Thursday, 9 April 2026

 

*శతపత్ర -31*
🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

శతపత్ర లోయ అంచుకు చేరుకొనేసరికి అప్పుడే తూరుపు తెల్లబడుతోంది.

చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. వాతావరణం చలిచలిగా ఆహ్లాదభరితంగా వుంది. లోయ మీదుగా మంచు తెరలు గాలికి పరదాల్లా కదులుతున్నాయి. మనోహరమైన ఆ ఉదయశోభను ఆస్వాదించే మూడ్ లో లేదు శతపత్ర. అడవిలో పొదలు, కొమ్మలు నరికి దారిచేసుకోడానికి ఒక పొడవాటి కత్తిని మాత్రం వెంట తెచ్చుకుంది. మెడలోని తులసిమాలను ఓసారి తడిమిచూసుకుంది. వచ్చేముందే రుద్రపాద మెడలోంచి ఆ మాలని తీసి తన మెడలో వేసుకుంది.

లోయలోకి దిగాలంటే ఆమె గుండెలు దడదడలాడుతున్నాయి. నిన్న జరిగిన అనుభవాన్ని ఆమె మర్చిపోలేదు. మరోసారి అలాంటి అనుభవాల్ని ఫేస్ చేయక తప్పదు.
ఇలాంటి మృత్యులోయలోకి వెళ్ళాలను కుంటే ధైర్యం, కసి, పట్టుదల ఉంటేనే సాధ్యం. ప్రాణాలమీద ఆశ వదులుకొనే తను బయలుదేరింది. తన కలలకీ, ఈ లోయకీ గల అనుబంధం ఏమిటో తెలుసుకోకుండా వెనక్కి వచ్చేది లేదు.

చుట్టూ గిరిశిఖరాలు మూడూ వెలుగు నీడలతో దర్శనమిస్తున్నాయి. ఎత్తైన వృక్షాలు తలలు విరబోసుకొని కూర్చున్న దెయ్యాల్లా బెదిరిస్తున్నాయి.

కాసేపట్లో తూర్పున సూర్యోదయం కానుంది. బూడిదరంగు గద్దలు గిరిశిఖరాల నుంచి లేచి లోయ మీదకు ఎగరటం ఆరంభించాయి.

కత్తి చేత్తో పుచ్చుకుని ముందుకు కదిలింది శతపత్ర. శిథిలమైపోయిన గోడను కూడా దాటి ఏటవాలుగా లోయలోకి దిగటం ఆరంభించింది.

ఎటు చూసినా ఎత్తైన వృక్షాలు... నేలమీద పొదలు ... ఒత్తుగా పెరిగిన పచ్చిక.. లతలు, తీగలు గజిబిజిగా అల్లుకొని వున్నాయి. సన్నటి దారిని గుర్తించటం కూడా కష్టంగా వుంది. కత్తితో తీగలు, పొదల్ని నరికి దారి చేసుకుంటూ లోయలోకి వెళ్ళిపోతోంది శతపత్ర.

ఆమెలో తనకే తెలీని ఏదో మొండిధైర్యం ఆవహించింది. అసలు తనలోనే మరో శతపత్ర దాగివుందేమోనని ఆమెకు అనుమానంగా వుంది. లేకపోత అంతటి నీడలాంటి శక్తిని ఆగిపొమ్మని శాసించి, ముఖంలో ముఖం పెట్టి చూసేంత ధైర్యం తనకెక్కడిది? సాధారణ మనిషైతే అక్కడే గుండె ఆగి చనిపోయేవాడు.

ఆలోచనల్లో ఫర్లాంగు దూరంపైగా లోయలోకి వచ్చేసింది. సరిగ్గా అప్పుడే లోతట్టు లోయ లోంచి వినవచ్చింది ఎనుబోతు రంకె. నిన్నటి అదే అనుభవం. తన రాకను లోయలోని శక్తులు పసిగట్టాయా?

ఉన్నట్టుండి ఆగింది శతపత్ర.

తనను ఎవరో అనుసరిస్తున్న ఫీలింగ్... రుద్రపాద చాటుగా తనను అనుసరించటం లేదుగదా! గిరుక్కున తిరిగిచూసింది. అక్కడ ఎవరూ లేరు. తను భ్రాంతికి లోనయిందా!

తిరిగి అడుగులు ముందుకు వేసింది. లెక్క ప్రకారం అటు సూర్యోదయం అయింది కాబట్టి, తను లోయలోకి వెళ్ళేకొద్దీ ఇంకా వెలుతురు పెరగాలి. కాని ఉన్నట్టుండి చీకట్లు ముసురుకోనారంభించాయి. అదే సమయంలో అస్పష్టంగా చీకట్లలోంచి కొన్ని గొంతులు “వద్దు... రావద్దు... వెనక్కి వెళ్ళిపో..." అంటూ హెచ్చరించాయి.

లోయలోని శక్తులు తన రాకను పసిగట్టి దాడులకు సిద్ధమవుతున్నాయని వెంటనే గ్రహించింది శతపత్ర. అవే తనను వెనక్కి పొమ్మని హెచ్చరిస్తున్నాయని ఊహించింది. వేటినీ లక్ష్యపెట్టకుండా ముందుకే పోతోంది.

చెట్ల కొమ్మలు జలజలా ఊగాయి. ఎక్కడో పక్షులు రెక్కలు తపతప కొట్టుకున్న అలికిడి.

శతపత్ర గుండెలు దడదడలాడాయి. తను భయపడి "లాభం లేదని తెలుసు కాబట్టి మరింతగా గుండెను రాయి చేసుకుంటూ ముందుకేసాగింది. ఎక్కడా నడక ఆపే ఉద్దేశ్యం ఆమెకు లేదు.

అంతలోనే పరిసరాలు పూర్తిగా చిమ్మచీకట్లు ఆవరించాయి. ఆకాశం కన్పించటంలేదు. చుక్కలూ కన్పించటంలేదు. కాటుకలా చిక్కని చీకటి. ఒక్కక్షణం... ఒకే క్షణం ఆగిందామె. ఆ చీకట్లో ఎటు వెళ్ళాలి. గమ్యం ఎక్కడ? లోయ ఆ చివర నుంచి అడవిదున్నల రంకెలు గుబులు పుట్టించేలా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ దిశగానే సాగాలని నిర్ణయించుకుంది.
📖

అంతలో ఒక అద్భుతం జరిగింది... లోయ మధ్య ప్రాంతంలో ఎక్కడో వెన్నెలకాంతి వంటి వెలుగురేఖలు విచ్చుకున్నాయి. తను ఉన్న చోటుకు అతిసమీపంలోనే ఒక బాట ఆమె దృష్టి పథాన్ని ఆకర్షించింది. కొద్ది క్షణాల ముందువరకు అక్కడ ఎలాంటి బాట కన్పించలేదు.

ఇప్పుడు ఆ బాట మీదకు తను అడుగు పెట్టడం సురక్షితమా కాదా? అన్నిటికీ తెగించే వచ్చింది తను. ఇంకా ఆలోచన ఏమిటి? ఏమైతే అవనీ అనుకుంటూ ఆ బాటమీద కాలుపెట్టింది. నాలుగుఅడుగులు కూడా వేయలేదు. అంతలోనే దబ్బున ఆమె ముందుకు దూకిందో నల్లపిల్లి. అలా సడెన్ గా దూకటంలో శతపత్ర గుండె ఝల్లుమంది. ఎగిరి వెనక్కి దూకింది.

ఆల్సేషియన్ డాగ్ సైజులో ఉంది అది. కళ్ళు నిప్పుముద్దల్లా ఎర్రగా ఉన్నాయి. కోరల్లా ఉన్న పళ్ళను బయటపెట్టి 'మ్యావ్' అంటూ వికృతంగా అరిచింది. తోకను ఆడిస్తూ దూకటానికి సిద్ధమవుతోంది అది.

అంతటి భయంలో కూడా ఆమెకి కోపం ముంచుకొచ్చింది. ఏమిటివి నన్ను తెగ బెదిరిస్తున్నాయి. మనుషులంటే వీటికి అంత అలుసా? "ఎవరే నువ్వు? నా మీదకు దూకుతావా? చంపుతావా? కమాన్... రా” అంటూ చేతిలో కత్తిని దానిమీదికి విసిరింది శతపత్ర. అంతే చెవులు పగిలేలా పెద్దగా అరిచి వెనక్కి దూకిందా పిల్లి. తిరిగి చూడకుండా చీకట్లలోకి పారిపోయింది.
కిందపడ్డ కత్తి తీసుకుని ఇక ఆగకుండా వడివడిగా నడవటం ఆరంభించింది శతపత్ర. అవసరమైతే పోరాటానికి సిద్ధంగా ఉంది. దారుణమైన ఒక తెగింపు ఏర్పడింది. దారిలో ఓ పిల్లల కోడి కంగారుపెట్టాలని చూసింది. అంతా తనకి కలలో జరిగిన సంఘటనలే రిపీట్ అవుతున్నట్టున్నాయి.

మరికొంత దూరం ముందుకు వెళ్ళేసరికి పెద్ద అడవిపంది ఒకటి భీకరంగా అరుస్తూ వచ్చి దారికి అడ్డంగా నిలబడి కదలకుండా మొరాయించింది. అసలే కోపంలో, ఆవేశం గా వున్న శతపత్ర చేతిలో కత్తితో బలంగా పొడిచింది దాన్ని. దారుణంగా అరుస్తూ పక్కకు తొలగి దూరంగా వెళ్ళిపోయిందది. పెద్ద పెద్ద అంగలతో బాటవెంట ముందుకు సాగింది శతపత్ర.
📖

ఆ బాట లోయ మధ్యగా, దక్షిణంగా ఉన్న కొండపాదం వైపు తనను తీసుకుపోతున్నట్టు గ్రహించిందామె. ఎనుబోతు రంకెలు కూడా అటునుంచే వినవస్తున్నాయి.

మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక్కసారిగా సమీపంలోంచి ఒళ్ళు జలదరించేలా నక్కల ఊళలు వినవచ్చాయి. పక్కనే ఎండిన వృక్ష శాఖల మీద తీరిగ్గా కూచున్న గుడ్లగూబలు కొన్ని ఎవరో రాయి విసిరినట్టు ఒక్కసారిగా రొదచేస్తూ గాలోకి లేచాయి. మరోపక్క గబ్బిలాల రొద గుండెల్ని గుభేలుమనిపించింది.

ఉన్నచోటే ఆగిపోయింది శతపత్ర. ఏదో ఆలోచిస్తోంది.

అసలు గరుడలోయలో పక్షిజాతులుగాని, జంతువులుగాని ఏమీలేవు. కేవలం గరుడ పక్షులు మాత్రమే కన్పించాయి తనకి కలలో. అలాంటప్పుడు ఈ నక్కలు, గుడ్లగూబలు, గబ్బిలాలు ఎక్కడినుంచి వచ్చాయి? అంటే ఇవన్నీ ఆయా జాతుల ప్రేతాత్మలు గాని, లోయలో ఉండే శక్తులుగాని అయి వుండాలి. ఎలాగైనా తనను భయపెట్టి లోయ బయటికి పంపించాలని చూస్తున్నాయి.

ఆమెలో పట్టుదల మరింత అధికమైంది.
ముందుకు పోబోతూ మరోసారి ఆగింది.
ఈసారి బాట ఎగువనుంచి ఎనుబోతు రంకెలు కర్ణకఠోరంగా బిగ్గరగా వినవచ్చాయి.

అదే క్షణంలో చెట్లమీదుగా ఒక స్త్రీ ఆర్తనాదం వినవచ్చింది. ఆమె ఏడుపు దయనీయంగా వుంది. ఆమె రోదన లోయ లో మారుమోగుతోంది. ఇది కూడా తనకు కలలో అనుభవమైన విషయమే. తలెత్తి చూసింది శతపత్ర, ఆకాశం చిమ్మచీకటిగా ఉంది.

పైన ఎవరూ కన్పించటంలేదు. కాని ఆ ఆర్తనాదాలు మాత్రం ఉత్తరంగా చెట్లపైన మొదలై అలా అలా దక్షిణంగా సాగిపోతూ క్రమంగా మందగించాయి. ఆ తర్వాత ఆమె రోదన విన్పించలేదు. ఎవరో అర్ధాంతరంగా మరణించిన స్త్రీ ప్రేతాత్మ ఆత్మల ప్రపంచం లోకి పోతున్నట్టుంది. ఆలోచిస్తూ ముందుకు సాగింది శతపత్ర..

అంతలో అడవిదున్న రంకెలు మరింతగా దగ్గరయ్యాయి. రాత్రి దాడి చేసిన నల్లటి శక్తి తిరిగి దాడి చేయొచ్చనుకుంది. దానికి బదులు ఎనుబోతు వస్తున్నట్టుంది. మహిషం... యముడి వాహనం. తనను అంతం చేయమని దాన్ని పంపిస్తున్నాడా! చూస్తున్నంతలోనే దృష్టిపథంలోకి వచ్చేసింది అది. పోతపోసిన ఇనుప మృగంలా అంత ఎత్తున ఉంది.

అది తల విదిలించి బుసలు కొడుతోంది. తోక లేపి రంకెలు వేస్తూ గిట్టల వెంట లేస్తున్న దుమ్ముతెరల మధ్య నుంచి అది వేగంగా దూసుకొచ్చేస్తోంది. దాని దూకుడు చూడగానే శతపత్రకు చెమటలు పట్టేశాయి. గుండెలు వేగంగా కొట్టుకోనారంభించాయి.
కాళ్ళు చచ్చుబడిపోయినట్టు కదలనని మొరాయించాయి. ఇక ఇక్కడితో తన పని అయిపోయిందనుకుంది. కళ్ళుగట్టిగా మూసుకుని ఉన్నచోటే శిలావిగ్రహంలా నిలబడిపోయింది.

తన ఆఖరిక్షణాల్ని లెక్కపెట్టుకోసాగింది.

అంతలోనే- సమీపంలోకి వచ్చిన మహిషం గిట్టల శబ్దం ఉన్నట్టుండి ఆగిపోయింది. ఏంజరిగిందో అర్థంకాలేదు. చటుక్కున కళ్ళు తెరిచింది. ఆమెకు సరిగ్గా పది అడుగుల దూరంలో దుమ్ము తెరల మధ్య మహిషం నిలబడుంది. అది కాలితో నేలను మట్టగిస్తూ తల విసురుతోంది. సూటిగా తననే చూస్తోంది. ఏమైంది దీనికి? తనను తాను చూసుకుంది. తను మామూలుగానే ఉంది. కాని ఆ మహిషం కళ్ళకి తనలో కన్పిస్తున్న ఒక దివ్య సుందర రూపం గురించి ఆమెకు తెలీదు. ఆ రూపం మహిషాన్ని మంత్రబద్ధం చేసింది.

ఇప్పుడది బుసలు కొట్టడంలేదు. కళ్ళలో కోపం శాంతించింది. ఒక్కో అడుగేవేస్తూ పెంపుడు జంతువులా దగ్గరకొచ్చి ప్రేమగా తలాడించింది. ఆమె ముందు మోకరించింది.

ఇది ఒక నమ్మలేని అద్భుతంగా తోచింది శతపత్రకి. సూదిగా, వాడిగా ఉన్న బలమైన ఆ ఎనుబోతు కొమ్ముల్ని చూస్తుంటే, శతపత్ర గుండెల్లో దడపుడుతోంది. ధైర్యాన్ని కూడగట్టుకొంటూ దాని తల నిమిరింది.

“మహిషా... నేను మీ లోకాన్ని చూడాలను కుంటున్నాను. నన్ను అక్కడికి తీసుకెళ్తావా?” అనడిగింది.

ఆ మాటలనే ఆనతిగా తీసుకున్నట్టు చెంగున లేచి నిలబడి. వెనుతిరిగింది అది. అంత దూరం వెళ్ళి ఆమె వస్తుందో లేదోనని ఆగి తిరిగి చూసింది.

వెంటనే దాన్ని అనుసరించింది శతపత్ర. ఆ తర్వాత ఏ శక్తులూ ఆమెమీద దాడి చేయటానికి సాహసించలేదు. స్వయంగా మహిషమే ఆమెను వెంటనిడుకొని తీసుకు రావటంతో అవన్నీ పక్కకి తొలిగిపోయాయి.
📖

కొద్దిసేపటికి దక్షిణంవైపు కొండపాదంలోని ఒక గుహ ముందుకు ఆమెను చేర్చిందా మార్గం. ఆ ప్రాంతమంతటా పరుచుకొంటున్న వెన్నెల్లాంటి వెలుగు ఎక్కడి నుంచి వస్తోందో ఆమెకు అంతుబట్టలేదు.

గుహద్వారం కోట గుమ్మం అంత ఎత్తుగా విశాలంగా ఉంది. దానిపైన నాలుక చాపిన పెద్ద రాక్షసుడి తల శిల్పం ఉంది. ఆ శిల వికృతమైన చేతులు గుహకు అటూ ఇటూ నేలకు ఆని వున్నాయి. గుహలో అంత దూరంలో ఎత్తైన పులులతో కూడిన పెద్ద గుమ్మం వుంది. తలుపులు మూసుకుని వున్నాయి. అటూ ఇటూ తలుపులమీద పెద్ద పెద్ద కొమ్ములతో మహిషం తల చిత్రాలు మెరుస్తున్నాయి. చాలా భీతావహంగా ఉందా ప్రాంతం.

గుహ ఆవరణలో ఎత్తయిన అతి పెద్దదైన మహిషం నల్లటి శిలా విగ్రహం నిలబడుంది. ఆమెను తీసుకొచ్చిన మహిషం అక్కడే అటూ ఇటూ తిరుగుతోంది.

ఇంత దూరం వచ్చాక నెరవటం అనవసరం అనిపించింది. సూటిగా గుహలోకి తన అడుగులు వేసింది శతపత్ర. అంతే... "వద్దు... రావద్దు... నీకు అనుమతి లేదు. వెనక్కి వెళ్ళిపో" అంటూ ఎక్కడినుంచో అనేక వేల గొంతులు ఒక్కసారిగా బిగ్గరగా అరిచాయి.

శతపత్ర సరాసరి గుమ్మం ముందుకెళ్ళి నిలబడింది. వెనక్కి వెళ్ళిపోయే ఉద్దేశ్యం ఆమెకు లేదు. సాహసించి తలుపుల మీద చేతులేసి బలంగా నెట్టింది. ఉక్కుచట్రాల్లా ఉన్నాయవి. అంగుళం కూడా కదల్లేదు.

"వెళ్ళిపో... వెనక్కి వెళ్ళిపో..." రణగొణ ధ్వనిగా అనేక గొంతులు అదృశ్యరూపంలో ఉండి అరుస్తూనే వున్నాయి. కావలి శక్తులు తనను ఏమీ చేయలేక అరిచి గోలచేస్తున్నా యని గ్రహించింది. తల తిప్పి గుహ బయట వున్న దున్నపోతు వంక చూసింది.

“మహిషా... నేను లోపలికి వెళ్ళాలి. దారి చూపించు" అంటూ ఆదేశించింది శతపత్ర.

పిలుపు విన్న తక్షణం అది పెద్దగా అరిచింది.

అమితవేగంతో సూటిగా లోపలికొచ్చి తలతో తలుపుల్ని ఒక గుద్దు గుద్దింది. అంతే... ధడాలున శబ్దం చేస్తూ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. వచ్చినంత వేగంగానూ వెనక్కి వెళ్ళిపోయింది మహిషం. తిరిగి చూసిన ఆమెకు గుహ ఆవరణలో ఉన్న దున్నపోతు శిలావిగ్రహంలోకి అది అదృశ్యమవుతూ కన్పించింది.

దడదడలాడుతున్న గుండెలతో తెరిచిన తలుపుల గుండా లోపలకు చూసింది శతపత్ర. లోపల ఏముందో తెలీదు. నిశ్శబ్దంగా, చిమ్మచీకటిగానూ ఉంది.

ఇక ఆలోచించలేదు. ఏమైతే అయిందని గడపదాటి లోపలకి అడుగుపెట్టింది. ఆమె వెనకే కిర్రుమని శబ్దాలు చేస్తూ యథాప్రకారం తలుపులు మూసుకుపోయాయి. అవి మూసుకున్న మూడో సెకనులో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది.

ఎదురుగా వున్న దృశ్యం చూసి- ఉన్న చోటే శిలావిగ్రహంలా బిగుసుకుపోయింది శతపత్ర.
🍁
*సశేషం*
*శతపత్ర - 33*
🍁

అంతలో ఆ విచిత్ర వాహనం చలువరాతి కోటలోకి ప్రవేశించి ఒక విశాలమైన ప్రాంగణంలో నేలమీద వాలింది.
📖

అది మైనాకుని మందిరం... గదాయుధాన్ని భుజాన వేసుకొని మీసం దువ్వుతూ మృగ రాజులా పచార్లు చేస్తున్నాడు మైనాకుడు. వెళ్ళిన కింకరులు ఇంకా తిరిగిరాలేదు. సశరీరంతో ఆ మానవ యువతిని తీసుకు రాలేదనే కోపంతో మాటిమాటికీ ప్రవేశ ద్వారం వంక చూస్తున్నాడు.

శ్యామలాంగుడైన మైనాకుని శిరస్సున మణిమయ కిరీటం ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తోంది. ఎర్రని పట్టువస్త్రాలు ధరించి వున్నాడు.

కరకంకణాలు, ఒంటిమీద ధరించిన ఆభరణాలు ఆయన నడుస్తుంటే వింతగా ధ్వనిస్తున్నాయి. ఆయన మహారాణి మిత్రవింత కూడా ఆతృతగా చూస్తోంది. అంతలో ఒక కింకరుడు వినమ్రంగా వంగి వంగి అభివాదం చేస్తూ లోపలికి వచ్చాడు.

ఏమిటన్నట్టు పలకరించి చూశాడు మైనాకుడు.

"ప్రభూ! మానవయువతిని మన భటులు తోడ్కొని వచ్చి తమ యానతి కోసం వేచి వున్నారు" అంటూ మైనాకునికి విన్నవించాడు కింకరుడు.

“ప్రవేశపెట్టండి” ఆజ్ఞాపించాడు మైనాకుడు.

బయటకి పరుగెత్తాడు కింకరుడు.

ఆమెను చూడాలనే ఉత్సుకతతో లేచి వచ్చింది మిత్రవింద. ఇంతలో ఇద్దరు కింకరులు అనుసరించగా లోపలకు ప్రవేశించింది శతపత్ర.

ఆమెకు ఇదంతా ఓ కలలా వుంది. భుజాన గదతో యముడికి ప్రతిరూపంలా భీకరంగా ఉన్న మైనాకుడిని చూస్తుంటే శతపత్రకి గుండెలు పీచుపీచుమని కొట్టుకున్నాయి. ఒకింత భయంతో దడపుట్టింది.

