Saturday, 7 February 2026

 

*మాఘ పురాణం*
            
           17 వ అధ్యాయము

మాఘ పురాణం పదిహేడవ అధ్యాయంలో…
ఒకప్పుడు, ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందాడు.
ఆ శాపం వలన అతనికి గాడిద ముఖం వచ్చింది. సిగ్గుతో, అతను పద్మగిరి గుహలో దాక్కున్నాడు. దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించి ఇంద్రుని శాప విముక్తి గురించి అడిగారు.
శ్రీమహావిష్ణువు మాఘమాస స్నాన మహిమను వివరించి, గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందుతాడని చెప్పాడు.
తన మాటలకు బలపరిచే ఉదాహరణగా, విశ్వామిత్రుని కథను కూడా చెప్పాడు…
ఒకసారి, విశ్వామిత్రుడు ఒక గంధర్వ స్త్రీతో కామ క్రీడలలో లీనమై తన తపస్సును కోల్పోయాడు. శాపం వలన అతనికి కోతి ముఖం వచ్చింది. కానీ, మాఘమాస స్నానం చేసి శ్రీమహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుండి విముక్తి పొందాడు.
శ్రీమహావిష్ణువు సలహా మేరకు, దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానం చేయించారు. దాని ఫలితంగా, ఇంద్రుడు తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్య శక్తులను పొందాడు. ఈ కథ మాఘమాస స్నానం యొక్క పుణ్య మహిమను మరియు భక్తి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.. .

*ఇంద్రునికి కలిగిన శాపము:*```
వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. “రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము... ‘పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగానది తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభం అగును. అటువంటి  మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాప నాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతః కాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడు అయినట్టుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు..
పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి, ఆమె ఒక నాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహ పరవశుడయ్యెను. అమెను ఎటులనైనా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు
ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను.
మిత్రవింద ముని తెల్లవారు జామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశమై ఇంద్రుని పొందుకు  అంగీకరించెను, కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఎవడవని అడిగెను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవు అయి స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగా నదీ తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను.
ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరముల యందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించు కొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారిట్లనిరి.           దేవతలారా వినుము మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకమునందు స్నానము చేయుట శ్రీమహా విష్ణు పూజ, పురాణ పఠనము, యధా శక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిల దానము ఆవూప దానము, పాయస దానము, వస్త్రకంబళముల దానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహా విష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు, మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.
దేవతలును దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి.
స్వామీ! నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులు అయినారు. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! అటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు.
పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును యెరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వ వ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.
దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.

దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వస్ధుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపి ముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాస కాలము అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి.
అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆసక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వుడి భార్య మాఘ స్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను.        స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.
ఆమె అడవిలో తిరుగుచూ  విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ  కామక్రీడలలో తేలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామ వాంఛకు లోనై నీ తపశ్శక్తిని అంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.
దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను..✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 18 వ అధ్యాయము*

*ఇంద్రుని శాపవిముక్తి*

శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను." దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు.

మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు, శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో, శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో, రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో, ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము, సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ, ఇలా సర్వనదులయందును, పది సంవత్సరముల పాటు, సూర్యోదయ సమయమున, స్నానము చేసినచో, వచ్చు పుణ్యము, మూడు దినములు, అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి, పూజ  మున్నగువానితో, వివిధ పుష్పములతో, సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన, మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, మాఘవ్రత మహిమను వివరించెనుl.

దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి, యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి, చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను, ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని, శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి, మరునాడు మాఘస్నానాదికమును చేసి, ఆ తీర్థమును తొండపై పోసిరి.

పవిత్రోదకముచే తడిసిన తొండ, దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను." నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున, నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి, తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి, నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.

నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ, చూచువారెవరును లేకపోవుటచే, భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు, బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు, జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి, పరిహాసము చేసితిని. ధనమును దాచి, సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి, నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి, దురాచారవంతురాలనై, జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.

పులి, కోతి, ఎద్దు, మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి  జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును, ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన, మీరు దయయుంచి, నాకు శాపవిముక్తిని కలిగించిరి" అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే, ఆమె దేవతత్వమునంది,' దేవప్రియ' అను పేరును పొందెను. దేవతలలో, ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును, దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో, వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి, బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి, వెంబడించి, వానిని ఊరడించి, ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు, మహావిష్ణువు, నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ, ప్రకారము చేయుదము" రమ్మని, తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెనుl.

ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి, సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము, ఇంకను వినవలెననున్నది. ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు .ధనసంపాదనము తప్ప, ధనవినియోగము నాతడు  చేయలేదు. పూజ, దానము, మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత, నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి, దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై, పంపాతీరమున, మఱ్ఱిచెట్టు పైనుండి, అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి, ఆ ప్రాంతమునకు, శిష్యులతో వచ్చి, మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు, మాఘస్నానము, పూజ, మున్నగునవి  చేయుచు, శిష్యులకు, మాఘమాస మహత్త్యమును, వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు, నొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వపాపములును, సూర్యోదయమువలన  చీకట్లు నశించినట్లుగా, నశించును. మాఘస్నానము చేయనివాడు  నరకమునపోవును" అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను,  వివరించుచుండెను. ఆ సమయమున, పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము, వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు, పంపాజలమున, మాఘస్నానమును, వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన, వాని పిశాచరూపముపోయి, దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన, వైకుంఠమును చేరెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

*మాఘ పురాణం - 19 వ అధ్యాయము*

*మునుల వాగ్వాదము*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. "ఓయీ వినుము. గోమతీ నదీ తీరమున, పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి, సర్వోత్తములైన వారిలో, పరస్పరము, నేనెక్కువయనగ నేనేయక్కువయను, వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును," నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని" పలికెను. లోమశుడను ముని," నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను." గార్గ్యుడను ముని, సభలో నిలబడి, "వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని" యనెను. మాండవ్యుడు "నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదునుl.
నిత్యకర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని" గర్జించెను. శంతనుడను ముని," నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రతకలవాడను. నన్ను మించిన వాడెవడు లేడని" పలికెను. పాలస్త్యుడను ముని లేచి," నేను వేదములు, శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడనని"యనెను. శౌనకుడును," ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును" లేరనెను. ఆ మునివరులు, తమ గొప్ప తనమును, బిగ్గరగా, యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక, భృగు మహర్షి వద్దకు వచ్చి, వాని జడలను లాగి, పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు, వారి దండములను, ఛత్రములను లాగుచు, కోలాహలమును పెంచిరి.

ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా, కలహప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించుకొనుచున్నవారిని, మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి, శ్రీహరికి, యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు '"నారదా! ఆ మునులు జ్ఞానులైనను, నా మాయకు లోబడి, కలహించుకొనుచున్నారు. వీరి వివాదము, ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని, వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును, యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున, చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా! నీవును అచటకు పోయి చూడుము" అని పంపెను. మార్కండేయ మహర్షి, వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి, వివాదపడుచున్న మునులు, వివాదమును ఆపి, అస్పష్టములైన మాటలతో, వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును, వారినందరిని కుశల ప్రశ్నాధికముతో, శాoతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.

కొంతకాలము గడచిన తరువాత, బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును, అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు, వారిని జూచి, యెదురువెళ్ళి, నమస్కరించి, అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని, తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి, సనకాది మునులాశ్చర్య పడి, యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు. మునులలో నుత్తముడవు, సప్త మహాకల్పములు, నీ ఆయుష్కాలము. ఇట్టి నీవుo బాలురమైన మాకు నమస్కరించి, పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి?  వృద్దులు, బాలురకు యెదురు వెళ్ళుట, నమస్కరించుట, చేయరాదని, శ్రుతివాక్యమున్నది కదా! మేము అయిదేండ్లవారమే కదా! అని పలికిరి.

ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని, మార్కండేయ మహర్షి యిట్లనెను. "భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా, ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను, మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు, చిరంజీవియైనచో, వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే, దుష్టుల జీవనము, గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే, యెక్కువగ, వ్యర్థముగ, అజ్ఞానియై, యెక్కువ కాలము గడిపిన, వాని గొప్పదనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు, ప్రాణిలోకము భయమునంది, తాను చేసిన కర్మఫలముననుభవించి, మరల జన్మించును. నిత్యముకాని దేహముతో, విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు, సార్థకమైనది.మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము, విష్ణు కథా ప్రసంగమును, చేయువారు, నిత్యము, ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును, నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను, విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము.  నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు, బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను, బాలురే కావున, మాకంటే మీరే గొప్పవారని, మార్కండేయ మహర్షి, సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని, సనకాది మహర్షులు, శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను  వినుచున్న మునులు, తమలో తాము, యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని, సిగ్గుపడిరి. వారందరును, మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును, పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యిoడని ప్రార్థించిరి.

నారదుడును, శ్రీహరి వద్దకేగి, జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి, వ్యాస రూపమున, సూతునకు, సర్వశ్రుతుల జ్ఞానమును, బోధించెను. సూతునివలన, మునులు మొదలగు వారందరును, శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు, మునులును, అహంకారము మొదలైన మనోవికారములను విడిచి, ప్రశాంతచిత్తులై, పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము, కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు, తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి, తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా, ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి, వివిధరూపములు పొంది, తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను, సర్వశాస్త్రములను అభ్యసించి, పరమాత్మ మహత్త్యము నెరిగి, పరమాత్మ చింతనమును చేసి, భగవదనుగ్రహము నందుటయే, జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు, భగవచ్చింత, నేను నిరంతరముగ, అలవాటు చేసి, జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ, భగవచ్చింతనమును, జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన, ప్రాణి, యిహలోక సుఖములను, పరలోకములను, దుష్కర్మక్షయమును, సత్కర్మాచరణ ఫలమును పొంది, భవసాగరమును తరించును. మునుల అహంకారమును, మార్కండేయ ముని, వినయవివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును, భగవచ్చింతనమును, జ్ఞానఫలములని యెరిగి, ఆచరించి, భవసాగరమును, దాటవలెను సుమా, అని గృత్నృమద మహర్షి వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*మాఘ పురాణము -20వ అధ్యాయము.*

భీముడు ఏకాదశీ వ్రతము చేయుట 

పంచపాండవులలో రెండవ వాడిన భీముడు మహాబలవంతుడు భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టింది. ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదాని  భోజనం విషయంలో బెంగ ఉండేది. భోజనము చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి “ గురుదేవా ! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు గదా! దాని విశిష్టత ఏమిట?” ని భీముడు అడిగాడు.

“అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటే ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు” అని పాండవ పురోహితుడు ధౌమ్యుడు చెప్పాడు.

“సరే నాకు అలా చేయాలని ఉన్నది గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలాగ? అని విచారిస్తున్నాను. ఉపవాసము ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలా, ఏకాదశీ వ్రత ఫలము దక్కేలా నాకు వివరించమని భీముడు అడిగాడు.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసినా కష్టములు కనిపించవు.  నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు. రాబోవు మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం ఇంకొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి పుష్యమీ నక్షత్రముతో కూడినదై ఉంటుంది. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏది లేదు. సంవత్సరములో వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహా పర్వదినము. ఆ రోజు నియమము తప్పకుండా ఏకాదశి వ్రతము ఆచరించు. ఆకలి గురించి దిగులు పడకు. అని ధౌమ్యుడు భీమునకు వివరించాడు.

ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటచే మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసము ఉన్నాడు. మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుస్తారు.   ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసములోనే వస్తుంది. మహా శివరాత్రి మహత్యము గురించి కూడా వివరిస్తాను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో  చెప్ప సాగాడు.

శివరాత్రి మహత్యము 

ఏకాదశి మహావిష్ణువునకు ఎలా ప్రీతికరమైన దినమో అదేవిధముగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి. దీనినే ‘శివరాత్రి’ అని అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన రోజు. మాఘమాసములో వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి” అని అందరూ పిలుస్తారు. ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళితో బిల్వ పత్రములతో పూజించాలి. పూజించి శివప్రసాదము సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎంతటి పాపములు ఉన్నా అవన్ని వెంటనే హరించి  పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది ఇంకొకటి లేదు. ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది మాఘమాసం కృష్ణ పక్షములో వచ్చు చతుర్దశి. అందరు జాతి బేధములతో నిమిత్తం లేక శివరాత్రి వ్రతము ఆచరించి జాగరణ చేయవలయును.

“ పూర్వము శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడనే బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసిస్తు ఉండేవాడు. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. వాడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించటము తప్ప మరేమీ తెలియదు. జంతువులను వేటాడటములో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయేవి. అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.

ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళాడు. ఆనాడు సాయంకాలము అవుతున్నా జంతువులు ఏమీ కంటపడలేదు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించక పొద్దు పోయినా అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూస్తున్నాడు. చలిఎక్కువ అవుతూ, మంచు కురుస్తున్నా కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరమును కప్పుకున్నాడు. అలా కప్పుకుంటున్న సమయములో ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడ్డాయి. ఆరోజు మహాశివరాత్రి రోజు బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియక చేసినా కొన్ని మారేడు పత్రములు శివలింగముపై పడ్డాయి. ఆ కారణము చేత శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది. మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడటము తిండిలేక ఉపవాసము ఉండటము ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసాయి.

జరామరణములకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుష్యుడు తన జీవితమును గడపాలి.

మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణము ఆసన్నమై ప్రాణములు విడచిపెట్టాడు. యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుపోతుండగా కైలాసమునుంచి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు వెళ్ళారు. యమభటులు చేసేది లేక జరిగినది యమునితో చెప్పారు. యముడు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు.

శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర, నారద గణములతో కొలువు తీరివున్న సమయములో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనము ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు. 

  యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందిస్తున్నాను. నేను రావడమునకు కారణము ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు.   అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకుతుందా ?” అని యముడు అడిగాడు.

యమధర్మరాజా! నాకు ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కుతుంది. ఈ బోయవాడు పాపాత్ముడయినప్పటికీ    శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుజ్యము ప్రాప్తమయినదని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్దనుండి వెళ్ళిపోయాడు.

🍁🥀🍁🥀🍁🥀🍁🥀🍁🥀🍁

_*🚩మాఘ పురాణం - 21 వ అధ్యాయము🚩*_

 *శివ స్తుతి*

☘☘☘☘☘☘☘☘☘


శ్రీమహావిష్ణువు చేసిన శివ ప్రశంస - నారదుని శివస్తుతి.

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరియు నిట్లనెను. విష్ణువు శివుని జూచి యిట్లనెను. శంకరా ! నీవు నాతో సమానుడవు. మన ఇద్దరికిని భేదము లేదు. నావలెనే సర్వ పూజ్యుడవు. సర్వవ్యాపకుడవు , సర్వోత్తముడవు , సర్వవ్యాపివి , సర్వాత్మకుడవు సుమాయని యిట్లు స్తుతించెను.

