Wednesday, 10 May 2017

వాస్తు:



నిజ జీవితంలో అందరికీ పనికి వచ్చే వాస్తు:
"వస" - 'నివసే' అనే ధాతువు నుండీ వాస్తు అనే పదం జనించిందని, గృహాది నిర్మాణం ద్వారా నివాసయోగ్యమైన భూమి 'వాస్తువు అని సరళమైన భాషలో చెప్పేరు పెద్దలు. వాస్తు శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో సమన్వయం ఉంది. అయితే, పూర్తిగా శుభ వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా, అద్దెకు లభ్యమయినా, నివశించినా 'సత్ప్రవర్తన లేనిచో కేవలం వాస్తు రక్షించలేదు. జ్యోతిష, భూ, వృక్ష, జల వైద్య, వేదాంత శాస్త్రాల తో పరస్పరత కలిగిన వాస్తుని పాటిస్తూ, "ధర్మో రక్షతి రక్షిత:" అనే శ్రుతి ప్రకారం శుభాలను పొందుతూ, మనకు అందుబాటులో ఉన్న కొన్ని నియమాలను ఇక్కడ చెప్పిన ప్రకారం తెలుసుకుందాం:
1) ఇంట్లో దేవి దేవతల చిత్రాల ప్రక్కన పూర్వీకుల చిత్రపటాలు పెట్టడం వలన చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది-నైరుతి గదిలో దక్షిణ గోడకు మాత్రమే పెట్టుకో వచ్చని సూచన
2)అద్దెకివ్వబడిన ఇంటి ప్రభావం యజమానిపై కాక, అద్దెకున్నవారి పై పడుతుంది. స్వంత యజమాని పై పడదు.
3) రోడ్ కి ఎత్తు తక్కువ గల ఇంటిలో నివశించ కూడదు, కొనకూడదు. శీఘ్రముగా ఎత్తు పెంచుకొనవలెను.
4) పార్కులకి దగ్గరగా ఉన్న స్థలం; ఈశాన్యం దిశ కలిగి ఉన్న ఇల్లు ఉత్తమ మైన ఫలితాలని ఇస్తుంది. దేవాలయాలకి దగ్గరగా ఇల్లు కొనకుండా, కట్టుకోకుండా జాగ్రత్త వహించాలి.
5)కోర్టు సముదాయం, కళ్యా ణ మండపములు, స్కూల్ సముదాయములలో ఇళ్ళు కాకుండా, దుకాణాములు, ఆఫీసులు గాని సమకూర్చుకుంటే చాలా లాభదాయకం
6)దంపతులు ఇంటి ఈశాన్య భాగములో నిద్రించ కూడదు. నై రుతి అతి ఉత్తమం, వాయువ్యం చాలా ఉపయోగకరం, అనుకూలం.
7) ఈశాన్య భాగంలో బరువులు నిషిద్ధం, నైరుతి లో బరువులు ఉండిన ఇంటికి వాస్తు పరంగా లాభం
9) ఈశాన్య ద్వారం ప్రవేశం గల ఇంటిలో-ఆగ్నేయం దిశలో వంటగది(తూర్పు కు తిరిగి వంట చేసుకునే యోగ్యం), నై రుతి దిశలో మాస్టర్ బెడ్ రూం, వాయువ్యం లో దంపతుల గది, ఈశాన్యం లో చిన్న పిల్లల గది గా గల నివాశాన్ని వాస్తు పరిపూర్ణత కలిగినది గా పరిగణించవచ్చు.
10)మొబైల్ టవర్స్ క్రింద నున్న నివాశయోగ్యమైన ఇళ్ళు గా పరిగణించక పోవడానికి కారణం వాటినుండీ వెలువడే హానికరమైన కిరణాలు గా చెప్పుకోవచ్చు.
11) మరుగు దొడ్లు ఈశాన్యం, వాయువ్య ఆగ్నేయం దిక్కులందు ఉండరాదు. ఉత్తర, దక్షిణ దిక్కులో నిర్మించినా ముఖ ద్వారం ఉత్తర దిశగా, కూర్చున్నప్పుడు ఉత్తరానికి చూస్తున్నట్టుగ్గా టాఇలెట్లు నిర్మించుకొనిన ఉత్తమం.
12) కారుతున్న నీటి కొళాయిలు, పంపు లను శీఘ్రంగా మరమ్మత్తు చేయించుకుంటే ఆర్ధిక పరిస్థితి దెబ్బతినకుండా ఉంటుంది. దీర్ఘకాలం కొనసాగితే ప్రాణ నష్టం కూడా జరిగిన ఇళ్ళు లేకపోలేదు.
13) డాబా మెట్ల కింద వంటగది నిషిద్ధం. ఆగ్నేయ ద్వారం నుండీ ప్రవేశం శాంతికి భంగం . ఆగ్నేయ మనగా తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం అని అర్ధం. వాయువ్య-ఈశాన్య గదులలో పిల్లలు చదువుకున్నప్పుడు ఉత్తర ముఖం గా చూస్తూ చదువుకోవాలి.
14) వివాహం కాని అవివాహిత స్త్రీ పురుషులు వాయువ్య గదిలో నిద్రించాలి. ఇంటిలో పెద్ద వయసు వారు నైరుతిలో నిద్రించాలి. నైరుతి పడమర నిద్రకు హాని.
15) నైరుతి మూలలో అధిక బరువులు గల వస్తువులు, ధనాగారాన్ని, బీరువాలు
దక్షిణ గోడకు ఆనించి, ఉత్తర ముఖం గా తలుపులు తెరుచుకునేటట్టు చూసుకున్న విశేష లాభప్రదం. కుబేర స్థానం అన్నివిధాలా లాభదాయకం, ప్రగతి కారకం.
