*నిర్మలమైన మనస్సు
ప్రతీ ఒక్కరూ నిర్మలమైన మనస్సు కై కృషి చేస్తుంటాం. అంటే అన్నీ మంచి పనులే చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరకీ హాని చేయకూడదు లాంటివి. కానీ ఒక్కసారి ఆలోచించిన ఆ ప్రయత్నంలో మనం ఎంతవరకూ సఫలమయ్యాం? ఎంత మంది సఫలీకృతులమయ్యాం? అంటే మాత్రం ఆ లెక్కకి మన చేతి వేళ్ళు సరిపోతాయేమో. కాదంటారా?
మనస్సనేది ఓ అద్భుతం. నిజానికి, అది నిజంగా మన నియంత్రణలోనే ఉందా? మన మనస్సును మనం నియంత్రిస్తున్నామా లేదా మన మనస్సే మనల్ని నియంత్రిస్తుందా? నిజంగా ఆలోచించవల్సిన విషయమే. ఏంటి లోపం? ఎక్కడుంది లోపం?
మన బుద్ధి , మనశ్శక్తి మొండివి, మార్చలేనివి అంటే అద్భుతం కాదు కానీ, ఆధ్యాత్మిక బోధనలు వాటి మధ్య ఉంటూ మనం చేసే పనులు, అవి మంచివా, చెడ్డవా, చెయ్యొచ్చా, చెయ్యకూడదా అనే అలోచనల్లో సహాయం చేస్తూ, కొన్ని సమయాల్లో మన మనస్సును నియంత్రించడంలో తోడ్పడుతూ, ఏదో ఓ విశ్వాసం మనల్ని , మన మనశ్శక్తిని ముందుకు నడిపిస్తున్నాయేమో, అదే ఆధ్యాత్మికతేమో అంటే మాత్రం అదో అద్భుతమే. మన విశ్వాసాలు కొన్నిసార్లు మారవచ్చు. వాటిని కాపాడుకోవాలి, వాటిని ఎప్పుడూ ఆదరించాలి, వాటితోనే జీవనం సాగించడమంటే కష్టమేమో గానీ ఎప్పటికీ ఆధ్యాత్మికతంగా ఉంటే మనలోని దుష్ట శక్తులకు, చెడ్డ పనులు చేయలన్న ఆలోచనలకు ఈ ఆధ్యాత్మికతా ధోరణి అడ్డుపడుతూండడం వల్ల మనలోని దైవత్వాన్ని పంపొందించుకోగలమేమో, మన మనస్సు మన నియంత్రణలోనే ఉంటుందేమో. ఏదేమైనా మన ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అలా ఆధ్యాత్మికత భావనలను పెంపొందించుకోవడం అంత సులభమంటారా?
ఒక్కసారి గతాన్ని చూచిన, మనకి ఎందరో గొప్ప గొప్ప మహానుభావులున్నారు. గౌతమ బుధ్ధుడు, స్వామి వివేకానందుడు, వాళ్ళకి అంత ఆధ్యాత్మిక ధోరణి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా నాకు తట్టదు. బహుశా వాళ్ళు అన్ని విలాసాలను, సౌకర్యాలను త్యజించి, త్యాగం చేసి, ఒక్క దైవం మీదే మనస్సు లగ్నం చేయడం వల్లా, లేదా ఆ దేవునిపై వారికున్న విశ్వాసమా? లేదా రెండూనా!! అయితే అలా అన్నింటినీ మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదేమో కానీ మనలోని ఉన్న దుష్ట శక్తులను, చెడ్డ ఆలోచనలను త్యాగం చేసి, త్యజించి, దైవత్వం మీద మనస్సు లగ్నం చేసిన నిర్మలమైన మనస్సును సాధించవచ్చేమో!
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషము సంభవించి వైభవము కోల్పోయాడు .అప్పుడు అతడు నిషాద పర్వతము మీద అజ్ఞాతవాసము చేయుచుండెను.దేవతలు,మునులును స్వర్గము నకు
రాజు లేక అరాచకమై పోయి ఆపదలు వచ్చునని భయపడి అనేక యజ్ఞములు చేసి మహా మహిమాన్వితుడైన నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రపదవి స్వీకరించమని కోరిరి.అతడు నాకు యోగ్యత వున్నదా?
