Saturday, 18 January 2025

 #Day5 


శ్రీమాత్రే నమః


సౌందర్యలహరి -4 శ్లోకం


త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః

త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।

భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం

శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥  

అర్థము


అమ్మా! జగజ్జననీ!!

ఇతర దేవతలకు రెండు చేతులతో రెండు ముద్రలు పెట్టి ఉంటారు. అవి అభయ ముద్ర, వరద ముద్ర. నీవు మాత్రం నీ చేతులతో ఏలాంటి మద్రులు అభినయించకున్నావు. అమ్మా! భయము నుంచి రక్షించటానికీ, కోరినవి ప్రసాదించటానికీ నీ పాదములు సమర్థమైఉండగా ఇంక చేతులతో ముద్రలు పట్టనేల?


తేటగీతి

అభయ ముద్రతో పనిఏల? అభయ మొసగ/

మాత! వరదాయిని!చరణమదియు చాలు/

మించి కల్పవృక్షముగ కామితముతీర్చ/

కొలచెదను సంధ్యను శరణు గోరి మదిన।।


వివరణ:


దేవతలు భక్తుల కోరికలు తీర్చటానికి గుర్తుగా వరద ముద్ర, అభయ ముద్ర పట్టి ఉంటారు. -అభయ ముద్ర అంటే, చెయి తెరచి వెళ్ళు పైకి ఉండేలా పెట్టడం. కారణము భయంలేదు నీకన్న సందేశమందులో ఉంది.

-వరద ముద్ర అంటే, నీవు కోరినవి తీసుకో అన్న సందేశము తెలిపుతూ వెళ్ళు క్రిందకు చూపుతూ చెయి తెరచి ఉంచటము. ఇవి సామాన్యంగా సర్వదేవతలలో చూస్తాము. కాని అమ్మవారు మాత్రము అలా లేరు. 


అమ్మ చతుర్భుజ. నాలుగు చేతులలో నాలుగు ఆయుధములు ధరించింది. అవి పాశము, అంకుశము, ధనస్సు, పంచ బాణములు. 


కాళీదాసు శ్యామలాదండకములో చెబుతాడు:


“చతుర్భుజే చంద్రకళావంతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే।

పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణా హస్తే నమస్తే జగదేకమాతః॥”

ఆయన దర్శించిన తల్లి నాలుగు చేతులతో ఉన్నది. ఆమె చేతులలో పాశాంకుశము, ధనస్సు బాణాలున్నవన్నాడు. 


లలితా ప్రార్థనా శ్లోకంలో చెబుతారు ఇలా

“ సకుంకుమ విలేపనా మళికచుంబికస్తూరికాం

సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం”  అని చెప్పారు. 


లలితా నామాలలో “ఉద్యద్భాను సహస్రాభా చతుర్భాహు సమన్వితా

రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా

మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్రసాయకా”॥ అన్న నామాలు మనకు చెబుతున్నదీ ఇదే. 

అమ్మ నాలుగు చేతులతో ఉన్నది. అందులో ఎడమవైపు పైచేతిలో పాశము పట్టుకున్నది. ఇది అనురాగ పాశము. జీవిని కట్టిపడేస్తుంది. 

రాగము అరిషడ్వర్గాలకు మూలము. దీనిని జయిస్తే ముక్తి లభ్యమవుతుంది. 

(అమ్మవారి ఆయుదాలకు మంత్రాలుంటాయి. అవి జపించిన వారికి భయం తొలిగిపోతుంది.) 


అమ్మవారి కుడి చేతిలో అంకుశముంది. రాగం అంటే కోరిక. అది తీరకపోతే కోపము ద్వేషం కలుగుతాయి. అమ్మవారు తన అంకుశముతో ఆ కోప ద్వేషాలను తీసేస్తుంది. 

అమ్మ క్రింది వెడమ చేతిలో ధనస్సు పట్టుకుంది. మనస్సే ధనస్సు. సంకల్ప వికల్పాలకు కారణము మనస్సు. మోక్షకామికై ఈ మనస్సును అదుపు చెయ్యాలి సాధకుడు. 

అమ్మ కుడి చేతిలో బాణాలుంటాయి. అవి కమలము, ఇందీవరము, పారిజాతము, కల్హారము, సహకారము. అవే పంచ తన్మాత్రలు.

సాధకులు మనస్సు అన్న ధనస్సును అదుపు చేసి, అహంకారమన్న పుష్పము అమ్మకు సమర్పిస్తే వారికి మోక్షము సిద్ధిస్తుంది. 

అటు వంటి అమ్మ మనకు మళ్ళీ అభయ వరద ముద్రలతో ఎందుకు కనపడటం? ఆమె పాదాలను ఆశ్రయిస్తే చాలు మనకు సర్వం సమకూరుతాయి.

సర్వం సమకూరుతాయని నానారకాలు కావాలనుకోకూడదు. చెడ్డపనులు చేసి అమ్మ రక్షిస్తుందని కోరకూడదు. అమ్మవారికి ఉన్న నామాలలో వాంఛితార్థ ప్రదాయిని అన్న నామం కూడా ఉంది. అంటే కోరిన వాటిలో అర్థవంతమైనవాటిని ఇస్తుంది. 


తనను శరణు కోరిన వారిని రక్షించే తల్లి పాదాలు పరమపూజ్యాలు. 

 కాబట్టి అమ్మవారికి అభయ ముద్ర, వరద ముద్ర పట్టనవసరము లేదని శంకరులవారు మనకు చెబుతున్నారు. 


అమ్మ పాదాలు విడవక పట్టుకోవటమే సాధకులుగా మన పని అని శంకరులు మనకు చేసిన బోధగా గ్రహించి, సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ


సంధ్యా యల్లాప్రగడ

#Day4

 


సౌందర్యలహరి -3


అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ

నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥


అర్థం

అమ్మా! నీ పాదము ల నుంచి వచ్చే పద్మపరాగం అజ్ఞానులకు సూర్యోదమైన పట్టణము వంటిది. మందబుద్ధులైన జడులకు జ్ఞానమిచ్చు తేనె ప్రవాహము. 

దరిద్రులకు చింతమణుల వరసవంటింది. సంసారమన్న సాగరములో మునిగిన జనులకు ఆది వరహామూర్తి కోర వంటిది. (భూమి సముద్రములో మునిగిన నాడు మహావిష్ణువు వరాహావతారములో భూమిని తన కోరపై ఉంచుకొని పైకి తీసుకువచ్చాడు)


తేటగీతి॥

“జలధి సంసారమిది నెంచ జనులకిలన,

నీ పదములాశ్రయించిగ నెనది, సూర్య।

కాంతి వెలుగు, తొలగు నంధకార తమసు

కొలచెదను సంధ్యను శరణుఁగోరి మదిని॥


ఈ శ్లోకములో మనకు భగవద్పాదులవారు అమ్మవారి పాద ధూళి కణము గురించి మరింత చెబుతున్నారు. 

ఈ శ్లోకము అత్యంత శక్తివంతమైన శ్లోకము. దీని రోజూ వెయి చొప్పున పన్నెండు రోజులు చేస్తే కోరినది జరుగుతుందని పెద్దలు చెబుతారు. 


ఈ శ్లోకములో ఒక లెక్క మనకు భగవద్పాదుల వారు చెప్పారు. అదేమంటే ‘గుణనిక’ అన్నది. 

ఇది ఒక లెక్క. చింతామణుల గుణనిక యట. అమ్మవారి పాద పరాగము. ఒక్క చింతామణి కోరిన కోరికలు తీరుస్తుందని చెబుతారు. మరి గుణనిక లెక్క ఏమిటీ? అంటే-

అక్షరమాల లోని అక్షరాలకు సంఖ్యలు వేసే ఒక పద్ధతి ఉంది. అది ప్రతి గుంపుకు 1 నుంచి9 తరువాత పది బదులు 0 వేస్తారు. 

క-ఞ వరకు మొదటి గుంపు

ట - వ వరకు రెండవ గుంపు

ప-మ వరకు మరో సమూహము

య- హ వరకు చివరి సమూహము. 

ఇప్పుడు గుణనికను మనము లెక్కిద్దాము:

గు అంటే ‘గ’ తీసుకోవాలి. క-1,ఖ-2, గ-3 కాబట్టి మొదట అంకె 3 అయింది. 

ఇలా ‘ణ’ కు 5, ని అంటే న కాబట్టి 0, ‘క’ కి 1

ఇవి 3501 అయ్యాయి. 