16)అద్దెకున్న వారితో గొడవులు ఉంటే నైరుతి సరిచేసుకోమన్నారు. బీంల క్రింద కూర్చోవడం, పరుపులు వేసుకోవడం, నిద్రించడం చేసిన మానసిక అశాంతి, ఆందోళన, భార్య భర్తల మధ్య విభేదాలు, హానికరమైన వాతావరణం లో గడపడానికి తావు కల్పించిన వారవుతారు.
17) బాడుగకి తీసుకునే ముందు ఇంటి యజమాని కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నారా, ఇంతకు ముందు బాడుగకు ఉన్నవారు వృద్ధి లోకి వచ్చారా లేదా, వారి స్థితిగతులు ఉన్నతంగా ఉండేవా లేవా అని వాకబు చేసి మరీ ఆ ఇంట దిగడం ఉత్తమం. ఎందుకంటే, ఆ ఇంటి వాస్తు బాడుగకు ఉన్నవారికే వర్తించి అభివృద్ధికి ఫలితాలను అందజేస్తుంది కనుక
18) కొ ట్లాటలు, యుద్ధ హింసాత్మక వాతవరణానికి సంబంధించిన చిత్రాలను ఎప్పుడూ కూడా ఇంట, కార్యాలయాల్లోనూ ఉంచరాదు
19) డ్రాయింగ్ రూం లో కుటుంబ సభ్యుల సంతోషకరమైన ఫొటోలు చిత్రాలను పెట్టండి. నవ్వుతూ ఉన్న చిత్రాల వల్ల పాజిటివ్ ఏనర్జీ పెరుగుతుంది. అపరిశుభ్రంగా ఏ ఫొటోనూ ఉంచరాదు. నిద్రించే ముందు-బుక్ షెల్ఫ్, టివి లను గుడ్డతో కప్పి పడుకోవలెను. గదులలో అద్దం (mirror) ఉంటే రాత్రి వేళ కప్పి ఉంచడం, నిదుర లేచిన వెంటనే చీపురు ను చూడకుండా (దక్షిణ దిశ దీనికి స్థానం) ఇంక మిమ్మల్ని కలవడానికి వచ్చిన వారికి మీ పాద రక్షలు కంట కనబడకుండా చూసుకోవడం, ఆగిపోయిన గడియారాలను, పగిలిన అద్దాలు, విరిగి బీటలు పడిన బొమ్మలు, కళా కాంతులు కోల్పోయిన వస్తువులు ఇంటినుండీ తొలిగించడం, మహా వృక్షాలు, భోజన శాల ఇతరులకు కనబడకుండా ఉంచడం లాంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా మరిచిపోకుండా పాటిస్తే హాని కలుగదని చెప్పడం జరిగింది.
అపార్ట్మెంట్లలో నివశించే వారి అభిరుచులకి విరుద్ధంగా వ్యవహరిస్తూ, కుక్కలను, కోతులను, మేకలనూ పెంచుకుంటూ ప్రతిదినం ఇతరుల ఆగ్రహానికి, వారి మనో దుర్భాషలకు, అభిశాపాలకు గురి కాకుండా చూసుకోండి. నివాశ స్థలములలో, ఇతరులను బాధపడుతూ, వ్యతిరేకతకు గురి అవుతూ, అధర్మ వర్తనగా చేసే ఏ పనీ శుభాలు కలుగ నీయదు. ఒకవేళ పూర్వజన్మ కృతపుణ్యం వలన కొంత కాలం శుభాలు పొందినా, పుణ్యఫలం అయిపోగానే అధికమైన అనర్ధాలను పొందడమే గాకుండా, ఇతరుల వల్ల కల్గిన అభిశాపాలు తమ సంతతికి అందించిన వారవుతారు. వారి దుఖమయ జీవితానికి నాంది వేసిన వారు అవుతారు. చివరగా వాస్తు శాస్త్ర భరితమైన మయ, విశ్వకర్మ లచే నిర్మితమైన కుబేర-లంకాధిపతుల నగరం, రావణబ్రహ్మ వైభోగం ఆయన అధర్మ ప్రవర్తన వల్ల ఎలా నాశన మయ్యిందో, కంటి ఎదురుగా తన సంతతి కి వాటిల్లిన నష్టాలూ పతనం అన్న చరితం మనకందరకూ తెలిసిందే.
వాస్తు దోషం వర్తించని స్థలములు:
1) ఏ ఇంటిలో పెద్దలు గౌరవింపబడతారో; 2) ఏ ఇంటిలో మోసం ఉండదో-ఒకరి మంచి చెడులను గురించి మరొకరు విచారిస్తారో; 3) ఏక్కడయితే చిన్నవారికి అందరి ప్రేమ లభిస్తుందో; 4) ఏ ఇంటిలో మహిళలు స్వతంత్రంగా భోజనం తయారుచేస్తారో-అలాగే అందరికీ తినిపిస్తారో; 5)ఏ ఇంటిలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక దగ్గర భోజనం చేస్తారో; 6) సహ-పంక్తి భోజనాలకు, పెళ్ళిళ్ళకు, చావు ఖర్చులకోసం అప్పులు తీసుకోరో; 7) కోర్టు, పోలీసు తగాదాలు ఉండవో; 8) తాగుడు, జూదాల కొరకు పురుషులు రాత్రుళ్ళు బయట గడపరో; అటువంటి వారి స్థలములలో వాస్తు దోషం పెద్దగా వర్తించదు.
(Compiled from the books written by Late Sree Jeereddy Baalachenna Reddy, Sri V N Shuklajee)

1 comment: