Saturday, 12 September 2020

 *నారద చరిత్ర*

><~><~><~><~><


➡️ ఒక రోజు నారదుడు వ్యాసునితో 'వ్యాసా! నేను ఈవేళ ఎందుకు నారదుడుగా ఉన్నానో నీకు చెపుతాను. నా చరిత్ర వింటే నీవు తెల్లబోతావు' అని నారదుడు తాను నారదుడెలా అయ్యాడో చెపుతాడు.


➡️ నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనంనుంచీ బాగా ఐశ్వర్యవంతులయ్న బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితికి పెత్తడం మొదలగు పనులు చేసేది. తల్లి ఎక్కడికి వెడితే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ పిల్లవాడు బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు. వారు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ కొంతమంది సన్యాసులు చాతుర్మాస్యమునకని వచ్చారు. వస్తే అమ్మతోపాటు ఈ పిల్లవాడు కూడ అక్కడ ఉన్నాడు. రోజూ 'నీవు ఉదయముననే స్నానం చేసేసి, వాళ్ళకి పీటలు వెయ్యడం, దర్భాసనములు వెయ్యడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం, ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసినది' అని యజమాని ఈ పిల్లవానికి చెప్పాడు.


➡️ దాసీ పుత్రుడైన నారదుడు రోజూ స్నానంచేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు. వాళ్ళు సన్యాసులు. సన్యాసులు అంటే లోకం అంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. వాళ్ళు ఆ పిల్లవాని దాసీపుత్రునిగా చూడలేదు. అయిదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవచూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టమును నారదునికి ఇచ్చేవారు. వాళ్ళు మహాభాగవతులు. వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవతమ్ శేషమును తినేవాడు. ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం, భగవంతుడిని అర్చన చేసుకోవడం, వేదవేదాంగములు చదువుకోవడం, వాటిని గూర్చి చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవాడు. ఆఖరుకి చాతుర్మాస్యమ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడయిన నారదుని పిలిచి -ఆ పిల్లవానికి ఏమీ తెలియకపోయినా, ఏ తాపత్రయం లేకుండా మనస్సులో వాళ్ళమీద ఉన్న అపారమయిన భక్తిచేత అతడు వారిని సేవించగా - వారందరు కూడ కారుణ్యము అని చెప్పడానికి కూడ వీలు లేదు - మిక్కిలి వాత్సల్య చిత్తముతో నారదుని వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని వానికి కృష్ణ పరమాత్మమీద ద్వాదశాక్షరీ మహామంత్రమును ఉపదేశంచేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవానిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో, సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇంతకాలం అటువంటి వారిని సేవించి, సేవించి ఉండడంఅలన నారదునికి సత్పురుష సాంగత్యం కలిగింది.


 *సత్సంగత్వే నిస్స్ంగత్వం - నిస్సంగత్వే నిర్మోహత్వం!*

*నిర్మోహత్వే నిశ్చలతత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!!* 


➡️ అటువంటి సత్పురుషులతో తిరగడం వలన హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది. వెంటనే ఈయనకు మనసులోకి అందేసింది. చాతుర్మాస్యం అయిపోయింది. ఆ సన్యాసులు వెళ్ళిపోయారు. తాను లోపల ఆ శ్రీమన్నారాయణుని తలుచుకొని పొంగిపోతూ రోజూ అమ్మతో వెళ్ళేవాడు. ఒకరోజు చీకటిపడిపోయిన తరువాత గృహయజమానులయిన బ్రాహ్మణులు ఆమెను పిలిచి 'పెరట్లోకి వెళ్ళి ఆవులపాలు పితికి పట్టుకునిరా' అని చెప్పారు తల్లిని. ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకుంది ఆవిడ చూడకుండా పొరపాటున దానిమీద కాలువేసింది. త్రాచుపాము ఆవిడని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. అప్పుడు పిల్లవాడు అనుకున్నాడు' అమ్మయ్య, నాకు ఉన్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నది ఒకర్తి ఉండడం వలన నేను ఈ ఇంట్లో అమ్మతోపాటు తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను స్వేచ్ఛావిహారిని. అంతా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతాను' అని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి చివరకు ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్దపులులు తిరిగుతున్నాయి. క్రూరసర్పములు తిరిగుతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు 'నాకు ఏమిటిభయం! ఈలోకం అంతటానిండి నిబిడీకృతమయి శాసించే కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ నా స్వామి ఉండగా నాకు ఏ ఆపద జరగదు' అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి విపరీతమయిన దాహం వేసింది. అక్కడ ఒక మడుగు కనబడింది. అక్కడ నీళ్ళు తాగి స్నానంచేసి 'ఇక్కడ నాస్వామి ఒకసారి నాకు సాకారంగా కనపడితే బాగుండును' అని ఒక రావిచెట్టు క్రిందకూర్చుని ద్వాదశాక్షరీ మంత్రమును తదేకంగా ధ్యానం చేస్తున్నాడు.