సంస్కృతభాషలో సంఖ్య చదివేటప్పుడు చివర నుంచి మొదటికి చదువుతారు. అష్టాదశమంటే (అష్ట అంటే ఎనిమిది, దశమంటే పది పూర్తిగా 8+10=18, చతుర్దశము 4+10 పద్నాలుగు అని ఇలా…) ఇత్యాదివి. కాబట్టి మనమిప్పుడు గుణనిక అంటే 1053 అని తెలుసుకున్నాము. 

లలితా సహస్రనామాలను సంఖ్య వేసుకుంటూ చదివితే అవి 1053 నామాలవుతాయి. అవే చింతామణులు. లలితా నామాలు చింతామణులన్నమాట. అందు ఏ ఒక్క నామము తీసుకొని మనం అమ్మవారిని ఆరాధించినా మనకు అమ్మ చింతామణిలా కోరినది ఇచ్చి కోరని కైవల్యం కూడా తుదకు ఇస్తుంది. అందుకే లలితా సహస్రం పరమ శక్తివంతమైనది. 


అవిద్య అతి పెద్ద అడ్డం. కటిక చీకటిలో ఉన్న వారికి ఏది ఎమిటో తెలియనట్లు, అజ్ఞానములో ఉన్న జనులకు తాము మాయలో కప్పబడి ఉన్నామని తెలుసుకోలేరు. కాని వారు పూర్వ పుణ్యము వలన ఆ జగదంబ పాదాలు పట్టుకున్నారంటే సూర్యోదయమైన సమయంలో చీకట్లు తొలిగి సర్వం ఎలా స్పష్టంగా అగుపిస్తుందో, అలా అజ్ఞానము వీడి ఆత్మజ్ఞానము కలుగుతుంది. అది అమ్మవారి పాదపద్మముల నుంచి పరాగము స్వీకరించినందు వలన. అంటే అమ్మ పాదములను ఆశ్రయించినందు వలననే. 

జడులైన వారికి కదలిక ఉండదు. వారు అమ్మ పాదాలనాశ్రయించిననాడు జ్ఞానమన్న తెనేను పొంది మధురమైన స్వస్వరూప జ్ఞానము కలుగుతుంది. 


సంసారమన్నది పంకము(బురద). జలధి (సముద్రం). అందులో ఉన్నవారు ఎంతకీ బయటపడలేరు. కానీ అమ్మ పదములు చింతన చేసే వారిని అమ్మ ఆదివరహుడు కోరలతో ఫృథ్విని తీసినట్లు తీసి బయటపడవేస్తుంది. అంటే ఈ జననమరణ చట్రం నుంచి తొలగిస్తుంది. 


అత్యంత్య శక్తివంతమైన ఈ శ్లోకము చదువుకుంటూ అమ్మ పాదాల వద్ద నుంచి కుంకుమ ధరించివారికి సర్వ సౌభాగ్యాలు లభ్యమవుతాయి. 


మునుపు అంటే దాదాపు పన్నెండేళ్ళ నాటి సంగతి, అప్పుడే చాగంటి వారి ఉపన్యాసాలు చాలా వినపడటం మొదలైయినాయి. ఆయన లలితా సహస్రం విన్నాము. ఆయనతో ఫోను కాల్ ప్రోగ్రామ్ మొదలెట్టారు ఆయన శిష్యులు. 

ఆదివారం సమయంలో ఫోను చేస్తే ఆయన మాట్లాడుతారు అని చెప్పారు. 

అప్పుడే సౌందర్యలహరి నేర్చుకుంటున్నాము. ఆయనకు ఫోను చేస్తే లైను కలిసింది. ఎంతో అప్యాయంగా కాకినాడకు పుట్టింటి వచ్చినట్లుగా రమ్మని పిలిచారాయన. అప్పుడు చెప్పిన విషయము, “ఈ శ్లోకం విడవక ధ్యానశ్లోకములా చదువుకో తల్లీ!” అన్నారు. అప్పుట్నుంచీ ఈ శ్లోకాన్ని మరింత ప్రియమైనదిగా చదవటం ప్రారంభించాము. 

అమ్మ దివ్య అనుగ్రహము మనకు లభ్యమవటానికి దివ్యమైన శ్లోకాలను మనకు ప్రసాదించిన జగద్గురువులకు మరొక్క మారు ప్రణామాలు చేస్తూ


సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ


Day3

 



సౌందర్యలహరి


శ్రీమాత్రే నమః


తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం

విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।

వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం

హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 ॥


అర్థము

అమ్మా! నీ పాదముల నుంచి అణువంత ధూళికణముతో బ్రహ్మగారు ఈ చతుర్ధశ భువనాలు నిర్మించాడు. విష్ణువు ఆ ధూళికణము ధరించి వేయి తలల ఆదిశేషువుగా మారి విశ్వమంతా తల మీద ధరించి మోస్తున్నాడు. శివుడు అదే కణమును తన శరీరమంతా బూడిదలా పూసుకు తిరుగుతున్నాడు. 


తే.గీ॥

తొలుత లేశ మాత్రపు పాదధూళి చేత,

బ్రహ్మ సృష్టియు, విష్ణువు  భారమంత।

మోయ, శివుడు బసువముగ మొఖము నుంచె

కొలచెదను సంధ్యను శరణుఁ గోరి మదిని॥


వివరణ:

పరమేశ్వరి అయిన ఆ జగదంబ పాదపద్మముల నుంచి స్వీకరించిన ఒక్క ధూళికణము సర్వ ప్రపంచ కార్యాలు చేస్తున్నదట. అదెట్లాగు? 


భారతీయ సనాతన విజ్ఞానములో ఉన్న వైశేషికం గురించి విన్నారా? ఇది షడ్దర్శనాలలో ఒకటి.

ప్రపంచము ఒక్క కణము నుంచి మొదలైయిందని, సమస్తం అణువుల కలయిక వల్ల జన్మించిందని వైశేషికం ప్రతిపాదిస్తుంది. దీని కర్త  కణాద మహర్షి.


సైన్సు కూడా ఒక కణము విస్పోటమే

 బిగ్‌బ్యాంగ్‌ అని చెబుతోంది. 


శంకరులు అదే ఈ శ్లోకములో చెప్పారు. 

అమ్మవారి పాదపద్మాల నుంచి ఒక్క కణమాత్రం ధూళి స్వీకరించి త్రిమూర్తులు తమ తమ కార్యాలు చేస్తున్నారు. 


బ్రహ్మ సృష్టికారుడు. చతుర్ధశ భువనాలనూ సృష్టిచెయ్యవలసినవాడు. ఆయనకు ముడిసరకు ఎక్కడ్నుంచి వస్తుంది?

కుమ్మరి కుండలు చెయ్యాలంటే పుట్టమన్ను తెచ్చుకొని కుండలు చేస్తాడు. అలా బ్రహ్మ ఈ సర్వ విశ్వమూ సృష్టిస్తున్నాడు. గ్రహాలు వాటి వాటి కక్షలలో తిరిగేలా నిర్దేశిస్తున్నాడంటే అది అమ్మవారి పాదపంకేరుహ పరాగ అనుగ్రహమే. అమ్మవారి పాదధూళికణము స్వీకరించి బ్రహ్మ ఈ ఘనకార్యము చేశాడు. 


విష్ణువు స్థితికారుడు. సృష్టించబడిన భువనాలను రక్షించటము ఈయన పని. విష్ణువే ఆదిశేషువుగా మారి వేయితలలతో ఈ విశ్వభారమంతా తలనెత్తుకున్నాడంటే, ఆయన అమ్మవారి పాదధూళీకణము స్వీకరించటము వలననే. 


హరుడు లయకారుడు. ప్రళయకాలములో హరుడు సర్వమునూ లయం చేస్తున్నాడు. లయమంటే లీనమగుట. 

మనం నిద్రించేటప్పుడు మనస్సు ఆత్మలో లీనమవుతుంది. బయట సర్వప్రపంచము ఉన్నా లయమైన వానికి ఏమీ తెలీదు. మరునాడు లేచి చూస్తే సర్వం ఉన్నదున్నట్లుగా ఉంటుంది. ఇదే లయం చెయ్యటమంటే. 

హరుడీకార్యము విజయవంతంగా చెయ్యగలుగుతున్నాడంటే, అమ్మవారి పాదధూళి గ్రహించి విభూతిలా వళ్ళంతా పూసుకోవటం వలన. భూడిదెందుకంటే, లయమయితే ఏదీ మిగలదని సర్వం భస్మమవ్వాలని చెబుతున్నారు. 