అయినప్పటికీ అన్నిటికీ తెగించిన ధీమా ఆమెది. షర్టు చేతులు మడిచి నిబ్బరంగా వచ్చి నిలబడింది. జీన్సు ప్యాంటు, షర్టులో అందమే తానుగా అరుదెంచిన ఆమెను దంపతులిద్దరూ ఆశ్చర్యంగా చూశారు.

“ఆయనే ప్రభువు మైనాకుడు. దండం పెట్టు... దండం పెట్టు” అంటూ శతపత్ర చెవిలో గుసగుసలాడాడు జడలో మందార పువ్వుగా అమరివున్న చైతన్య.

అప్రయత్నంగానే గరుడలోయాధిపతికి ఆయన ధర్మపత్నికి భక్తి పూర్వకంగా నమస్కరించింది శతపత్ర.

మిత్రవింద ఆమెను ముచ్చటగా చూస్తూ ముందుకొచ్చింది. "అద్భుతం... పరమాద్భుతం. ఈ బాలిక సజీవముగా మన లోకమందు ప్రవేశించుట ఏమి? మన కావలి శక్తుల గాంచినంతనే మానవులు గుండెపగిలి ఛస్తారు. ఏమి ఈమె ధైర్యము?” అంది భర్తతో.

“అదియేగద దేవీ, ఈమె మాయాజాలము. వదలను. ఈమె దుశ్చర్యకు తగిన శిక్ష విధింపక వదలను" అంటూ అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమని హుంకరిస్తూ ముందుకి వచ్చిన మైనాకుడు ఒక్కసారిగా ఆగిపోయాడు.

ఇది నిజంగానే ఆమె మాయాజాలమా లేక తన భ్రమా అర్ధంగాక కళ్ళు నులుముకొని చూశాడు.

శతపత్ర స్థానంలో ఇప్పుడు కన్పిస్తున్నది ఆమె కాదు. ఒక దివ్యాంగన మైనాకుడికి దర్శనమిస్తోంది. శిరస్సున మణిమయ కిరీటంతో, నీలాంబరిగా, మణిమయ ఆభూషణాలంకృతయై తేజోమయంగా వెలిగిపోతున్నదామె.

ఆ దివ్యతేజస్సును చూడలేక కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకున్నాడు మైనాకుడు. అతనెందుకలా ఆగిపోయాడో తెలీక ఆశ్చర్యపోయింది శతపత్ర. తనను తాను చూసుకుంది. తనలో ఏ మార్పూ లేదు. మామూలుగానే ఉంది. ఆయన వస్తున్న దూకుడు చూసి తన పని అయిపోయిందనే అనుకుంది. ఇంతలో ఏమైంది?

మైనాకుడు ఆనందభాష్పాలతో ముందుకు వచ్చి గదను పక్కన ఉంచి ఆమె ముందు మోకరించి పాదాలు తాకి నమస్కరించి కళ్ళ కద్దుకున్నాడు. ఆయనతోపాటే మిత్రవింద కూడా వచ్చి మోకరిల్లింది.

ఊహించని ఈ సంఘటనకి... హతాశురాలయింది శతపత్ర. మందారంగా ఉన్న చైతన్య ఆత్మ ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది.

“శిక్షిస్తాడనుకొంటే సాగిలబడ్డాడేమిటి?... శతపత్రా... నువ్వు సామాన్యురాలివి కాదు" అంటూ ఆమె చెవిలో గుసగుసలాడాడు చైతన్య.

శతపత్రకు చిర్రెత్తుకొచ్చింది. తనకే అర్ధంగాక చస్తుంటే మధ్యలో ఈ చైతన్య గోల ఒకటి అనుకుంటూ జడలో పువ్వును పీకి అవతల పారేసింది. ఆ మందాపువ్వు సూటిగా పోయి పరదాల మాటున పడింది. వెంటనే కోతి పిల్లగా మారి చెంగున ఇవతలికి దూకాడు చైతన్య. సాగిలబడిన రాజదంపతులకీ విషయం తెలీదు.

కాని అక్కడే ఉన్న కింకరులు దాన్ని చూసి ఠారెత్తిపోయారు. అది లోపలకెలా వచ్చిందో తెలియక ముఖాలు చూసుకున్నారు. మైనాకుడు గమనిస్తే తమ బతుకులు తెల్లారిపోతాయని భయపడిపోయి ఆ పిల్ల కోతిని బైటికి తరుము కెళ్ళారు.

ఈ లోపల మైనాకుడు మాతృభక్తిలో పరవశించిపోతూ సతీసమేతంగా లేచి నిలబడి మరొక్కసారి నమస్కరించి కన్నీరు పెట్టుకున్నాడు. ముకుళిత హస్తాలతో "తల్లీ లోకపావనీ... అలనాడు అలిగి భూలోకం వచ్చి, నదిగా మారిపోయాక, తమ దర్శన భాగ్యమే కరువైపోయినది. ఎందరో పాపులను నిత్యం పునీతుల్ని చేయు ఓ జననీ... ఇంతకాలానికి ఈ బిడ్డడిమీద దయగలిగినదా అమ్మా... ధన్యోస్మి మాతా ధన్మోని...” అన్నాడు.

దరహాసంతో కొడుకునీ, కోడల్ని ఆశీర్వదించింది యమునాదేవి.

"బిడ్డా మైనాకా!... ఈ బాల నా అంశలో జనించిన కారణజన్మురాలు. కోపించి ఈమెను శిక్షింపతగదు. ఈమెను అతిథిగా భావింపవలె. ఈ విషయం ఎరుకపరచటాని కే స్వయముగా వచ్చితిని. శుభమస్తు" అంటూ ఆశీస్సులందించి అంతర్ధానమైంది యమునాదేవి.

ఇప్పుడు ఆమె స్థానంలో మళ్ళీ శతపత్ర కన్పించింది. ఆమెలో తన తల్లిని చూస్తున్నాడు మైనాకుడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.

శతపత్ర కూడా ఆ సనాతన దంపతుల్ని ఆశ్చర్య సంభ్రమాలతో చూస్తోంది. ఆమెకి నోటమాట రావటం లేదు. తన ముందున్నది మనుషులు కాదు, దేవతలు, ఆత్మలు పుడుతుంటాయి. చస్తుంటాయి. కాని వాటిని శాసిస్తూ వేలాది సంవత్సరాలుగా నిత్యనూతనంగా ఉన్న పుణ్యదంవతులు. వారు నమస్కరిస్తున్నది తనకు కాదని, ఏదో అద్భుతం జరిగిందని ఊహించి స్థాణువైపోయిందామె.

మైనాకుడు ఉత్సాహభరితంగా గదను భుజాన వేసుకుని... "ఏమి నా భాగ్యము. మాతృసందర్శన భాగ్యము కలిగె. ధన్యుండ బాలికా... నీవు మా లోకమునకెటుల రాగలిగితివో అవగతంబయ్యె. మా తల్లి సంపూర్ణానుగ్రహము నిన్ను కాపాడె. ఇది మాకు సుదినము” అంటూ తన సహచరి వంక చూశాడు. అప్పటికి శతపత్రకు అర్థమైంది. యమునాదేవి మైనాకుడికి తనలో కనిపించిందని.

మిత్రవింత గౌరవంగా శతపత్రను చూసింది- "నాయకా! ఈమె రాకడ మనకు శుభము చేకూర్చినది. ఉత్తినే పొగడక ఏదైనా వరం అనుగ్రహించండి" అంటూ భర్తకు సలహా ఇచ్చింది.

"లెస్స పలికితివి దేవీ. కోరుకొనుము. బాలికా, ఈ ఆనందములో నీకో వరంబు అనుగ్రహించెద. నీకేమి వలయునో కోరుకొనుము” అన్నాడు.

ఇతర భాషాపదప్రయోగాలు లేకుండా అచ్చతెలుగులో మాట్లాడ్డమే సరిగా రాదు శతపత్రకు. ఇక వారి గ్రాంథిక భాషనేం అర్ధం చేసుకోగలదు? జాగ్రత్తగా వింటేగాని అర్థం కాదు. వారితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలీలేదు శతపత్రకు.

"అడుగుము బాలికా నీకేమీ వరంబు కావలె" అన్నాడు మైనాకుడు. ఎక్కువగా ఏమీ ఆలోచించలేదు శతపత్ర-

“నాకు మీ ఆత్మల ప్రపంచాన్ని పూర్తిగా తిరిగి చూడాలని కోరిక. అప్పుడప్పుడూ వచ్చి చూసిపోతుంటాను. నన్నెవరూ ఆపకుండా వరం అనుగ్రహించండి” అనడిగింది.

ఆమె కోరిక విని విస్తుపోయాడు మైనాకుడు. "ఏమి ఈ వింతకోరిక. ఈ ప్రేతాత్మల లోకమున నీకు పని ఏమిటి? ఆదియును గాక ఇది నియమ విరుద్దమైన కోరిక. ఈ ఒక్కటి తప్ప మరేదైనా కోరుకొనుము తల్లీ. ధనధాన్యములా? పాడిపంటలా? వజ్ర వైఢూర్యములా? ఇంకను ఆడువారికి బంగారమనిన మక్కువగదా, వలసినంత బంగారమునిచ్చెద కోరుకొనుము" అన్నాడు.

"అవేమీ అక్కరలేదు. ఇవ్వాలంటే నేనడిగిన వరమే ఇవ్వండి" అంది పట్టుదలగా శతపత్ర.

భారంగా నిట్టూర్చాడు మైనాకుడు-

"ఇది కాలపరీక్ష. తప్పించుకోలేం. అటులనే కానిమ్ము. తథాస్తు. ఇకనుంచి యధేచ్ఛగా నీవు మా లోకమునకు వచ్చిపోవచ్చును” అంటూ ఆశీర్వదించాడు.

సరిగ్గా అప్పుడే ఝంఝామారుతం వీచినట్టు వింత శబ్దంతోబాటు చిరుగజ్జెల సవ్వడి వినవచ్చింది. కన్నుమూసి తెరిచే లోపు ఒక వికృతాకారుడు వారికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సన్నగా పొడవుగా వున్న భీకరాకారుడు. తలమీద కొమ్ము కలిగిన ఏకశృంగుడు.

నల్లటి పంచె ధరించి నడుముకి చిరుమువ్వల పట్టీ ఉంది. కాలికి వెండి తోడా వుంది. మెడలో నల్లటిపూసల దండలున్నాయి. కళ్ళు ఎర్రగా నిప్పు ముద్దల్లా ఉన్నాయి.

కుడిచేత పొడవాటి ఖడ్గము... ఎడమచేత బరిసె... ఆయుధాలుగా కలిగి వున్నాడు. అతని భుజం మీద వుంది గ్రద్ద ఒకటి. అది శతపత్రనే క్రూరంగా చూస్తోంది. అతడు ప్రత్యక్షమవుతూనే తన ఖడ్గాన్ని శతపత్ర వైపు దూకుడుగా దూశాడు. తన పని అయిపోయిందనుకొంటూ కెవ్వున అరిచి కళ్ళు మూసుకుంది శతపత్ర.

కాని అప్రమత్తంగా ఉన్న మైనాకుడు తన గదాయుధంతో వేగంగా ఆ ఖడ్గాన్ని అడ్డుకున్నాడు. 'ఖణేల్' మన్న మ్రోతతో ఝల్లున నిప్పులు రాలాయి.

ఎవరూ ఊహించని పరిణామం ఇది. వచ్చిన క్రూరుడు ఎవడో? ఎందుకు వాడు తనను చంపబోయాడో అర్థంగాక గాభరాపడుతూ వెనక్కి జరిగింది శతపత్ర.

పరిస్థితి గ్రహించిన మిత్రవింద శతపత్ర దగ్గరకొచ్చి ఆమెను తన వెనక్కి తీసుకుంది.

"కాలకేతూ! ఏమిటి నీవు చేయుచున్న కార్యము? ఆ బాలిక మా అతిథి, అతిథిని కడతేర్చు కుసంస్కారి. ఆమె మా రక్షణలో ఉన్నదని మరువకు అంటూ హెచ్చరించాడు.

ఫెళ్ళున నవ్వుతూ తన ఖడ్గాన్ని వెనక్కి తీసుకున్నాడు కాలకేతు-“ప్రభువులకు మతి తప్పినదా? గతి మారినదా? కలిపురుషుని భృత్యులం, మాకు సంస్కారమా! మేము సంస్కారవంతులమైన కలిధర్మము నడచునా?.. మానవుల్ని నీతిబాహ్యుల్ని చేసి సర్వదా పాపకార్యములు చేయించి భ్రష్టుల్ని చేయుటయే గదా మా కర్తవ్యము.

యుగారంభమున కలిపురుషునితో జరిగిన ఒప్పందమునకు విరుద్ధముగా ఈ మానవ యువతి సజీవముగా మన లోకమునకు ఎటుల వచ్చె? దోషియగు నీమె మీకు అతిథి యగునా? మీరు చేయలేని పని నేను చేసెద. ఈమెను సంహరించెద... మీరు ఒప్పంద భంగమొనర్చుట ఉచితము కాదు" అని అరిచాడు.

“ఉచితానుచితాలు మాకు తెలియజెప్పకు కాలకేతూ. ధర్మసూక్ష్మము మాకును తెలియును. ఈమెను సాధారణ యువతిగా నెంచకు. ఈమెలో దైవాంశ ఉందని గ్రహించ లేకున్నావు. మనమే గొప్పని అహానికి వెళ్ళకు. అహం మనిషికే కాదు, మనకూ హాని చేస్తుంది. మా రక్ష ఉందని మరువకు. నీవు మా సలహాదారువే గాని శాసనకర్తవు గాదని మరిచిపోకు” అంటూ గట్టిగా కోపంగా
హెచ్చరించాడు మైనాకుడు. శతపత్ర విషయంగా కాలకేతు, మైనాకుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

మైనాకుడి వివరణ కాలకేతు కు సంతృప్తినివ్వలేదు.
🍁
*సశేషం*
*శతపత్ర -34*
🍁

కన్నుమూసి తెరిచేలోపు పుష్పకవిమానం గరుడలోయ పైన ఎగురుతోంది. ఆత్మల ప్రపంచం నుంచి ఆ విమానం ఏ మార్గంలో ఎలా బయటి కొచ్చిందో కూడా శతపత్రకు తెలీదు. అంతా మాయలా ఉంది.

బంగారురేకుల తావడం మీద మణిమాణి క్యాదులు పొదగబడి చిత్రవిచిత్రమైన లతలు, డిజైన్లతో ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఎంతో సుందరంగా ఉందా విమానం. పెద్ద పడవలాంటి ఆకారంపైన నాలుగు స్తంభాల మండపం...

గద భుజాన వేసుకుని ముందుభాగంలో నిలబడున్నాడు మైనాకుడు. మండపంలో ఈ చివర దూదికన్నా మెత్తని ఆసనం మీద కూర్చుంది శతపత్ర.

ఇలాంటి విమానాల వర్ణన పురాణాలు, ఇతిహాసాల్లో చదివింది తను. ఇప్పుడు నిజంగానే ఇందులో ప్రయాణిస్తోంది. తను దేశవిదేశాలు తిరుగుతూ ఎన్నో విమానాల్లో ప్రయాణించింది. కాని ఇలాంటి విమానాన్ని ఎక్కడా చూళ్ళేదు. పుష్పక విమానాల్లో ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి చోటుంటుందంటారు. అది కూడా నిజమేనేమో... ఆలోచిస్తూ దిగువకు చూసింది.

కింద గరుడలోయ మొత్తం స్పష్టంగా కనబడుతోంది. అప్పటికి మిట్టమధ్యాహ్న మైంది సమయం. అప్రయత్నంగా లోయ పశ్చిమభాగాన కొండల వెనక్కు చూసిందామె. ఉదయం ఎక్కడ ఉందో అదే చోట ఉంది తమ వ్యాన్. రుద్రపాద వ్యాన్ పక్కన టెంట్ బిగిస్తూ కన్పించాడు.

అతడ్ని చూడగానే ఏదో తెలీని ఆనందం. బిగ్గరగా అరిచి పిలవాలనిపించింది. కాని మైనాకునికి భయపడి నోరు విప్పలేక పోయింది. చూస్తూండగానే గరుడలోయను దాటి దక్షిణంగా వాయువేగంతో మబ్బుల వెంట దూసుకు పోవారంభించిందా విమానం. తీవ్రంగా ఆలోచిస్తోంది శతపత్ర.

ఇది అదృష్టమో, దురదృష్టమో తనకే అర్ధంగావటంలేదు. సశరీరంతో నరకాన్ని చూసినవారి జాబితాలో ఇప్పుడు తనూ చేరబోతోందా? సశరీరంతో, ప్రాణాలతో భూలోకం నుంచి యమలోకానికి వెళ్ళి, ప్రాణాలతో తిరిగి వచ్చిన నచికేతుడు, రురుడు తరువాత తనేనా...?

మరణానంతర జీవితాన్ని మరణించకుండా నే చూడగలదా? నరకంలోకి తనను అనుమతిస్తారా? సూర్యనందనుడయిన యమధర్మరాజును తను చూడగలదా?
తామరతంపరగా పుట్టుకొస్తున్న ఏ ప్రశ్నకీ తన దగ్గర సమాధానం లేదు. ఇదలా ఉంచితే తన మూలంగా ఏర్పడిన ఈ వివాదం కలిపురుషుడు, యమధర్మరాజుల కలహానికి దారితీస్తుందేమోననే సందేహం మనసులో కలవరపెడుతోంది- తీవ్రంగా ఆలోచిస్తున్న శతపత్ర ఉన్నట్టుండి ఉలిక్కి పడింది. గాభరాగా చుట్టూ చూసింది. ఎవరో తనను పిలుస్తున్నారు. ఎవరది?

అప్పటికి మబ్బులపైన దూసుకుపోతోంది పుష్పకవిమానం. అప్పుడప్పుడూ మబ్బులు తొలగినచోట దిగువన సువిశాలమైన మహా సముద్రం కన్పిస్తోంది.

"శతపత్రా... నువ్వేం గాభరాపడకు. నేను చైతన్యని" చెవిలో గుసగుసలాడినట్టు వినవచ్చింది చైతన్య ఆత్మ గొంతు. భారత భూభాగాన్ని దాటి శ్రీలంక గగనతలం మీద ఎగురుతోంది విమానం. ఒకింత విసుగ్గా నుదురు రుద్దుకుంది శతపత్ర. తనకి ఉన్న సమస్యలు చాలక వీడొకడు... నరకానికి పోతున్నా వదిలేట్లు లేడు. తన వెంటే విమానంలోకి వచ్చేసినట్టున్నాడు. మైనాకుడు పసిగడితే ఏమవుతుందో ఏమిటో. ఓ పక్క గాభరాపడుతూనే "ఎక్కడున్నావ్?” అనడిగింది శతపత్ర చిన్నగా.

"ఇక్కడే" అంటూ బదులిచ్చాడు చైతన్య.

"ఇక్కడే అంటే?”

"నీ షర్ట్ కాలర్ లోని మడతలో ఇరుక్కు పోయి ఊపిరాడక చస్తున్నాను. కాస్త హెల్ప్ చెయ్యి బయటికొస్తాను" అంతే... కోపంతో ఆమె ముఖం కుంకుమ పువ్వులా కందిపోయింది.

"లోపలకెలా వచ్చావ్?” అంది కోపంగా.

"ఎలా ఏమిటి పిచ్చిప్రశ్న.... గాలికి, ఆత్మకి తేడా లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోతాం" అన్నాడు.

"అందుకని ఇలా స్త్రీల చొక్కా కాలర్ లో దూరతావా...?” అడిగింది శతపత్ర...

“తెలీక ఇరుక్కుపోయాను. తీరిగ్గా తర్వాత తిట్టుదువుగాని, ముందు నన్ను బయటికి లాగు" అన్నాడు చైతన్య. కాలర్ మడత విప్పి అతడ్ని బయటికి లాగి కోపంగా విసిరికొట్టింది శతపత్ర. కిందపడీ పడక ముందే అదృశ్యమైపోయాడు చైతన్య. ఎటు పోయాడాని వెదికే లోపల తిరిగి అతడి గొంతు విన్పించింది చెవిలో.

“ఏమైనా మరీ ఇంత కోపం మంచిది కాదు" అన్నాడు చెవిలో.

“ఇప్పుడెక్కడున్నావ్?" గాభరాగా అడిగింది.

"నీ చెవి పోగును ఆశ్రయించుకున్నాను. ప్లీజ్ నన్నిలా ఉండనీ" అన్నాడు చైతన్య.

“అక్కడి నుంచి కిందకు రానని మాటివ్వు. ఉండనిస్తాను" అంది శతపత్ర.

“రాన్లే... నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. శరీరం ఉన్నంతవరకు ఈ స్వాభిమానం సహజం. గాలిని అడ్డుకోగలవా? అలాగే ఆత్మలనీ అడ్డుకోలేవు. "

"నేను నీలా చచ్చి ఇక్కడికి రాలేదు. శరీరం తో ఉన్నాను. పిచ్చివేషాలేస్తే మైనాకుడితో చెప్పేస్తాను"

"వద్దు వద్దు. బుద్ధిగా ఉంటాను"

"నువ్విలా నా వెంటపడ్డం ఏమిటి?" విసుక్కుంది.

"నీ వెంట కాదు. నీ మూలంగా యమలోకం చూసే అవకాశం నాకు దొరకబోతోంది. అర్ధాంతరంగా చచ్చానని నన్ను కింద లోకం లోనే ఉంచేశారు. నేను విడిగా ఇక్కడికి రాలేను. అందుకే అదృశ్యంగా నీతో వస్తున్నా"

"కోతిగా మారిపోయావుగా. మళ్ళీ వెనక్కి ఎప్పుడొచ్చావ్?" అడిగింది శతపత్ర.

"నువ్వు పుష్పకవిమానం ఎక్కబోతూండగా వచ్చేశాను." అన్నాడు చైతన్య.

"అల్లరి చేయకుండా చెవిపోగులోనే ఉండు" అంది నవ్వును దాచుకుంటూ, "ఊ" అన్నాడు చైతన్య బుద్ధిగా, అ తర్వాత తనక్కడ ఉన్న సంగతే తెలీనంత బుద్ధిగా, నిశ్శబ్దంగా ఉండిపోయింది చైతన్య ఆత్మ.
📖

అంతలో ఉన్నట్టుండి చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. పుష్పకం చీకటి ప్రాంతంలోకి ప్రవేశించింది. పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. గరుడలోయలో ప్రవేశించినప్పుడు తనకు ఎదురైన అదే అనుభవం ఇది.