అని సందేహించగా,యముడు,వరుణుడు మొదలగు వారు తమ శక్తి ,దర్పము లలో కొంత భాగము అతనికి యిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గమునకు అధిపతిని చేసినారు.భూలోకములో నున్నంత కాలము
మహాత్ముడు,శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధి పత్యము రాగానే మారి పోయాడు.
ఇంక నాకేమి తక్కువ అని గర్వముతో తన యిష్టమొచ్చి నటుల ప్రవర్తించ సాగాడు. .
పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు అప్సరసలతో కాలము గడపు తూ కొలువుకు
రాకుండా నిర్లక్ష్యముగా ప్రవర్తించసాగాడు. సాగాడు. అంతే కాకుండా మంచి చెడ్డలు మరిచి త్రిలోక సుందరి యగు శచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను.
ఆమె దేవగురువగు బృహస్పతిని శరణు కోరింది.దేవతలందరూ కలిసి ఆమెకు
ఒక ఉపాయము చెప్పిరి.ఆమె నహుషుని దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి నాకు ఒక వ్రతము వుంది,
నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకొని వస్తే నేను నీదాన్నవుతాను అని చెప్పింది.
వెంటనే నహుషుడు సప్తరుషులను పిలిచి మీరు బోయీలై నన్ను పట్టణమంతయు తిప్పవలయును అని ఆజ్ఞాపించెను.అది విని మునులందరూ తెల్లబోయారు.
కానీ చేయునది లేక ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు.నహుషుడు గర్వముతో వారిని యిష్ట మొచ్చినట్లు మాటాడుతూ అదిలిస్తూ మెల్లగా నడిస్తే ఊపిరి లేని
వాళ్ళలాగా అదేమీ నడక యని, వేగముగా నడిస్తే, అంత వేగముగా పోతున్నారెందుకు అని 'సర్ప'సర్ప' అంటే నిదానము,నిదానము అనేవాడు.
.మధ్యాహ్న కాలమైనందున
మునులు పల్లకి దింపి వేదమంత్రములు చెప్పసాగారు.నహషుడు ఆ మంత్రములు చాలించి పల్లకి మోయండి అని గద్దించెను.వేదమత్రములను గురించి యెగతాళి చేసెను.దానితో అగస్త్యునకు కోపము వచ్చి యింత అహంకారము నీకు తగదు,'సర్ప'సర్ప' అని మమ్మల్ని అదిలించినావు కనుక .భూలోకములో పామువై పడి వుండు అని శాప మిస్తాడు.
అప్పుడు నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి అగస్త్యుని కాళ్ళపై బడి క్షమాపణ వేడి శాపవిమోచనం
ప్రసాదించమని వేడుకుంటాడు.అగస్త్యుడు శాంతించి సర్పముగా ఉంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ వుండు. నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు
సరియైన సమాధానము ఎవరు చెప్తారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు.నహుషుడు వేసిన ప్రశ్నలే 'యక్షప్రశ్నలు' గా ప్రసిద్ధికెక్కాయి.
పాండవులలో నలుగురు యీతని ప్రశ్నలకు సమాధానము చెప్పలేక చనిపోతారు.చివరకు ధర్మరాజు వచ్చి యీతని ప్రశ్నలకు సరియైన సమాధానము యిస్తాడు.అప్పుడు నీకేమి వరము కావలెనో అడుగు అని అడుగుతాడు.అప్పుడు నా నలుగురి తమ్ముళ్ళను బ్రతికించ మని అడుగుతాడు.
అప్పుడు
నహుషుడు వీరిలో ఎవరినైనా ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించ మంటావో చెప్పు అని అడుగు తాడు.అప్పుడు ధర్మరాజు సహదేవుడిని బ్రతికించ మంటాడు.నహుషుడు ఆశ్చర్యపోయి నీవు బలవంతు లైన నీ సొంత సోదరులను కోరకుండా సవతి తమ్ముడైన సహదేవుడిని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు కుంతీ పుత్రులలో జ్యేష్టుడిని నేను బ్రతికి వున్నాను మా పినతల్లి మాద్రి పుత్రులలో కనిష్టుడైన సహదేవుడు బ్రతికి ఉండుట న్యాయము కదా!అందుకనే సహదేవుడిని కోరుకున్నాను అంటాడు.అతని న్యాయ,ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురినీ బ్రతికించి తన స్వస్వరూపముతో వెళ్ళిపోతాడు నహుషుడు.ఆ ప్రశ్నలే లోకములో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి.