విజ్ఞానపరంగా చూస్తే:

 

కనిష్ఠస్థాయిలో, అంటే పరమాణువు (పిండాండములో) నందు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ (analysis, balance and synthesis) ఎలా పనిచేస్తాయో, సమిష్ఠి రూపములో అంటే బ్రహ్మాండములో బ్రహ్మ (Emerger) విష్ణువు(sustainer), శివుడు(Merger) అలా పనిచేస్తారు. వారందరూ అమ్మవారి ఉపకరణములుగా ఉండి ఆమె ఆదేశబద్ధులై పని చేస్తారని ఈ శ్లోకార్థము. 


రేపు మరికొంత ఆవిష్కరించుకుందాము. 

అప్పటి వరకూ సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ


Day2

  


సౌందర్యలహరి -ఆచారము- ఫలము

సౌందర్యలహరిని సమయాచారములో 

ఆష్కరించారు శంకరులు. శ్రీవిద్యా స్వరూపమైన భగవతిని సేవించుకోవటానికి మనకు అందించిన స్తోత్రరాజ్యము సౌందర్యలహరి. 

ప్రతిశ్లోకంలో నిగూఢముగా ఎన్నో రహస్యాలను పొందపరిచారు. భక్తితో ఈ శ్లోకాలను చదివితే మనకు ఆ మంత్రఫలితము దక్కుతుంది. 

ఈ శ్లోకాలను చదువుకుంటే శ్రీవిద్యా ఉపాసనా పుణ్యఫలము కూడా దక్కుతుంది. 

కారణం తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది కదా. అలాగే విద్య కూడా. 

ఈ శ్లోకఫఠనము వలన బ్రహ్మవిద్యను కూడా పొందగలరు చదివినవారు. 

శంకరులు తన పరమగురువులైన గౌడపాదులవారి ‘సుభగోదయస్తవము’ ను అనుసరించి సౌందర్యలహరి రచించారని చెబుతారు. అలా వారి పరమ గురువుల పరంపరను శంకరులు కొనసాగించారు. 

గౌడపాదులవారు మాండుక్యోపనిషత్తుకు వ్రాసిన కారికలు లోకప్రసిద్ది. అలాగే ఆయన రచించిన ఈ సుభగోదయస్తవము కూడాను. 

సౌందర్యలహరి శిఖిరినీ చందస్సు లో 

రచించారు శంకరులు. శిఖరిణి  వృత్తము ఒక కొండ ఎక్కుతున్నట్లుగా ఉంటుంది.

ఈ వృత్తములో ఉన్న ఆకర్షణ కూడా చాలా అద్భుతమైనది. అందుకే సౌందర్యలహరి చదువుతుంటే ఎంతో మనోహరంగా అనిపించి సంతోషపరుస్తుంది. 

సాధకులకు ఉపాసన పండాలన్నా, అపరోక్షమవ్వాలన్నా అది సమయాచార పద్దతిలో కుదిరుతుందని శంకరులు సౌందర్యలహరితో చూపారు. ఆగమాలలో చూపిన ఉపాసనే సమయాచార పద్ధతి. 

సమయాచార పద్ధతిలో శివపార్వతులకు అబేధము. వారికి పంచ సారూప్యాలను చెబుతారు. 

అవి:

1నామ సారూప్యము, (శివ-శివాని,భవ-భవాని,ఈశ్వరుడు-ఈశ్వరి, కాళుడు-కాళీ, భైరవుడు-భైరవి ఇత్యాదివి)

2.రూప సారూప్యము,(మూడు కన్నులు, చంద్రవంక)

3.ఆయుద సారూప్యము(ధనస్సు, బాణము, అంకుశము, పాశము)

4.చేసే పనులు (సృష్టిస్థితిలయఅనుగ్రహ తిరోధానము )

5. ఆవాసము (కైలాసము, శ్రీచక్రములో బిందువులో ఇత్యాదివి) 

ఇలా పంచ సారూప్యం ల చేత శివశక్తులను సమయులుగా చూపబడు సంప్రదాయము సమయాచారము. 

సౌందర్యలహరి నామాన్ని సమర్ధన:

సత్‌చిత్‌‌ ఆనందమే అమ్మ స్వరూపముగా  సౌందర్యలహరి మనకు కనపడుతుంది. 

సౌందర్యలహరి, శ్రీవిద్యా స్వరూపమనటానికి మరో ఉదాహరణ శ్రీవిద్యకు సుందరీవిద్య అని మరోపేరు. సుందరీ విద్యే సౌందర్యలహరీ గా మారింది. స్త్రీ పురుషులకు తేడా లేక ఉండేది సర్వత్రా నిండి ఉండేది చైతన్యం. అమ్మవారు చిచ్ఛక్తి స్వరూపము. కాబట్టి సౌందర్యమైన చైతన్యమే అమ్మవారు కాబట్టి ఇది సౌందర్యలహరి. 

ఆనందము సౌందర్యం. ఆ ఆనందము సదా నిలబడటమే సౌందర్యం. లౌకిక విషయాలను మించిన అసలు విషయమే సౌందర్యం. కాబట్టి ఇది సౌందర్యలహరి. 

అమ్మవారి విద్యలో మహామంత్రం మూడు కూటములుగా ఉంటుంది. ఆ కూటములు వాగ్భవకూటమి, కామరాజకూటమి, శక్తికూటమి. ఈ మూడు కూటములను సూచిస్తూ సాగే మంత్రరాజ్యానికి అమ్మవారి బీజాక్షరముతో ముగుస్తుంది. ఆ మహాబీజానికి నాదం తీసేసి సౌందర్యానికి చివరన కలిపి సౌందర్యలహరి అని భగవద్పాదులవారు నామకరణం చేసి మనకు ప్రసాదించారు. 

సౌందర్యలహరి ప్రతిశ్లోకానికీ ఒక యంత్రము, బీజాక్షరం, పూజ చేసే విధానము ప్రసాద వితరణ పద్ధతులున్నాయి. అవి గురువు ద్వారా మాత్రమే పొందాలని చెబుతారు. మనము తత్త్వం మీద దృష్టి పెట్టి హృదయంలో పరదేవతను ప్రతిష్ఠించుకొని ఈ శ్లోకాలు చదువుకుంటే ఆ భగవతి తప్పక ప్రసున్నురాలవుతుంది. 

ఇక శ్లోకాలు తెలుసుకుందాము:

ప్రతి కావ్యానికీ మొదటి శ్లోకము ఎంతో ముఖ్యమైనది. ఇది ఎంతో ప్రధానమైన శ్లోకము. ఈ శ్లోకాన్ని నిత్యం చదువుకుంటే సాధకునికి కావలసినవి లభ్యమవుతాయని చెబుతారు. 

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।

అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి

ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥

అర్థము: 

తల్లీ భగవతి! శివుడు నీతో కూడి ఉన్నప్పుడే సమస్త సృష్టిని చేయగలుగుతున్నాడు. నీవు లేక పోతే కదలలేకపోతున్నాడు. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులచే పూజించబడు నిన్ను ఆరాధించడానికి, స్తుతించటానికి గానీ పుణ్యము చేయ్యని వాని వలన అవుతుందా?


తేటగీతి 

శంకరుని  యందు వ్యక్తమౌ శక్తివీవు/

సర్వ లోకాల చైతన్య ఝరివి నీవు/

బ్రహ్మ విష్ణువులు గనఁ సేవకులు నీకు /

కొలచెదను సంధ్యను శరణుఁ గోరి మదిని//


వివరణ:

1.అమ్మవారు పతివ్రత. ఆ తల్లి పూర్తి ఆసక్తిని చూరగొనాలంటే అమ్మవారిని రకరకాల నామాలతో కొలవటం కన్నా “శివ” అంటే ఆమె సంతోషముతో చూస్తుండట. అందుకే ఎంతో తెలివిగా శంకరులు ఎత్తుగడే “శివః” అంటూ మొదలెట్టారు. 

2. అయ్యవారైన మహదేవుడు “అ” అన్న అక్షరముతో సూచించబడుతాడు. అమ్మవారు “ఇ”కారరూపిణి. శివలో ఇకారము తీసివేస్తే శవ గా మారుతుంది. శవమంటే జడము. నిర్జీవమైనది. అంటే ఈశ్వరి లేని శివుడు కదలలేడు. శివునిలోనైనా, సర్వ విశ్వములోనైనా ఉన్న చైతన్యశక్తి అమ్మవారే. 

3.స్పందన శక్తి అంటే లోపలి కదలిక. స్వామి సత్ స్వరూపము. ఆయన కదలక మెదలక అలా నిశ్చలంగా ఉంటాడు. ఆయనలో ఈ ప్రపంచసృషి చెయ్యాలన్న కోరికనే స్పందన. ఆ స్వందనే శక్తి, అమ్మవారు. 