చీకట్లు ముసురుకోగానే పుష్పక విమానం ధగద్ధగాయమానంగా ప్రకాశింపసాగింది. ముందుకు పోయేకొద్ది కాటుకలాంటి చిమ్మచీకట్లు కన్పించాయి
నడి సముద్రంలో ఓడలా, ఆ చీకటిలో ప్రకాశిస్తూ వేగంగా దూసుకుపోతోంది. పుష్పకవిమానం. భూమికి ఎంత ఎత్తులో, ఏ ప్రాంతంలో ఉన్నారో తెలీటం లేదు. ఈ చీకట్లకు కారణం ఏమిటో కూడా శతపత్ర మస్తిష్కానికి అంతుపట్టలేదు. మైనాకుడు మాత్రం గదాయుధాన్ని భుజంమీద ఉంచుకొని శిలావిగ్రహంలా ముందు భాగంలో అలా నిలబడే వున్నాడు.
గంభీరమైన అతడి రూపాన్ని చూస్తుంటే వివరాలు అడగటానికి శతపత్రకు ధైర్యం చాలటంలేదు.

ప్రయాణంలో ఎన్నో చీకటి సొరంగాలు కనిపిస్తున్నాయి. అవేమిటో అర్థంకాక ఆశ్చర్యపోయింది. "అవి చీకటి సొరంగాలు కావు. చచ్చిపోయిన నక్షత్రాల తాలూకు అవశేషాలు అవి. నక్షత్రం నాశనం కాగానే లేదా చచ్చిపోగానే ఇలా అయిపోతాయి. వీటినే ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు బ్లాక్ హోల్స్ అంటారు. అబ్బో ఈ దేవుడి సృష్టిలో ఎన్నో నిగూఢ రహస్యాలు ఉన్నాయి" ఎన్ని కోట్లమంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసినా సృష్టి రహస్యాలు ఎప్పటికీ విడిపోవు." అంది చైతన్య ఆత్మ.

బ్లాక్ హోల్స్ మధ్య నుంచి ప్రయాణం... ఏం జరగనుందో తెలీని స్థితిలో ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. బిక్కు బిక్కు మంటూ కూర్చునుంది.

"మనం యమలోకాన్ని సమీపిస్తున్నట్టు వున్నాం. అందుకే ఈ చీకట్లు, భయంగా వుందా?" చెవి పోగులోంచి గుసగుసలాడాడు చైతన్య.

"ఊఁ" అంది శతపత్ర.

“భయపడకు. పక్కన నేనున్నానుగా” ధైర్యం చెప్పాడు. తల ఊపింది శతపత్ర. కాని ఆమెకు తెలుసు చైతన్యకు అంతటి శక్తి లేదని, వెళ్తున్నది అలాంటిలాంటి చోటు కాదు. మహా ప్రమాదకరమైన లోకం... మనిషి ఊహకే అందని విచిత్ర లోకం... వింత లోకం... యమలోకం...
🍁
*సశేషం*
*శతపత్ర -35*
🍁

కళ్ళు చిట్లించుకొని ఎగువకు చూస్తున్న శతపత్రకు, ఆ చిక్కటి చీకట్లలో దూరంగా ఎర్రని కొన్ని వెలుగు రేఖలు గోచరించాయి. అవి క్రమంగా దగ్గరవుతున్నాయి. పుష్పక విమానం వేగం కూడా మందగిస్తోంది.

చనిపోయిన పాపుల్ని వెంట బెట్టుకొని వస్తున్న యమకింకరుల్ని ఇప్పుడామె ప్రత్యక్షంగా చూడగలుగుతోంది. పుష్పక విమానం యమలోకానికి మరింత చేరువైంది.

"ఏమిటదిఎర్రగా తగలబడిపోతున్నట్టుంది?" ఆకాశానికి విరజిమ్ముతున్న ఎర్రటి నెత్తురు ముద్దల్లాంటి వెలుగుల్ని చూసి కంగారు పడుతూ చైతన్యను అడిగింది చిన్నగా శతపత్ర. ఆమె చెవిపోగును ఆశ్రయించుకొని వున్న చైతన్య చిన్నగా నవ్వాడు.

“నువ్వు భయపడుతున్నట్టున్నావ్... నువ్వనుకుంటున్నట్టు అక్కడేమీ తగలబడిపోవటం లేదు" అన్నాడు.

“మరి?”

“యమలోకం ప్రహరీగోడ చుట్టూ కందకంలా ఏర్పడి సదా ప్రవహిస్తూంటుంది వైతరణీ నది. పాపుల నెత్తురుతో అది కుతకుత ఉడుకుతూ ప్రవహిస్తూంటుంది. ఆ నది నీటి రంగే ఆ వెలుగు.”

"వైతరణీనది... ఇది భూమి పైన ఒడిస్సాలో ప్రవహిస్తోంది గదా... పురాణ ప్రసిద్ధమైన ప్రముఖ యాత్రాస్థలం జాజ్ పూర్ ఈ వైతరణీ నదీ తీరంలోనే గదా వుంది"

"అవును. అది భూలోకంలో మాట. ఇది యమలోకం వైతరణి, ఈ నదిని దాటకుండా యమలోకం చేరుకోలేరు"

ఆతృతగా అటే చూస్తోంది శతపత్ర. పుష్పక విమానం నది మీదుగా ఎగరసాగింది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా స్పష్టంగా గోచరిస్తోంది.

అది వైతరణి నది... చాలా వెడల్పు వుంది... అటు ఎగువనగాని ఇటు దిగువనగాని ఎటు చూసినా సెగలు చిమ్ముతూ నది కనబడుతోంది. నది అవతల చాలా ఎత్తుగా నల్లటి గోడలు కన్పిస్తున్నాయి. ఆ గోడలను తన్నిపెట్టి ఎగసిపడుతున్న కెరటాలతో ఉరుకులు పరుగులు తీస్తోంది నది.

“నదినీరు, ఎర్రగా, చిక్కగా నెత్తురులా ఉండి వేడిసెగలు చిమ్ముతోంది. సుడులు తిరుగుతున్న నదిలో పాపులు మునకలు వేస్తూ కొట్టుకుపోతున్నారు. వారి కేకలు, ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

ఆ నది ఉగ్రరూపాన్ని చూసి వణికిపోయింది శతపత్ర. ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
చూడలేక భయంతో కళ్ళు మూసుకుంది.

"బతికినంత కాలం అధికార దర్పం, ధనమదం, యవ్వనబలంతో, నేను, నా అంతవారు లేరని విర్రవీగుతూ, చెయ్యరాని పాపాలన్నీ చేస్తాడు మనిషి, తీరా వాటి ఫలితం అనుభవింప వచ్చేసరికి అదిగో వైతరణి నదిలో కొట్టుకుపోతూ ఇలా లబోదిబోమని ఏడుస్తాడు" అన్నాడు చైతన్య వేదాంతిలా.

“వాళ్ళంతా ఇలా నదిలో పడి చావాల్సిందేనా?" అమాయకంగా అడిగింది శతపత్ర.

"వాళ్ళంతా చచ్చినవాళ్ళే. కొత్తగా చచ్చేదేముంది? నాలాగే అవన్నీ ఆత్మలు. మనుషులు నదికి వెళ్ళి, పవిత్ర స్నానాలు చేసి దైవదర్శనానికి గుళ్ళోకి వెళ్తారు. ఇదీ అంతే... ఘోరపాపాలతో పంకిలమైన ఆత్మలను సరాసరి యమలోకానికి తెస్తే ఆ పాపాలతో న్యాయ ధర్మాలకు నిలయమైన యమలోకం అపవిత్రమవుతుంది. అందుకే పాపాత్ముల్ని యమకింకరులు ముందుగా వైతరణినదిలో పడేస్తారు. ఇక్కడే నరకం కనబడుతుంది వాళ్ళకి. ఎగువన నదిలోంచి వాళ్ళని బయటికి తీసి అప్పుడు యమ లోకంలో ప్రవేశపెడతారు.

అక్కడ నేరాలనుబట్టి శిక్ష విధిస్తారు. ఆ శిక్షలు నరకంలో అమలవుతాయి.

ఈ కోర్టుగాకపోతే పై కోర్టుకెళ్ళి శిక్ష తప్పించుకోవడానికి ఇది భూలోకం కాదు. యమలోకం... ఇక్కడ శిక్షపడితే దానికి తిరుగుండదు" అంటూ వివరించాడు.

“ఓ మైగాడ్" అనుకుంటూ గుండెలమీద చేయి వేసుకుంది శతపత్ర, నది హోరు... పాపుల ఆర్తనాదాలు... చిమ్మచీకట్లో... ఆ వాతావరణం శతపత్రను బేజారెత్తిస్తున్నా యి. గుండెదట తగ్గటం లేదు.

“అప్పుడే ఏమైంది నరకంలో ఇంతకన్నా ఘోరశిక్షల్ని చూడాలి. కాస్త గుండె దిటవు పర్చుకో” అన్నాడు హెచ్చరికగా చైతన్య. ఇంతలో పుష్పకం వైతరణి దాటేసింది.

కోటగోడల్లాంటి ఎత్తయిన నల్లటి గోడల మీదుగా ముందుకు వెళ్ళిన పుష్పకం మెల్లగా కిందకు దిగనారంభించింది. అదే సమయంలో ఒక్కసారిగా వెలుతురు, రణగొణ ధ్వనులు గమనించి ఉలికిపాటు చెందుతూ, దిగువకు చూసింది శతపత్ర.

చూడగానే అర్థమైపోయింది అది నరకలోకం అని. ఆ ప్రాంతం పట్టపగల్లా వెలుతురు వ్యాపించి వుంది. దిగువన అనేకమైన మండపాలు, వాటి మధ్యన విశాలమైన దారులు కన్పిస్తున్నాయి. అవి ఎంతదూరం విస్తరించి వున్నాయో అంతుచిక్కడం లేదు.

పుష్పకం మరింత కిందకు దిగి ఎగురుతోంది. ఇప్పుడు మరింత స్పష్టంగా చూడగలుగు తోంది శతపత్ర. అక్కడి మండపాల్లో యమకింకరులు పాపులను శిక్షిస్తున్నారు. ఒక పక్క శిక్షలు అమలుచేస్తుండగా, మరో పక్క యమకింకరులు శిక్షలు పడిన పాపులను వీధుల్లో శిక్షలు అమలుపరచటా నికి లాక్కువస్తున్నారు. యమకింకరుల హుంకరింపులు, పాపుల ఆర్తనాదాలతో చెవులు హోరెత్తిపోతూ హృదయవిదారకం గా ఉందా ప్రాంతం.

“చూడు... ఇదే నరకమంటే” అంటూ శతపత్ర చెవిలో హెచ్చరించాడు చైతన్య.

చూడ్డానికి ధైర్యం చాలటంలేదు శతపత్రకి. అయినా ధైర్యాన్ని కూడగట్టుకొని చూస్తోంది. హత్యకు గురై మరణించిన తన తండ్రి విక్రమవర్మ ఒకవేళ నరకానికి వచ్చుంటే కనిపిస్తాడేమోనని ఆశ. అందుకే చూస్తోంది.
📖

అతిభయంకరమైన అక్కడి శిక్షల్ని చూసి మానవ మాత్రులు తట్టుకోలేరు. జాలి, దయ అనే పదాలకు అర్థం తెలీనివారు ఈ యమ భటులు. పాపులకు తగిన శిక్షలను అమలు పరచటమే వారి పని. ఒకచోట పాపుల్ని రంపాలతో కోస్తున్నారు. మరోచోట సలసలా మరుగుతున్న నూనెలో వేపుతున్నారు. ఒకచోట గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఎర్రగా కాల్చిన ఊచల్ని శరీరంలో గుచ్చుతున్నారు. కొండాలతో కొడుతున్నారు.

కొందరు పాపులు శూలాలకు వేలాడుతున్నారు. కొందరు పాపులకు పురుగుల అన్నంపెట్టి తినేదాకా కొరడాలతో కొట్టి, హింసిస్తున్నారు. చిత్ర విచిత్రమైన వివిధ రకాల శిక్షలు అమలవుతున్నాయి ఆక్కడ. ఆ బాధలకు తట్టుకోలేక పాపులు చేస్తున్న ఆర్తనాదాలు వినలేక కళ్ళు, చెవులు కూడా గట్టిగా మూసుకుంది శతపత్ర.

"నరకంలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో గరుడ పురాణంలో చదివాను. ఇక్కడ అదే ప్రకారం శిక్షలు అమలవుతున్నాయి చూడు" అన్నాడు చైతన్య.

శతపత్ర ధైర్యం తెచ్చుకుని తిరిగి అటువైపు చూడనారంభించింది. అక్కడ ఆడ, మగ వయోభేదం లేదు. పాపులందరికీ ఏకకాలం లో శిక్షలు అమలు జరుగుతున్నాయి.

కనుచూపు దూరంలో ఎక్కడా తన తండ్రి విక్రమవర్మ జాడలేదు. ఇక్కడ ఇంతటి భయంకరమైన శిక్షలు ఉంటాయని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. "అయినా కూడా భూమిపైన మనిషి యుగం మారేసరికి ఎంతగా మారిపోయాడు? గత యుగాల్లో పాపులు లేక వెలవెలబోయిన నరకం ఇప్పుడు పాపులతో కిటకిటలాడుతోంది.

తొమ్మిది మాసాలపాటు తల్లి గర్భవాసం చేసి ఆమె ఊపిరి తీసుకుని బతికి ప్రపంచంలోకి వచ్చిన మనిషి ఆ తల్లినే మర్చిపోతున్నాడు. స్వార్ధం తలకెక్కి తల్లిదండ్రులనే పూర్తిగా విస్మరిస్తున్నాడు. కేవలం తన పెళ్ళాం, తన పిల్లలు అనే స్వార్థంలో కూరుకుపోయి, చేయరాని పాపాలు, చేయకూడని ఘాతుకాలు చేసి డబ్బుతో బాటు పాపాలను కూడా మూటగట్టుకుంటున్నాడు.

ప్రస్తుతం మానవ సమాజంలో మూడు భయంకరమైన వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. వాటిలో ఒకటి ప్రేమ జబ్బు. రెండోది డబ్బు జబ్బు. మూడోది అధికారపు జబ్బు. ఇవి మూడూ చివరకు దారుణమైన వేదననే మిగులుస్తున్నాయి. యుక్తవయసు రాకముందే కేవలం ఆకర్షణనే ప్రేమ అనుకొని భ్రమపడి యువత నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. మరోవంక స్వార్థం పెరిగి పోయి అక్రమ సంపాదనకు అలవాటు పడి మానవత్వాన్ని మర్చిపోయి అందినంత దోచుకుంటున్నాడు.

బంధుత్వాన్ని కూడా మర్చిపోయి, అయిన వాళ్ళని కూడా ముంచేస్తున్నాడు. కలి పురుషుని కోరల్లో చిక్కి మానవజన్మనే మంట కలిపేస్తున్నాడు. చచ్చాక ఇది... ఇలా... ఇక్కడ తన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాడు. వీళ్ళలో మరుజన్మకు వెళ్ళే ఆత్మలెన్నో? అంతరించిపోయే ఆత్మలెన్నో ఆ దేవునికే తెలియాలి.

శతపత్ర ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే పుష్పక విమానం శిక్షా ప్రాంతాన్ని దాటేసి ఇంకా ముందుకి వెళ్ళింది.
🍁
*సశేషం*
*శతపత్ర - 36*
🍁

శతపత్ర ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే పుష్పక విమానం శిక్షా ప్రాంతాన్ని దాటేసి ఇంకా ముందుకి వెళ్ళింది.

అక్కడ మరో ఎత్తయిన గోడ ఉంది. ఆ గోడను కూడా దాటి అవతలి విశాలమైన మైదాన ప్రాంతాన్ని చేరుకుంది. ఆ మైదానం లో అతి పెద్దదయిన కోటలాంటి ఒక దివ్య సౌధం వుంది. ఆ సౌధం ముందు నేలకు దిగింది పుష్పకం. అదే యమసదనం. నరకంలో ఎంత రణగొణ ధ్వనిగా వుందో ఇక్కడ అంత నిశ్శబ్దంగా వుంది.

విచిత్రమైన ఆయుధాలు ధరించి వికార రూపులైన యమకింకరులు ఆ భవనాన్ని చుట్టూ కావలి తిరుగుతున్నారు. పుష్పక విమానం దిగుతున్న మైనాకుడ్ని చూసి వినయంగా వంగి వంగి నమస్కరించారు వాళ్ళు.

శతపత్రను వెంటబెట్టుకుని ఆ సౌధంలో ప్రవేశించాడు మైనాకుడు. కలిపురుషుని ప్రతినిధి కాలకేతు అప్పటికే అక్కడికి చేరుకొని విశాలమైన హాల్లో యముడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నాడు.

అప్పటికింకా యముడు సభ చాలించినట్టు లేదు. అవతలి నుంచి అస్పష్టంగా మాటలు విన్పిస్తున్నాయి. హాలు చివర బాల్కనీ వంటి ప్రదేశంలోకి వెళ్ళి దిగువకు చూశాడు మైనాకుడు. అతడ్ని అనుసరించి వెళ్ళిన శతపత్ర కూడా చూసింది. దిగువన వుంది సువిశాలమైన సభాస్థలి.

యమధర్మరాజు కొలువుతీరి వున్నాడు. ఒక్కొక్కరే పాపుల్ని యముడి ముందు ప్రవేశపెడుతున్నారు. యముడు శిక్ష విధించగానే దాన్ని అమలు చేయటానికి వెంటనే ఆ పాపిని లాక్కుపోతున్నారు యమభటులు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉంచటం లేదు.

ఎత్తయిన వేదికమీద మణిమయ రత్న సింహాసం అధిష్టించి వున్నాడు యమధర్మరాజు. ఒకచేత యమపాశం, మరోచేత గదాయుధం ధరించిన ఆయన ఉగ్రరూపాన్ని చూసిన శతపత్రకి గుండె ఆగినట్టయింది. నాలుక పిడచకట్టుకు పోయింది.

ఇక్కడ తనను చూసి ఆ మహనీయుడు ఏమంటాడో తెలీక కలవరపడి బెదిరిపోసాగింది.

దిగువన బారులు తీరిన పాపుల్లో కూడా తన తండ్రి విక్రమవర్మ లేడు. ఒకవేళ ఆయన స్వర్గానికి చేరుకున్నాడేమో? ఆ విషయం తనకు స్పష్టంగా తెలియజెప్పే వారు లేరు. అడగటానికి తనకి ధైర్యం చాలదు. నరకలోకమే ఇలా ఉందంటే స్వర్గం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆమె ఊహకి అందటం లేదు. మునులైనా, మహర్షులైనా స్వర్గాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎంత నరకమో అక్కడంత సుఖమయంగా ఉంటుందట.

మైనాకుడు వెనుతిరిగి తనవంక చూడ్డంతో శతపత్ర ఆలోచనల నుండి బయటపడింది.

"భయము వలదు తల్లీ. మా మేనమామ యమధర్మరాజులవారు దయాళువు. నిష్కారణంగా ఎవరినీ శిక్షించరు. భీతిల్ల పనిలేదు. రమ్ము” అంటూ తిరిగి కాలకేతు వున్న ప్రదేశంలోకి వెనక్కి తీసుకొచ్చాడు ఆమెను.

ఇద్దరూ అక్కడున్న వేదికలమీద కూచున్నారు. ఎదురుగానే కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు కాలకేతు.

అతడ్ని చూడాలంటేనే భయంగా ఉంది శతపత్రకి. తలమీద కొమ్ము, బక్కపల్చటి నల్లని రూపం, చిరుమువ్వల సవ్వడి, భుజం మీద బూడిద రంగు గ్రద్ద, రెండు చేతుల్లో ఆయుధాలతో అతిక్రూరమైన రూపం.
📖

క్షణాలు భారంగా దొర్లిపోతున్నాయి. ఎంత సమయం గడిచిందో తెలీదు. ఉన్నట్టుండి లేచాడు మైనాకుడు.

"సభ ముగిసింది. యమధర్మరాజు వేం చేస్తున్నారు” అంటూ శతపత్రను హెచ్చరించాడు. ఆమె కూడా లేచి నిలబడింది. పదిక్షణాల తర్వాత- శాంత గంభీరవదనంతో గుబురుమీసం తిప్పుతూ గదను భుజం మీద వేసుకొని చేతిలో యమ పాశంతో మత్తేభంలా నడుచుకుంటూ వారి ముందుకు వచ్చాడు యమధర్మరాజు.

ఎదురువెళ్ళాడు కాలకేతు. తన అభియోగాన్ని విన్నవించబోయాడు. ఆ యమధర్మరాజును చూడగానే వంగి వంగి ప్రణామాలు చేస్తూ అవకాశం ఇవ్వకుండా చేయెత్తి వారించాడు సూర్యనందనుడు.

"కాలకేతూ! నీవు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతయు మాకు తెలుసు, నీ అభియోగము సరిగాదు. ప్రతి యుగము నందు దేవలోక ప్రవేశంలో కొందరు మానవులకు మినహాయింపు తప్పదు.

త్రేతాయుగమందు దేవలోకాలను సందర్శించిన మానవులు లేరా? ద్వాపరం లో అర్జునుడు స్వర్గాన్ని సందర్శించి ఇంద్రుని ఆతిధ్యం స్వీకరించలేదా?

ఈ యుగమునందే విక్రమాదిత్యుడు స్వర్గాన్ని సందర్శించి ఇంద్రుని మెప్పించి ముప్పదిరెండు సాలభంజికలతో విరాజిల్లు సింహాసనమును కానుకగా బడయలేదా? నరకాన్ని చూసిన మానవులు లేరా? దేవలోకాలను గాంచిన మునివర్యులు లేరా? వారి వారి పూర్వజన్మ సుకృతఫలం వారికా అవకాశాన్ని కల్పించును. ఇప్పుడీ బాలిక మదీయ సోదరి అనుగ్రహంబున ఇంత దూరము రాగలిగె. సందియము వలదు.

ఇది మాకును, కలిపురుషునకును గల ఒప్పందమును మీరుట ఎంత మాత్రమును గాదు. ఇది మా మాటగా కలితో చెప్పుము. అంతయును ఆయనకు తెలియు. పోయి రమ్ము" అన్నాడు శాంత గంభీరంగా.

కాలకేతు సంశయం నివృత్తి అయింది. "చిత్తం సమవర్తి.... నా అవివేకమును మన్నించండి” అంటూ నమస్కరించాడు. అంతకుమించి ఒక్క పలుకు కూడా పలకకుండా వెంటనే వెనుతిరిగి తన దారిన బయటికెళ్ళిపోయాడు. కాని పూర్తిగా సంతృప్తి చెందలేదు.

ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయినందుకు మైనాకుడి మనసు తేలికపడింది. సమవర్తికి తెలియని సమస్య లుండునా! అణకువగా భయభక్తులతో సూర్యనందనుడికి వినమ్రంగా ప్రణామం చేశాడు.

శతపత్రకు ఇదంతా కలలా ఉంది. ఎక్కడి భూలోకం? ఎక్కడి యమలోకం..? సాక్షాత్తూ న్యాయాధిపుడ్ని కనులారా చూస్తున్న ఆనందంలో ఆమె కనులు రెండూ అశ్రుపూరితాలయ్యాయి.