*🌴విష్ణుకృత శివస్తుతి🌴*


*శంభో భవానర్కహిమాంశు* *నహ్నివేత్రత్రయస్తే ఖిలలోక కర్తా*

*తధాసమస్తామర పూజితాంఘ్రీః* *సంసేవ్యమానస్పురయోగిబందైః ||*

*వచాస్తికించిత్తవ మిత్ర భేదస్తే హంచ్వహం త్వం సురనాధసత్యం*

*వేదాంద వేద ప్రముఖా నిశం ర్వాంసన్యాసినస్వృర్గ విముక్తి హేతుం*

*వదంతి తద్వత్ సుభజంతిశంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం ||*

*సర్వభేదవినిర్ముక్తః సర్వభేదాశ్రయోభవాన్*

*త్వంత్వరిష్ఠాయలోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః ||*

*త్వమేవ పరమానందస్త్వమే వాభయదాయకః*

*త్వమక్గరం పరంబ్రహ్మ త్వమేవహినిరంజనః ||*

*శివస్స్ర్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మవిదామసి*

*ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసోవేదనిదామసి ||*

*సాంఖ్యానాంకపిలోదేవః రుద్రాణామపి శంకరః*

*ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపొవకః ||*

*వేదానాంసామవేదస్త్యం సావిత్రి చందసామపి*

*ఆధ్యాత్మ విద్యావిద్యానాం గతీనాం పరమాగతిః ||*

*మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి*

*ఓంకారస్సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ||*

*ఆశ్రమాణాం చ గార్హ్యస్థ్యం ఏశ్వరాణాం మహేశ్వరః*

*పుంసాంత్వమేకుపురుషః సర్వభూతహృదిస్థితః ||*

*సర్వోపనిషదాంచేవ గుహ్యోపనిషదుచ్యతే*

*కల్పానాంచమహాకల్పః యుగానాంకృత మేవచ*

*ఆదిత్యః సర్వమారాణాం వాచాందేవి సరస్వతీ ||*

*ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి*

*సూక్తాణాం పౌరుషంసూక్తం బ్రహ్మసిబ్రహ్మవేదినాం ||*

*సావిత్రీచాసి జాహ్యిరాం యజుషాం శతరుద్రీయః*

*పర్వతానాం మహామేరుః అనంతోయోగినామపి ||*

*సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి*

*యరైవాహం త్వంహి సర్వముఖ్యోషు శంకర ||*


శంకరా ! నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగ తెలియును. నేను నారదునకు నీ మహిమను చెప్పగా నతడు నీయనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనెందెను. నీవాతని ననుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా ? మరల స్మరింపుము.


*కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం* *నిర్మలమేకరూపం*

*అనాదిమధ్యాంత* *మనంతమాద్యం నమామి దేవంతమనః పరస్తాత్ ||*

*ర్వాందేకపస్యంతి జగతృసూతిం వేదాంత సునిశ్చితార్థాః*

*ఆనందమాత్రం ప్రణనాభిధానం* *చతేవరూపం శరణం ప్రపధ్యే ||*

*ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని* *వియోగహేతుం తేజోమయం* *జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మిరూపం ||*

*ఆద్యంత హీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేపరస్తాత్*

*కూటస్థమవ్యక్తవపు స్తదైవ నమామిరూపం పురుషాభిదానం ||*

*సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం*

*సూక్ష్మంవిచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్త భేధం ||*

*ఆద్యం మహత్త్వే పురుషార్త్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం*

*ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మైస్పమన్వితం దేవనతోస్మిరూపం ||*

*ద్వీసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకరాధం*

*అనంత భూతైరధివాసితంతే వతోస్మ్యహం తజ్జ గదంద స్థంస్థం ||*

*అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజసారూపితలోక భేదం*

*త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవి మండలస్థం ||*

*సహస్రమూర్థానమనంత శక్తీం సహస్రబాహుం పురుషం పురాణం*

*శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మినిత్యం ||*

*దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంత కాలావల కాలరూపం*

*అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ||*

*ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభీ పూజ్యమానం*

*జనార్దన ప్రీతి మహత్కరం త్వాం సతోస్మిరూపంతవ శేష సంజ్ఞం ||*

*అన్యాహతైస్వర్యమయుగ్మ నేత్రం బ్రహ్మమృతానంద రవజ్ఞమేకం*

*యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్మ్యహంత్వామె తిరుద్ర సంజ్ఞం ||*

*ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం*

*మకోమలం హింద్ర సుశుభ్రదేవాం నమామ్యహాం త్వామఖిలాభినాధం ||*

*చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవర ప్రదానం*

*వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహందేవ కృపాకరేశం ||*

శంకరా ! నారదుడు చేసిన అమోఘమైన యీ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితిమ్ని. మునులందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమున్నదని తల్చు మూఢులు నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడంతర్థానము నందెను.