4. హరిహరులు సర్వదేవతల శక్తీ అమ్మ నుంచే వస్తున్నది. అంటే దేవతలు తమ పనులు చేయటానికి అమ్మవారి మీదనే ఆధారపడ్డారని శంకరులు చెబుతున్నారు. 

శ్రీవిద్యా ఉపాసకులు మనకు 14 మంది కనపడుతారు. 

5. అయ్యవారు అవ్యక్తముకు, నిర్గణబ్రహ్మకు సంకేతము. వ్యక్తమవటం అమ్మవారి లక్షణము. అందుకే శివుడిని కొలచినా శివుడు వరమివ్వాలన్నా వ్యక్తమయ్యేది అమ్మద్వారానే. అమ్మను కొలిస్తే అమ్మ చూపేది అయ్యనే. అందుకే హరిహరవిరించులు అర్పించవలసినది అమ్మవారినే అన్న సూచక కూడా ఉంది. 

రేపు మరికొంత ఆవిష్కరించుకుందాము. 

అప్పటి వరకూ సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ

మల్లాప్రగడ 

Friday, 10 January 2025

#Day1



సౌందర్యలహరి

 

ఉపోద్ఘాతము

శ్రీమాత్రే నమః.

అమ్మవారి సాహిత్యం అపారం. అసలు అక్షరమే జగన్మాత స్వరూపము. జగత్తు పుట్టినది నాదము నుంచి. నాదము అక్షరమే. అక్షరమంటే క్షరము లేనిది, నాశనము అన్నది లేనిది. ఈ అక్షరాలన్నీ కూడా చెప్పేది పరమాత్మ గురించే. వీటినే వర్ణాలని కూడా అంటారు. వర్ణాలంటే అక్షరాలు, రంగులు కూడా. 

అన్నీ వర్ణాలు చెప్పేది ఆ దేవదేవి గురించే. అందుకే అమ్మవారిని మాతృకావర్ణరూపిణీ అంటారు. అన్నీ వర్ణాలు మంత్రమయమే. మంత్రాలన్నీ వర్ణాల కూడికే కదా. 

అమ్మవారి గురించిన సాహిత్యము అపారం. అది పూర్తిగా చదవటం, ఆకళింపు చేసుకోవటము ఈ జన్మకు సాధ్యమా అంటే సందేహమే. 

మునుపు వేదము పూర్తిగా నేర్చుకోవాలని ముని భరద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడట. 

బ్రహ్మ వరమిచ్చాడు “వేదం పూర్తిగా నేర్చేవరకూ జీవింతువుగాక!” అని. 

ఆ ముని వేదరాశిని చూసి భయపడిపోయాడట. ఇంతటి వేదరాశిని నేను నేర్వగలనా అని కృంగిపోయాడు. పరమేశ్వరుడు కృపాలుడై వైశంపాయనుడైన వ్యాసునిగా వచ్చి వేదాలను నాలుగు విభాగాలు చేసి నేర్పాడుట. ఇది గురుచరిత్రలో కథ. 

అలాగే అమ్మవారి సాహిత్యాన్నీ పూర్తిగా నేర్చిన ఘనులు, వేదవేత్తలూ, బ్రహ్మవేతలూ ఉన్నారా? అంటే సందేహమే సుమా! అంటారు పెద్దలు. అందుకే మనము గురువు వద్ద చేరి వారిచే ప్రభోదించబడిన మంత్రం పట్టుకు సాగుతుంటే ఈశ్వరే ఒకనాటికి కరుణిస్తుంది. 

ఇదే కదా ప్రపత్తి మార్గమంటే.

గురువై గతి చూపించేదీ, ప్రయత్నాన్ని చేయించేదీ, మోక్షానికి ఉపాయాన్ని (సాధన) చూపించేదీ సర్వమూ నీవేనని పూర్తిగా శరణువేడడమే ప్రపత్తి. 

భగవతి ప్రపత్తి మార్గ సులభ. సర్వకర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ, అహంకారాదులను త్యాగం చేయడమే అసలైన ప్రపత్తి. ఇలా ప్రపత్తిని చేసే వారిని 'ప్రపన్నులు' అంటారు. భక్తునికి ఉండవలసినది 'ప్రపన్నత'. 

కాబట్టి ప్రపన్నతతో వేడితే ఈశ్వరి మార్గం చూపుతుంది గురురూపములో. 

జగద్గురువులైన శంకరభగవద్పాదులు అలా ఈ ప్రజావళికి దయతో ఇచ్చిన అపూర్వ వరం ‘సౌందర్యలహరి’.

శంకరుల సాహిత్యము అపారము. ఆ సాహిత్యములో అత్యంత విశిష్టమైనది, విశేషమైనది, మంత్రమయమైనది, శక్తివంతమైనది, శ్రీవిద్యాఉపాసకులు పారాయణం చేసేది అయినది సౌందర్యలహరి. 

దీని గురించి మనకు ఒక కథ ప్రచారంలో ఉంది. శంకరులు ఒకనాడు సూక్ష్మరూపములో కైలాసం వెళ్ళారుట. అక్కడ అమ్మవారినీ, అయ్యవారినీ దర్శించుకున్నారు. మహాదేవుడు శంకరులకు ఐదు స్ఫటికలింగాలనిచ్చారుట. అమ్మవారు గొప్ప గ్రంథరాశిని చేతిలో పెట్టారు. 

ద్వారము వద్ద ఉన్న నంది ఆపి ఆ గ్రంధములో ముందుభాగమిచ్చి, వెనకభాగము దాచాడుట. 

శంకరులు ఖిన్నలై ధ్యానించగా అమ్మవారు శంకరులని ఆ భాగము పూరించమన్నారుట. అందుకే మొదటి 41 శ్లోకాలనూ ఆనందలహరీ అనీ, వెనుక 59 శ్లోకాలు శంకరులచే రచించబడినవి సౌందర్యలహరీ అనీ అన్నారు. 

సౌందర్యలహరి పూర్తిగా వంద శ్లోకాల మంత్రరాజ్యం. ఎన్నో బీజాక్షరాలు ఇందు నిభిడీకృమైనాయని, చదివిన వారికి అవి ఫలిస్తాయనీ చెబుతారు. 

ఈ శ్లోకాలు శ్రీవిద్యా రహస్యాలను చెప్పేవిగా ప్రసిద్ధి. ఎన్నిసార్లు చదివితే, అన్నీసార్లూ కొత్త అర్థాలను స్ఫరింపచేస్తాయని పూజ్యులు చెబుతారు. 

ఇందులో కుదిరితే పూర్తిగా కుదరకపోతే కనీసం కొన్ని శ్లోకాలైనా చదువుకుంటే వారి సర్వకామాలు తీరుతాయని పేరు. 

ఏది ఏమైనా అత్యంత్య శక్తివంతమైన సౌందర్యలహరి జగదంబ కృపన చదివి, పెద్దలు చెప్పిన అర్ధాలను స్వీకరించి, మనము అనుసంధానం చేసుకోవటానికి ఈ దివ్యమైన మార్గశిరం కన్నా పుణ్యకాలమేముంది? 

వైకుంఠఏకాదశి కన్నా దివ్యమైన రోజేముంది? 

ఇది ఆనందలహరీ, సౌందర్యలహరీ అని అంటారని చెప్పుకున్నాము కదా. 

మొదటి 41 శ్లోకాలలో కుండలినీ యోగము, షట్చక్ర వివరణ, తంత్ర మంత్ర యంత్ర రహస్యాలను వివరించారు. 

రెండవ భాగమైన సౌందర్యలహరిలో అమ్మ వర్ణనే కనపడుతుంది. 

వీటికి వ్యాఖ్యానాలు మనకు ఎన్నో కనపడుతాయి. వాటిలో డిండిమ వ్యాఖ్యా, లక్ష్మీధర వ్యాఖ్య, సుధావిద్యోతిని మొదలైనవి ముఖ్యమైనవి. 

ఇవి నేను చూడలేదు. కానీ GLNశాస్త్రిగారిది చదివాను. పూజ్యగురువుల ప్రవచము విన్నాను. కొన్ని రోజులు ఆలోచన చేసిన తరువాత నోట్సు వ్రాసుకోవాలని కోరిక కలిగింది. అమ్మ కృపన మనస్సుకు అంటిన కొన్ని అమ్మ పాదాల రేణువులును భక్తితో స్వీకరించి పంచుకుంటున్నాను. 

సౌందర్యలహరి, లలితా నామాలలా కథలా ఉండదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకము నిగూఢమైన అర్థాని ఇస్తూ అంతర్ముత్వనికి దారి చూపుతుంది. 