ఒక పక్క భయం... మరో వంక ఆనందం... ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతటి అదృష్టం అనితరసాధ్యంగదా! పాపం లేదు, పుణ్యం లేదు. నీతికథలు, దేవతల గాథలు అన్నీ కట్టుకథలు అని కొట్టిపారేసే వితండ
వాదులు ఈ నిజం చెప్తే నమ్ముతారా?... వాస్తవాన్ని గ్రహించలేక కలిమాయలో పడి కొట్టుకుపోతున్నారంతా.

మేరు పర్వతంలాంటి న్యాయనిర్ణేత యమ ధర్మరాజు ముందు మోకాళ్ళమీద కూచుని వంగి ఆ మహనీయుని పాదాలను తాకి భక్తితో ప్రణమిల్లింది శతపత్ర.

ఆమె భక్తిప్రపత్తులకు ముగ్ధుడవుతూ "అభీష్టసిద్ధిరస్తు” అంటూ ఆశీర్వదించి, వాత్సల్యంతో భుజాలు పట్టి లేవదీశాడు యమధర్మరాజు.

"బిడ్డా! నిన్ను జూసిన, మా సోదరి యమున ను జూసినట్టే యున్నది. ధన్యురాలవు తల్లీ... భీతిల్లకు. నీకు శుభం కలుగుతుంది" అంటూ శతపత్రకు అభయమిచ్చి మైనాకుని వంక చూశాడు.

"మైనాకా... వరమునిచ్చునపుడు ముందు వెనకలు యోచన చేయవలె. గరుడలోయకు యధేచ్ఛగా వచ్చిపోవు నటుల ఈ బాలికకు వరమొసంగితివిగాని, నిబంధన విధింప మరచితివి. నీ వరమును నేను సరిజేసెద." ఈ మాటలు శతపత్రకు వినిపించలేదు. అది యముడి మాయే...

"బాలికా శతపత్రా! గరుడలోయ రహస్యము ను మీ లోకమున నీవు పరులకు జెప్పరాదు. ఈ యానతి మీరినను, నీ కన్యత్వము తొలగినను, నీలోని శక్తులు తొలగిపోగలవు. అప్పుడు నీవు సాధారణ యువతివే. గరుడ లోయ ప్రవేశమునకు అనర్హురాలివి కాగలవు. ఈ విషయము గరుతుంచుకొని జాగరూకవై మెలగవలె" అంటూ హెచ్చరించాడు.

"దయామయా! ఇది తమ ఆనతిగా భావించి నడుచుకుంటాను. అయిననూ నాదొక విన్నపము.”

“అడుగుము”

గరుడలోయ దాటి బయటి అవసరార్థం నేను తలుచుకోగానే జరగబోవు సంఘటన ముందుగానే నాకు తెలిసేట్టు వరం అనుగ్రహించండి.”

ఆమె కోరిక విని నవ్వాడు యముడు-

"భళీ బాలికా... నీ ఆంతర్యము మాకు అవగతంబైనది. తెలివైనదానవు. నిను గాంచిన సంతసమున, నీవు అడిగిన వరంబు అనుగ్రహించితి. అయినను ఇది కూడా ముందు జెప్పిన నిబంధనలకు లోబడే సుమా. గరుడలోయ ప్రవేశార్హురాలి గా నువ్వు కొనసాగినంతవరకే ఈ వరము నీకు ఫలించును. “తథాస్తు" అంటూ ఆశీర్వదించాడు.

"దయామయా, ఇది తమ ఆనతిగా భావించి నడుచుకుంటాను” అంటూ మరోమారు ప్రణమిల్లింది శతపత్ర.
📖

సరిగ్గా అప్పుడే జరిగింది ఓ సంఘటన.
ఎవరూ ఊహించని ఘటన.

యమధర్మరాజుని కనులారా పూర్తిగా తిలకించాలన్న ఆశతో ఆమె చెవిపోగు నుంచి కొంచెం జరిగిన సూక్ష్మరూపంలోని చైతన్య పట్టుతప్పి జారి దబ్బున కింద పడ్డాడు. భయపడి వెంటనే అదృశ్యం కాబోయాడు. కాని అతడ్ని చూడనే చూశాడు యముడు. కొంప మునిగిందిరా దేవుడాని- కంగారుపడిపోయాడు చైతన్య.

"ఆగుము" అంటూ హుంకరించాడు యముడు.

ఏం జరిగిందో అక్కడెవరికీ అర్థంకాలేదు. ఊహించని సంఘటనతో ఉలిక్కిపడింది శతపత్ర.

మైనాకుడు ఆగ్రహంగా చూశాడు.

తప్పని పరిస్థితిలో చిక్కుబడిన చైతన్య ఆత్మ సూక్ష్మరూపం నుండి పూర్తిరూపాన్ని సంతరించుకొని అందరి ముందు దోషిలా నిలబడింది.

అంతా సవ్యంగా జరిగిపోతున్న తరుణంలో ఈ అపశృతి ఏమిటో అర్థంగాక కలవర
పడింది శతపత్ర. చైతన్య దొరికిపోవటం ఆమెను బేజారెత్తించింది. ఎందుకంటే నేరం చేయటం ఎంత తప్పో, నేరస్తుడికి సహకరించటం కూడా అంతే తప్పు. చైతన్య పుష్పక విమానంలో ప్రవేశించిన సంగతి మైనాకుడికి చెప్పకపోవటం తన పొరపాటు. ఇప్పుడు ఏం జరగనుందో ...?

“ఎవరు నీవు? ఇచట నీకేమి పని?” చైతన్య నుద్దేశించి కటువుగా ప్రశ్నించాడు యముడు. యమధర్మరాజుకు వినయంగా నమస్కరించాడు చైతన్య.

“నా సాహసాన్ని మన్నించండి ధర్మతేజా... నా పేరు చైతన్య ఎనభైయేళ్ళు నా ఆయుష్షు పొరపాటున రాసిపెట్టిన గండంతో ఇరవై ఎనిమిదిలోనే చచ్చిపోయి శరీరాన్ని కోల్పోయాను. ఇంకా ఏభై రెండేళ్ళు నా ఆయుష్కాలం. కాబట్టి ఇప్పుడు గరుడ లోయలో ఉంటున్నాను.

నాకు మీరంటే ఎనలేని భయము, భక్తి, కనులారా మీ దర్శనభాగ్యము ఆశించాను. కాని అనుమతి లేదు గదా. అందుకే మిము గాంచు ఆపేక్షతో సాహసించి మైనాకులవారి పుష్పకంలో సూక్ష్మరూపంలో వచ్చేశాను.

మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ప్రభూ. నా తప్పిదాన్ని క్షమించండి" అంటూ యముడికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

"నన్ను క్షమించండి ప్రభూ. మీరు క్షమాభిక్ష పెట్టనంతవరకు మీ పాదాలను వదలను" అంటూ పాదాలు గట్టిగా పట్టుకున్నాడు చైతన్య.

పాదాలు వెనక్కి తీసుకుని తీక్షణంగా చూశాడు యముడు. "లే... పైకి లెమ్ము” అన్నాడు.

లేచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు చైతన్య.

"అనుమతి లేని చోటుకు నీవు చోరునివలె చొరబడుట క్షమించరాని నేరము. అందుకు శిక్ష తప్పదు. మైనాకా.. వీడ్ని తీసుకుపోయి
మూడు దినములు వీడిని చీకటి గదిలో బంధింపవలె. వీని ఆగడానికి ఇదియే మేము విధించు శిక్ష. పోయిరండు” అన్నాడు గంభీరంగా.

ఆయన మాటకు ఎదురులేదు గదా.

యముడికి నమస్కరించి వెనుతిరిగారంతా. శతపత్రతో పాటు వచ్చి పుష్పకవిమానంలో కూర్చున్నాడు చైతన్య. మైనాకుడు అతనితో చిన్నమాట కూడా మాట్లాడలేదు. పుష్పకం బయలుదేరింది. నరకాన్ని దాటి, వైతరణీ నదిని దాటగానే వాయువేగాన్ని పుంజుకొని ఉత్తరాభిముఖంగా ప్రయాణం సాగించింది. మైనాకుడికి భయపడి శతపత్ర, చైతన్యలు మౌనంగానే వుండిపోయారు.
🍁
*సశేషం*

*శతపత్ర - 37*
🍁

ఎటు వెళ్ళాలో తెలీక దిక్కులు చూస్తూండగా అప్పుడు కన్పించారు తన వైపుకే నడుచు కుంటూ వస్తున్న కింకరులు నలుగురు. చైతన్య ఎందుకు పారిపోయాడో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఆమెకు.

తనను ఆపి వాళ్ళు ప్రశ్నిస్తారనుకొని కొంచెం కంగారుపడింది. కాని వాళ్ళు పల్లెత్తుమాట కూడా అడగలేదు సరిగదా వినయంగా ఆమెకు నమస్కరించి తమ దారిన తాము ముందుకు సాగిపోయారు. ఇది ఆమెకు కొత్త అనుభవం.

కింకరులు తనకు మర్యాదలివ్వటం ఏమిటి? ఇది మైనాకుడి వర ప్రభావమని గ్రహించింది. ఇంతకీ ఈ అల్లరోడు ఏమయ్యాడు? ఎటూ గాకుండా తనని దారిలో వదిలేసిపోయాడు. తనిప్పుడు ఎటు వెళ్ళాలి? వీధి మధ్యలో నిలబడి ఆలోచిస్తోంది. అంతలో వినబడింది గిట్టల అలికిడి. చూస్తే తీరిగ్గా నడుచుకుని వస్తోంది మనిషి తల వింత గాడిద. ముసిముసిగా నవ్వుతున్నాడు చైతన్య.

"నవ్వకు. నాకొస్తున్న కోపానికి నిన్ను బాగా కొట్టాలనుంది" అంది ఉడుక్కుంటూ.

"శనీశ్వరుడ్ని చూసి శివుడంతటివాడే చెట్టు తొర్రలో దాక్కున్నాట్ట. నేనెంత... మైనాకుడి కింకరుల్ని చూసిన కంగారులో మాయంగాక తప్పలేదు. నిజంగా నీకు కొట్టాలనుంటే కొట్టు తప్పుతుందా. అంతటి కృష్ణ పరమాత్మే పాపం పెళ్ళాం ఎడమకాలితో తన్నితే ఓర్చుకున్నాడు. నేను ఓర్చుకోలేనా...” అన్నాడు చైతన్య.

నేన్నీపెళ్ళాం కాదు. గుర్తుంచుకో...”

"తెలుసు... మనిషి ఆత్మ పెళ్ళి చేసుకొనే అవకాశం కల్పించలేదు దేవుడు... ప్రాణాల తో ఉండే భౌతిక శరీరాలకే ఆ అదృష్టం... నాకెక్కడుంది. ఏదో మాట వరసకన్నాను. అంతమాత్రాన మనం మొగుడూ పెళ్ళాం అయిపోతామా? నేను ఆత్మని. నీవు మనిషివి...” అన్నాడు చైతన్య.

"ఎటెళ్ళాలో చెప్పు" అంది లోలోపలే నవ్వుకుంటూ.

“వచ్చి కూర్చో... తొందరగా వెళ్ళిపోదాం.”

"నీకో దండం... నీ గాడిదకో దండం... మళ్ళీ కిందపడేస్తావ్ బాబూ. నా వల్ల కాదు” అంది.

"కావాలనా చేశాను? ఇంకోసారి అలా జరగదు.”

తప్పదనుకుని తిరిగి గాడిద సవారీకి అంగీకరించింది శతపత్ర. ఆమె కూర్చోగానే పరుగు ఆరంభించాడు చైతన్య. ఎక్కడా ఆగకుండా పావుగంట ప్రయాణం చేసి ఒక పెద్ద గుహలాంటి ప్రదేశానికి చేరుకున్నారు.

చిన్న చిన్న జలపాతాలు అనేకం ఉన్నాయా గుహలో. నీళ్ళను చూడగానే ప్రాణం లేచి వచ్చింది శతపత్రకు. ఆమె దిగ్గానే గాడిద రూపం నుంచి మళ్ళీ యథారూపం పొందాడు చైతన్య.

"ఇది ఆత్మలు స్నానాలు చేసే చోటు. ఇలాంటి జలపాతాలు ఈ ఆత్మలలోకంలో వందలు, వేలున్నాయి. ఇవి ఎప్పటికీ మైలపడవు. కలుషితం కావు, అత్మలు ఇక్కడ స్నానం చేశాక ఈ ఆత్మల లోకంలోనే ఓ కొండ శిఖరం మీదున్న శివాలయానికివెళ్ళి ప్రార్థన చేసుకుంటాయి. భయపడాల్సిన పనిలేదు వెళ్ళి స్నానం చేసిరా. ఈ లోపల నువ్వు తినడానికి ఏదో ఏర్పాటు చేస్తాను. అలస్యమైనా నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు” అని చెప్పి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడతను.

ఒంటిమీది దుస్తులు తప్ప తనవద్ద వేరే ఏమీ లేవు. తడిపేస్తే తడిదుస్తులతో నిద్రపోలేదు. సందిగ్ధంలో కాస్సేపు తటపటాయించింది శతపత్ర. చివరకు తెగించి నీటిలో దిగింది. చల్లటి నీరు శరీరాన్ని తాకగానే హాయిగా అన్పించింది. కాస్సేపు మొత్తం అలసట మర్చిపోయింది. జలకన్యలా చల్లటినీటిలో మునకలు వేసి అటూ ఇటూ ఈతలు కొట్టింది. అంతలో ఒక విచిత్రమైన శబ్దం. 'కీవ్' మంటూ వికృతమైన పక్షి కూత.

ఉలిక్కిపడి పైకి చూసింది.

బూడిద రంగు గ్రద్ద. తన తలమీదుగా పైన చక్కెర్లు కొట్టడం ఆరంభించింది. దాని కూతలతో గుహ మారుమోగుతూ శతపత్ర గుండెల్లో దడ పుట్టించింది.

గరుడలోయ దాటి వచ్చి లోపల గ్రద్దలు తిరగటం తనింతవరకు చూళ్ళేదు. కాని... కాలకేతు...?! వికార రూపుడయిన కలి భృత్యుడు, కాలకేతు కళ్ళ ముందు మెదిలాడు. అతడి భుజం మీద గ్రద్ద... అది ఇది కాదు గదా... అదృశ్యరూపంలో కాలకేతు వచ్చాడా!

మైనాకుడు చెప్పినా, యముడు చెప్పినా కూడా ఆ ధూర్తుడు సంతృప్తి చెందినట్టు లేడు. తనకు అపకారం తలపెట్టాడా!

తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఒడ్డువైపు కదలబోయింది. అంతలో నీటి అడుగు నుంచి ఏదో వచ్చి తన కాలు పట్టుకుని బలంగా లాగటంతో కెవ్వున అరిచింది.

మొదటిసారిగా తీవ్రమైన ఒత్తిడికి, భయానికీ గురైంది శతపత్ర. ఆమె అరుపులు ఆమెకే గుహలో మారుమోగి గుండె దడ పుట్టిస్తున్నాయి. చక్కెర్లు కొడుతున్న గ్రద్ద అరుపులు హడలెత్తిస్తున్నాయి.

నీటి అడుగునుంచి ఏదో తనను బలవంతం గా లోపలకు లాగేస్తోంది. నిలదొక్కుకోవటం సాధ్యంగాక నీటిలో మునకలు వేస్తూ ఉక్కిరి బిక్కిరవుతోంది. నీళ్ళలోకి తొంగిచూసింది. అది మొసలి కాదు. ఎలుగ్గొడ్డులాంటి ఏదో నల్లటి ఆకారం. చేతులు చాపి తన పాదాలు పుచ్చుకుని ఉడుం పట్టు పడుతూ లోపలకు లాగేస్తోంది.

అది తనని నీటిలో ముంచి చంపాలని బలంగా చూస్తోంది. దాన్నుంచి బైటపడేందు కు తన శక్తి చాలటంలేదు. క్రమంగా తాను నీళ్ళలోకి వెళ్ళిపోతోంది.

ఆ చివరి క్షణాల్లో తనను కాపాడగలవారు ఎవరో అర్ధంకాలేదు. ఆఖరిసారిగా నీటి అడుక్కి జారిపోతూ కళ్ళు మూసుకుని యమునాదేవిని తలుచుకుంది.

"అమ్మా. నానుంచి ఏదో జరగాలని ఆశించి నాకీ అవకాశం కల్పించావు. అది నెరవేర్చక ముందే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నువ్వే కాపాడాలి" అని మనసులో వేడుకుంది శతపత్ర. ఆ మరుక్షణమే అక్కడ గాలిలో ఒక్క మెరుపు మెరిసింది. ధగధగా మెరుస్తున్న చేతి గాజులాంటి వస్తువు రివ్వున ఎగిరివచ్చి నీటిలో పడింది.

అది నిలువునా జారి శతపత్ర పాదాలను పట్టి లాగుతున్న నల్లటి ఆకారాన్ని తాకింది. అంతే- అది భయంకరంగా అరుస్తూ శతపత్ర పాదాలను వదిలేసింది.

నీటిలోంచి జలభూతంలా చివ్వున గాల్లోకి అంత ఎత్తున ఎగిరింది. అలా ఎగురుతూనే భగ్గునమండి బూడిదై గాల్లో కలిసిపోయింది. ఈ లోపల-

అది పాదాలను వదిలిన మరుక్షణం చివ్వున నీటిలోంచి తల బయటపెట్టి గుండెల నిండా ఊపిరి తీసుకుంది శతపత్ర. గాలిలో అంత వరకూ పరిభ్రమించిన బూడిదరంగు గ్రద్ద దారుణంగా అరుస్తూ ఎవరో తరుము తున్నట్టు గుహనుండి బయటకు పారిపోయింది.

ధగధగా మెరుస్తున్న చేతిగాజు వచ్చి శతపత్ర ముందుపడింది. అది సాక్షాతూ, అమ్మవారి చేతిగాజు. తన మొర ఆలకించి తక్షణం వచ్చి కాపాడిన యమునాదేవిని మనసు లోనే తల్చుకుని కృతజ్ఞతలు చెప్పుకుంది.

అంతలో... "అమ్మా శతపత్రా!" అంటూ అమ్మవారి మాటలు లీలగా గాలిలో వినిపించాయి. భక్తితో చేతులు జోడించింది శతపత్ర.

"భయము వలదు. అది నా చేతిగాజు. వాత్సల్యంతో నీకు ఇస్తున్నాను. అది నీ చేతి నున్నంతవరకు ఇక ఏ దుష్టశక్తి నిన్నేమీ చేయలేదు. నా సంకల్పం ఏదో నీకు త్వరలో తెలుస్తుంది. అంతవరకు నీ బాధ్యత నెరింగి చరించు. ఆ గాజును ధరించు. శుభమస్తు” అంటూ స్పష్టంగా విన్పించాయి మాటలు.

ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.

శతపత్ర ఆ గాజును అందుకుని భక్తితో కళ్ళ కద్దుకుంది. ఆ వెంటనే దాన్ని తన కుడిచేతికి ధరించింది. ధరించిన తక్షణం గాజులోని ధగధగలు అదృశ్యమయ్యాయి. సాధారణ బంగారు గాజులా మారిపోయింది.

కాని దానిని ధరించగానే ఆమెలో ధైర్యం నూతనోత్సాహం ఏర్పడ్డాయి. పురాణదేవత చేతిగాజును తను ధరించింది. ఇది ఎవరికీ దొరకని గొప్ప అదృష్టం. చాలా ఆనందంగా ఉంది శతపత్రకి. నీటిలోంచి ఒడ్డెక్కింది.

ఒక తిన్నెమీద కూర్చుని తల తుడుచుకో నారంభించింది. అంతలో బయటికెళ్ళిన చైతన్య తిరిగివచ్చాడు. ఊరికే రాలేదతడు. చక్కగా పండిన అరటిపళ్ళు, బొప్పాయి, మామిడి ఫలాలతో వచ్చాడు. ముగ్గురు మనుషులు తినడానికి సరిపడా తెచ్చిన పండ్లను ఆమె ముందుంచాడు.

జరిగిన సంఘటన గురించి అతనికి చెప్పలేదు శతపత్ర. పళ్ళను చూడగానే కడుపులో ఆకలి భగ్గుమంది. అతడివంక కృతజ్ఞతగా చూసింది.

“చాలా ఆకలితో ఉంటావ్. త్వరగా తిను" అన్నాడు చైతన్య.

“ఇవన్నీ ఎక్కడినుంచి తెచ్చావ్?” ఆత్రంగా తింటూనే అడిగింది శతపత్ర.

"నీకోసం బయట అడవిలోకి వెళ్ళి గాలించి తెచ్చాను” అని చెప్పాడు చైతన్య.

"బయటికి వెళ్ళనిస్తారా?"

“చూస్తే కింకరులు ఊరుకోరు. నాలా కొంచెం తెలివైన ఆత్మలు ఎలాగోలా పోయి వస్తూనే ఉంటాయి."

కబుర్లు చెప్తూనే ఆకలి తీరా పళ్ళు చాలా తినేసిందామె. ఆ వెంటనే భుక్తాయాసంతో నిద్ర ముంచుకొచ్చింది. అక్కడే తిన్నెమీద పడుకుని గాఢనిద్రలోకి జారుకుంది.

చైతన్య ఎడంగా ఉన్న మరో తిన్నె మీదకు పోయి పడుకున్నాడు. తర్వాత సమయం ఎలా గడిచిందో శతపత్రకు కొంచెం కూడా తెలీదు.
🍁
*సశేషం*
*శతపత్ర - 38*
🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

చైతన్య వెంట ఆత్మల ప్రపంచాన్ని చూడ్డానికి - ఆరాటంగా బయలుదేరింది శతపత్ర. ఇప్పుడామె చాలా ఉత్సాహంగా ఉంది. నిద్ర లేవగానే మరోసారి జలపాతం వద్ద స్నానాదులు ముగించింది. రాత్రి తినగా మిగిలిపోయిన పళ్ళన్నీ ఆరగించేసింది. అందుకే ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది.

అక్కడి వీధులు నిన్నటిలాగే మనుషుల రూపంలో తిరుగుతున్న ఆత్మలతో నిండిపోయున్నాయి.

భూమ్మీద కనిపించే మనుషులకీ, ఇక్కడ కనిపిస్తున్న ఆత్మలోకపు మనుషులకి ఏదో తేడా కనిపిస్తోంది. నాభి ప్రాంతానికి పై భాగంలో, ఛాతీ మధ్యభాగంలో ఏదో నిప్పు లాంటి వెలుతురు... చిన్న జ్యోతిలా కనిపిస్తోంది. వీళ్ళసలు నడుస్తున్నారా? గాల్లో తేలుతున్నారా...? ఏమీ అర్ధం కావటంలేదు.