అధికార గర్వముతో పెద్దలను ధిక్కరించి నిందించరాదు అని ఈకథ నీతి.
స్వర్గ పరి భ్రష్టుండై
దుర్గతికిం బోయెనతడు,దుష్టాత్ములకున్
దౌర్గత్యము సుజనులకు న
నర్గళ సద్గతియు నగుట యరుదే యెందున్
'శంకరకృప' పత్రిక సౌజన్యముతో.
***
🌹🙏చెప్పు నేస్తమా ఎక్కడుందో రహస్యం?...🙏🌹
చిన్నప్పుడు ఏ పండక్కో..పబ్బానికో కొత్త బట్టలు కుట్టిస్తే.. ఎంత ఆనందమో...
ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడువేసేసుకుందామా అన్న ఆతృతే...
ఇంటికి చుట్టాలొచ్చి వెళ్తో వెళ్తూ..చేతిలో రూపాయో.. అర్ధరూపాయో పెడితే ఎంత వెర్రి ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే దుఃఖం తన్నుకు వచ్చేది... ఇంకా ఉంటే బాగుండు అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...
సినిమా వచ్చిన ఏ పదిహేను రోజులకో ఎంతో ప్లాన్ చేసి ఇంట్లో ఒప్పించి అందరం కలిసి
నడిచి వెళ్లి.. బెంచీ టికెట్ కొనుక్కుని సినిమా చూస్తే ఎంత ఆనందమో...
ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ ఆ సినిమా కబుర్లే... మర్నాడు స్కూల్ లో కూడా...
ఆ ఆనందం ఇంకో పది రోజులుండేది... అసలు రేడియో విచిత్రం.. అందులోకి మనుషులు వెళ్లి మాట్లాడతారా అన్న ఆశ్చర్యం...అమాయకత్వం..
పక్కింట్లో వాళ్లకి రేడియో ఉంటే..ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త శబ్ద చిత్రం (ఒక గంట కి కుదించిన) సినిమాని వింటే ఎంత ఆనందం... మనింట్లో కూడా రేడియో ఉంటే...అన్న ఆశ...
కాలక్షేపానికి లోటే లేదు... స్నేహితులు కబుర్లు, కధలు చందమామలు బాలమిత్రలు...
సెలవుల్లో మైలు దూరం నడిచి లైబ్రరీ కి వెళ్లి గంటలు గంటలు కథల పుస్తకాలు చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....సర్కస్ లు, తోలు బొమ్మలాటలు లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు... చింత పిక్కలు వైకుంఠ పాళీ పచ్చీసు.. తొక్కుడు బిళ్ళలు.. ఎన్ని ఆటలో...
మూడు గదుల రైలుపెట్టి లాంటి ఇంట్లో అంతమంది ఎంత సంతోషంగా ఉన్నాం... వరుసగా కింద చాపేసుకుని పడుకున్నా ఎంత హాయిగా సర్వం మరిచి నిద్రపోయాం...
అన్నంలో కందిపొడి.. ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటే ఏమి రుచి... కూర అవసరమే లేదు..
రెండు రూపాయలు తీసుకెళ్లి నాలుగు కిలోల బియ్యం తెచ్చేది...ఇంట్లో, చిన్నా చితకా షాపింగ్ అంతా నేనే... అన్నీ కొన్నాకా షాప్ అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం ముక్కో పెడితే ఎంత సంతోషం... ఎంత బరువైనా మోసేసేవాని..
ఎగురుతున్న విమానం కింద నుండి కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టి చూస్తే ఆనందం...
తీర్థం (జాతర) లో ముప్పావలా పెట్టి కొన్న ముత్యాల దండ చూసుకుని మురిసి ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే ఆనందం...వాసనచూసి మురిపెం.. కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...రిక్షా ఎక్కితే... రెండు పైసల ఇసుఫ్రూట్ తింటే ఎంత ఆనందం..?