ఎంతో క్లిష్టమైన తత్త్వ విచారాన్ని శంకరభగవద్పాదులవారు అందమైన శిఖరిణీ వృత్తములో రచించారు. ఉపమా, రూపక, ఉత్ర్పేక్ష శబ్ధాలంకారాలతో శబ్ధ రమ్యతతో, కవితా శిల్పంతో చదువుతుంటేనే ఎంతో సంతోషం కలిగిస్తుంది. 

ఆ ఆనందమే లహరిలా ఉంటుంది. లహరి అంటే అల. అల అన్నది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. దివ్య మంగళ స్వరూపమైన జగదంబ సౌందర్యం నిరంతరం ఆనందకారణం. అలాగే ఈ కాలస్వరూపమైన అంబ ఆడుతున్న ఈ ఆట కూడా లహరే. ఇది నిరంతర ప్రక్రియే. 

సౌందర్యలహరి కావ్యం ప్రారంభం “శివః” అని మొదలయి, చివర “ ఇయమ్” అని పూర్తి అవుతుంది. 

శివఃఇయమ్ అంటే ఈమె శివుడు. ఈ పూర్తి కావ్యము ఆ విశేషాన్ని నిరూపిస్తూ నడుస్తుంటుంది. 

దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ శ్లోకాలను తెలుగు పద్యాలుగా మార్చుకోవాలని కోరిక కలిగింది. కొన్ని అలా వ్రాసుకొని పూజ్యగురువులకు చూపితే బావుందని నవ్వారు. ఇలాగే పూర్తి చెయ్యమన్ని ప్రోత్సహించారు. అవి మధ్యలో ఆగాయి. అని మళ్ళీ ఇప్పుడు పూర్తిచెయ్యాలను కోరిక కూడా కలిగింది. ఇలా రోజుకొకటి వ్రాసుకుంటే ఉత్తమమని తలిచింది. 

ప్రార్థన

1.

వందనమ్ములో జయ గణపతి, నమామి

ఈశ్వరి! జననీ! గురురూపిణీ! నమామి

పార్వతి, త్రిశతి సేవింతు పరి పరి విధి,

కొలిచెదను సంధ్యను శరణు గోరిమదిని।।

2.

శ్వేత వస్త్రమును ధరించి చేత వీణ

పుస్తకములతో తెల్లని పూలమాల

ముత్యపు మెరపు నగవుల మోము, వాణి

కొలచెదను సంధ్యను శరణుఁ గోరి మదిని

3

ఆదిగురువు మహేశ్వరుండనుచు పలికె

శంకరుని జగద్గురువుగ సంఘపరచె 

దేవిదాసు గురు కృపన దీక్ష నొఁస గె 

కొలచెదను సంధ్యను శరణ గోరి మదిన।।

4

తెలుగు నెంత నేర్చిన పద్యములు తెలియవు

నేడు గురు యాజుల దయన నేర్తు పద్య

విద్య, నడచి వచ్చిన వాణి వీరి రూపు

కొలచెదను సంధ్యను శరణు గోరి మదిన


సర్వం శ్రీమాతపాదాలకు సమర్పిస్తూ

మల్లాప్రగడ 


Tuesday, 15 October 2024

-

*****

ప్రతివసంత యామినిలో..రేరాజువి వేంకటేశ.

సరసాద్భుత కవనానికి..గురువైతివి వేంకటేశ


ఒక నేస్తము నీవులాగ..మనసైనది యిదిగిదిగో 

ఒక నీడను నేను నుండ.. తనువైనది యిదిగిదిగో 

సుఖదుఃఖము  ఒకపవిత్ర..సుమమైనది యిదిగిదిగో

రకమేయది రమ్యమైన.. రణమైనది యిదిగిదిగో..ప్ర 


మధురామృత భావాలకు..నెలవైనది యిదిగిదిగో.

మధుసూదన లక్ష్యమ్ముకు.. మేలైనది యిదిగిదిగో 

రూపమేదొ చెక్కబోతె.. రూకలేక  యిదిగిదిగో 

పాపమాయ నన్ను జేరి.. పలుకందక యిదిగిదిగో. ప్ర 


ప్రవహించే సౌందర్యపు..యేఱైనది యిదిగిదిగో

భావభావము బంధవ్యము.. బర్వైనది యిదిగిదిగో 

పయనించే నీలిమేఘ..మాలలేను యిదిగిదిగో

కలలఫలము లందించే..తరువైనది యిదిగిదిగో... పా 


చెలిమివీణ తంత్రులలో..విహరించే యిదిగిదిగో ..

విప్లవించు వినోదాల..విందైనది ఇదిగిదిగో..!

శ్రమకుతగ్గ ఫలమిచ్చే..మాధవుడే యిదిగిదిగో

గురుబోధయె దారిచూపు..వెలుగైనది ఇదిగిదిగో..పా 


పాడరాని గీతానికి.. పాఠ్య మౌను వేంకటేశ

మాటలేని మోనానికి.. మచ్చ యేల వేంకటేశ

ప్రతివసంత యామినిలో..రేరాజువి వేంకటేశ.

సరసాద్భుత కవనానికి..గురువైతివి వేంకటేశ

**

-చందమామ  …కడు చిత్రం అంతులేని మిడిసిపాటు 

అరువు తెచ్చుకున్న (వెలుగు)అందంతో!! వేంకటేశా


కలువ పువ్వు.. కడు చిత్రం నీటిలోన తెలియాడు మిడిసి పాటు అరువు తెచ్చుకున్న అందంతో!!వేంకటేశా


రూపు సుందరమైన చూచే కనులకు విందగు వేంకటేశా

మాట మంచిదైన వినే మనసుకు ఇంపగు వేంకటేశా

మది సుగుణమైన పొందే మన్నన ఘనమగు.! వేంకటేశా

"ఆకర్షించే అందమైన వేషము కన్నా ఆకట్టు మధురమైన భాషణమే కదా వేంకటేశా

                  

