Saturday, 6 December 2025

 [31/10, 10:39 am] . Mallapragada: _*🚩కార్తీకపురాణం - 10 వ అధ్యాయము🚩*_


*అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము*


జనకుడు వశిష్టుల వారిని గాంచి *" ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు ? వాడి పూర్వ జన్మ మెటువంటిది ? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను ? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను ? వివరించ వలసినది "* గా ప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా ! అజా మీళుని విష్ణు దూతలు వైకంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మరాజు కడ కేగి , *" ప్రభూ ! తమ అజ్ఞ ప్రకారము అజా మీళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము'* అని భయ కంపితులై విన్నవించు కొనిరి.

*"జా రా ! ఎంత పని జరిగెను ? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే ? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును"* అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొని *" ఓహొ ! అది యా సంగతి ! తన అవ సాన కాలమున " నారాయణ" అని వైకంఠవాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను విష్ణు దూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసి గాని , తెలియక గాని మృత్యువు సమయమున హరి నామస్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక , అజా మీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా !"* అని అనుకొనెను.

అజా మీళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను , సిరి సంపదల చేతను , బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక , శివాలయము యొక్క ధనము నపహరించుచు , శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక , దుష్ట సహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడి వాడు. ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి *" నాకు యీ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము",* అని భార్యతో ననెను. అందులకామె చిదరించుకోనుచు , నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక , అతని 

వంక కన్నెత్తి యైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కఱ్ఱతో బదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగు కొని భర్తను రెండితలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి , ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి *" ఓయీ ! నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కొరెను. అంత నా చాకలి *" తల్లి ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నిచాకులస్తుడును , చాకలి వాడిని మిరీ విధముగ పిలుచుట యుక్తము గాదు. నేనేట్టి పాపపు పని చేయజాలను"* అని బుద్ది చెప్పి వెడలి పోయెను. ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివర్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి *" అయ్యో ! నే నెంతటి పాపమునకు ఒడి గట్టితిని ? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి క్షణికమయిననకామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని"* అని పాశ్చాత్తాపమొంది , ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకు రావలసినదిగ పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త యింటికి రాగా పాదముల పై బడి తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణించుచు మరణించెను. అతడు రౌర వాది నరక కుపముల బడి నానా బాధలు పొంది మరల నానా జన్మ మెత్తి సత్య వ్రాతుడను బ్రాహ్మణో త్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవత దర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజా మీళుడై పుట్టెను. ఎప్పటికి తన అవసాన కాలమున *'నారాయణా'* అని శ్రీ హరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనలన నుభవించి ఒక మల వాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడు శిశువును తీసుకొనిపోయి అడవి యందు వదిలిపెట్టేను.అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో శ్రీ హరిని ధ్యానించుట , దాన ధర్మములు , శ్రీ హరి కథలను ఆలకించుట , కార్తిక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైననూ మోక్ష మొందగలరు. గాన కార్తిక మాసము నందు వ్రతములు , పురాణ శ్రవణములు చేసిన వారలిహపర సుఖములు పొంద గలరు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*దశమా ధ్యాయము- పదవ రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

[01/11, 7:20 am] . Mallapragada: *కార్తీకపురాణం*

               

            *11 వ అధ్యాయము*



*మ౦థరుడు - పురాణ మహిమ:*


ఓ జనక మహారాజా! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. 

ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. 


దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్ధగా ఆలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి..


“పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్య మా౦సాది పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప, ధీపారాదనాదికములను, ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. 


మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. 


ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. 


ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. 


సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన 

ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. 


ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభవి౦చుచు రక్తము గ్రక్కుచు బాధ పడుచు౦డిరి.


మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచరవర్తినియై భర్తను తలచుకొని దుఃఖిoచుచు కాలము గడుపుచు౦డెను. 


కొనాళ్ళుకు ఆమె యిoటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి “స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి ‘అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొని వచ్చెదను. నీవు ప్రమిదను, వత్తి ని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొనుము” అని చెప్పిన తోడనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను. 


అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల “ఆరోజు రాత్రి ఆలయముందు జరుగు పురాణ కాలక్షేపము నకు” రమ్మని చెప్పెను. 


ఆమె కూడా రాత్రి అంతయు  పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. 


ఆమె పుణ్యత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు దీసికొనిపోయిరి. 


కానీ - ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుటచేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికొనిపోయిరి. అచట నరకమందు మరి ముగ్గురితో భాద పడుచున్న తన భర్తను జూచి 

‘ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక  బాధపడుచున్నారు. కాన, నాయ౦దు దయయుంచి వానిని ఉద్దరింపు’డని ప్రాధేయపడెను. 


అంత విష్ణుదూతలు “అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యా దులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య, మాంస భక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచునారు.’ అని వారి చరిత్రలు చెప్పిరి. 


అందులకుఆమె చాలా విచారించి ‘ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు’ డని ప్రార్ధించగా, అందులకా దూతలు “అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కలిగినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు" నని  చెప్పగా అందులకామె అట్లే ధార పోసెను. 


ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టులవారు నుడివిరి.✍️```

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*ఏకాదశో ధ్యాయము- పదకొండవ రోజు పారాయణము సమాప్తము.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

[02/11, 10:46 am] . Mallapragada: _*🚩కార్తీక పురాణం -12 వ అధ్యాయము🚩*_


*ద్వాదశి ప్రశంస*

*సాలగ్రామ దానమహిమ*



*"మహారాజా ! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి , సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"* మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.


కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి , సాయంకాలము శివాలయమునకు గాని , విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి , నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక , మోక్షము కూడా పొందుదురు.


కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున , పూర్ణోపవాసముండి ఆ రాత్రి  విష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి , శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన , కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక , కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి , ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి , దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున , కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని , సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము.


*సాలగ్రామ దానమహిమ*


పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు , తాననుభవించక , యితరులకు బెట్టక , బీదలకు దానధర్మములు చేయక , ఏల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవిగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక *"పరులద్రవ్యము నెటుల అపహరింతునా !"* యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.


అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు *"అయ్యా ! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా , మీ ఋణము తీర్చుకోగలను"* అని సవినయముగా వేడుకోనెను. ఆ మాటలకు కోమటి మండిపడి *"అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీ కంఠమును నరికి వేయుదును"* అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి , అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక , అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.


ఆ  వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు , నీడకొరకై చెట్లు నాటించుచు , నూతులు , చెరవులు త్రవ్వించుచు , సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి , త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి , విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి , చేతులు జోడించి *"మహానుభావా ! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ   నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు"* అని సవినయుడై వేడుకొనెను.  అంత నారదుడు చిరునవ్వు నవ్వి *"ఓ ధర్మవిరా ! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రితికరమైన దినము.


అరోజున స్నాన , దాన , జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా , జారుడైనా , చోరుడైన , పతివ్రతమైనా , వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి , సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ , ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము"* అని చెప్పెను.  అంతట దర్మవిరుడు *" నారద మునివర్యా ! నేను గోదానము , భూదానము , హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని , అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునా   యని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా ! దాహంగొన్న వానికి దాహం తీరునా ? కాక , యెందులకీ దానము చేయవలయును ? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"* నని నిష్కర్షగా పలికెను.


ధర్మవీరుని అవివేకమునకు విచారించి *"వైశ్యుడా ! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని , యీ దానముతప్ప మరొక మార్గము లేదు"* అని చెప్పి నారదుడు వెడలిపోయాను.


ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు , దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి , మరి మూడు జన్మలందు వానరమై పుట్టి , ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి , పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి , పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టి  ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.


చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగేనా యని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి *"నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక"* యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయి  ఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం , జన్మాంతరమున స్వర్గమున కెగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.


కావున , ఓ జనకా ! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము -* *పన్నెండోవ రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

No comments:

Post a Comment