జహ్నుమునీ ! విష్ణు ఏ విధముగ రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి లోకములకి వినయము నీ విధముగ తెలిపెను. ప్రస్తుతం  ముగ్గురికి భేదములేకున్నను భేదమున్నదని తలచివాదించు , అహంకార పండితులకొరకీ సంఘటన జరిగినది. మాధమాసవ్రతము నాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి దోషమునకు ఓడిగట్టరాదు.

****

_*మాఘ పురాణం - 22 వ అధ్యాయము*_

 _*క్షీరసాగరమధనము*_

గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును, మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాదు, అన్నదానము చేయువాదును పొందు పుణ్యము అనంతము అని పలికెను.

జహ్నుముని గృత్నృమదమహాముని! తిధులనేకములుండగా యేకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను, సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.

వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.

_*దేవదానవులు చేసిన శివస్తుతి*_

నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే

నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||

నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ

నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||

త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక

త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||

త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే

అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||

హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే

మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||

పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్s

అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరిv.

ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను, హస్తకంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరిl.

_*రాహుకేతువుల వివరణ*_

రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపదిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.

చక్రముచే నరుకబది చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని, చంద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరిs.

ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్సించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెనుv.

ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెనుl.

పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును 'నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.

యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును 'నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి యింద్రునకు ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను

*మాఘపురాణం - 22వ అధ్యాయం  సంపూర్ణం*

*మాఘ పురాణం - 23 వ అధ్యాయము*


*నారదుని దౌత్యము - దేవతల దైన్యము*

గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని యింద్రుడుని విచారించెను. పారిజాత పుష్పముపై నున్న యిష్టము అధికమగుటచే, తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు, దేవతలను గూడ, తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి, యింద్రుడు, దేవతలు మహోత్సాహముతో, పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే, స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో, శ్రీహరి, పూజా నిర్మాల్యమును, పాదములతో, త్రొక్కిదాటిరి. ఫలితముగా, దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి, ఇంద్రాదులింకను రాలేదని, మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాతవృక్షమును పెకలింపదలచి   యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే, వారును, శక్తి హీనులై పడియుండిరి.

మరునాటి ఉదాట్యమున, సత్యజిత్తు, తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన యింద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును, విచారమును, చెందెను. వారికి నమస్కరించెను. "ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు, స్వల్ప ప్రయోజనమునకై, యిట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ, పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా?" అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక, తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు, నేలపైనున్న మాంసమునకాశపడి, భూమిపై వానియవమానము నందినట్లు, మేమును, పారిజాత పుష్పముల కాశపడి, ధర్మమును తప్పి, దొంగలించి, యిట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో, యెట్టిదో, చెప్పుమని, యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక, తన యాశ్రమమునకు పోయెను.

ఇంద్రుడు మొదలగువారు, ఆహారము లేక, దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున, అమృతాహారము లేదు. కామధేనువు యిచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి యిచ్చునట్టి, పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును, దేవతల దురవస్థకు, విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును, తొలగించెను. తానేమి చేయవలెనో, దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక, దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని, యధాపూర్వకముగ పూజించుచు, తానును, భార్యయు, నిరాహారులై యుండిరి. ఈ విధముగా, సత్యజిత్తు కూడ, పదనొకండు దినములు, నిరాహారుడై, శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడాకాశమున దిరుగుచు, దేవతల దురవస్థను, గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో, అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి, యిట్లు స్తుతించెను.