ఎక్కడైనా …చదివి చూడు మనసు వ్యధ చెందితే…

మాటలు మార్చేస్తారు!! వేంకటేశా


కళ్ళు చెమ్మగిల్లితే  …స్వరం మార్చేస్తారు !! వేంకటేశా

ఎంత అదృష్టం … వ్యధ చెందినవారు!! వేంకటేశా


తమవారిని గుర్తు చేసుకుంటూనే వుంటారు!!…వేంకటేశా


వాస్తవాలను విస్మరించే వారు వేంకటేశా

ఊహల్లో విహరించేవారు వేంకటేశా


“కలిమి “ కడు దురదృష్టకరం పొందినవారు తమవారిని మరిచి పోతారు !!వేంకటేశా


చెలిమి చేసి మోసము చేసి అందరినీ మరిచేవారు!! వేంకటేశా


మీ విధేయుడు.. మల్లాప్రగడ

****

సీస పద్య మాలిక


సీ౹౹ ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

కొలువుండు భక్తుల కొంగు పసిండి

ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

దేహాత్మ భావమ్ము దివ్య తేజ 


ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

కను ముందు నిలచిన కల్పతరువు

ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

ఈశ్వర నియతిగా యిచ్ఛ వసతి 


 ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

తిమిరాన్ని తరిమేటి తపన కలుగు 

ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

రాజిల్లు నతిలోక రక్షక మణి


ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

ఈశ్వరేచ్చయనుచు యిష్ట మగుట 

ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

జగమేలు దేవతా చక్రవర్తి


ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

దేహేంద్రియములుగా దీక్ష ముక్తి 

ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

కేవలం కర్మల కాల మాయ 


ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

వాక్కుమహిమజూపు వాస్తవమ్ము 

ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై 

దుర్లభమని యన్న దరిని జేర్చు 


ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

శ్రాద్దకర్మలవల్ల శాంతి నిచ్చు 

ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

ఇష్టార్ధములగా యిచ్ఛ పెరుగు 


ఏ దేవుడేవేళ నిల వేంకటాద్రిపై

దానం తపస్సుగా దాత యగుట 


ఆ .:పరము పురుష లీల పావణుడుగువేళ 

సన్ని ధాన మౌను సమయ కళలు 

కలిని తరిమి బలిమి కనుల కలిమి నిచ్చు 

వేంకటగిరి కర్త వేంక టేశ 

****

*****

మందారం.. వేంకటేశాయ నమః 


మంచిచేసి మురిసిపోవు మనిషిచెలిమి వేంకటేశ

మానవతా వాదాన్నినిలిపేచెలిమి వేంకటేశ


చిగురాకుల ఊసులన్ని చిరుగాలికి చెప్పగల్గు 

శుభ రాత్రిన సుఖదుఃఖము పొందగల్గు వేంకటేశ


మరుమల్లెల పరిమళాన్ని కురులచాటు దాచగల్గు 

చిరుహాసము చేరువగుట చెంత చెలిమి వేంకటేశ


సిరిచందన చిరుజల్లులు విరహాలకు మత్తు గల్గు 

సరిలేరని సమరమ్మును సమయమ్మగు వేంకటేశ


సుమశరముల తాకిడికే అదరగల్గు బెదర గల్గు 

మమకారము మమత మెలిక మగువ చెలిమి వేంకటేశ 


విజేతలుగ నిలవాలని కలలుగనే పువ్వు సిగ్గు 

సహాయముకు చెంతచేరి సలుపు చెలిమి వేంకటేశ


ఊహలలో ఉరుకుతున్న ఉత్సాహం కలువ సిగ్గు 

దాహమునే తీర్చగల్గు దాత చెలిమి వేంకటేశ


ఆటంకాలే ప్రగతికి ఆశలవల లే యగుటే 

 సోపానాలవుతాయట సోకు చెలిమి వేంకటేశా


చేజారిన క్షణాలనే పదేపదే కల్వ గల్గు 

సౌజన్యపు శిఖరానా సాగు చెలిమి వేంకటేశ


పరిసరాల పరిరక్షణ బాధ్యతగా భావ బుగ్గ 

కరుణ కళల కావ్య చరిత కాల చెలిమి వేంకటేశ


 విలయాలను ఆపాలని చేయు చెలిమి వేంకటేశ

 కోరికలను మట్టుపెట్ట కోరు చెలిమి వేంకటేశ


****

Tuesday, 8 October 2024

 O1*శ్రీగురుభ్యోనమః🙏*

*🙏ఓం శ్రీమాత్రేనమః🙏*

*జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే*

*జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవ తారిణి*

*మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి*

*హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే🙏*

*పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే*

*సర్వభూత హితార్థాయ వసువృష్ఠిం సదా కురు🙏*

*జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే*

*దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోಽస్తుతే🙏*

*శుభోదయం శుభంభూయాత్ శుభమస్తు*🙏

****

02.. దుర్లభం త్రయం ఏవై  తత్ దైవానుగ్రహ హేతుకం.

మనుష్యత్వం,ముముక్షత్వం,మహాపురుష సంశ్రయః.


మనిషిగా పుట్టటం, ముక్తి కలగాలనే కోరిక వుండటం, సమర్ధుడైన గురువు లభించడం.

ఈ పైవాటి అన్నింటిలో మనకు రెండు శ్రమ పడకుండానే లభించాయి.

ఇక మనకు కావాల్సింది ముక్తి పొందాలనే కోరికను అలవర్చుకోవడం.

ఇదే మన సహజమార్గ సాధన లక్ష్యం.

****

03..సుజనాః పరోపకారం శూరాః శస్త్రం ధనం కృపణాః |    

కులవత్తో మందాక్షం ప్రాణాత్యయ ఏవ ముంచతి |

(రసగంగాధరం)

   *సత్పురుషులు పరోపకారాన్నీ, శూరులు శస్త్రాన్నీ, పిసినారులు ధనాన్నీ, కులస్త్రీలు సిగ్గునూ ప్రాణం పోయినప్పుడు మాత్రమే వదిలిపెడతారు.

****

04.శ్లో.  యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం

లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి


భావము.  ఎవనికైతే స్వయం ప్రజ్ఞ ఉండదో వానికి శాస్త్రం ఏమి చేయగలదు? కనులు లేనివానికి దర్పణము ఏమి చేయగలదు? 

కనుక మనం తెలిసికున్నదానిని లోతుగా పరిశీలించుకోనపుడు అర్థం చేసికోనపుడు తెలిసికున్నదానివలన ప్రయోజనము ఉండదు. 

****

05.శ్లో.మృత్యోర్బిభేషి కిం బాలన స భీతం విముంచతి |    

 అద్య వాబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః

(పంచతంత్రం-మిత్రభేదం)


       *ఓ మూఢుడా, మరణానికి ఎందుకు భయపడుతున్నావు? భయపడిన వారిని అది విడిచిపెట్టదు. ఈ రోజైనా లేదా వందేళ్ల చివరలోనైనా ప్రాణులకు మరణం అనివార్యమైనది.

****

06.శ్లో.మానస శమయేత్తస్మాత్జ్ఞా నేనాగ్నిమివాంబునా౹      

ప్రశాంతే మానసే హ్యాస్యశారీర ముపశామ్యాతి.౹౹

     

   (సంగ్రహము)

      *నిప్పుని నీటితో ఆర్పినట్టుగా మనస్సులోని దుఃఖాన్ని జ్ఞానంతో దహింపజేయాలి,మానసిక చింతలు పోగొట్టుకుంటే ప్రశాంతమై శరీరం కూడా ఆరోగ్యంతో చక్కగా ఉంటుంది.

*****


07..జ్ఞానం ప్రధానం న తు కర్మహీనమ్l

కర్మ ప్రధానం న తు బుద్ధి హీనంl

తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధి:

న హ్యేక పక్షో విహగ: ప్రయాతిll 


భావం: జ్ఞానం ప్రధానమే కానీ, కర్మ హీనమైన జ్ఞానం నిరుపయోగం. కర్మ ప్రధానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే. జ్ఞాన,కర్మ సముచ్చయము వలననే మానవుడు తరిస్తున్నాడు. ఒక్కరెక్కతోనే పక్షి ఎగురలేదు కదా!

*****

08..ఉచ్ఛైర్గతిర్జగతి సిధ్యతి ధర్మతశ్చేత్

      తస్య ప్రమా చ వచనైః కృతకేతరైశ్చేత్ |

     తేషాం ప్రకాశనదశా చ మహీసురైశ్చేత్

     తానంతరేణ నిపతేత్ క్వ ను మత్ప్రణామః ||

(చంపూరామాయణం)

         ధర్మం ద్వారా ఉత్తమమైన గతి లభిస్తే, వేదవాక్యాల ద్వారా ఆ ధర్మం యొక్క నిజమైన అవగాహన కలిగితే, ఆ వాక్యాల వివరణను భూసురులు (బ్రాహ్మణులు) అందిస్తే, నా ప్రణామాలు వారికి కాకుండా ఇంకెవరికి సమర్పించబడాలి?

******

09..యౌవనం ధనసంపత్తి:ప్రభుత్వ మవివేకితాl

ఏకైక మప్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ 


భావం: యౌవనము, ఐశ్వర్యము, అధికారము మరియు అవివేకము.. ఇవి ఒక్కొక్కటీ అనర్ధాన్ని తెచ్చిపెడతాయి. ఈ నాలుగూ ఒకేచోట ఉన్నట్లయితే ఇక చెప్పవలసిందేముంది?

*****

010.వలీభిర్ముఖమాక్రాంతం పలితైరంకితం శిరః |

     గాత్రాణి శిథిలాయంతే0తృష్ణైకా తరుణాయతే ||🌺

(వైరాగ్యశతకం)

     ముఖము ముడతలు పడి ఉంది. తల పండిన తెల్ల జుట్టుతో నిండిపోయింది. శరీరంలోని అవయవాలు శిథిలమయ్యాయి. కానీ ఆకాంక్ష మాత్రం యౌవనంతో చెలరేగుతూ ఉంది.


*****

011.ఓం ఆధత్త పితరో గర్భం

     కుమారం పుష్కరస్రజం | 

     యథేహ పురుషోఽసత్ ||

(యజుర్వేదం)


_ఓ పితృవులారా! ఉత్తముడైన పుత్రుణ్ణి కరుణించండి._

_ఇతడు సత్పురుషుడుగా ఉండుగాక!

🙏యత్పితృభ్యో నిపృణాతియత్

     ప్రజామిచ్ఛతే తేన పితృణాం |

(బృహదారణ్యకోపనిషత్)

   పితృవులను తృప్తిపరచడంవలన సత్పుత్రులను పొంది పితృవుల కృపకు పాత్రుడౌతాడు._

****

012..సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వంl

నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తం!!


భావం: సత్సంగము అనగా మంచి వారితో కలియుట ద్వారా విషయవాంఛలలో విరక్తి భావన కలుగుతుంది. తద్వారా నేను, నాది అనే స్వార్ధాలు లేక నిర్మోహత్వం కలుగుతుంది. దానివలన మనసు చంచలం నుండి స్థిరత్వం పొందుతుంది. అట్టి స్థిరత్వమే జీవన్ముక్తికి మార్గమవుతుంది.

****

013.దుఃఖ సాగరే చరణీయం కష్ట పర్వతే తరణీయంl

విపత్తి విపినే భ్రమణీయం లోక హితం మమ కరణీయంll 


భావం: దుఃఖాల కడలిని దాటుము. కష్టాల పర్వతాన్ని అధిరోహించుము. ఆపదల అరణ్యాన్ని అధిరోహించుము. లోక హితానికై కృషి చేయుము.