శతపత్రతో పాటు నడుస్తున్నప్పటికీ చుట్టూ ఓ కన్నేసి ఉంచాడు చైతన్య. ఎందుకంటే అక్కడి కావలి వాళ్ళకంటబడితే వదలరు. తను తప్పించుకున్న సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. ఈసారి నెలరోజులపాటు చీకటిగదిలో బంధించేస్తారు.

"చైతన్యా!" పిలిచింది శతపత్ర.

"ఊఁ" అన్నాడు పరధ్యానంగా.

"ఎక్కడున్నావ్? మనం చాలాదూరం నడిచాం. నువ్వలా మౌనంగా ఉంటే బోర్ కొడుతోంది.”

"నా భయం నాది. కింకరుల కంటబడితే వదలరు. లోపలున్నది నేను కాదని తెలిసిపోయిందట.”

"అయితే వేషం మార్చెయ్. నీకు అలవాటే గదా.”

"ఏ వేషంలో ఉన్నా వాళ్ళకు తెలిసిపోతుంది. మనుషుల్ని ఏమార్చినంత సులువుకాదు వీళ్ళని ఏమార్చటం” అన్నాడు చైతన్య ఆత్మ.

"నువ్వంత సులువుగా వాళ్ళకి చిక్కవులే గాని అటు చూడు. అక్కడేదో స్వీట్ షాపు ఉన్నట్టుంది. స్వీట్ తిందామా? ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి?"

ఆ మాటలకు ఫక్కున నవ్వాడు చైతన్య.

"ఎందుకు నవ్వుతావ్?" ఉడుక్కుంది శతపత్ర..

"నీ మాటలకు నవ్వు రాకుండా వుంటుందా? ఒక్క స్వీట్ ఏమిటి? ఇక్కడి అంగళ్ళలో సరుకంతా మాలాంటి ఆత్మల కోసమే గాని నీలాంటి మనుషుల కోసం కాదు" అన్నాడు చైతన్య.

"అదేమిటి?”

"అదంతే. నీకు ఎండమావులు తెలుసా?" అన్నాడు చైతన్య.

“ఆఁ... ఎడారుల్లో పగలు నీళ్ళున్నట్టు భ్రమింపజేస్తాయి. కాని అక్కడ నీళ్ళుండవు"
అంది.

"ఇదీ అంతే. స్వీట్స్ లా భ్రమింపజేస్తాయి. కాని స్వీట్లు కాదు. ఆత్మలకు రక్తమాంసాలు గాని, జీర్ణవ్యవస్థగాని ఉండవు. అవెలా తినగలుగుతాయి? నేను నిన్ననే చెప్పాను నీకు. శరీరం కలిగి ఉన్నప్పటి అలవాట్లు ఆత్మని అంటిపెట్టుకుని వుంటాయి. టైమ్ కి ఆకలయినట్టు అన్పిస్తుంది. భోజనం చేస్తుంది. కాని అది నిజం భోజనం కాదు. అలా చేయటం చేత ఆత్మ తృప్తిపడుతుంది.

ఇక్కడ తినేది, తాగేది అంతా మాయ... బతికున్నప్పటి అలవాట్ల కొద్దీ అమ్మే ఆత్మలు అమ్ముతుంటాయి. కొనే ఆత్మలు కొనుక్కుంటాయి. ఇదో మాయా లోకం. ఆత్మల లోకం" అంటూ వివరించాడు చైతన్య.

శ్రద్ధగా వింది శతపత్ర.

అంతలో ఒక గుడిముందు మండపంలో స్త్రీ పురుషులు అనేకమంది ధ్యానముద్రలో కన్పించారు.

“ఎవరు వాళ్ళంతా?" అడిగింది శతపత్ర.

"వచ్చే జన్మలోనయినా పూర్ణాయుష్షుతో మంచి జీవితాన్నివ్వమని సదా దైవధ్యానం లో గడిపే ఉత్తమ ఆత్మలు" చెప్పాడు చైతన్య ఆత్మ.

“ఇక్కడి ఆత్మలన్నీ మరుజన్మకు వెళ్ళాల్సినవేగా?”

"నిజానికి ఇక్కడినుంచి కాదు. మనం చూసిన నరకానికో లేక స్వర్గానికో వెళ్ళాక ఈ ఆత్మల భవిష్యత్తుని పైవాళ్ళు నిర్ణయిస్తారు. భూమ్మీద ఉండాల్సిన కాలంలో పోయిన వాళ్ళు రోజూ ఎందరో పైకి పోతూంటారు. కొత్త ఆత్మలు వస్తుంటాయి” అన్నాడు చైతన్య"

"ఇక్కడికొచ్చిన ఆత్మలు బయటికిపోలేవా?”

"పోతుంటాయి. నేను వెళ్ళి రాలేదా? అలా... అయితే ఇక్కడో రహస్యం నీకు చెప్పాలి."

"ఏమిటా రహస్యం?”

"కొన్ని ఆత్మలకి తొందరెక్కువ. దొడ్డిదారిన దైవదర్శనం చెసుకునే ఆత్రగాళ్ళ వంటివి. తొందరగా పుట్టి ఏదో సాధించేయాలని ఒకటే ఆరాటం. ఎలాగో తప్పించుకుని తమకో గర్భాన్ని వెదుక్కుంటూపోతాయి.

సమయం, సందర్భం లేకుండా మైథునం జరుపుకొనే ఆత్రగాళ్ళయిన దంపతులో, పెళ్ళిగాకుండానే అక్రమ సంబంధం కలిగిన ప్రేమికులో ఎవరోఒకరు వీళ్ళకి దొరుకుతారు. వెనకా ముందూ చూడకుండా గర్భవాసంలో ప్రవేశించి గర్భస్థ శిశువుగా మారి పుట్టేస్తారు”

"అంటే, పైవాళ్ళ అంగీకారం లేకుండానే మానవ జన్మ ఎత్తుతారన్న మాట. మరి అలాంటప్పుడు పైవాళ్ళు ఊరుకుంటారా?" తన సందేహాన్ని అడిగింది.

"ఎందుకు ఊరుకుంటారు? అకాలంలో కాచే చెట్టు కాయలు తినడానికి పనికిరావు. అలాగే వీళ్ళ జన్మ కూడా వృధా అవుతుంది. పైకి వెళ్ళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా శిక్ష అనుభవింపని నేరం వాళ్ళని వదిలిపెట్టదు.

కొందరు పుట్టడమే మృతశిశువులుగా పుడతారు. కొందరు పుట్టగానే కుప్పతొట్టెల పాలవుతారు. దోషాలు నెత్తిన పెట్టుకొని జన్మనెత్తటం' పైవాళ్ళ దృష్టిలో ఆత్మలు చేసే గొప్ప నేరం. అలాంటి ఆత్మలని శిక్షింపకుండా వదలరు. అందుకే కొందరు శిశువులు పుట్టిన వారాల్లోనే లేదా కొద్ది నెలలకే పాపం పండక మరణిస్తుంటారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తారు. కొందరు పూర్వజన్మ సుకృతంతో బతికినా, ఏదో అంగవైకల్యంతో జీవితాంతం బ్రతుకు వెళ్ళదీయాలి. కాలచక్రం ఎంత ఖచ్చితంగా అమలవుతోందో జీవుల చావుపుట్టుకల రహస్యం కూడా అంత ఖచ్చితంగా ఉంటుంది.”

చైతన్య చెప్తున్న జన్మరహస్యాల్ని ఎంతో ఆసక్తిగా వింటోంది శతపత్ర.

“అంటే, ఆత్మల అదృష్ట, దురదృష్టాల్ని పైవాళ్ళే నిర్దేశిస్తారు. అంతేగదా? మరి బ్రహ్మ లిఖితం అంటారు. అదేమిటి?” కుతూహలంగా అడిగింది శతపత్ర.

ఇద్దరూ ఆత్మల వీధుల్లో నడుస్తూనే మాట్లాడుకుంటున్నారు. ఆమె ప్రశ్న విని చిన్నగా నవ్వాడు చైతన్య.

"అంటే, నీ ఉద్దేశం ఏమిటి? బ్రహ్మ వేరు, దేవతలు వేరనా? దేవతలయినా, ఎవరైనా బ్రహ్మలిఖితం ప్రకారమే వ్యవహరించక తప్పదు. అందరూ బ్రహ్మ సృష్టే గదా. మానవులయినా, దానవులయినా. బ్రహ్మ లిఖితం తెలిసిన వాళ్ళు గాబట్టి పైవాళ్ళు ఆత్మల్ని శాసిస్తుంటారు" వివరించాడు.

"ఆత్మలు భూమి పైన జీవులుగా పుడ్తున్నాయని మనకు తెలుసు. అసలీ ఆత్మ అనేది ఎక్కడ పుడుతోంది?”

"అబ్బో...! నువ్వు మరీ లోతుకు వెళ్ళిపోయావే. తప్పో ఒప్పో తెలీదు. నీకు చాలా రహస్యాలు చెప్పేస్తున్నాను. బ్రతికుండే ఏ మనిషికీ తెలీని చాలా రహస్యాలు ఆత్మలకు తెలుస్తాయి. తిరిగి ఈ లోకం నుండి భూమ్మీదకు వెళ్ళాక నువ్వు ఎవరికీ ఎక్కడా చెప్పవు గదా?”

"ప్రాణం పోయినా చెప్పను సరా?” అంది శతపత్ర.

"జీవుడు ఆత్మ... ఈ జీవాత్మకు ఆధారం పరమాత్మ. ఆయనే దేవుడు. బ్రహ్మ సృష్టించిన ఆత్మే జీవుల్లో అంతర్లీనంగా ఉండి చావు పుట్టుకలను అనుభవిస్తోంది. అయితే ఇంతకుముందు నువ్వడిగిన ఒక ప్రశ్నకు నేను పూర్తిగా సమాధానం చెప్పలేదు.

ఆత్మల అదృష్ట, దురదృష్టాల్ని పైవాళ్ళు నిర్దేశిస్తారు. అంతేగదా అని అడిగావ్. ఆత్మ మల్లెకన్నా స్వచ్ఛమైనది. మంచుకన్నా చల్లనైనది. ఆత్మకు ఎలాంటి వికారాలు అంటవు. అదృష్ట, దురదృష్టాలనేవి జన్మ నెత్తాక లభించే అవకాశాలే గాని ఆత్మగా ఉన్నప్పుడు అలాంటివేమీ ఉండవు. ఐతే ఇప్పుడీ ఆత్మలన్నీ ఇలా మనుషుల్లా ప్రవర్తిస్తున్నాయేమిటి అంటావు? ఇవన్నీ కొన్ని జన్మల్ని అనుభవించిన ఆత్మలు.

పూలకు గుచ్చబడిన దారానికీ సువాసన అబ్బినట్లుగా గతజన్మల అనుబంధం వల్ల ఇలాగే ప్రవర్తిస్తాయి. ఎందుకంటే అకాల మరణంతో ఇక్కడికి చేరిన ఆత్మలివన్నీ, ఒక జీవి పేదవాడిగా పుట్టాలా, ధనికుని ఇంట పుట్టాలా, లేక నిరుపేదగా పుట్టినా, అదృష్టం కలిసొచ్చి అపర కుబేరుడై, పేరు ప్రతిష్టలు పొందాలా అనేది ఏదీ జీవుడి చేతిలో లేదు. అది ఆయా ఆత్మల పుణ్యం స్థాయిని బట్టి జన్మ లభించాక ఫలితం దక్కుతుంది.

జీవుల ఎడల కరుణ, దానధర్మాలు, పుణ్య కార్యాలు- ఇలా తన పుణ్యం శాతాన్ని పూర్వజన్మ సుకృతమే మానవజన్మనిస్తుంది. మనిషిగా అతడి దైవభక్తి, పెంచుకోగలిగిన వారికి దైవశక్తి తోడుగా నిలిచి అశుభాలు కూడా శుభాలుగామారి వారికి సిరిసంపదలు మంచి సంతానం, సుఖశాంతులులభిస్తాయి" అంటూ తన మాటలు ముగించాడు చైతన్య.
🍁
*సశేషం*
*శతపత్ర - 39*
🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

"చివరిగా ఓ ప్రశ్న" అంది శతపత్ర.

"ఇన్ని చెప్పినవాడ్ని నీ చివరి ప్రశ్నకు బదులు చెప్పకుండా వుంటానా? అడుగు?" అన్నాడు.

"ఆత్మ మల్లెకన్నా స్వచ్ఛమైనది. మంచు కన్నా చల్లనైనది అన్నావ్. ఆత్మస్థితిని నేను తెలుసుకోవాలనుంది. నాలోనూ ఆత్మ ఉంది. కాని నేను దర్శించలేను. నీవు అత్మవు. కాని మానవాకృతిలో ఉన్నావు. ఆత్మస్థితిని ఎలా తెలుసుకోను?" అని అడిగింది శతపత్ర.

అగి ఆమె వంక చూశాడు.

"నీ సందేహాలు నేను తీరుస్తాను. నా చేయి పట్టుకో. ఇలా నా ఛాతీ వంక చూడు" అన్నాడు చైతన్య.

అతడి చేయి అందుకుంది శతపత్ర.

"ఓ మై గాడ్!" అంది అప్రయత్నంగా.

అతడి చేయి మంచుకన్నా చల్లగా వుంది. ఐస్ గడ్డను తాకినట్టుంది. అతడి ఛాతీవంక తదేకంగా చూసిన శతపత్రకు ఏవో కొన్ని పరదాలు తొలగినట్టయి, చివరకు ఒక చిరుజ్యోతి కనిపించింది. వెన్నెల వంటి కాంతిని వెదజల్లుతున్న చిరుజ్యోతి. పరవశంతో కొద్దిక్షణాలపాటు అలాగే చూస్తూ ఉండిపోయింది.

"సందేహం తీరింది గదా?" అడిగాడు చైతన్య.

అతడి ఛాతీలో కన్పించిన జ్యోతి అదృశ్యమైంది నెమ్మదిగా.

"నీ చేయి ఎందుకింత చల్లగా వుంది?" ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగింది శతపత్ర.

"ఇదే ఆత్మస్థితి" చెప్పాడు చైతన్య.

"సూర్యుడు వేడిగా ప్రకాశిస్తాడు. చంద్రుడు చల్లగా ప్రకాశిస్తాడు. అది వాటికి భౌతిక ధర్మం. సూర్యునివంటి వాడు పరమాత్మ. చంద్రుని వంటిది ఆత్మ. మంచుకన్నా చల్లని స్థితిలో ఉండే మూలాధారమైన ఆత్మ తను వున్న స్థితిలో సూర్యకాంతిని భరించలేదు. ఆత్మలు, ప్రేతాత్మలు, శాకినీ, ఢాకినీలాంటి పిశాచగణాలు అన్నీ రాత్రివేళనే ఇష్టపడ్డానికి సంచరించడానికి కారణం ఇదే.

చూస్తున్నావుగా... ఈ ఆత్మల ప్రపంచం అంతటా చల్లటి వెన్నెల వంటి కాంతులే కన్పిస్తున్నాయి. జన్మలతో విసిగిపోయిన ఆత్మలు జన్మరాహిత్యం కోరుకుంటాయి. ఆత్మలకు మూలమైన ఆ పరంజ్యోతిలో ఐక్యం కావాలని ఆశిస్తూ ఎదురు చూస్తుంటాయి..
📖

నడుచుకుంటూ చాలా దూరం వచ్చేశారు. ఏదో అడగాలనుకుంది శతపత్ర. చైతన్య మాటల్ని ఎంతో ఆసక్తిగా వింది శతపత్ర. కాని అప్పటికే వీధుల్లో అటుగా వస్తున్న కింకరుల్ని చూడగానే చటుక్కున అదృశ్యమై పోయాడు చైతన్య. విషయం తెలుసుగాబట్టి-

ఈసారి గాభరాపడలేదామె. కాస్త ముందుకు వెళ్ళేసరికి, ఒక మండపం అరుగుమీద ఒంటరిగా కూర్చుని విలపిస్తున్న ఒక యువతిని చూసింది శతపత్ర.

కొత్తగా వచ్చిన ఆత్మ అయివుండొచ్చు అన్పించింది. ఇరవై సంవత్సరాలు మించని లేబ్రాయపు జవ్వని ఆమె. చాలా అందంగా వుంది. ఆమెకు అకాల మరణం అంటే చాలా బాధనిపించింది. ఆమె ఎవరో ఎక్కడ్నుంచి వచ్చిందో తెలీదు. ఆమెను చూస్తుంటే జాలేసింది.

వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చుంది. "నువ్వెంత ఏడ్చినా పోగొట్టుకున్న శరీరం తిరిగిరాదు. 'జాతస్య మరణం ధృవం' అన్నారు. పుట్టిన వాళ్ళు ఏదో రోజు గిట్టక తప్పదు. ఏడ్చి అనవసరంగా ఎందుకు బాధపడతావు? ఏం జరిగిందో నాతో చెప్పు" అంది లాలనగా. ఆ అమ్మాయి తలెత్తి...

శతపత్రను ఆశ్చర్యంగా చూసింది. “ఎవరు నువ్వు? నాలాగే చనిపోయి వచ్చావా?” అనడిగింది.

“నేను సజీవంగానే వచ్చాను. నాదో పెద్ద గాథ. నా వల్ల అయ్యే సాయం ఏదన్నా ఉంటే చేస్తాను. ఏం జరిగిందో చెప్పు" అంది శతపత్ర.

"ఎవరేం చేయగలరు!... అంతా అయిపోయింది. నేను మోసపోయాను. నా ఆశలు, కలలు అన్నీ నేలరాలి పోయాయి” అందామె ఏడుస్తూనే.

“నీ బాధ అర్థం చేసుకోగలను. వివరంగా చెప్పు”

“నా పేరు హరిణి. నన్ను చేసుకుంటాడను కున్న బావే నన్ను చంపి అడ్డు తొలగించు కుంటాడనుకోలేదు.”

"ఎందుకలా జరిగింది? ఎలా మోసపోయావు?”

"గుడ్డిగా నమ్మి మోసపోయాను. చిన్నప్పట్నుంచి బావంటే నాకు చాలా ఇష్టం. తనూ అంతే, మాది మధ్య తరగతి కుటుంబం. బావ వాళ్ళ కుటుంబం వ్యాపారాలు చేసి రాజకీయాల్లో తిరుగుతూ కోటీశ్వరులయ్యారు. అయినవాళ్ళ మధ్య అంతస్తులు అడ్డుగోడలు అవుతాయని ఊహించలేకపోయాను. నన్ను మరింత ప్రేమలో ముంచాడు బావ నరేన్, మాయ మాటలతో నన్ను వశపర్చుకుని మోసం చేశాడు. ఓ పక్క నేను పెళ్ళి గురించి ఒత్తిడి చేస్తున్న సమయంలోనే మరో పక్క ఎవరో రాజకీయనాయకుడి కూతురుతో నరేన్ కి పెళ్ళి జరగబోతోందని తెలిసి హడలిపోయాను.

వెంటనే వెళ్ళి బావను నిలదీశాను. తనకు తెలీకుండా పెద్దవాళ్ళు నిశ్చయించారన్నా డు. ఆ పెళ్ళి క్యాన్సిల్ చేయమని గొడవ చేస్తున్నట్టు చెప్పాడు. నన్ను మాటల్లో పెట్టి నమ్మకంగా ఊరిబయట తన నిమ్మతోటలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను మూడునెలల గర్భవతిని. నేను గర్భవతినని కూడా చూడకుండా, నా గొంతు పిసికి చంపాడు. అక్కడే వాటర్ షెడ్డు వెనక గొయ్యి తీసి పాతేశాడు. మూడు రోజుల్లో వాడి పెళ్ళి జరగబోతోంది. నేనేమయ్యానో తెలీక మా ఇంట్లో తల్లడిల్లిపోతున్నారు” అంటూ బావురుమని ఏడ్చిందామె. ఆమె విషాదగాధ.... శతపత్ర కంటతడి పెట్టించింది.

హరిణి ఆత్మను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ఓదార్చి ఇవతలకు వచ్చింది. అంతలో కింకరుల నుంచి తప్పించుకున్న చైతన్య ఆమె వద్దకొచ్చాడు. ఇద్దరూ తిరిగి నడక ఆరంభించారు.
📖

ఒకచోట చింతాక్రాంతుడై కూచున్న ఒక వృద్ధుడు శతపత్ర కంటపడ్డాడు. అలా అతనెందుకు దిగాలుగా వున్నాడో తెలుసు కోవాలనిపించింది. దగ్గరకెళ్ళింది. “తాతా నీ పేరేమిటి?” అనడిగింది.

"నన్ను రాజయ్య అంటారు తల్లీ. నువ్వెవరు?”

“నా సంగతలా ఉంచు. ఎందుకలా దిగులుగా ఉన్నావు. వయసైందిగదా. సరాసరి పైకి వెళ్ళకుండా ఇక్కడికెలా వచ్చావు?” అడిగింది శతపత్ర.

“ఇంకా అయిదేళ్ళు వయసుండగానే ట్రాక్టర్ తిరగబడ్డ ప్రమాదంలో చనిపోయాను. అందుకే ఇక్కడికి తెచ్చారు. చావు గురించి నాకు చింతలేదమ్మా. నా ఆస్తి ఎవరెవరికి చెందాలో వివరంగా వీలునామా రాసిపెట్టి ఉంచాను. దాని గురించి వాళ్ళకి తెలీదు. నేను చెప్పలేదు. చెబుదామనుకుంటుండ గానే దుర్మరణం చెందాను.

వీలునామా మా ఇంట్లో ఎక్కడ దాచిపెట్టింది నాకొక్కడికే తెలుసు. దాయాదులు మోసం చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. నా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని బాధగా వుంది" అన్నాడాయన.

"ఏ ఊరు మీది?"

“విజయవాడ సమీపంలోని తిరువూరు."

"వీలునామా ఎక్కడ దాచావు?”
చెప్పాడాయన.

"విచారించకండి. మీ వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాను" అంటూ ఇవతలికి వచ్చేసింది శతపత్ర.

అప్పటికే చాలా దూరం తిరగటం చేత అలసిపోయింది శతపత్ర. ఒక కట్టడం పక్కన మెట్లమీద కూర్చుంది. చైతన్య కూడా కూర్చున్నాడు.

"అడగటం మర్చాను. చెప్పు చైతన్యా. నీ సంగతి ఏంటి? ఎలా చనిపోయావ్? యాక్సిడెంటా?” అనడిగింది.

అవునన్నట్టు మొదట తలూపాడు. వెంటనే నవ్వాడు. "నీ దగ్గర అబద్ధం చెప్పలేను. యాక్సిడెంట్ లా క్రియేట్ చేశారు. కాని జరిగింది మర్డరే" అన్నాడు.

"ఎవరో మంత్రిగారి అబ్బాయివని నువ్వు చెప్పిన గుర్తు. అది రాజకీయ హత్యా?"