*నారదకృత విష్ణుస్తుతి*

ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే

గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||

మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే

శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||

అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ

సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||

నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే

భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||

నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన

సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||

సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి

పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||

పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః

సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||

త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః

ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||

త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే

జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||

త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో

గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||

ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం

ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||

నారదుని స్తుతిని విని, సర్వజ్ఞుడగు శ్రీహరి,యేమియు నెరుగనివానివలె, ''నారదా! స్వాగతము ఇప్పుడెందులకీస్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో, అది యెట్టిదైనను, దేవాదులు సాధింపజాలనిదైనను, నీకు సమకూర్చెదను" చెప్పుమని యడిగెను. నారదుడును, తలవంచి," ఇంద్రాదులు చెడుపనిని చేసి, ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి యిష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై, యింద్రుడు, దేవతలతో బాటు వెళ్లి, ఆ పారిజాత వృక్షము వద్ద, అగ్ని సమీపమున, రెక్కలు కాలిపడిన మిడుతవలె, దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన యింద్రాది దేవతలు, పదునొకండు దినముల నుండి, నిరాహారులై, దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు, వారిని దయయుంచి రక్షింపవలయునని," నారదుడు కోరెను.నారదుని మాటలను విని శ్రీహరి, 'నారదా! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే, పారిజాత వృక్షముగను, తులసిగను అయినది. అనగా ఆ రెండును, అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తనువాడు, ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి, ఆ ధనముతో, దరిద్రులను ఆర్తులను పోషించి, తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి యుత్తమునికి, దీనులకును, జీవనాధారమగు పుష్పసంపదను, త్రిలోకాధిపతియగు నింద్రుడు, నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు, నన్నర్చించిన నిర్మాల్యమును, పుష్పవాటికలో జల్లగా, భోగలాలనుడగు నింద్రుడు, నా నిర్మాల్యమును గూడ దాటెను. త్రొక్కెను. ఇన్ని దోషములచే, త్రిలోకాధిపతియగు నింద్రుడు, వాని యనుచరులు, శక్తిహీనులై, తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును, తెలిసికాని, తెలియకకాని, దాటిన, తొక్కిన, యెంతటి వాడైనను, శక్తిని కోల్పోయి, దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు, యింద్రాదుల దైన్యమునకు బాధపడుచు, నేమి చేయవలెనో తెలియక, తానును, భార్యతో బాటు, నిరాహారుడై, నన్నర్చించుచు, నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు, నేటి వరకు, పదనొకండు  దినములు, దేవతలు అమృతపానము లేక, నిరాహారులైరి. సత్యజిత్తును, వారిని జూచి, భార్యతోబాటు, నిరాహారుడై యుండెను. దేవతల విముక్తికై, నన్ను ప్రతిదినము, నర్చించునే యున్నాడు. నేడు పదకొండవ దినము. అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు, నేడు కూడ, ఉపవాసముండి, నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు, జాగరణమొనర్చినచో, నేను ప్రసన్నుడై, అతడేది కోరినను వెంటనే యిచ్చెదను. అతడే కాదు. యెవరైనను, యేకాడశి నాడు, ఉపవాసముండి, జాగరణ చేసి, నా మంత్రమును జపించినచో, వారికిని, కోరిన దానినిచ్చెదను" అని, విష్ణువు సమాధానము ' నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక, తన దారిన బోయెను, అని గృత్నృమదమహాముని, జహ్నువునకు చెప్పెను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*మాఘపురాణం - 24వ అధ్యాయము*

విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట

శూద్ర స్త్రీ వృత్తాంతము

మాఘమాసమందలి నదీస్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది.

ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపొయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యౌవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలనా గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆదృశ్యమును చూచి మండిపడుచు “నీవు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతి ముఖము సంభవించుగాక యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మణి భార్యను శపించి వెళ్ళిపొయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము. అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు.

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

*మాఘ పురాణం - 25 వ అధ్యాయము*


*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*


గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. " ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను. వినుము. ఎట్టి పాపాత్ముడైనను, మాఘమాసవ్రతము నాచరించి, పాప విముక్తుడగునని, యీ కథ తెలుపెదను. వినుము. అతి ప్రాచీనమైన యీ కథ, శ్రీహరి 

కథామహిమను తెలుపును.

పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి, పరివారముతో, నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా, నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు, నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో, ఆయాసముచే, నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి, మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి, వాని వద్ద నున్న వస్త్రములు, ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి, యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని, బలవంతముగ తీసికొనెను.


"ఓయీ! నీవు దాచిన ధనమునిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని, కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, 'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని, సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు, ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు,  అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి, వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా, అరణ్య మార్గముననే కాక, పట్టణ మార్గమున ప్రయాణించు, వారిని  కూడ  దోచుకొని, చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక, విపరీతముగా పెరుగుచుండెను.


ఇట్టి కిరాతునకు, బంగారు నగలను చేయువాడొకడు, మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె, క్రూరుడు, వంచనాపరుడు, బంగారపు నగలను చేయుచు, దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని, స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడుl. అతడును నగలమ్మి, అందులో కొంత ధనమును తీసుకొని, మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట, ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను. ఈ విధముగ, నాకుటుంబమున కుమారుడు, తల్లి యిద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా, నుండిరి. వాని తల్లి, చీకటిలో కామాతురయై, తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ యింటికి, ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని, యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు, వ్యభిచారిణి కాముకురాలయిన, తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి, తాను కోరిన ఆమెయనుకొనెను, వాని తల్లియు, ఆ చీకటిలో వచ్చినది, తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా, తల్లియు కుమారుడును, ఆ చీకటిలో, ఒకరినొకరు యెరుగక, తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా, వారిద్దరును, ఆ చీకటిలో కలిసిరి, సమాగమమైన తరువాత, వారిద్దరును, ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి, నరకమును చేరి, శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము, నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే, అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై, కిరాతుని చేరి, వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు, బ్రాహ్మణుని, ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి యిచ్చిన నగలలో, బంగారమును, దొంగలించువాడు. శూద్రుడు, తల్లితో, వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని,, బ్రాహ్మణ మిత్రుడొకడు, కలడు. అతడు వారితో కలసి, వారితోబాటు, పాపకార్యములను చేయుచుండెను, బ్రాహ్మణుడగుటచే, వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో, పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కల్లుత్రాగువాడు, క్రూరుడు, బంగారము నపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును, పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు, కిరాతుడు, పంపగా, గ్రామాంతరమునకు పోయెను, అతడు ఆ గ్రామమున, శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు, వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి,దీనుడై యున్నవానిని చూచి, "నీవెవరవు? ఎక్కడికి పోవుచున్నావని" యడిగెను. అతడును," నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడనని" పలికెను. అప్పుడు వీరవ్రతుడు, ధ్యానమగ్నుడై యుండి, కనులు తెరచి యిట్లనెను.