➡️ అలా ధ్యానం చేస్తుంటే లీలామాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని దర్శనం అయిందొ. పొంగిపోయి పైనుంచి క్రిందకి మెరుపును చూసినట్లు చూశాడు. అంతే! స్వామి అంతర్ధానం అయిపోయారు. అపుడు అశరీరవాణి వినపడింది. 'ఈజన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టంచేత, వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణంచేత, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపమును అలా బాగా చూడాలి అని కోరుకుంటూ, నువ్వు నా గురించే చెప్పుకుంటూ, నా గురించే పాడుకుంటూ, నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మాన్ని అనుసరించి ఒకరోజున ఈ శరీరమును వదిలేస్తావు. అలా అదిలేసిన తరువాత నిన్ను గుప్తంగా ఉంచుతాను. ఒకనాడు నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు 'మహతి' అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకములయందు విహరిస్తావు. నీకీ కానుకను ఇస్తున్నాను' అన్నాడు శ్రీమన్నారాయణుడు.


➡️ 'ఆనాడు శ్రీమన్నారాయణున్ని దర్శనం చేస్తూ దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని, చెప్పుకుని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళిపోయాను. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తరువాత నారాయణుని నాభికమలంలోంచి మరల చతుర్భుజ బ్రహ్మగారు సృష్టింపబడ్డారు. మొట్టమొదట ప్రజాపతులను సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించారు. నాకు 'మహతి' అను వీణను ఇచ్చారు. ఆ వీణ సర్వకాలములయందు భగవంతునికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములనంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నేను వైకుంఠమునకు వెళతాను. సత్యలోకమునకు వెళతాను. కైలాసమునకు వెళతాను. ఏ ఊరుపడితే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను. భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను. అదితప్ప మరొకటి నాకు రాలేదు.


➡️ వ్యాసా, నేను ఇవ్వాళ్టికి ఇంతటి వాడిని ఎందువల్ల అవగలిగాను? ఒకనాడు దాసీపుత్రుడనయిన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించిన జ్ఞానము ఇవ్వాళ నన్నీస్థితికి తెచ్చింది. రెండవజన్మలో నారదుడను అయిపోయాను. నీవు భాగవతమును, భగవత్కథను చెప్పగలిగితే విన్నవాడు ఉత్తరజన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు? ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని నీవు భగవద్భక్తి గురించి చెప్పవలసింది. దుర్యోధన ధృతరాష్ట్రులగురించి ఎందుకు చెపుతావు? చెప్పకపోయినా ప్రజలకందరకు వారిని గురించి తెలుసు. అందుకని భక్తి గురించి చెప్పు. భక్తికి ఆలవాలమయిన భాగవతమును రచించు' అన్నారు.


➡️ అనగా ఆనాడు మహానుభావుడు వ్యాసభగవానుడు నారదుని మాటలు విని పొంగిపోయి 'నారదా ఎంతగొప్పమాట చెప్పావయ్యా!ఇప్పుడు నేను భగవంతుని గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తిగురించి, ఆయనను నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నీవు తరించిపోయినట్లు తరించిపోతారు. అటువంటి భాగవతమును రచన చేయడం ప్రారంభిస్తున్నాను' అని ఆచమనం చేసి కూర్చుని వ్యాసభగవానుడు తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభం చేశారు.


🙏 🙏


*విశ్వేదేవతలు*

ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః|| *దక్షస్యదుహితాసాధ్వీ* *విశ్వానామ ప్రకీర్తితా !*

*తస్యాః పుత్రా మహావీర్యాః విశ్వేదేవాస్త్రయోదశ!!||*


దక్షుని బిడ్డ విశ్వ అనునామె కొడుకులు విశ్వేదేవతలు ..

వీరు పదముగ్గురు 

వీరందరు శ్రాద్దాదులు అందుకుంటారు ..