రిక్షా ఎక్కినంత తేలికగా... ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం... మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ లో సినిమా చూస్తున్నాం. ఇంటర్వెల్ లో ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి పోయేటన్ని బట్టలు... చేతినిండా డబ్బు.. . మెడలో ఆరు తులాలనగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు... ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు... సౌండ్ సిస్టమ్స్, చేతిలో ఫోన్లు... అరచేతిలో స్వర్గాలు... అనుకోవాలే గానీ క్షణంలో మన ముందు ఉండే తిను బండారాలు..
సౌకర్యాలు...
అయినా చిన్నప్పుడు పొందిన ఆ ఆనందం పొందలేకపోతున్నాం ఎందుకు నేస్తం...?
ఎందుకు...? ఎందుకు...?
చిన్నప్పుడు కోరుకున్నవి అన్నీ ఇప్పుడు పొందాము కదా...
మరి ఆనందం లేదేం... ఎందుకంత మృగ్యం అయిపోయింది... ఎండమావి అయిపోయింది..
మార్పు ఎందులో...? మనలోనా...? మనసుల్లోనా...? కాలంలోనా...? పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...? ఎందులో నేస్తం...? చెప్పవా తెలిస్తే....!!🙏🌹
*అద్భుతం*
ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు...
చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు...మూడుసార్లు లెక్కపెట్టాడు.
తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..
ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా
తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..
షాప్ లో ఆవిడ తనవేపు చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...
షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది.. ఏమి కావాలి బాబు అని..బాబు చెప్పాడు..
నాకు ఒక అద్భుతం కావాలి అని..
షాప్ ఆవిడ అర్ధం కానట్టూ ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది..
నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని..చెల్లి చాలా కష్టపడుతోంది..అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది..అని అడిగాడు బాబు...
ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..
ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబు అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది..బాబు మాటలకి విషయం అర్ధం అయ్యి ఆవిడకి బాధేస్తోంది....
నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు..అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను..అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు...
ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న
పొడుగ్గా ఉన్న , మంచిగా తయారయ్యి ఉన్న , హుందాగా ఉన్న ఒకాయన బాబుని అడిగారు...
ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా అని ...
బాబు చెప్తున్నాడు..చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతోందంటా..
అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది.
అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను...సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను..
అని చెప్తుంటే బాబుకి తెలీకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి....
ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు నీ దగ్గర ఎంత డబ్బు ఉందీ అని..బాబు చెప్పాడు 83 రూపాయలు...అని...అదీ వినపడి వినపడనట్టు..
ఓ అవునా ...తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే..ఏదీ పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం.. అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం..
ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ కి డైరెక్టర్...ఆయన ఒక్కరే చిన్నిపాప సమస్యకు వైద్యం చెయ్యగలరు...
ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేకుండానే ఆపరేషన్ జరిగింది...తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది...తల్లి అంటోంది...
ఎంత అద్భుతం జరిగిందీ అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కరలేకుండానే అని తండ్రితో అంటోంది...
అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు.
..ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని...
కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం...
కల్మషం లేని ప్రేమ, స్వార్ధం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి..దేవుడిని నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది..
అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో...
మనిషికి మనిషి సాయం చెయ్యాలి, అని అనుకోవాలి, అంతే.....................
******
వంశం.. కధ
పూర్వం చంద్ర వంశం లో గాధి అనే క్షత్రియుడు ఉండేవాడు. ఈ దంపతులకు మగ సంతానం కలగాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఇతనికి సత్యవతి అనే కూతురు మాత్రమే జన్మించింది. ఈమెను ఋచీకుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు గాధి. గాధి కి మగ సంతానం కలగాలనే ఆకాంక్ష తో తన అల్లుడు బ్రాహ్మణుడు అయిన కారణంగా ఆయనతో యజ్ఞాలు జరిపించాలని పూనుకొని ఋచీకుడి తో విషయం చెప్పాడు. ఋచీకుడు తన మామ చెప్పిన మాటలు విని తన భార్య అయిన సత్యవతి కోసం బ్రాహ్మణ మంత్రాలతో, తన మామ అయిన గాధి కోసం క్షత్రియ మంత్రాలతో యజ్ఞాలను విడివిడి గా నిర్వహించి, యజ్ఞ ఫలాలను తయారు చేశాడు.