*****

014.

నారాయణో నామ నరో నరాణాం ప్రసిద్ధ చౌరః కథితః పృథివ్యామ్ |

అనేక జన్మార్జితపాపసంచయం రత్యశేషం స్మరతాం సదైవ ||

(పాండవగీత)

        నారాయణ అనే ఒక మనిషి అత్యంత ప్రసిద్ధి చెందిన దొంగగా లోకంలో చెప్పబడుతున్నాడు. ఎవరైనా అతన్ని ఒకసారి స్మరిస్తే చాలు, వారి అనేక జన్మల పాపఫలాలను అతను ఆ క్షణంలోనే పూర్తిగా అపహరిస్తాడని అంటారు.

*****

015.గహనారణ్యే ఘనాంధకారే బంధు జనా: యే స్థితా గహ్వరే

తత్రమయా సంచరణీయంలోక హితం మమ కరణీయంll 


భావం: ఘోరారణ్యమునందు, చిమ్మ చీకటుల యందు బంధుజను లెందు ఉందురో అచ్చటనే సంచరించవలెను. లోక హితానికై కృషి చేయవలెను.

****

016.న జాతు దుఃఖం గణనీయం న చ నిజసౌఖ్యం మననీయంl

కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయంll 


భావం: స్వంత కష్టాలను ఏకరువు పెట్టకు. నీ సుఖాల గొప్పలు చెప్పుకోకు. కార్యాచరణకై కదులు ముందుకు. లోక హితానికై కృషి చేయుము.

***

017.

ప్రియ ఇతి గోపవధూభిఃశిశురితి వృద్ధైరధీశ ఇతి దేవైః |

నారాయణేతి భక్తైఃబ్రహ్మేత్యగ్రాహి యోగిభిర్దేవః ||


    గోపాంగనల చేత   ప్రియుడిగా, వృద్ధుల చేత శిశువుగా, దేవతల చేత లోకనాథుడిగా, భక్తుల చేత నారాయణుడిగా, యోగుల చేత బ్రహ్మగా దేవుడు భావించబడుతున్నాడు.

****

018.దుఃఖ సాగరే చరణీయం 

కష్ట పర్వతే తరణీయంl

విపత్తి విపినే భ్రమణీయం 

లోక హితం మమ కరణీయం 


భావం: దుఃఖాల కడలిని దాటుము. కష్టాల పర్వతాన్ని అధిరోహించుము. ఆపదల అరణ్యాన్ని అధిరోహించుము. లోక హితానికై కృషి చేయుము

*****.

019..సర్వ పాపాని వేం ప్రాహు:

కటస్తద్దాహ ఉచ్యతేl

తస్మాత్ వేంకటశైలోయం 

లోకే ఖ్యాతిం గమిష్యతిll 


భావం: సకల పాపాలూ కలిపి 'వేం' అవుతుంది. వాటిని కాల్చివేయటమే 'కట'. అలా పాపాలను కాల్చివేసే పర్వతమే 'వేంకటాచలం'. ఆ విధంగానే ఈ పేరు లోకంలో ప్రసిద్ధి చెందింది.

*******

020..సుఖం వా యది వా దుఃఖం

    ద్వేషం వా యది వా ప్రియమ్ |

    ప్రాప్తం ప్రాప్తముపాసీత

    హృదయేనావిదూయతా ||

(సుభాషిత సుధానిధి)

       సుఖముగానీ, దుఃఖముగానీ, శత్రుత్వముగానీ, ప్రేమగానీ వచ్చినదాని గురించి హృదయంలో వ్యథచెందకుండా, ఇవి భవిష్యత్తులో మంచిది జరుగడానికే వచ్చాయని తెలుసుకొని, వచ్చినట్లుగానే స్వీకరించి అనుభవించాలి.


*****

021.న కార్తీక సమో మాస:

న దేవం కేశవాత్పరంl

న చ వేదం సమం శాస్త్రం 

న తీర్థం గంగాయాస్థమమ్ll


భావం: కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహా విష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు.

*****

022..స్త్రీయోఽక్షా మృగయా పానం

     ఏతత్ కామసముత్థితమ్ |

     దుఃఖం చతుష్టయం ప్రోక్తం

     యైర్నరో భ్రశ్యతే శ్రియా ||

(మహాభారతం)

         ఆడుది, జూదం, వేట, త్రాగుడు - ఇవి కామాతిశయంవలన కలిగే నాలుగు దుఃఖములని చెప్పబడినాయి. వీటితోనే మనిషి సంపదను పొగొట్టుకుంటాడు.


****

o23.జటా భారార్జి నైర్యుక్తా 

దాంభికా వేషధారిణి:l

భ్రమంతి జ్ఞానివల్లోకే 

భ్రామయంతి జనానపిll 


భావం: జటలు, కృష్ణాజినమును అనగా జింక చర్మమును ధరించి, సన్యాసి వేషం ధరించి, డంబాచారముతో లోకంలో జ్ఞానులుగా సంచరిస్తూ ప్రజలను మోసగిస్తారు.


****

024...దేశే కాలే చ పాత్రే చశ్రద్ధయా విధినా చ యత్ |    

పితౄనుద్దిశ్య విప్రేభ్యోదానం శ్రాద్ధముదాహృతం |

(బ్రహ్మపురాణమ)


    శ్రద్ధతో విధిపూర్వకంగా దేశ కాల పాత్రత్వమునకు తగినట్టు పితృవర్గాన్ని ఉద్దేశించి విప్రులకు దానం చేయడమే శ్రాద్ధమనుబడుతుంది.

 " తంతుం తన్వన్ పితౄన్ యజేత్ || "

(భాగవతం)

  తనయొక్క వంశం అభివృద్ధి కావాలని కోరుకొనేవాడు పితృయజ్ఞం చేయవలెను.

దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం |

శ్రద్ధయా దేయం అశ్రద్ధయాఽదేయం ||

(తైత్తరీయ ఉపనిషత్)

        దేవపితృకార్యములను తప్పకుండా చేయవలయును. శ్రద్దతో దానం చేయి. అశ్రద్ధతో దానం చేయవద్దు._

       ఎవరు ఆస్తికభావనతోనూ, శ్రద్ధతోనూ ఉండి, మద మాత్సర్యరహితుడై శాస్త్రరీత్యా శ్రాద్ధం చేస్తాడో అతనికి స్వర్గమూ, సంతాన లాభమూ, సామర్థ్యమూ, శౌర్యమూ, గుణవాన్ పుత్రలాభమూ, శుభమూ కలుగుతాయి. అతడు లోకప్రియుడౌతాడు. ఆరోగ్యవంతుడూ, శోకరహితుడూ, ఐశ్వర్యవంతుడూ అయి బ్రహ్మలోకాన్ని పొందుతాడు - ఇట్లు యాజ్ఞవల్క్యస్మృతియందు చెప్పబడింది.

*****

025..*శ్రాద్ధాత్పరతరం నాన్యత్శ్రేయస్కరముదాహృతం |   

ఇతి ఘోషం ఘోషమాహుః అశ్రాంతం నిగమాగమాః ||  

(ధర్మప్రవృత్తి)


శ్రాద్ధ కర్మకంటే శ్రేష్ఠమైనది మరియు శ్రేయస్కరమైనది మరొకటి లేదని నిగమాగమాలు నిరంతరం ఘోషిస్తున్నాయి. తల్లిదండ్రులకు వసు-రుద్ర-ఆదిత్య రూపాలను చెప్పిన తత్త్వం ఏమిటంటే, తల్లిదండ్రులు వసువులు అంటే అష్ట ప్రకృతి రూపాల్లోని స్థూల శరీరం (ఆ శరీరం ధరించిన మన తల్లిదండ్రులు అష్ట వసువులు).

పితామహులు, పితామహిలు రుద్రులు, అంటే పంచేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు మరియు మనసుతో కూడిన పదకొండు ఇంద్రియాలతో కూడిన స్థూల శరీరానికి కారణమైన సూక్ష్మ శరీరం (అంటే పితృలకు కారణమైన పితామహులు-ఏకాదశ రుద్రులు).    ప్రపితామహులు-ప్రపితామహిలు ఆదిత్యులు, ఈ సూక్ష్మ శరీరానికి కారణమైన పన్నెండు మాసాలతో కూడిన కాలం మరియు ప్రాణులు చేసిన కర్మఫలం. వీటివల్ల ప్రేరేపించబడిన కారణ శరీరం (అంటే పితామహులకి కారణమైన ప్రపితామహులు-ద్వాదశాదిత్యులు) ఇది బుద్ధి, అహంకారము అయినది. ఈ వసు, రుద్ర, ఆదిత్య రూపాల గురించి బృహదారణ్యకోపనిషత్తులో వివరించింది. ఇలాంటి శ్రేష్ఠ తత్త్వాలను కలిగిన శ్రాద్ధ మహత్త్వం అసాధారణమైనది.