"అవును. నిజానికి లక్ష్యం మా డాడీ. విధి వశాత్తూ ఆయన భద్రం. వాళ్ళకి నేను దొరికిపోయాను. పెద్ద బ్లాస్టే. రన్నింగ్ లో ఉన్న కారు తునాతునకలయింది. నా బాడీ వెయ్యి చెక్కలయింది” అన్నాడు చైతన్య.

"మై గాడ్ నమ్మలేకపోతున్నాను”

“ఇందులో నమ్మలేకపోవడానికి ఏముందని? పబ్లిక్ గా జరిగిన పేలుడది. నాకు తెలీక అడుగుతాను నువ్వు న్యూస్ పేపర్లు చూడవా? టీవీలు చూడవా? రాష్ట్రంలో సంచలనం కలిగించిన వార్త. అది జరిగి పది రోజులయింది. నీకు తెలీకపోవటం ఏమిటి?"

“సారీ" చైతన్యా... ఈ మధ్య నేను రాష్ట్రంలో లేను. వచ్చీరాగానే ఇటు వచ్చేశాను. అందుకే తెలీదు... ఏం జరిగిందసలు?" అంది శతపత్ర.

"భారీ నీటిపారుదల శాఖామంత్రి వరహాల రావు మా నాన్నగారు. ఆయన ఖచ్చితమైన మనిషి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం సహించరు. రెండు వేలకోట్ల విలువైన మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి టెండర్ల ద్వారా కాంట్రాక్టు పొందిన కంపెనీ బి అండ్ బి కన్స్ట్రక్షన్స్. దాని అధిపతి ఠాగూర్.

అక్కడ కాంట్రాక్టరు, ఇంజనీర్లు కుమ్మక్కయి నాసిరకం నిర్మాణం పనులు చేపట్టడంతో గతంలో వచ్చిన వరదలకి కొంతమేర నిర్మాణాలు కొట్టుకుపోయాయి. శాఖా పరంగా పూర్తిస్థాయిలో ఆ కంపెనీ మీద చర్యలు చేపట్టారు డాడీ, అక్కడ మొదలయింది గొడవ.

మంత్రినే లేపేసి, వేరే మంత్రి వస్తే తప్ప ఈ గొడవ నుంచి బయట పడలేమని అనుకున్నాడు ఠాగూర్. సో... డాడీ కారుకి రిమోట్ బాంబ్ పెట్టారు. ఈ విషయం తెలీదు ఎవరికీ. నాకు అర్జెంటు పని ఉండి డాడీ కారు తీసుకుని బయటికి వచ్చేశాను. కారులో ఉన్నది డాడీ అనుకుని వీధిలో వున్న ఠాగూర్ మనిషి రిమోట్ నొక్కి బాంబు పేల్చాడు" జరిగింది చెప్పేశాడు.

"యాక్సిడెంట్ లా క్రియేట్ చేశారన్నావ్..?" అని అడిగింది శతపత్ర.

"బ్లాస్టింగ్ సమయానికి అయిదు సెకన్ల ముందు మనిషి లేని లారీ నా కారుకి అడ్డం వచ్చేలా చేశారు. దాంతో లారీ గుద్దుకుని బ్లాస్టెందనుకున్నారంతా”

"రాగూర్ ని దోషిగా నిలబెట్టాలంటే తగిన ఆధారాలేమీ లేనట్లేగా?" అడిగింది శతపత్ర.

"ఉంది. ఒకే ఒక ఆధారం ఉంది.”

"ఏమిటది?" అడిగింది శతపత్ర.

"ఠాగూర్ సెక్రటరీ గణేష్, వాడో గుంటనక్క. చాలా తెలివైనవాడు. ఇలాంటి నీచమైన పనులు చేయించటంలో దిట్ట. ఠాగూర్ని తన గుప్పిట్లో ఉంచుకోవటం కోసం వాడో సీక్రెట్ డైరీ రాస్తుంటాడు.

ఈ విషయం ఎవరికీ తెలీదు. బతికుంటే నాకు కూడా తెలిసేది కాదు. ఆత్మని కాబట్టి నాకు తెలిసింది. ఆత్మ మాటలు ప్రాణాలతో ఉన్న వ్యక్తిని చేరవు. అలా చేరితే ఈనాడు భూమ్మీద నివసిస్తున్న రాజకీయ నాయకుల్ని అధికారుల్ని, హంతకుల్ని, మోసగాళ్ళని స్వార్ధపరుల్ని ప్రజలు బతకనివ్వరు. డైరీతో సహా వాడ్ని పట్టుకుని కోర్టులో నిలబెడితే, నేరాలన్నీ బయటికొస్తాయి. కాని అదంత సులువు కాదు.

శతపత్ర ఏదో చెప్పబోయింది.

అంతలో పదిమంది మైనాకుడి భటులు వారిని చుట్టుముట్టి ఒక్కసారిగా చైతన్యను పట్టుకున్నారు. ఊహించని సంఘటనకి దిగ్భ్రాంతికి లోనైంది శతపత్ర. చైతన్య మాత్రం ఎప్పటిలాగే తేలిగ్గా నవ్వేశాడు.

"ఏదో టైమ్ లో దొరికిపోవాల్సిందేగా, ఇప్పుడు దొరికిపోయాను. ఈసారి నువ్వు వచ్చేసరికి చీకటి గదిలోంచి బయటికి వచ్చేస్తాలే." అంటూ కింకరుల వెంట సాగిపోయాడు చైతన్య. అతను కనుమరు గయ్యేంతవరకూ అలాగే చూస్తూ నిలబడుంది శతపత్ర.

అతను ఇంకా మరికొన్ని విషయాలు చెప్పేవాడేమో. పట్టుబడడంతో ఆ అవకాశం లేకుండాపోయింది. బతికున్నప్పుడు ఎంత చిలిపిగా, హుషారుగా ఉండేవాడో గాని ఇప్పుడూ అలాగే వున్నాడతను. ఆలోచిస్తూ కాస్సేపు అక్కడే నిలబడింది శతపత్ర.

తనేం చేయాలిప్పుడు? ఇంచుమించుగా చైతన్య వెంట తిరిగి అక్కడ చాలా ప్రాంతాలు చూసేసింది. ఇక బయటికి వెళ్ళి (భూమ్మీదకు వెళ్ళి) కొన్నయినా మంచి పనులు చేయాలి. తను లోపలికివచ్చి ఖచ్చితంగా ఎన్ని రోజులయిందో తెలీదు. పాపం అక్కడ రుద్రపాద ఏం చేస్తున్నాడో ఏమిటో...? అతడ్ని అనవసరంగా కంగారు పెట్టించటం కూడా న్యాయం కాదు. ఆలోచించిన శతపత్ర అప్పటికప్పుడే బయటికెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.

వడివడిగా ప్రధాన ద్వారం వద్దకొచ్చి నిలబడి తలుపులమీద చేయి వేసింది. ఆమెను ఈసారి ఎవరూ అడ్డగించలేదు. తలుపులు తెరుచుకున్నాయి. ఆమె బయటికి రాగానే తిరిగి మూసుకున్నాయి. చీకటిగా ఉన్న గరుడ లోయలోపడి ఎగువకు నడక ఆరంభించింది శతపత్ర.
🍁
*సశేషం*
*శతపత్ర - 40*
🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

శతపత్ర గరుడలోయలోకి వెళ్ళి మూడు రోజులయింది. అప్పట్నుంచీ ఆమె కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయాడు రుద్రపాద.

ఆమె ఉత్తరంలో సూచించినట్టుగా ఆ ప్రాంతం వదిలి దూరంగా పోలేదు. వచ్చిన రోజు ఎక్కడుందో ఇప్పుడూ అక్కడే వుంది వ్యాన్.

వ్యాన్ పక్కనే టెంట్ వేసుకున్నాడు. పగలు టెంట్ లో కాలక్షేపం చేస్తున్నాడు. రాత్రిపూట డోర్ వేసుకుని వ్యాన్ లో నిద్రపోతున్నాడు. వెంట తెచ్చుకున్న ఆహారపదార్ధాలు దాదాపు అయిపోయాయి. ఆ అడవి చుట్టుపక్కల దొరుకుతున్న పళ్ళు, దుంపలు తిని కాలక్షేపం చేస్తున్నాడు.

శతపత్ర తిరిగివస్తుందా, రాదా? అనుక్షణం అతడ్ని వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఒకవేళ ఆమె చెప్పినట్లు రేపు నాలుగో రోజు కూడా ఆమె రాకపోతే ఏం చేయాలి? ఆశ వదులుకొని తనదారిన వెళ్ళిపోవడమేనా? అలా వెళ్ళగలడా? ఆమెను మర్చిపోగలడా...? ఆమె వస్తుందన్న ఆశతోనే ఎన్నిరోజులైనా ఇక్కడే ఉండాలి తప్పదు.

అప్పటికి సాయంకాలం అవుతోంది.

సూర్యుడు పశ్చిమానికి వాలుతున్నాడు. టెంట్ లో కూర్చున్న రుద్రపాడ లేచి మగ్ తో మంచినీరుతో ముఖం కడుక్కున్నాడు. ఆ రోజు ఎండ తీవ్రత అధికంగా ఉంది. చల్లటి నీరు ముఖాన్ని తాకగానే హాయిగా ఉంది.

మంచినీరు తాగి టవల్ తో ముఖం తుడుచుకున్నాడు. అంతలో గరుడలోయ వైపు నుంచి ఎండుటాకులు నలుగుతున్న చప్పుడు దగ్గరవుతోంది. ఎలుగ్గొడ్డు ఏదో టెంట్ వైపు వస్తోందని భావించాడు రుద్రపాద. షాట్ గన్ అందుకొని టెంట్లోంచి బయటికొచ్చాడు. వ్యాన్ ని చుట్టి అవతలకు వెళ్ళి గరుడలోయ వైపు చూశాడు.

అంతే... అతడి ముఖం ఆనందంతో ఒక్కసారిగా వెలిగిపోయింది. వస్తోంది ఎలుగ్గొడ్డుకాదు... శతపత్ర. సిగపూవు వాడనంత ఫ్రెష్ గా, చాలా ఉత్సాహంగా కన్పిస్తోంది. చకచకా నడుచుకుంటూ వచ్చేస్తోంది శతపత్ర. ఆమెను చూసిన ఆనందంలో కొద్దిక్షణాలపాటు తనను తాను మర్చిపోయాడు రుద్రపాద. యుగాల తర్వాత తిరిగి ఆమెను చూస్తున్నంత ఉద్వేగంగా ఉంది. తుపాకి భుజాన వేసుకుని ఆమెకు ఎదురువెళ్ళాడు.
"నీకోసం ఎంత కంగారుపడుతున్నానో తెలుసా? థ్యాంక్ గాడ్. క్షేమంగా వచ్చావ్ చాలు. నీకేం కాలేదుగదా? మాట్లాడు... శతా... ఇది కలకాదు గదా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రుద్రపాద.

అతడి మాటలో, అతడి మనసులో తన స్థానం ఏమిటో శతపత్రకు అర్ధమవుతోంది. అతడి కళ్ళల్లో తడి తనమీద మమతను చాటుతోంది.

ఇక్కడ అయినవాళ్ళు లేరు. ఆత్మీయులు లేరు. బంధువులు లేరు. లోయలో తను చనిపోయినా బయటికి తెలీదు కాని. రుద్రా... తన క్షేమం కోసం ఎంతగా ఆరాట పడ్డాడో... ఎంతగా ఎదురుచూస్తున్నాడో అర్థంకాగానే ఆమె కళ్ళలో కూడా నీరు సుడి తిరిగింది. అతడి చేయి అందుకుని ఆరాధనగా చూసింది.

“కలకాదు రుద్రా... క్షేమంగా తిరిగివచ్చాను” అంది అతనికేసి ఆరాధనగా, ప్రేమగా చూస్తూ...

రుద్రపాద కళ్ళలో సంతృప్తి... ఆనందం... ప్రశాంతత... ఉద్వేగం... ప్రేమ... ఆరాధన... ఏ ముసుగూ లేకుండా ప్రత్యక్షంగా, ప్రస్ఫుటంగా తొంగి చూస్తున్నాయి. ప్రతి భావంలో స్వచ్ఛత తొంగిచూస్తోంది. నిజాయితీ కనిపిస్తోంది. వాత్సల్యం వర్షిస్తోంది.

అలాగే కళ్ళార్పకుండా ఒకింతసేపు అతని కళ్ళల్లోకే చూస్తుండిపోయింది. కొద్ది సమయానికి తేరుకుంది. "నువ్వెలా వున్నావ్?” తిరిగి తనే అడిగింది శతపత్ర.

"చూస్తున్నావుగా. నీ ధ్యాసే, నువ్వెళ్ళాక ఇక్కడి నుంచి కదిలితే ఒట్టు. ఔనూ, ఇంతకీ లోయలో ఏముంది? అక్కడేం జరిగింది? ఏం చూశావ్?" ఆత్రుతగా అడిగాడు.

"సారీ రుద్రా! అవి నేను చెప్పకూడదు. నువ్వు అడగకూడదు. అంతేకాదు. నేనిక్కడికి వచ్చిన సంగతి కూడా నువ్వు ఎవ్వరికి చెప్పకు. ప్లీజ్... అర్థం చేసుకో.”

"ఓ.కె... ఓ. కె. క్షేమంగా తిరిగివచ్చావ్ చాలు. కమాన్" అంటూ వ్యాన్ వైపు దారితీశాడు.

ఉన్నట్టుండి ఆగిపోయింది శతపత్ర. చుట్టూ పరికించింది. పక్షులు గూళ్ళకు చేరుతున్న సమయం. అటు పశ్చిమాన సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆకాశం నిర్మలంగా వుంది. మందగాలులు ఆహ్లాదంగా వీస్తున్నాయి. కాని... మనసు ఎందుకో ఆందోళనకు గురవుతోంది. అక్కడ ఏదో జరగబోతోందనే శంక మనసును పట్టి పీడించటం ఆరంభించింది.

కొద్దిసేపట్లో ఇక్కడ ఏం జరగబోతోంది?

యముడి నుంచి పొందిన వరాన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుంది శతపత్ర. అంతే... కళ్ళ ముందు ఒక భీకరమైన దృశ్యం గోచరించింది. పెను గాలులు, కుండపోతగా వాన, చెట్లు కూలుతున్నాయి. కొండలపై నుంచి రాళ్ళు దొర్లిపోతున్నాయి. ఒళ్ళు గగుర్పొడుస్తుండ గా చటుక్కున కళ్ళు తెరిచింది.

ఇంతలో- “శతా... అక్కడే ఆగిపోయావేం. కమాన్" అంటూ వ్యాన్ వద్ద నుంచి పిలుస్తున్న రుద్రపాద గొంతు వినబడింది. వేగంగా అతడి వద్దకు పరుగెత్తింది శతపత్ర.

“రుద్రా! టైమ్ లేదు. టెంట్ పీకి వ్యాన్ లో పడెయ్యి, ప్రమాదం ముంచుకురానుంది" అంటూ తొందరచేసింది. అంతేకాదు, తనే పనిలోకి దిగింది.

ఆమె ఏం చేస్తోందో, హడావుడి ఏమిటో రుద్రపాదకి అర్ధం.కాలేదు. ఓ పక్క ఆమెకు సాయం చేస్తూనే- "ఏమిటా ప్రమాదం? నాకేం కన్పించటం లేదే" అనడిగాడు.

"భయంకరమైన గాలివాన రాబోతోంది" అంది.

ఆ మాటకి నవ్వాడు రుద్రపాద.

"పైన ఒక్క మబ్బుతునక లేదు. గాలివాన ఏమిటి? నువ్వేదో భ్రమలో ఉన్నట్టున్నావ్” అన్నాడు.

అతడు మాట్లాడుతూ వుండగానే నీ మాటలు తప్పు అన్నట్లుగా ఎక్కడినుంచో ఉరుము శబ్దం విన్పించింది.

రుద్రపాద ఉలిక్కిపడి పక్కకు వచ్చి ఆకాశం వంక చూసి అదిరిపడ్డాడు. ఉత్తరం దిక్కుగా అడవిమీద ఉరుకులుపరుగులతో మబ్బులు కమ్ముకొస్తున్నాయి నల్లటి దట్టమైన కారుమబ్బులు. అదే సమయంలో గాలిలో కదలిక ఆరంభమైంది. చెళ్ళున ముఖాన్ని తాకిందో గాలివిసురు.

శతపత్ర మాటలు అబద్ధం కాదని అతడికి అర్థమైపోయింది. కొద్దిక్షణాల క్రితం వరకు... సూచనలేమీ లేవు వాతావరణంలో. ఆకాశం లో ఒక్క మబ్బు తునక లేకుండా క్లియర్ గా ఉంది,  ఇంతలో ఇదేమిటి...? అదలా ఉంచితే ఈ విషయాన్ని ముందే ఎలా పసిగట్టింది శతపత్ర...? ఏం అర్థం కాలేదు... గబగబా టెంట్ మడిచి వ్యాన్ లో పడేశాడు. బయట సామానంతా లోపల సర్దేశారు.

అంతలోనే టపటపా రాలటం ఆరంభించాయి వాన చినుకులు. ఇద్దరూ వ్యాన్ లో జొరబడి డోర్స్ క్లోజ్ చేసేసారు. ఆ కాస్త వ్యవధిలోనే మబ్బులు ఆకాశాన్ని పూర్తిగా మూసేశాయి. ఝంఝామారుతం తో ఈదురు గాలులు ఆరంభించాయి.
వడగళ్ళు కూడా పడనారంభించాయి. అడవిలో చెట్లు గడ్డిపోచల్లా ఊగిపోనారం భించాయి. వానతోపాటు వడగళ్ళు కూడా
పడుతున్నాయి.

"వ్యాన్ స్టార్ట్ చేయనా శతా... దూరంగా వెళ్ళిపోదామా?” కంగారుగా అడిగాడు రుద్రపాద.

"వద్దు. అదింకా ప్రమాదం. వ్యాన్ సురక్షితం గా ఉన్నంతవరకే మనం సురక్షితంగా ఉంటాం. లెటజ్ సీ” అంది బయటకు చూస్తూ.

బయట చుట్టూ కాటుకలాంటి చీకట్లు అలుముకున్నాయి. మెరుపులు కళ్ళను మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆగి ఆగి సమీపాల్లో పిడుగులు పడుతున్నాయి. బరువుగా పడుతున్న వడగళ్ళ తాకిడికి వ్యాన్ పైభాగం సొట్టలు పడుతోంది. గాలి విసురుకు గడ్డిపోచలా పైకి లేచిపడుతోంది వ్యాన్.

“ఓరినాయనో, ఇదేం గాలివానరా బాబు... మన ప్రాణాలు తీయటానికే వచ్చినట్టుంది" అన్నాడు కంగారుపడుతూ రుద్రపాద.

ఆ మాట ఎందుకో నిజమనిపించింది శతపత్రకు...
🍁
*సశేషం*

*శతపత్ర - 41*
🍁

ఆ మాట ఎందుకో నిజమనిపించింది శతపత్రకు...చూస్తుంటే సహజమైన గాలి వానలా లేదు ఇది. ఆమె కళ్ళముందు కలి భృత్యుడు కాలకేతు మెదిలాడు.

సందేహ నివృత్తి కోసం మరోసారి కళ్ళు మూసుకుని అవలోకించగా మబ్బుల్లో వికటాట్టహాసం చేస్తూ కన్పించాడు. అతడి భుజంమీద ఉండాల్సిన బూడిదరంగు డేగ అతడి చుట్టూ తిరుగుతోంది.

చటుక్కున కళ్ళు తెరిచింది శతపత్ర. సందేహనివృత్తి అయింది. గరుడలోయలో ఉండగా తనను ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు తను లోయ బయటకు రాగానే ఎలాగైనా తనను హతమార్చాలని చూస్తున్నాడు. తనమీద పగబూనిన అతడ్ని ఎదిరించటం తన శక్తికి మించినది.

వెంటనే యమునాదేవిని తలుచుకొంటూ తన కుడిచేతినున్న గాజును బయటికి తీసింది.

వ్యాన్ అద్దం దించి గాజును అరచేతిలో ఉంచుకొని చేతిని బయటకుసాచింది. "కాలకేతు నుంచి రక్షించు మాతా.... నీదే భారం" అంది గంభీరంగా శతపత్ర.

విచిత్రంగా ఆమె చేతిలో అమ్మవారి గాజు ఒక్కసారిగా దివ్యకాంతుల్ని సంతరించుకుని ధగధగాయమానంగా ప్రకాశిస్తూ గాలిలోకి లేచింది.

ఆ వ్యాన్ నుంచి యాభై అడుగుల ఎత్తు గాల్లోకి లేచి అక్కడే ఆగిపోయింది. ఆ గాజు నుంచి జాలువారుతున్న కిరణాలు వ్యాను చుట్టూ పరుచుకొని, గాజుగోళంలా భ్రాంతి కలిగించాయి...

తాము కూర్చున్న వ్యాన్ చుట్టూ నాలుగు దిక్కులు ఆకాశం, భూమి హద్దుగా ఒక కాంతి రక్షణగా నిలిచింది. చూస్తుండగానే ఆ అమ్మవారి గాజు నుంచి ప్రసరిస్తున్న కాంతి కిరణాలు అగ్నికీలల్లా మారిపోయి ఆకాశం లోకి దూసుకుపోయాయి... క్షణాలు... నిమిషాలు గడిచిపోతున్నాయి. క్రమంగా మేఘాలు చెల్లాచెదురైపోయాయి. బయట గాలిహోరు తగ్గిపోయింది.

వడగళ్ళ శబ్దాలు లేవు... వ్యాన్ చుట్టూ వర్షం పడుతోంది. వ్యాన్ మీద చుక్క కూడా రాలటంలేదు. ఆ అద్భుతాన్ని చూస్తూ రెప్ప వేయటం మర్చిపోయాడు రుద్రపాద.

శతపత్ర వ్యాన్ తలుపు తెరిచి బయటకి వచ్చింది. ఆమె వెనకే రుద్రపాద కూడా వ్యాన్ దిగాడు. ఒక అద్భుత దృశ్యాన్ని, అమ్మవారి మహిమను తమ కళ్ళారా చూస్తున్నారు ఇద్దరూ. రుద్రపాదకు ఇదంతా ఏదో మహామాయలా ఉంది. ఈ వింత ఎలా జరుగుతున్నదో ఏమీ అర్ధంగావటం లేదు.

ఇంతలో రాక్షస అరుపు లాంటి ఒక భయంకరమైన అరుపు విన్పించింది. అంతే... అదిరిపడి స్పృహ తప్పి కింద పడిపోయాడు రుద్రపాద.

శతపత్ర ఆకాశం వంక చూస్తున్నంతలో గింగిరాలు తిరుగుతూ వచ్చి ఆమె సమీపం లో నేలమీద పడిపోయాడు కాలకేతు. అతడ్ని తరుముకొచ్చిన త్రిశూలం లాంటి ఆయుధం ఒకటి ధగధగలతో మెరుస్తూ దూసుకొచ్చి కాలకేతు గొంతు సమీపంలో ఆగింది.