"ఓయీ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను. వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు. తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో, తిరిగి, నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను, వాడును, వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక, తప్పనిసరి అయినను, దర్భను చేత బట్టి, మాటలాడవలెను. అట్టు చేసిన పాపమంటదు.నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే, బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని, పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగలించిన వాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురు, పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న, అంత మంచిది." అని, వీరవ్రతుడు, నిశ్శంఖులునితో పలికి, మిన్నకుండెను.


నిశ్శంఖులుడును, వీరవ్రతుని మాటలను విని, భయపడెను. "జ్ఞానీ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి, విముక్తి యెట్లు కల్గును? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని", వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని, దయాళువైన వీరవ్రతుడు, "మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము, ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు, తీర్థ యాత్రలను, పన్నెండు సంవత్సరముల పాటు, చేయుము. ప్రతి యింటను బిచ్చమెత్తుకొని, ఆ బిక్షాన్నమును, తినుచుండుము. ప్రతి మాఘమాసమున, ప్రయాగ క్షేత్రమున, ప్రాతఃకాల స్నానము చేసి, మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే, ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును, చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను, మాఘమాసమున, ప్రయాగలో స్నానము చేసినచో, వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని, సంవత్సరము పాటు కాని, ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును, వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము" అని అనెను. నిశ్శంఖులుడును, అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు, ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును, వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే, వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును, వీరవ్రతునకు నమస్కరించి, పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత, నాకు ధర్మము నుపదేశింప గోరుదునని" యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని, పలికెను.


నిశ్శంఖులుడును, కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి, వీరవ్రతుడు చెప్పిన మాటలను, వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని, భయమును, పశ్చాత్తాపమును, పొందిరిl. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి, ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము, మాఘస్నానము చేసి,, పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు, వ్రతమును పాటించుచు, తీర్థయాత్రలు చేయుచు, కాశీ నగరము చేరి, కొంతకాలముండి, తరువాత, ప్రయాగకు పోయి, మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము, పాపనాశనము, ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును, వీరవ్రతుడు చెప్పినట్లు, పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై, వీరవ్రతుని వెదకుచు, నైమిశారణ్యమునకు బోయి, వీరవ్రతునకు నమస్కరించి, యిట్లు పలికెను.


వీరవ్రతుడు, తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. " ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే, దుష్టసాంగత్యజనిత దోషలుము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో, మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ, నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము, మూడు దినములు, చేయించెను. నిశ్శంఖులుడు, వీరవ్రతుడు చెప్పినట్లు, నిరాహారుడై యుండెను.


వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను." ఓయీ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము, సంధ్యా వందనము, మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి, తులసీ దళములతో, లక్ష్మీనారాయణులను, బిల్యదళములతో, శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును, సేవింపుము. నివేదాన్నమును భుజింపుము, యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకుము, మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము, అని, వీరవ్రతుడు, నిశ్శంఖలునకు, ధర్మప్రశస్తిని, ఆచరణ విధానమును చెప్పెనుl.నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది, మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి, వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును, ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను, పుత్ర పౌత్రులను పొంది, సుఖముగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*మాఘపురాణం - 26వ అధ్యాయము*

*సుధర్ముడు తండ్రిని చేరుట*

పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.

అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.

ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.

“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.

అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.

*మాఘ పురాణం - 27 వ అధ్యాయము...!!*

*సులక్షణ మహారాజు కథ :*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. 

జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. 

దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము.

 పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణు రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. 

బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. 

రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.

నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును, పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి, కృతఘ్నునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు.

 పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. 

అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను, అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. 

అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు.

 అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే యింతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి.

 అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారి ప్రార్థించెను. అప్పుడా మునులోక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి.

 దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. 

సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి యింటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికెదురు వెళ్ళిరి.

 ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. 

ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. 

సేవకులను, రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి, తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. 

రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను.

 చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. 

కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను.

 ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియక పడియుండెను.

 గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.

అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి 

ఏండా మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినవి. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి.

 బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి.

 ఒకనాడు పవిత్ర దినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. 

అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి యింటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు ఏవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు,

 వనమున, జలమున, గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను.

 బాలుని యింటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. 

ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.

అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. 

తులసీ స్పర్శవలన బాలునకావనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది ఏవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు.

వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచటికి వచ్చినవి, బాలుని నిస్సహాునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు.

ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై యిహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను....

నేటి మాఘ పురాణం 27,వ రోజు పారాయణం సమాప్తం...