*****

026.*హరణం చ పరస్వానాం పరదారాభిమర్శినమ్l

సుహృదశ్చ పరిత్యాగ: త్రయో దోషా: క్షయావహా:ll


భావం: ఇతరుల ఆస్తిని అపహరించడం, ఇతరుల భార్యలను రెచ్చగొట్టడం, స్నేహితులను విడిచి పెట్టడం.. ఇవి మూడు పూర్తిగా నాశనం చేసే దోషాలు.

****

027*అయం నిజ: పరోవేతి గణనా లఘు చేతసామ్l

ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్ll


భావం: ఇతడు నావాడు, అతడు ఇతరుడు... అన్నట్లుగా లెక్క పెట్టడం అల్పమనస్సు కలవాడికి ఉంటుంది. కానీ, ఉదారుడికి అనగా మంచి మనస్సు గలవాడికి ఈ భూమండలమే తన కుటుంబమవుతుంది.

****

028.*వసూన్ వదంతి వై పితౄన్ రుద్రాంశ్చైవ పితామహాన్ |    

ప్రపితామహాంశ్చాదిత్యాన్ శ్రుతిరేషా సనాతనీ ||   

(మనుస్మృతి)


         వసు రుద్ర ఆదిత్య - ఈ ముగ్గురూ పితృ, పితామహ, ప్రపితామహ వీరియొక్క అధిష్ఠాన దేవతలు అని శ్రుతులు చాటుతున్నాయి. కావున వారిని ధ్యానించి శ్రాద్ధం చేయవలెను. తమ పిల్లలు ఇచ్చిన అన్నపానాదులతో తృప్తులైన పితృవులు శ్రాద్ధం చేసిన పిల్లలకు ఆయురారోగ్యమునూ, సత్సంతానము, విద్య, అధికారము, స్వర్గ మోక్షాది సకల సుఖాన్నీ కరుణిస్తారు - అని యాజ్ఞవల్క్యస్మృతిలో చెప్పబడింది.

      పితృయజ్ఞంకంటె వేరు ధర్మం లేదు. పితృయజ్ఞంకన్న వేరు తపస్సు లేదు. పితృయజ్ఞాన్ని మించిన వేరే కర్మయే లేదు. ఇలా శ్రాధ్ధమహాత్మ్యాన్ని, శ్రేష్ఠతను శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాసాలు కొనియాడుతున్నాయి. 


శ్రాద్ధాత్ పరతరం నాన్యత్

శ్రేయస్కర ఉదాహృతమ్ |

(ధర్మప్రవృత్తి)

        శ్రాద్ధం కన్న శ్రేష్ఠమైనది, శ్రేయస్కరమైనది మరొకటి లేదు. దేవపూజకన్న పితృపూజ అత్యంత ప్రాచీనమైనది. మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులు ఉన్నప్పుడు వారి సేవను భక్తి శ్రద్ధలతో చేయడం అత్యంత శ్రేయస్కరమైనది మరియు శ్రేష్ఠమైనది. వారు గతించిన పిమ్మట సంవత్సరానికి ఒకసారైనా వారిని స్మరించి మన కృతజ్ఞత, భక్తిగౌరవములను చెల్లించవలసినది మనయొక్క పవిత్రమైన కర్తవ్యం కాదా? మాతాపితరులు మనకోసం పడిన శ్రమను మనం వంద జన్మలలోనూ తీర్చుటకు అలవి కానప్పుడు, సంవత్సరానికి ఒకసారైనా వారి స్మరణను చేయకుంటే మనం వారి సంతానమైనందుకు ప్రయోజనమేమిటి?

****


029.*స్వభావేన హి తుష్యంతి దేవి: సత్పురుషా: పితాl

జ్ఞానయస్త్వన్న పానేన వాక్య దానేన పండితా:ll


భావం: మంచి స్వభావముచేత దేవతలు, సజ్జనులు, తండ్రి... సంతృప్తి చెందుతారు. బంధు మిత్రులు అన్నపానాలతో సంతుష్టులవుతారు. విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతార హృదయము.

****

030.*షోడశాబ్దాత్పరం పుత్రం ద్వాదశాబ్దాత్పరం స్త్రియంl

నా తాడయే దుష్ట వాక్యై:పీడయే న్న స్నుషాదికమ్ll


భావం: పదహారేళ్ళ వయసు దాటిన పుత్రులను తిట్టకూడదు. పన్నెండేళ్లు దాటిన కూతురితో కఠినమైన మాటలు మాట్లాడకూడదు. కోడళ్లను పరుష పదజాలంతో తిట్టకూడదు.

****

031.శ్రీమద్రామాయణము.

(312 )


"" జ్యేష్ట ఏవ తు గృహ్ణీయాత్ పితృవ్యం ధన మశేషతః,

శేషాః తమనుజీవేయః యథైవపితరం తథా""


ఇది స్మృతి ప్రమాణము.పిత్రార్జితములైన (రాజ్యము)సంపదలన్నిటికిని పెద్ధవాడే(జ్యేష్టుడే)అర్హుడు.ఇతరులు(తమ్ములు)ఆ జ్యేష్టుని తండ్రివలే గౌరవిస్తు విధేయులై నడచుకోవాలి.


రామాయణము అయోధ్యాకాండములో తనకు రాజ్యాధికారము కట్టబెట్టడానికి తల్లి కైకేయి చేసిన ఘాతుకాన్ని నిరసిస్తు భరతుడు తల్లితో,


032."" అస్మిన్ కులే హి పూర్వేషాం జ్యేష్టో రాజ్యే~భిషిచ్యతే,

అపరే భ్రాతారస్తస్మిన్ ప్రవర్తంతే సమసహితాః||(73-20),


ఓ పాపాత్మురాలా! మన ఇక్ష్వాకువంశమున కూడ పూర్వులు జ్యేష్డునకే రాజ్యాధికారము అప్పగించుచువచ్చిరి.ఇది మన సాంప్రదాయము.తక్కిన మా సోదరులందరము అన్నయ్య రామునికి విధేయులమై యుండవలసినదే యని తల్లిచేసిన పనిని గర్హించి కౌసల్యా మాతవద్ధకు వెళ్లి రామ వనవాసములో తన ప్రమేయము లేదని వివరిస్తూ,


033."" అప్రాప్య సదృశాన్ దారాన్ అనపత్యః ప్రమీయతామ్,

అనవాస్య క్రియాం ధర్మ్యాం యస్యార్యో~నుమతే గతః||(75-34),


జననీకౌసల్యామాతా! రాముని వనవాసమునకు పంపుటలో నా ప్రమేయమున్నచో "తగిన భార్యను చేపట్టక, అగ్నిహోత్రాది ధర్మకార్యమును అనుష్టింపనివాడై, సంతాహీనుడుగ మరణించెడి వానికి సంప్రాప్తించు పాపము నాకు చుట్టుకొనుగాక అంటు,


034.."" కమలపాణిః పృథివీమ్ అటతాం చీరసంవృతః,

భిక్షమాణో యథోన్మత్తో యస్యా~~ర్యో~నుమతే గతః||(75-39),

ఓ మాతా! నిజముగ ఈ వనవాస యాత్రలో ప్రమేయమున్మచో  "మాసిపోయి చిరిగిన వస్త్రములను  ధరించి ,పుర్రెను చేతపట్టుకొని బిచ్చమెత్తుకొనుచు యున్మత్తుని వలె తిరుగాడు వానికి పట్టు గతి నాకు పట్టుగాక! యని పలుపలు విధములుగ రామ వనవాసములో తన ప్రమేయము లేదని కౌసల్యామాత ముందు అట్డి పనులకి నేను పాల్పడలేదంటు అలా నేను ప్రవర్తించిన నాకు నరకము ప్రాప్తించుగాక యని విలపిస్తాడు.

కొన్ని కొన్ని సందర్భాలలో మన ప్రమేయము లేకపోయినా పరిస్థితుల ప్రభావకారణాల వల్ల మనము తాత్కాలికముగ  నిందలు మోయవలసి వస్తుందని ఆయా సమయాలలో మనమెలా ప్రవర్తించాలో భరతుని పాత్ర ద్వారా గ్రహించమని రామాయణము మనలని జాగృతము చేస్తున్నది.

జై శ్రీరామ్  జై  జై శ్రీరామ్.


మీ విధేయుడు 

మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