక్కసారి తలుచుకుందాము.

వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ || .

భార్యా భర్తలంటే ఎల్లావుండాలో, తల్లి తండ్రులంటే ఎల్లా ఉండాలో తెలియచేసారు పార్వతీ పరమేశ్వరులు.బిడ్డలపై వారి కారుణ్యానికి అవధులు లేవు.

ఆలాహలం ఉద్భవించి జగములు అల్లకల్లోలమైన వేళ, తమ పిల్లలను కాపాడడానికి పరమశివుడు ముందుకు రావడం, దాన్ని ఆ తల్లి సమర్ధించడం..ఆహా..

ఇంతకన్నా కారుణ్యానికి, వాత్సల్యానికి ప్రపంచంలో ఎక్కడైనా ఉదాహరణ దొరుకుతుందా? 

పోతనా మాత్యుని పలుకులలో

మ్రింగెడివాడు విభుండని

మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్

మ్రింగుమనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

ఈ కార్తీకమాసం ముప్పై రోజులుగా మనమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను సేవించుకున్నాముగా, మరి ఆ పురాణదంపతుల    నుండి ఏమి నేర్చుకోవాలో ఆలోచించామా? కేవలం స్తోత్ర పారాయణలు, అభిషేకాలు, ఉపవాసాలు.. ఇవేనా? 

అసలు భార్యాభర్తలు అంటే ఎల్లా ఉండాలి? పిల్లలపై వాత్సల్యం ఎల్లా ఉండాలి? త్యాగనిరతి ఏమిటి?.. ఇదేమన్నా నేర్చుకున్నామా? అని ఒక్కసారి ఆలోచించి..వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను సుసంపన్నం చేసుకుందుకు పూనుకుందాము. అదే ఆ ఆదిదంపతులకు మనం సమర్పించే నిజమైన మంగళహారతి. 

ప్రస్తుతానికి శలవు.

  


             శివ మంగళాష్టకం.



భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥


వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।

పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥


భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।

రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥


సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే ।

సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥


మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే ।

త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ॥ 5 ॥


గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ।

ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ॥ 6 ॥


సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే ।

ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ॥ 7 ॥


సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ ।

అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ॥ 8 ॥


శ్రీచాముండాప్రేరితేన రచితం మంగళాస్పదమ్ ।

తస్యాభీష్టప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ ॥ 9 ॥


మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ ।

సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 10 ॥


శ్రీ శంకరాచార్యవిరచిత శివ మంగళాష్టకం సంపూర్ణం.


          శ్రీ బేతవోలు రామబ్రహ్మ విరచిత   


                  భవానీ నీరాంజనం


శీతాద్రి శిఖారాన పగడాలు తాపించు

మా తల్లి లత్తుకకు నీరాజనం- కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం.


యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి

బాగైన అందెలకు నీరాజనం- బంగారు నీరాజనం- భక్తి పొంగారు నీరాజనం.


నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు

మా తల్లి గాజులకు నీరాజనం- రాగాల నీరాజనం- భక్తి తాళాల నీరాజనం.


మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు

మా తల్లి నవ్వులకు నీరాజనం- ముత్యాల నీరాజనం- భక్తి నృత్యాల నీరాజనం.


చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు

మా తల్లి ముంగరకు నీరాజనం- రతనాల నీరాజనం- భక్తి జతనాల నీరాజనం.


పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు

మా తల్లి చూపులకు నీరాజనం- అనురాగ నీరాజనం- భక్తి కనరాగ నీరాజనం.


దహరాన కనిపించు ఇనబింబ మనిపించు

మా తల్లి కుంకుమకు నీరాజనం- నిండైన నీరాజనం- -భక్తి మెండైన నీరాజనం.


తేటిపిల్లల వొలె గాలి కల్లలనాడు

మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం- భక్తి భావాల నీరాజనం.


జగదేకమోహిని, సర్వేశగేహిని

మా తల్లి రూపునకు నీరాజనం- నిలవెత్తు నీరాజనం- భక్తి నిలువెత్తి నీరాజనం.

*****