రెండు చేతులూ ఎత్తి ఆయుధానికి నమస్కరించాడు కాలకేతు. “అమ్మా యమునాదేవీ! అహంకారముతో ఈ మానవ బాలికకు హాని తలపెట్టిన ఈ అవివేకిని క్షమించు తల్లీ. అనుగ్రహించు. దుష్టశిక్షణకు వచ్చిన నీ ఆయుధం కార్య సమాప్తం కానిదే వెనుదిరగదని తెలియును. నా అహంకారమును తొలగించు. నా తలమీది కొమ్మును సగము ఖండించుము” అంటూ వేడుకున్నాడు.

మరుక్షణం అమ్మవారి ఆయుధం కాలకేతు ఏకశృంగమును సగానికి ఖండించి అంతర్థానమైపోయింది. కాలకేతు లేచి అదృశ్యమైపోయాడు.

ఆ మరుక్షణమే అంతర్మధ్యంలో వెలుగులు చిమ్ముతున్న అమ్మవారి గాజు రివ్వున వచ్చి శతపత్ర చేతిలో పడి మామూలు గాజుగా మారిపోయింది. ఆ తర్వాత అంతటా నిశ్శబ్దం... ఆకాశంలో మబ్బులు లేవు. గాలివాన లేదు. ఇక కాలకేతు తన జోలికి రాడు. అతడికి గర్వభంగం చేసింది అమ్మవారు. శతపత్రకు ఆనందంగా ఉంది. ముఖాన నీళ్ళుకొట్టి రుద్రపాదకు స్పృహ రప్పించింది.

అతడు లేస్తూనే గాభరాగా చుట్టూరా చూశాడు. ఏముందక్కడ? అంతా ప్రశాంతంగా ఉంది.

"ఏమైంది? ఏదో భయంకరమైన అరుపు విన్నాను" చుట్టూ చూస్తూ అడిగాడు.

"అవును. ఆ అరుపు వినే తెలివితప్పి పడిపోయావు. మొనగాడివి కదా!" అంది ఉడికిస్తూ శతపత్ర.

"నువ్వేమీ వెక్కిరించక్కర్లేదు. నేను మొనగాడినే. మనుషులైతే పదిమంది వచ్చినా విరగ్గొట్టేస్తాను. ఇదేదో అంతా రాకాసిమాయలా ఉంది. ఆ గాలివాన ఏమిటి? ఆ కంకణం ఏదో మనకి గొడుగు పట్టడం ఏమిటి? ఆ అరుపేమిటి? మైగాడ్... నువ్వెలా తట్టుకున్నావో అర్ధంగావటం లేదు. అయినా గాలివాన వస్తోందని ముందే నీకు ఎలా తెలిసింది?” ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు.

"అవేమీ అడగవద్దన్నానా? చీకటిపడింది. మనం వెంటనే బయల్దేరాలి. కారు స్టార్ట్ చెయ్యి" అంది శతపత్ర.

“ఫ్లాస్కులో కాఫీ ఉంది. తాగుతావా?"

"సరే" అంది.

రెండు కప్పుల్లో కాఫీ ఒంచి ఒకటి ఆమెకిచ్చాడు.

వ్యాన్ టాప్ లైట్ ఆన్ చేశాడు.

"ఆ ఉత్తరం ఏమిటి అలా రాశావు?" అడిగాడు.

"బాగానే రాశానే. ఏమైంది?"

"పదిలక్షలకు చెక్కిచ్చి వదిలించుకోవాలను కున్నావు గా..." అన్నాడు.

"నిష్టూరాలాడకు.. ఒకవేళ నేను తిరిగిరాలేక పోతే పరిస్థితి ఏమిటి? అందుకే చెక్కు రాశాను. ఇంతకీ ఏం చేశావ్ దాన్ని?" అంది శతపత్ర.

"చించి అవతలపారేశాను"

"నామీద కోపం దానిమీద చూపించావన్న మాట.... ఓ.కే. డ్రైవింగ్ డ్యూటీ నీదే. అలసిపోయాను. వెనక సీట్లో నిద్రపోతాను" అంది శతపత్ర.

“ఎక్కడికి? హైదరాబాదేగా?"

"కాదు... మనం మదనపల్లి వెళ్ళాలి"

“అక్కడేం పని?" అడిగాడు రుద్రపాద.

"చైతన్యా ప్లీజ్... చెప్పింది చెయ్యి."

ఉలిక్కిపడ్డాడు రుద్రపాద.

"చైతన్యా...?! వాడెవడు?" వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు రుద్రపాద.

పొరబాటు గ్రహించి, నాలిక్కరుచుకుంది శతపత్ర. ఆత్మల ప్రపంచంలో అతడితో ఏర్పడ్డ చనువు... అలవాటులో పొరపాటు గా అతడి పేరు వచ్చేసింది.

"నా ఫ్రెండ్... నువ్వు పోనీ" అంటూ వెనక సీట్లో పడుకుని ముసిముసిగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది. రుద్రపాద ఖచ్చితంగా ఉడుక్కుంటాడని ఖచ్చితంగా ఆమెకు తెలుసు. ఉడుక్కుంటేనే తన మీద ప్రేమ ఉన్నట్లు.

కోపమంతా వ్యాన్ మీద చూపిస్తూ దురుసుగా ముందుకు దూకించాడతను.

శతపత్ర కళ్ళముందు చైతన్య ఆత్మ మెదిలింది. పాపం, చీకటి గదిలో శిక్ష అనుభవిస్తూంటాడు అనుకుంది. ఎగిరెగిరి పడుతూ వ్యాన్ ముందుకు దూకుతున్నా కూడా వెంటనే గాఢనిద్రలోకి జారుకుంది శతపత్ర.

హెడ్ లైట్ల కాంతిలో జాగ్రత్తగా వ్యాన్ ని పోనిస్తున్నాడు రుద్రపాద. గాలివానకి అనేక చెట్లు నేలకూలాయి అక్కడక్కడా. దారి వెతుక్కుంటూ చాలాదూరం ప్రయాణం చేశాక ఒక ఘాట్ రోడ్ కి చేరుకుంది వ్యాన్. అప్పటికి అర్ధరాత్రైంది సమయం. శతపత్ర గాఢనిద్రలో ఉంది.

తిరిగి ఆమెకు మెలుకువ వచ్చేసరికి బయట తెలతెలవారుతోంది. వ్యాన్ రోడ్డుకి ఓరగా ఆగివుంది. దగ్గరలో నీళ్ళ శబ్దం విన్పిస్తోంది.

లేచి కళ్ళు నులుముకుంటూ వ్యాన్ దిగింది శతపత్ర. ఊరూ పల్లెగాని లేని చోటు. అది నిర్మానుష్య ప్రాంతం. చుట్టూ మెట్టపొలాలు కన్పిస్తున్నాయి. ఉదయపు గాలులు ఆహ్లాదంగా వీస్తున్నాయి.

పక్కన మైలురాయి మీద కూర్చుని సిగరెట్ తాగుతున్న రుద్రపాద ఆమెను గమనించి లేచివచ్చాడు. అప్పటికే అతను ముఖం కడుక్కుని స్నానంచేసి రెడీగా ఉన్నాడు.

“ఎక్కడ ఉన్నాం రుద్రా?” అనడిగింది శతపత్ర.

“ప్రస్తుతం చిత్తూరుకి పదిమైళ్ళ దూరంలో వున్నాం” చెప్పాడు రుద్రపాద.

"అదేమిటి? మదనపల్లి వెళ్ళాలన్నాను గదా!”

"మనకోసం అడవిలోంచి డైరెక్ట్ మదనపల్లికి రోడ్డు వేశారేమో నాకు తెలీదు మేడమ్. దిక్కుమాలిన అడవిలో దొరికిన రోడ్డు పట్టుకుని వస్తే ఇక్కడికి చేర్చింది. ఫ్రెషప్ అవడానికి చోటు బాగుంటుందని ఇక్కడ ఆపాను. ఆ షెడ్ వెనక చేనుకు నీరుపెట్టే కరెంట్ పంపు సెట్టు పనిచేస్తోంది. వెళ్ళి స్నానం చేసిరా! టవలు, సోపు అక్కడే ఉన్నాయి” అన్నాడు రుద్రపాద.

ఇంకేం మాట్లాడలేదు శతపత్ర. తన ఎయిర్ బ్యాగ్ లో నుండి పొడిదుస్తులు అందుకొని వాటర్ షెడ్ వెనక్కి వెళ్ళింది.

అర్థగంట తర్వాత ఇవతలికి వచ్చింది శతపత్ర. కడిగిన ముత్యంలా ఉంది. నాలుగు రోజులుగా ఒంటిమీదే ఉన్న జీన్స్ ప్యాంటు, షర్టు విడిచి చుడీదార్ ధరించింది.
అలవిమాలిన సౌందర్యంతో రాయంచలా నడిచి వస్తున్న ఆమెను చూస్తూ కొద్దిసేపు కన్నార్పటం మర్చిపోయాడు రుద్రపాద.
🍁
*సశేషం*
*శతపత్ర -42*

అంతలోనే ఏదో గుర్తుకొచ్చింది. అంతే. ముఖం మాడ్చుకుని కూర్చున్నాడు రుద్రపాద.

"హలో! ఏమిటలా ఉన్నావ్?" అడిగింది శతపత్ర.

"ఎలా ఉన్నానేమిటి?”

"అదోలా ఉన్నావ్"

"నేను మామూలుగానే ఉన్నాను. నువ్వు త్వరగా రెడీ అయితే బయలుదేరదాం."

"నా ఆలస్యం ఏమీ వుండదులే. అవునూ... నేనెప్పుడూ ఇటు రాలేదు. చిత్తూరు నుంచి మదనపల్లికి రూటు ఉందికదా?” అంది శతపత్ర.

"రూటు లేకుండా ఉంటుందా? చిత్తూరు సెంటర్ కి వెళ్ళి ఎవరినడిగినా రూట్ చెప్తారు. ప్రాబ్లం ఏమీ ఉండదు. నువ్వు హ్యాపీగా డ్రైవింగ్ చేసుకు వెళ్ళిపోవచ్చు. నేను చిత్తూరులో డ్రాపైపోతున్నాను. ఇక్కడి డిఎస్పి వరుణ్ కుమార్ నాకు బాబాయి వరుస. వాళ్ళని చూడాలి. డ్రాపవుతాను" అన్నాడు రుద్రపాద.

నుదురు చిట్లించింది శతపత్ర.

"డ్రాపవుతావా?" దబాయించింది.

"నిన్నంటిపెట్టుకునే తిరుగుతానని ఒప్పందం చేసుకోలేదుగా?" అన్నాడు రుద్రపాద ఆమెనే చూస్తూ.

“పక్షం రోజులు మన ఒప్పందం.”

"నాకిష్టం లేదండి. నేను డ్రాపైపోతాను. ఒప్పందం ప్రకారం గరుడలోయకి నిన్ను తీసుకెళ్ళాను. తీసుకొచ్చాను. ఇక నాతో పనేముంది?"

“ఉంది... నువ్వు నాతో తప్పక రావాలి" అంది శతపత్ర.

“రాను. నీ ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడెవడో చైతన్య... వాడ్ని ఇక్కడికి పిలిచి హెల్ప్ తీసుకో."

శతపత్రకు అతని కోపానిక్కారణం ఏమిటో అర్థమైపోయింది. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది.

"సో... చైతన్య మీద అసూయపడుతున్నా వ్. అర్థమైందిలే" అంది తల దువ్వుకుంటూ,

"ఏమర్ధమైంది? ఇక్కడ కడుపుమండి పోతుంటే నీకు జోక్ గా వుందా?" అరిచాడు సీరియస్ గా.

ఒకింత విలాసంగా నవ్వింది శతపత్ర.

"ఆడవాళ్ళు ముందు... తర్వాత అసూయా పుట్టాయంటారు. నిన్ను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. అసూయతో పాటే మగాళ్ళు పుట్టారంటాను” అంది.

"అలాగా. తర్వాత దీనిమీద తీరిగ్గా పి.హెచ్ చేద్దుగాని, ముందు ఈ చైతన్య ఎవడో చెప్పు.”

"పర్సనల్ విషయాలు అడక్కూడదు రుద్రా...” అంది.

“ఓ.కే. నేవెళ్ళిపోతాను. మా పనులు మాకుంటాయండీ” అన్నాడు రుద్రపాద.

"నేను వదిలితేగా నువ్వు వెళ్ళటానికి” అంది శతపత్ర.

"అంతలేదమ్మా. నాకు తెలియాలి. చైతన్య ఎవడు?”

“చెప్పక తప్పదా?”

"అవును. చెప్పి తీరాలి.”

"అతడు నా బెస్ట్ ఫ్రెండ్. నేనంటే అతనికి చాలా ఇష్టం.”

"ఇంతకీ ఎవడు వాడు?”

“రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి వరహాలరావుగారి అబ్బాయి” అంది శతపత్ర నవ్వుతూ.

"నాకన్నా బాగుంటాడా?”

“అబ్బో... చెప్పలేనంత”

"ఎప్పట్నుంచి పరిచయం? నాకన్నా ముందు నుంచా?” అడిగాడు రుద్రపాద.

"అదేం లేదు. జస్ట్ త్రీ ఫోర్ డేస్” అంది.

పిచ్చెక్కినట్టు చూశాడు రుద్రపాద.

“పొద్దుటే నాకు మెంటల్ రప్పించాలని కంకణం కట్టుకున్నావా? నాకు ఒళ్ళుమండి పోతోంది. త్రీ ఫోర్ డేస్ అంటే మనం అడవి లోనే ఉన్నాం. నువ్వు లోయలోకి వెళ్ళావ్. ఎలా పరిచయం?" అంటూ అతడు పెద్దగా అరుస్తుంటే ముసిముసిగా నవ్వుతూ చెవులు మూసుకుంది.

ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చి ఆగిపోయి నమ్మలేనట్టుగా చూశాడామెని.

“ఏమన్నావ్? వరహాలరావు కొడుకు... ఓ మైగాడ్.. నిజంగానే నాకు పిచ్చెక్కిస్తున్నా వ్ .... పదిహేనురోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో ఆ చైతన్య చనిపోయాడు. మీడియా అంతా కోడెకూసింది. ఆ పోయిన వాడు నీకు ఫ్రెండా?" అనడిగాడు.

అవునన్నట్టు తలూపింది శతపత్ర.

"లోయలో చైతన్య ఆత్మ నాకు కనిపించింది. అతను ఫ్రెండయ్యాడు. చాలా సాయం చేశాడు. ఇంతకుమించి నీకు ఇప్పుడు ఏమీ చెప్పలేను. చెప్పకూడదు. గరుడలోయ ఒక దేవరహస్యం. కోట్లాది సంవత్సరాలుగా ఎవరికీ తెలీని ఆ దేవరహస్యం నా మూలం గా తెలీకూడదు. పైవాళ్ళకు మాటిచ్చాను. మాట తిప్ప శాపగ్రస్తురాలిని కాలేను..." అంది శతపత్ర.

రుద్రపాద చిన్నపిల్లాడు కాదు. ఎక్కడో హైదరాబాద్ లో మరణించిన చైతన్య ఆత్మ ఇక్కడ లోయలో శతపత్రకు కన్పించిందంటే ఆత్మలకి సంబంధించిన రహస్యం ఏదో ఆ లోయలో ఉంది.

తనని అడ్డగించి చంపాలని చూసిన అక్కడి శక్తులు శతపత్రని ఏమీ చేయలేకపోయా యంటే బలీయమయిన కారణం ఏదో ఉండే ఉంటుంది. శతపత్ర క్షేమం తనకి ముఖ్యం. లోయలో ఏం జరుగుతోందన్నది తనకి అనవసర విషయం.

“సారీ శతా... అయాం సారీ" అన్నాడు రుద్రపాద కూల్ అయిపోతూ.

జడ అల్లుకోవటం ముగించి వెనక్కి వేసుకుంటూ అతడి వంక ఓరగా చూసింది శతపత్ర నవ్వుతూ.

"సారీలేమీ అక్కర్లేదు. చెప్పు. ఇప్పుడు కూడా డ్రాపయిపోతానంటావా?"

"నువ్వు ఫీలవుతున్నావ్. డ్రాపవన్లే. కాని మదనపల్లిలో పనేమిటో చెప్పాలి" అన్నాడు రుద్రపాద.

“చెప్తాను దానికి ముందు నీకీ జెలసీ ఎందుకు? అసలు నీ మనసులో ఏముందో నాకు తెలియాలి." అంది.

"ఆ ప్రశ్న నువ్వు అడక్కూడదు. నేను చెప్పకూడదు. ఇది మానవ రహస్యం... మనిషి అనుభూతులకు సంబంధించిన రహస్యం... మనిషి భావోద్వేగాలకు సంబంధించిన రహస్యం...”

"అయినా సరే..." చెప్పాలి.

ఆమెకు సమాధానం చెప్పటం ఇష్టంలేనట్టు ముఖం పక్కకు తిప్పుకున్నాడు రుద్రపాద.
🍁
*సశేషం*

*శతపత్ర - 43*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



బాగా తెల్లవారింది. తూర్పు సూర్యోదయ మవుతోంది. ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాద భరితంగా ఉంది వాతావరణం.


"అడుగుతోంది నిన్నే రుద్రా. చెప్పవా?" అని అడిగింది శతపత్ర.


"నిజంగా నీకు తెలీదా?" ఎదురు ప్రశ్నించాడు రుద్రపాద.


“తెలీదు... చెప్పు" అంది శతపత్ర.


"ఐ లవ్ యూ!” వెంటనే నిర్మొహమాటంగా అనేశాడు రుద్రపాద.


"శతపత్ర ఊహించిన సమాధానమే అది. ఈ సమాధానం రుద్రపాద నుంచి త్వరగా వస్తే బావుండును అనుకుంది శతపత్ర. అలాగే వచ్చింది. ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది.


"నేను గయ్యాళి గంగమ్మని. ఈ మాట నువ్వే అన్నావ్. గుర్తుందా? నాతో లవ్ ఏమిటి?" చేతులు కట్టుకుని సీరియస్ గా అడిగింది శతపత్ర.


"నాతో జీవితాంతం పోట్లాడ్డానికి నీలాంటి గయ్యాళి బాగుంటుందని" అంటూ నవ్వాడు రుద్రసాద.


“తమాషా కాదు. సీరియస్ గానే అడుగుతు న్నాను. మనం ఫ్రెండ్లీగా ఉన్నాం. చాలదా? మళ్ళీ ఈ లవ్ ఏమిటి?"


"ఫ్రెండ్షిప్ లవ్ కి పునాది”

 

"నాకు చాలా విషయాలు తెలియవులే. పద, బయలుదేరదాం" అంది శతపత్ర.


"విషయం తేలకుండా నేను రాను. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి."


"ఓ.కె. చెప్పు వింటాను” అంది శతపత్ర.


“నాలుగేళ్ళ క్రితమే నువ్వు నాకు తెలుసు.”


"నమ్మను. లండన్ లో మనం గొడవపడే వరకు నువ్వెవరో నాకు తెలీదు” అంది శతపత్ర.


"కాని నువ్వెవరో నాకు తెలుసు. అప్పట్లో ఓసారి నేను ప్రతాపవర్మ గారింటికి వచ్చాను. నేనక్కడ ఉండగా నువ్వొచ్చావు. నన్ను చూశావ్. కాని మర్చిపోయావ్. నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు నాకు నచ్చావ్. నీతో పరిచయం పెంచుకోవాలనుకున్నాను. ఉద్యోగ బాధ్యతల్లో పడి తర్వాత నిన్ను కలవలేకపోయాను. లండన్ యాక్సిడెంట్ సందర్భంగా రెండోసారి నిన్ను చూశాను. గుర్తుపట్టాను. అందుకే నిన్ను కావాలని టీజ్ చేశాను.


ఇండియా రాగానే ప్రతాపవర్మగారికి ఫోన్చేసి నా మనసులో మాట చెప్పాను. నా మేన కోడలు నిన్ను ఇష్టపడితే చాలు. మిగిలిన వాళ్ళని నేను ఒప్పిస్తాను. లండన్ నుంచి వచ్చాక మాట్లాడదాం అన్నారు.


ఆ మధ్య పనిమీద మళ్ళీ లండన్ కి వచ్చినప్పుడు నిన్ను కలవాలని నీ ఫ్రెండ్ విశ్వదాకి ఫోన్ చేశాను. నువ్వు ఇండియా వచ్చేశావని చెప్పింది. నేను ఢిల్లీ వచ్చాక ప్రతాపవర్మగారికి ఫోన్ చేశాను. మీ ఫాదర్ పోయారన్న సంగతి అప్పుడే నాకు తెలిసింది. చాలా బాధపడ్డాను.


నువ్వు నా హెల్ప్ కోసం వస్తున్నావని తెలిసినప్పుడు కూడా నేనని తెలిస్తే నువ్వు రావని, నా పేరు చెప్పొద్దని నేనే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. నీమీద ప్రేమతోనే ఇదంతా చేశాను" వివరించాడు రుద్రపాద.


మౌనంగా విని ఊరుకుంది శతపత్ర.


తన ముఖంలో ఎలాంటి భావం బయట పడకుండా జాగ్రత్తపడుతోంది. పది సెకన్ల తర్వాత వ్యాన్ డోర్ తెరిచి స్టీరింగ్ ముందు కూర్చుంది శతపత్ర.


"నువ్వు డ్రైవ్ చేస్తావా?" అడిగాడు రుద్రపాద.


“రాత్రంతా డ్రైవ్ చేసి అలసిపోయావ్. స్టీరింగ్ నేను తీసుకుంటాను" అంది శతపత్ర.


"ఇంతకీ మదనపల్లిలో పనేమిటో చెప్పలేదు”


“వారంరోజుల క్రితం అక్కడ హరిణి అనే అమ్మాయి హత్యకు గురైంది. ఆ విషయం వెలుగులోకి తేవాలి”


“అది పోలీసుల పని" అన్నాడు రుద్రపాద.


"హత్య జరిగిన సంగతి ఎవరికీ తెలీదు. హత్య చేసిన హంతకుడు ఆ శవాన్ని మూడో కంటికి తెలీకుండా ఓచోట రహస్యంగా పూడ్చిపెట్టాడు. ఎక్కడ పూడ్చి పెట్టాడో నాకు తెలిసింది” అంది శతపత్ర.


“నీకెలా తెలుసు?" అడిగాడు.


“ఎలా అని అడక్కు. ఏం జరిగిందో చెప్తా విను” అంటూ అభాగ్యురాలైన హరిణి విషాద గాధను వివరించింది.


