[ _*🚩కార్తీక పురాణం - 16వ అధ్యాయము🚩*_
*స్తంభ దీప ప్రశంస*
*వశిష్టుడు చెబుతున్నాడు -*
*"ఓ రాజా ! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన , దాన , వ్రతాదులను చేయుట , సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ , తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి , భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు , నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.
సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని , స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి , వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు శాలిధాన్యంగాని , నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును , లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.
*దీప స్తంభము విప్రుడగుట*
ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని , దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని , నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ ఆశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి , కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను చూచి *"ఓ సిద్దులారా ! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా ! రేపు కార్తీకశుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభముపాతి , దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము , రండు"* అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి , అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి , దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి *"ఓయీ నీ వేవడవు ? నీవీ స్తంభమునుండి ఎలా వచ్చితివి ? నీ వృత్తాంతమేమి"* అని ప్రశ్నిచిరి. అంత , ఆ పురుషుడు వారందరకు నమస్కరించి *"పుణ్యాత్ములారా ! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక , దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి , ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి , నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను , పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని , నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై , పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి , లక్ష జన్మలముందు కుక్కనై , పదివేల జన్మలు కాకినై , ఐదువేల జన్మలు తొండనై , ఐదు వేల జన్మలు పేడపురుగునై , తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని , నన్ను మన్నింపు"* డని వేడుకొనెను.
ఆ మాటలాలకించిన , మునులందరు నమితాశ్చర్యమొంది *"ఆహా ! కార్తీకమాస మహిమ మెంత గొప్పది అదియునుగాక , కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు , రాళ్లు , స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును.
[07/11, 1:17 pm] . Mallapragada: _*🚩కార్తీక పురాణం - 17 వ అధ్యాయము🚩*_
*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*
☘☘☘
ఓ మునిశ్రేష్ఠులారా ! ఓ ధనలోభీ ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.
కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున , శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా
*"ఓ మునీంద్రా ! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక , ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన , *'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"* యని ధనలోభుడు కోరెను.
అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే , *'నేను - నాది'* అని చెప్పబడు జీవత్మాయే *'అహం'* అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా *' నః '* అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే *"ఆత్మ"* యనబడను. *"నేను"* అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక , ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ *"నేను", "నాది"* అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.
ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర , ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ . అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరెంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి , మేల్కొన్న తర్వాత *'నేను సుఖనిద్రపోతిని , సుఖంగావుంది'* అనుకోనునదియే ఆత్మ.
దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును , ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన , దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే *'పరమాత్మ'* అని గ్రహింపుము. *'తత్వమసి'* మొదలైన వాక్యములందలి *'త్వం'* అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం *'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి"* అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే *"ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షిణించుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము , ఉపదేశము , సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ".* ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో , అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.
జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు , జీవులు కర్మ ఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు , దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.
*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.*
[08/11, 8:45 am] . Mallapragada: _*కార్తీక పురాణం - 18 వ అధ్యాయము_
*సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*
☘☘
*"ఓ మునిచంద్రా ! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే , నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా , తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా ! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా ! అట్టి ! నేనెక్కడ ! మీ దర్శన భాగ్యమెక్కడ ! నాకు సద్గతి యెక్కడ ? పూణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీకమాసమెక్కడ ! పాపాత్ముడనగు నేనెక్కడ ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ ? ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన , నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో , దాని ఫలమెట్టిదో విశదీకరింపు"* డని ప్రార్ధించెను.
*"ఓ ధనలోభా ! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి ఉపయోగార్ధమైనట్టివి కాన , వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని , సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే , జాతివాడో , ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక , సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను , మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా ఈ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు , స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము , వేదములతో సరితూగు శాస్త్రము , గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు , బ్రాహ్మణులకు సమానమైన జాతీయు , భార్యతో సరితూగు సుఖమునూ , ధర్మముతో సమానమైన మిత్రుడనూ , శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు"*. అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.
*"ఓ మునిశ్రేష్టా ! చతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ! ఏ కారణం చేత దానిని నాచరించవలెను ? ఇదివరకెవ్వరయిన ఈ వ్రతమును ఆచరించియున్నారా ? ఆ వ్రతము యొక్క ఫలితమేమి ? విధానమెట్టిది ? సవివరంగా విశదికరింపు"* డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.
*"ఓయీ ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి'* అనియు , *కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు , ఈ వ్రతమునకు , చతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన , దాన , జప , తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన , ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".*
తొలి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత , వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును , చతుర్బాహుండును , కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. *"నారదా ! నీవు క్షేమమే గదా ! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా ? మానవులందరికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ? ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా?"* అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి *"ఓ దేవా ! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు.కొందరు పుణ్య వ్రతములు చేయుచు , అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా , మరి కొందరు అహంకార సహితులుగా , పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"* మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి , ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.
ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు , పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు *"ఈ ముసలి వానితో మనకేమి పని"* అని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి *"వీరినెట్లు తరింపజేతునా ?"* అని అలోచించుచు , ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ , చక్ర , గదా , పద్మ , కౌస్తుభ , వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి , లక్ష్మి దేవితోడను , భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.
ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.
*శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*
*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*
*లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*
*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*
*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*
*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*
*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*
*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*
*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.*
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
No comments:
Post a Comment