Saturday, 6 December 2025

[28/10, 12:04 pm] . Mallapragada: 🌼_*కార్తీక పురాణం*_🌺


_*అధ్యాయము - 7*_🍃

*శివకేశవార్చనా విధులు*


ఓ జనక రాజేంద్రా ! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా - దీప విధానాలను చెబుతాను విను.


*పుష్పార్చనా ఫలదాన దీపవిధి - విశేషములు:*


ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన  కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరనివాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని , జాజిపువ్వులతోగాని , మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ  భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు  సూర్యోదయానికి చీకట్లవలె చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో , వారికి మించిన ధన్యులెవరూ  ఉండరనడం అతిశయోక్తి కాదు.


బ్రాహ్మణ సమేతులై , ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో  విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో , వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని , అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప , హోమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి -  పుష్పము  పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.


కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి , పంచరంగులతోనూ , శంఖ - పద్మ - స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై , అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్థాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై  అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి.  ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము , మహానదీ స్నానము , బ్రహ్మపత్ర భోజనము ,  అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ , లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి , తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.


కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ  జనక మహారాజా ! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో  శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను , అశక్తులయిన వాళ్లు.


      *శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !*

        *మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!*

    *శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !*

         *మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!*


కార్తీకమాసంలో ఆదివారం  నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని , పూర్ణమనాడు గాని , అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. *'ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు  కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ  కార్తీక మహాపురాణాన్ని చదివినా , వినినా కూడా  స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా ! మహీశా ! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి. కార్తీకమాసము విష్ణుపూజార్ధమై యితరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ - విష్ణుస్తోత్రాలను పఠించేవారు - కొంతకాలము స్వర్గలోకములో వుండి - అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు.


ఇలా ప్రతీ ! కార్తీక మాసములో యెవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడుజన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.*

[29/10, 9:52 am] . Mallapragada: *కార్తీకపురాణం*

                ➖➖➖✍️

            8 వ అధ్యాయము


*శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*

*ఆజా మీళుని కథ*


వశిష్టుడు చెప్పిన దంతా విని 

“మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభంగా కలుగు ననియూ, అది - నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులే చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పాటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను” యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి..  “జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు.

 సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు యెంతటా ఆధిక్యత కలదు.  


సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు - వేదములు పఠించి, సదచారుడై, కుటింబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందున్న  దేవాలయంలో జపతపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు.


రాజస ధర్మమనగా - ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించునదగును.


తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడినపుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్ఛరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు..```


*ఆజా మీళుని కథ*```

పూర్వ కాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావాసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. 

ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కామంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞోపవీతము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామ క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంటనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున అజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువులు తనని విడిచి పెట్టిరి. అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టేక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. అజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధకారాముచె కన్ను మిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటిలోనె చచ్చిరి. మరల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను.

వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ' అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళుచూ, “నారాయణా-నారాయణా” అని ప్రేమతో సాకు చుండిరి. కాని 

‘నారాయణ' యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్రమతనికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై 

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజామీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక 'నారాయణా'’నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. 


అజామీళుని నోట 'నారాయణా'యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి “ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి' యని చెప్పి, అజామీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు 

'అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కోరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొడంగిరి.✍️```


*ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*ఎనిమిదో అధ్యాయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

[30/10, 6:59 am] . Mallapragada: _*కార్తీకపురాణం -  9 వ అధ్యాయము*_


*విష్ణు పార్షద , యమ దూతల వివాదము*


☘☘


*'ఓ యమ దూత లారా ! మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా ! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు , చంద్రుడు , భూదేవి , ఆకాశము , ధనంజయాది వాయువులు , రాత్రింబవళ్లు  సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును , గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు , పర స్త్రీ లను కామించిన వారును , పరాన్న భుక్కులు , తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కుల వృతిని తిట్టి హింసించు వారున్నూ , జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును , జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును , యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును , చేసిన మేలు మరచిన కృతఘ్నులును , పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. 


వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా

మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి , కామాంధుడై వావివరసలు లేక , సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు ? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కింకరులారా ! మీరెంత యవివేకులు ? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును , జపదాన ధర్మములు చేయువారును - అన్నదానము , కన్యాదానము , గోదానము , సాలగ్రామ దానము చేయువారును , అనాధ ప్రేత సంస్కాములు చేయువారును , తులసి వనము పెంచువారును , తటాకములు త్రవించువారును , శివ కేశవులను పూజించు వారును సదా హరి నామ స్మరణ చేయువారును మరణ కాలమందు *' నారాయణా'* యని శ్రీ హరిణి గాని , *' శివ '* అని శివుని గాని స్మరించు వారును , తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నామస్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు ! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున *"నారాయణా"* అని పలికిరి.

అజా మీళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది *" ఓ విష్ణు దూతలారా ! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని , ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్టుడనై , నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో *"నారాయణా"* యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా ! నేనెంత అదృష్టవంతుడను ! నా పూర్వ జన్మ సుకృతము , నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ ! తెలిసిగాని , తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద , కలిగించునో , అటులనే శ్రీ హరినామం స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదరు. ఇది ముమ్మాటికినీ నిజము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*నవమద్యయము- తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

No comments:

Post a Comment