అంతా విని ఒకింత ఆలోచనలో పడ్డాడు రుద్రపాద. ఒక అమాయకురాలికి జరిగిన అన్యాయం తెలిసి చలించిపోయాడు. చాలా బాధేసింది. రాను రాను డబ్బు, అధికారం మనుషుల్ని రాక్షసుల్ని చేస్తోంది. డబ్బుకోసం ఎలాంటి ఘాతుకానికైనా మనిషి వెరవటం లేదు. అమ్మాయిల మీద అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే వున్నాయి. వాటిని అరికట్టడానికి చట్టాల్ని ఎవరూ కూడా అమలుచేయటంలేదు.


డి.జి.పి నుంచి అట్టడుగు స్థాయి పోలీసు వరకు కాసుల కోసం కక్కుర్తిపడేవాళ్ళే...


"ఇలాంటి విషయాల్లో మనం స్థానిక పోలీసుల్ని నమ్ముకుంటే పనులు కావు. అక్రమార్కులు వాళ్ళని ప్రభావితం చేసి కేసు వీగిపోయేలా చేస్తారు" అన్నాడు.


"అయితే ఏం చేద్దాం?" అడిగింది.


“ఇక్కడి డిఎస్పి వరుణ్ కుమార్ మా బాబాయని చెప్పాగదా. వాళ్ళింటికెళదాం. ఆయనకు చెప్పి హెల్ప్ తీసుకుందాం. అలాగే ఓరోజు మనం విశ్రాంతి తీసుకోవచ్చు. నాకు రాత్రంతా నాకు నిద్రలేదు. కళ్ళు కూడా బాగా మండుతున్నాయి” అన్నాడు రుద్రపాద. 


లోయలోకి వెళ్ళిరాగానే శతపత్రకి హత్య రహస్యం ఎలా తెలిసిపోతుంది? శతపత్ర గురించే ఆలోచిస్తూ.


"ఓ.కే. వెళ్ళిపోదాం" అంది.


"ఆగు. విషయం తేలకుండా ఎలా రమ్మంటావ్?" అన్నాడు రుద్రపాద మొండిగా.


“ఏ విషయం?” నవ్వును దాచుకుంటూ తెలీనట్లుగా అడిగింది శతపత్ర.


"నా మనసులో ఏముందో చెప్పించావ్. ఐ లవ్ యూ అని కూడా చెప్పేశాను. మరి నీ మనసులో ఏముందో చెప్పాలి ఇప్పుడే” 


ముసిముసిగా నవ్వుతూ ముఖం పక్కకు తిప్పుకుంది. “ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడో సినీ కవి. మాటలకే కాదు. నవ్వులకీ వేరే అర్థాలుంటాయని నా అభిప్రాయం. అందుకే మేటర్ ఇక్కడే తేలిపోవాలంటాను" అన్నాడు పట్టుదలగా రుద్రపాద.


"ఓ.కే... నా మనసులో మాట చెప్పాలంటే నా ప్రశ్నకి నువ్వు బదులు చెప్పాలి" అంది శతపత్ర.


"తప్పించుకోడానికి కొత్త ట్విస్టా?”


"నువ్వు కరెక్టుగా ఆన్సర్ చెప్తే తప్పించుకోను”


“అడుగు. తప్పుతుందా?”


"నువ్వు భారత రామాయణాలు చదివుంటావు...”


“ఎప్పుడో చిన్నప్పుడే చదివేశా” అన్నాడు.


"అయితే ఎందులోంచి ప్రశ్న అడగమంటావ్?”


“నీ ఇష్టం"


"రామాయణం నుంచి అడుగుతాను. రామ రావణ యుద్ధంలో రాముడి తరఫున ఇరవై ఒక్క వేలకోట్లకు పైగా వానరవీరులు యుద్ధం చేశారని వాల్మీకి మహర్షి అంటాడు. సహస్రాక్ష పర్వతం మీద నివసించే ఒక వానరవీరుడు కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. అతని పేరు నువ్వు చెప్తే చాలు. నా మనసులో మాట నీకు చెప్పేస్తాను." అంది.


"ఇది చాలా అన్యాయం. సముద్రంలో సూది కోసం వెదికినట్టు ఆ వానరవీరుడి కోసం రామాయణాన్ని వడపోయాలా? మరో ప్రశ్న అడుగు" అన్నాడు రుద్రపాద.


"ఇదే ప్రశ్న... నువ్వు ఎప్పుడు బదులు చెప్తావో అప్పుడే నా మనసులో మాట చెప్తాను. లేటవుతోంది రా కూర్చో” అంటూ ఇంజన్ స్టార్ట్ చేసింది శతపత్ర.


విసుక్కొంటూనే ఎక్కాడు. చిత్తూరు దిశగా వ్యాన్ ని పరుగెత్తించింది శతపత్ర.

📖


మదనపల్లి! ఆరోజు సిటీ కమ్యూనిటీ హాల్లో అతివైభవంగా..గొప్పగా పెళ్ళి వేడుకలు జరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ పలుకుబడి కలిగిన పట్టణ ప్రముఖుడు పాండురంగారావుగారి ఏకైక కుమారుడు నరేన్ కి, ఎంపి బాలరాజుగారి ద్వితీయ కుమార్తె కరుణకు వివాహం జరుగుతోంది అక్కడ. రంగరంగ వైభవంగా జరిగాయి పెళ్ళి ఏర్పాట్లు.


రాత్రి ఎనిమిది గంటలకు ముహూర్తం.


రంగురంగుల విద్యుద్దీపతోరణాల కాంతుల్లో కమ్యూనిటీ హాలు ఇంద్రభవనంలా మెరిసిపోతోంది.


బయట వీధి పొడవునా బారులు తీరిన కార్లు... బైక్ లు ... వస్తూనే వున్న అతిధులు, ప్రముఖుల ఇంట పెళ్ళికాబట్టి మీడియా వాళ్ళ సందడి కనిపిస్తోంది.


పెళ్ళి మండపం అత్యంత వైభవంగా అలంకరించబడింది. హాల్లో ఆహూతులు కిటకిటలాడుతున్నారు. ఛైర్స్ ఎక్కడా ఖాళీలు లేవు. చాలామంది నిలబడే వున్నారు.


పెళ్ళి మండపంలో నూతన వధూవరులు పెళ్ళి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. వధువు వంటినిండా మేలిమి బంగారమే. పురోహితుల వేద మంత్రాలు మైక్ సెట్లలో మారుమోగుతున్నాయి. పెళ్ళితంతు ప్రారంభం కాబోతోంది.


జిల్లా నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన ప్రముఖులంతా మొదటి వరుసలోనే వున్నారు. ఓ పక్క ఇరువర్గాల పెళ్ళి పెద్దలు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. క్రమంగా ముహూర్తం దగ్గరపడింది.


సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టించే ఘట్టం ఆరంభం కానుండగా ఉన్నట్టుండి ఎంట్రన్స్ వద్ద కలకలం మొదలైంది. ఎవరో అరిచారు “పోలీసులు పోలీసులు” అంటూ... అక్కడ ఒక్కసారిగా పెళ్ళి మండపం ఉలికిపాటుకు గురైంది.


చూస్తూండగానే జిల్లా డిఎస్పితో పాటు పోలీసులు హడావుడిగా లోపలకు ప్రవేశించారు.


"ఆపండి. ఈ పెళ్ళి ఆపండి” అంటూ హాల్లో ఖంగున మోగింది డిఎస్పి వరుణ్ కుమార్ గొంతు.


ఎక్కడివాళ్ళక్కడ షాక్ లో ఉండిపోయారు. ఎటు చూసినా గుసగుసలు మొదలయ్యాయి.


మండపంలోపలికి వెళ్ళి నరేన్ ని చుట్టు ముట్టారు పోలీసులు. అటునుంచి పెళ్ళికూతురు తండ్రి ఎం.పి బాలరాజు, ఇటునుంచి వరుడి తండ్రి పాండురంగా రావు పరుగులెత్తుకొచ్చారు. ఎంపి బాలరాజు కోపంతో ఊగిపోతూ పోలీసుల్ని చూశాడు.


"డి.ఎస్.పి... నా కూతురు పెళ్ళి వైభవంగా జరిపిస్తున్నాను. ఏం జరిగిందని పెళ్ళి ఆపమంటున్నారు?” అనరిచాడు. 


అంతలో పాండురంగారావు కూడా అందుకున్నాడు. "తెలిసే వచ్చారా? పోలీసులు బయట ఉండాలి. లోపలకు రాకూడదు. మీ అంతు చూడాల్సి వస్తుంది" అనరిచాడు.


"మాకు పనిలేక వచ్చామనుకుంటున్నారా? ఒక హంతకుడికి పెళ్ళి చేయాటానికి మీకు సిగ్గులేదూ? వారంట్ తోనే వచ్చాం. ఏయ్... అతన్నిలా లాక్కురండి” అన్నాడు డి.ఎస్.పి వరుణ్ కుమార్ తన స్టాఫ్ తో.


నరేన్ ని మండపంలోంచి ఇవతలకు లాక్కు వచ్చారు పోలీసులు. అంతా డిఎస్పి మాటలకు బిత్తరపోయారు. మండపంలో పీటలమీద వున్న వధువును ఆడంగులు పక్కకు తీసుకుపోయారు.


అక్కడ భయంకరమైన టెన్షన్ చోటు చేసుకుంది. పెళ్ళికి వచ్చిన వాళ్లంతా సీట్లలోంచి లేచిపోయారు.


"ఏమిటి మీరంటున్నది? నా కొడుకు హంతకుడా? అన్యాయంగా నేరం మోపితే సహించేది లేదు" అనరిచాడు నరేన్ తండ్రి పాండురంగారావు.


"అన్ని రుజువులు ఉన్నాయి సార్. మరదలు హరిణితో మీ అబ్బాయి ప్రేమ నాటకం ఆడి కడుపు చేశాడు. మూడోమాసం గర్భవతి అని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా ఆమెను చంపి, మీ నిమ్మతోటలోని షెడ్ల వెనక పాతిపెట్టాడు. హతురాలి చేతిలో మీ అబ్బాయి గొలుసు ఉంది. ఆ గోతిలోనే మీవాడి సెల్ ఫోన్ కూడా దొరికింది. రుజువు ఇంతకన్నా ఏంకావాలి? ఇలాంటి కసాయి వాడ్ని కన్నందుకు మీరు సిగ్గుతో తలవంచుకోవాలి.


ఒక అమ్మాయిని చంపిన చేతులతో మరో అమ్మాయికి తాళి కట్టడానికి సిద్ధపడ్డ ఇలాంటి రాక్షసుడికి ఏ శిక్ష విధించినా తక్కువే. చెప్పరా... హరిణిని హత్య చేశావా లేదా?" అంటూ నరేన్ చెంప మీద గట్టిగా ఒక్కటిచ్చాడు డి.ఎస్.పి.


తలవంచుకున్నాడు వాడు...


అతను ఊహించని షాక్ ఇది. మైండ్ బ్లాంక్ అయిపోయి మతి తప్పి పిచ్చి చూపులు చూస్తున్నాడు. హత్య చేసిన తనకు తప్ప హరిణి ఏమైందో మరో ప్రాణికి తెలీదు. తనను పట్టిచ్చి తన భవిష్యత్తుమీద దెబ్బ కొట్టినవాళ్ళు ఎవరు? మెంటల్ గా అతలా కుతలం అయిపోతూ కనీసం ఈ నేరం నేను చేయలేదు అని బుకాయించే ధైర్యం కూడా లేకపోయింది నరేన్ కి.

🍁

*సశేషం*

శతపత్ర - 44*
🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

పెళ్ళికి వచ్చిన బంధువుల్లో హతురాలు హరిణి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పటివరకూ కూతురు కనిపించటం లేదన్న బాధలో ఉన్నారు వాళ్ళు. అయినా పెళ్లికి రాకుంటే బాగుండదని మేనల్లుడి పెళ్ళికి వచ్చారు.

తమ కూతుర్ని హత్య చేశాడని, మేనల్లుడే చంపి పాతిపెట్టాడని తెలియగానే వాళ్ళు శిలాప్రతిమలైపోయారు. "అయ్యో. నా తల్లి... నా బంగారం... చనిపోయిందా..." అనరుస్తూ స్పృహతప్పి పడిపోయింది హరిణి తల్లి.

"ఏరా! చిన్నప్పట్నుంచి అది నువ్వే ప్రాణం అనుకుని నీ చుట్టూ తిరిగింది. సర్వం నువ్వే అనుకుంది. ఆస్తుల కోసం ఇంత నీచానికి తెగిస్తావా! కడుపు చేసిన సంగతి కూడా మాకు తెలీదు. అలాంటి పిల్లని చంపి పాతి పెట్టడానికి చేతులెలా వచ్చాయిరా కసాయి వెధవా... అంతాచేసి ఈ పెళ్ళికి సిద్ధమయ్యా వంటే నీకన్నా రాక్షసుడు ఈ భూమ్మీద ఉండడు. నా బిడ్డ ఉసురు ఊరికేపోదురా. నువ్వు నాశనమైపోతావ్" అంటూ ఏడ్చాడు హరిణి తండ్రి.

విషయం తెలీగానే ఎంపి బాలరాజు ఉగ్రుడై పోయాడు. “ఛీ... నువ్వింత నీచుడివనుకో లేదు. మా అదృష్టం బాగుంది గాబట్టి తాళి కట్టకముందే ఈ విషయం తెలిసింది. మీకు, మీ సంబంధానికి ఓ దండం" అంటూ అప్పటికప్పుడు తన కూతుర్ని, బంధువుల్ని తీసుకుని కళ్యాణమండపం వదిలి వెళ్ళి పోయాడు.

అప్పటికే పెళ్ళి ఆగిపోయిందన్న విషయం కళ్యాణవేదిక దాటి దావానలంలా ఊళ్ళోకి వ్యాపించింది. పెళ్ళితో సంబంధం లేని వాళ్ళు కూడా కళ్యాణమండపంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని గుంపులు గుంపులుగా వచ్చి చేరిపోసాగారు. సీన్ మారిపోగానే పెళ్ళి న్యూస్ కాస్తా హత్యకు సంబంధించిన సెన్సేషనల్ న్యూసైపోయింది. న్యూస్ కవరేజ్ కి మీడియా వాళ్ళు వచ్చి ఎగబడుతున్నారు. టీవీ ఛానళ్ళలో ఫ్లాష్ న్యూస్ గా స్క్రోలింగ్ వార్తలు పాకుతూ వెళ్ళిపోతున్నాయి. పోలీసులు పెళ్ళి మండపం దాకా రావటానికి ముందు చాలా తతంగమే జరిగింది.

చిత్తూరులోనే శతపత్ర డిఎస్పి వరుణ్ ని, హరిణి హత్య విషయంలో బలంగా కన్విన్స్ చేయగలిగింది. ఆమె మాటమీద నమ్మకం ఉంచి ఉదయమే స్టాఫ్ తో పాటు మదనపల్లి చేరుకున్నాడాయన.

కోర్టు జడ్జి నుంచి హరిణి శవాన్ని తవ్వి తీయటానికి అనుమతి తీసుకున్నాడు. కోర్టు తరఫున కొందరు అధికారులూ వారి వెంట వచ్చారు. లోకల్ పోలీసులక్కూడా ఈ విషయాలు తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

నిమ్మతోటకు వెళ్ళి తవ్వగానే హరిణి శవం బయటపడింది. ఫోటోలు, వీడియో తీసి ఆధారాలు సేకరించి శవాన్ని పోస్ట్మార్టంకి తరలించాక కోర్టునుంచి అరెస్ట్ వారెంట్ తీసుకుని పెళ్ళిమండపం వద్దకొచ్చేసరికి ఆ టైమైంది. శతపత్ర, రుద్రపాదలు ఉదయం నుంచీ పోలీసుల వెంటే ఉన్నారు. తమ ప్రమేయం లేకుండా డైరెక్టుగా డిఎస్పి రంగం లోకి దిగి ఈ కేసు డీల్ చేయటంతో లోకల్ పోలీసులు షాకయ్యారు. పెళ్ళి హడావుడిలో ఉన్న పాండురంగారావుకి ఈ విషయాలేమీ తెలీవు.

"ఈ హత్య ఎలా వెలుగుచూసిందీ చెప్తారా? ఎలా ఛేదించారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న మీడియా ప్రతినిధుల్ని చేయెత్తి వారించాడు డి.ఎస్.పి.

ఈ విషయం తెలుసుకోవాలని మీడియా ఎంత ఆత్రంగా ఎదురు చూస్తోందో, అంతకు మించి ఆత్రంగా హంతకుడు నరేన్, అతడి తండ్రి పాండురంగారావు కూడా ఎదురు చూపులు చూస్తున్నారు.

“ప్రతి చిన్న విషయాన్ని కూడా పబ్లిక్ మనకెందుకులే అని వదిలేస్తోంది. వార్తలు తెలుసుకోడానికి చూపిస్తున్న ఆసక్తి అవినీతిని అరికట్టడంలో తమవంతు పాత్ర పోషించటం లేదు. కళ్ళముందు హత్య జరిగినా సాక్ష్యం  చెప్పడానికి ఒక్కరూ ముందుకు రావటం లేదంటే, పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల లోపాలను వేలెత్తి చూపించే వాళ్ళలో ఎంతమంది నిజంగా పోలీసులకు సహకరిస్తున్నారో చెప్పండి? ఇటువంటి పరిస్థితుల్లో కూడా సామాజిక స్పృహతో, అభ్యుదయ భావాలున్న ఒక యువతి చొరవతో ఈ హత్య వెలుగు చూసింది. ఆమె పేరు శతపత్ర" అంటూ శతపత్రను చూపించాడాయన.

ఊహించని ఆ పరిణామంతో శతపత్రతో పాటు రుద్రపాద కూడా ఉలికిపాటుకు గురయ్యారు.

శతపత్ర గురించి పబ్లిక్ కి తెలీటం మంచిది కాదని ముందే ఊహించాడు రుద్రపాద. అందువల్ల శత్రువులు ఏర్పడే ప్రమాదం ఉంది. తమ పేర్లు బయట పెట్టొద్దని ముందే ఆయన్ని రిక్వెస్ట్ చేశారు. అయినా చివరికి అత్యుత్సాహంతో ఆ విషయం మర్చిపోయి శతపత్రను సెంటర్ పాయింట్ చేసేశాడు డి.ఎస్.పి వరుణ్ కుమార్.

మీడియా ఆమెను చుట్టుముట్టింది. ఆమెను చూసి హంతకుడు, అతడి తండ్రి కూడా కోపంతో పళ్ళు కొరికారు. మీడియా నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది శతపత్ర కి. ఏదో ఒకటి కల్పించి అయినా చెప్పాలి.

టీవీ కెమెరాలు ఆమెమీద ఫోకస్ అయి వున్నాయి. మైక్ లు ఆమె ముందు సిద్ధంగా ఉన్నాయి.

“హతురాలు హరిణి నా ఫ్రెండు. మేమిద్దరం అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. నావద్ద ఏదీ దాచేది కాదు. బావ నరేన్ తో తన ప్రేమ విషయం కూడా నాకు చెప్పింది. తన బావ మారిపోయాడని తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఓసారి బాధపడింది. మరోసారి ఫోన్ చేసినప్పుడు తనకు మూడో నెల కడుపని చెప్పింది. బావ పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకం పోతోందని ఏడ్చింది. నేను ధైర్యం చెప్పి ఓదార్చేదాన్ని.

చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు తను బావ చేతిలోనే చస్తుందేమోనని భయంగా ఉందని తనకేదన్నా అయితే బావే బాధ్యుడని అంది. ఆ తర్వాత ఫోన్లు లేవు. అప్పటి నుండి తను కనిపించటంలేదని తెలిసింది. నేను ఏదో జరిగిందని అనుమానించాను. ఇక్కడికొచ్చి నాదైన తరహాలో ఎంక్వయిరీ చేశాను. కొన్ని నిజాలు తెలిశాయి

డి.ఎస్.పి. గారిని కలిసి నా అనుమానాల్ని చెప్పాను. ఆయన సాహసంతో తీసుకున్న నిర్ణయాలు హంతకుడ్ని పట్టించాయి. నరేన్ అరెస్టుతో నా స్నేహితురాలి ఆత్మ పూర్తిగా శాంతిస్తుంది. ఈ క్రెడిటంతా డిఎస్పిగారిదే. వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను” అంటూ మీడియాను తిరిగి డిఎస్పి వైపుకి
డైవర్ట్ చేసింది శతపత్ర. మీడియా తిరిగి డి.ఎస్.పిని చుట్టుముట్టింది.

పోలీసులు నరేన్ కి సంకెళ్ళు వేసి బయటికి తీసుకొస్తున్నారు. ఆ హడావుడిలో శతపత్ర చేయిపుచ్చుకుని వేగంగా జనం మధ్యలోంచి బయటికి వ్యాన్ వద్దకు లాక్కొచ్చేశాడు రుద్రపాద.

"ఏమైంది?" అడిగిందామె ఆందోళనగా.

"ఏమీ కాకూడదనే నా ప్రయత్నం. మనం వెళ్ళిపోతున్నాం. ముందు వ్యాన్ ఎక్కు" స్టీరింగ్ ముందు కూర్చుంటూ చెప్పాడు రుద్రపాద.

"అదేమిటి? చెప్పకుండా వెళ్ళిపోతే మీ డి.ఎస్.పి. బాబాయి ఫీలవరా?” అంది శతపత్ర.

ఆమె ప్రశ్నకి విసుగ్గా చూశాడు రుద్రపాద.

"నేలకి పోయేది నెత్తికి రుద్దుకోవటం అంటే ఇదే. మనకి సంబంధం లేని విషయంలో వేలు పెట్టడమే తప్పు. అంత చెప్పినా మర్చిపోయి నిన్ను మీడియా ముందుకు నెట్టి మరో తప్పు చేశాడా పెద్దమనిషి, నిన్ను పెద్ద రిస్క్ లో పడేశాడు.

ఆ పాండురంగారావు బ్యాగ్రౌండు మంచిది కాదు. వాడికిక్కడ చాలా నెట్వర్క్ వుంది. నా మాటలు అర్థమౌతున్నాయా? మనం వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. ఊ... హరియప్" అని తొందరచేస్తూ ఇంజన్ స్టార్ట్ చేశాడు.

ఇక ఒక్కమాట కూడా మాట్లాడకుండా వచ్చి అతడి పక్కన కూర్చుని వ్యాన్ డోర్ మూసింది శతపత్ర. ఒక్క పెద్ద జర్క్ తో ముందుకు దూకి పరుగు అందుకుంది వ్యాన్.

అతడి ముఖంలో ఆందోళనను ఆమె గమనిస్తూనే ఉంది. అప్పటికి రాత్రి తొమ్మిది దాటింది సమయం. హెడ్ లైట్ల కాంతిలో వేగంగా దూసుకుపోతూ వ్యాన్ క్రమంగా మదనపల్లి వీధుల్ని దాటేసింది. ఊరి పొలిమేరను సమీపిస్తుండగా తేలిగా ఊపిరి తీసుకున్నాడు రుద్రపాద, కాని....
🍁
*సశేషం*