సర్వేజనా సుఖినోభావంతు

*మాఘపురాణము 28వ అధ్యాయం*

విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ
పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నడా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే. భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.
*****
_*🚩మాఘ పురాణం - 29 వ అధ్యాయము🚩*_

🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️

*మృగశృంగుని కథ*

☘☘☘☘☘☘☘☘☘

వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయవలెనని తల్లిదండ్రుల అనుమతి నొంది  ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరి తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలేనను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. *"నాయనా ! నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును , నా ప్రేమను సాధించితివి. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను".* మృగశృంగుడును *"స్వామీ ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను , ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను".* శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.

కౌత్సుడు ఇంటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి , ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.

భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల , ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు , గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల , ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను , చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.

కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను , యముని దయవలన , సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి. జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన ఇనుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో , పాపముచేసిన వానిని పడవేయుదురు. తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.

వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి , ఇష్టదైవమును పూజించి , యధాశక్తి దానము , జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా ! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత ? చనిపొయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా యని ప్రశ్నించెను.

అప్పుడు వశిష్టమహర్షి నాయనా ! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును , సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము , కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా ఇట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.

యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి ఇతడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా ! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.

*☘️మృగశృంగుని వివాహములు☘️*

వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను , మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము , ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా ? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా ? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ , గంగ ఇద్దరు లేరా ? వారికి లేని అభ్యంతరము నీకెందులకు ? అని వాదించిరి. ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.

కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు *బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయు వివాహము బ్రహ్మవివాహము , యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు. ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు , ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగా చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను.* గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని గూడ వివరించెను.

దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి ఇష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను , మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను , సర్వలాభములను పొందెను , మనుమలను గూడ పొందెను.

ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక , అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు యీ విధముగా తలపోసెను. *"కాశీ మహా పుణ్యక్షేత్రము , సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక , మనస్సునందలి కోరికలు నెరవేరెను , అనేకమంది కాశీ విశ్వనాధుని దర్శనము చేసికొని , వారి అభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని , కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.

కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి , ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని , విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను. ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు , తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి , ఒక లింగమును ప్రతిష్టించి , దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా ! అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా ! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి , ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. *"మహామునీ ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు"* డని పలికెను. అంత మృకండుడు నమస్కరించి *"తండ్రి ! మహాదేవా ! తల్లి అనంపూర్ణా ! ఇవే మా నమస్కృతులు , లోకరక్షకా ! మీదయవలన నాకు సులక్షణవతి , సౌందర్యవతి , సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా ! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను"* అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు *"మునిసత్తమా ! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా ? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా ?"*
అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడబడి *"హే శశిధరా ! నన్ను పరీక్షింప నెంచితివా ? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని"* అడిగెను. *"అటులనే అగునుగాక !"* అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా ! పరమపూజ్యుడును , ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి , వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.
***

*మాఘ పురాణం - 30*

*30వ అధ్యాయము -* *మార్కండేయుని వృత్తాంతము*

వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.

అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.

మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.

క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.

సమాప్తం.

*****

మాఘమాస ఫలశ్రుతి

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునీ! ధర్మప్రభోధకములగు మాసములలో మాఘమాసముత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకామ్యకర్మలనన్నిటిని చేయుటవలన వచ్చునంతటి పుణ్యము. మాఘమాస వ్రతము నొకదానిని చేసినంతనే వచ్చును. మాఘమాసవ్రతము సర్వపుణ్యక్రియ సారము. శివకేశవులిద్దరికిని ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను గూడ కలిగించును. సర్వసుఖముల నిచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచినదానిని, విన్నదానిని, తెలిసినదానిని నీకు అడుగగనే చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను, మాధవ ప్రీతికరమైన మాఘ్మాసవ్రతమును విడువక ఆచరించినచో సర్వ ధర్మములనాచరించుటవలన వచ్చుఫలితమునందును. ఈ పురాణమును శ్రీహరిసన్నిధిలో చెప్పువాడును, భక్తితో వినివారును యిహపరములయందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరిసాన్నిధ్యమును చేరును. సూతుడు శౌనకాది మహామునులతో నిట్లనెను. మాఘమాసవ్రతము సర్వ పుణ్యముల నిచ్చును. సర్వైశ్వర్యముల నిచ్చును. అన్ని రొగములను పొగొట్టి ఆయుర్దాయమును పెంచును. విష్ణు సాన్నిధ్యమును కలిగించును. ముక్తిని కొరినవారికి ముక్తినిచ్చును, కోరిన కోరికలనిచ్చును. వినయవిధేయతలు కల శిష్యునకును, శ్రద్దకల వానికిని, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి యీ వ్రతమును  చేయుడని చెప్పవలెను.

శౌనకాది మహామునులకు రోమమహర్షి పుత్రుడు నైమిశారణ్యమున మాఘమాసవ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పినవానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీపమహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, మరికొన్ని గృత్నృమదుడను మహర్షి జహ్నుమునికి చెప్పినవి. మొత్తం మీద  యీ కథలనిటిని కలిసి సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలనెరిగినవాడగుటచే ఆయా సందర్భములో ఆయావ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పెనని గ్రహింపవలెను.



No comments:

Post a Comment