1... ఇష్టికా శ్రాద్ధమున 

*దక్ష . క్రతు*

2 .... నాందీ శ్రాద్ధమున

*సత్య . వసు*

3 .... సపిండీకరణ శ్రాద్ధమున

*కాల . కాముక*

4 .... ప్రత్యాబ్దిక శ్రాద్ధమున

*పురూరవ . ఆర్ద్రవ*

5 ..... హిరణ్య శ్రాద్దమున 

*ధను . రుచి*

6 .... తీర్ధ శ్రాద్దమున 

*ధూరి . విలోచన*

7 .... ఏకోద్దిష్ట శ్రాద్దమున 

*రుద్రుడు*


*వసుసత్యౌ క్రతుదక్షౌ కాలకామౌ ధృతి: కురు:|*

*పురూరవా మాద్రవాశ్చ విశ్వేదేవా ప్రకీర్తితా:||*


అని భరతవచనం

వసువు, సత్యము, క్రతువు, దక్షుడు, కాలుడు, కాముడు, ధృతి, కురువు, పురూరవులు, మాద్రవులు అనుపదిమందికి విశ్వేదేవతలని పేరు. వీరికి తోడు లోచీమని లేక రోచనుడు మరియు ధూర్వి అని మరి ఇద్దరు కూడ విశ్వే దేవతలుగా కీర్తింపబడుతున్నారు. దక్షుని కుమార్తె అగు విశ్వా అను నామె సంతానము కనుక వీరికి విశ్వే దేవతలు అని పేరు వచ్చినది.

వీరిలో - కాలుడు - ప్రేతకార్యమందు; కాముకుడు - ప్రేతకార్యపూజయందు; పురూరవ - ప్రత్యాబ్దికములందు; ఆర్ద్రవ లేక మాద్రవ - ప్రత్యాబ్దికములందు; ధూర్వి - మహాలయ శ్రాద్ధమునందు; లోచీమని - మహాలయ శ్రాద్ధమందు; సత్యుడు - నాందీశ్రాద్ధమందు; వసుడు - నాందీ శ్రాద్ధపూజలోను; క్రతుడు - యజ్ఞమునందు; దక్షుడు - యజ్ఞపూజలోను అర్చింపబడుతున్నారు.

వీరుకాక మరి ౩౩ మంది కూడా విశ్వే దెవతలని పిలువ బడుతున్నారు. వీరు సమస్త విశ్వానికి ప్రధాన దేవతలు కనుక వీరిని విశ్వేదేవతలని వ్యవహరిస్తున్నారు.

౧. వరుణుడు ౨. ఋషభుడు ౩. నహుషుడు ౪. ప్రత్యూషుడు ౫. జయుడు ౬. అనిలుడు ౭. విష్ణుడు ౮. ప్రభాసుడు ౯. అజైకపాత్ ౧౦. అహిర్బుధ్న్యుడు ౧౧. విరూపాక్షుడు ౧౨. సురేశ్వరుడు ౧౩. జయంతరుద్రుడు ౧౪. బహురూపరుద్రుడు ౧౫. త్ర్యంబకుడు ౧౬. అపరాజితుడు ౧౭. వైవస్వతరుద్రుడు ౧౮. అర్యముడు ౧౯. మిత్రుడు ౨౦. ఖగుడు ౨౧. అర్కుడు ౨౨. భగుడు ౨౩. ఇంద్రుడు ౨౪.భాస్కరుడు ౨౫. పూషుడు ౨౬. పర్జన్యుడు ౨౭. తృష్ణ ౨౮. విష్ణువు ౨౯. అజుడు ౩౦. ఆదిత్యుడు ౩౧. ప్రజాపతి ౩౨. పావిత్రుడు ౩౩. హరుడు అను వారు.

వీరే కాక మరి పది విధములైన విశ్వేదేవతలు ఉన్నారు. వారు:

యక్షులు, రాక్షసులు, పిశాచములు, గంధర్వులు, అప్సరసలు, అసురులు, నాగులు, సర్పములు, సుపర్ణులు, పితరులు అని.

వీరిలో పితృకార్యములందు విశేషించి ప్రత్యాబ్దికములందు పూజింపబడు వారు పురూరవ్ - ఆర్ద్రవులనబడే వారు మాత్రమే.

--(())--

తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?

డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ  ❓ ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.

ఎందుకు ❓

ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ❓

మన తెలుగులో మాటలు లేవా ❓
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి ❗
కానీ మనం పలకం.

వంటింటిని......కిచెన్ చేసాం.
వసారా.....వరండాగా మారింది.
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు.
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు.
భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.
అందులో వడ్డించే వన్నీ.......
రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.
అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం.
బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ❓ అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది.

టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు,
వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి.
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.

టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది.
అది ఏ భాషో మీరే చెప్పండి.
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది.
మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి❓

నిన్న మా పక్కింటాయన వచ్చి
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు.
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ❓ ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ❓
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం.
సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు.
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ❓ ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ❓ తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ❓ ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం,
ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అం
దరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.

No comments:

Post a Comment