ఋచీకుడు యజ్ఞాలు పూర్తి చేసి చరువులను (యజ్ఞ ఫలాలను) తన భార్య సత్యవతికి బ్రాహ్మణ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, తన అత్త అయిన గాధి భార్య కు క్షత్రియ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, విడివిడిగా ఇచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు. గాధి భార్య కొంత దుర్బుద్ధి తో ఆలోచించి ఇలా అనుకుంది "ఋచీకుడు తన భార్య కు మంచి లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం జరిపించి మంచి ఫలాన్ని తన భార్యకు, మామూలు లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం గావించి ఆ ఫలాన్ని నాకు ఇచ్చి ఉంటాడు. ఎలాగైనా ఈ యజ్ఞ ఫలాలను తారు మారు చేయాలి" అనుకుంది. తన కూతురు అయిన సత్యవతిని ఒప్పిస్తుంది. సత్యవతి కూడా విషయం తెలియక ఒప్పుకుని తన ఫలాన్ని తన తల్లి కి మరియు తన తల్లి ఫలాన్ని తానూ తారు మారు చేసుకుని సేవిస్తారు.
స్నానం చేసుకుని తిరిగివచ్చిన ఋచీకుడు జరిగిన విషయం తెలుసుకొని తన భార్య కు ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. ఇలా జరిగినందుకు నీకు (అంటే ఋచీకుడు మరియు సత్యవతీ దంపతులకు) క్షత్రియ లక్షణాలు కలిగిన బాలుడు, మీ అమ్మ ( గాధి దంపతులకు) కు బ్రాహణ లక్షణాలు కలిగిన బాలుడు జన్మిస్తాడు అని ఋచీకుడు తెలియజేస్తాడు. ఋచీకుడు, సత్యవతి కోరిక మేరకు జరిగిన తప్పు ను మన్నించి పుట్టబోయే సంతానం లో కొంత మార్పు చేస్తాడు. తమకు (సత్యవతి, ఋచీకుల దంపతులకు) కొడుకు గా కాకుండా మనుమడు గా క్షత్రియ లక్షణాలు గల బాలుడు జన్మిస్తాడు అని చెబుతాడు. తద్వారా గాధి దంపతులకు జన్మించిన బాలుడు విశ్వామిత్రుడుగా, సత్యవతి - ఋచీకుల దంపతులకు జన్మించిన బాలుడు జమదగ్ని మహర్షి గా ఎదుగుతారు. ఈ జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు.
ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే... ఈ మధ్య కాలం లో కులాల పేరుతో చాలా గొడవలు, హత్యలు జరుగుతున్నాయి కానీ వారికి కులం అనేది పుట్టుకతో వచ్చింది కాదు వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అనే విషయం తెలియదు. ఇటువంటి కథలు చదివినపుడు మాత్రమే అసలైన విషయం తెలుసుకుంటారు
పూర్వం సూర్య వంశం లో శ్రాద్ధ దేవుడు - శ్రద్ధ అనే దంపతులకు దృష్టుడు, దిష్టుడు అనే కుమారులు ఉన్నారు. వీరిలో దృష్టుడు పేరుతో దార్జ వంశం అవతరించింది. ఈ దృష్టుడు పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి బ్రాహ్మణుడి గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దిష్టుడు కూడా పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి వైష్యుడి గా పేరు గాంచాడు.
ముగింపు: విశ్వామిత్రుడు, పరశురాముడు, ధృష్టుడు,దిష్టిడు మొదలైన వారి కులాలు పుట్టుకతో నిర్ణయించబడలేదు. వారి వృత్తి ధర్మాన్ని బట్టి వారి కుల నిర్ణయం జరిగింది. అంటే ఉదాహరణకు బ్రాహ్మణ కులం లో జన్మించిన వ్యక్తి వ్యాపారాలు చేసినట్లైతే వైశ్యుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేస్తే క్షత్రియుడు గా, సేవా కార్యక్రమాలు చేస్తే శూద్రుడు గా పరిగణించవచ్చు. అలాగే శూద్రులు కూడా వేదాలు పఠించడం, పాఠాలు చెప్పడం వంటివి చేసినపుడు బ్రాహ్మణుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేసినపుడు క్షత్రియుడు గా, వ్యాపారాలు చేసినపుడు వైశ్యుడు గా పరిగణించాలి. ఇదే నియమం క్షత్రియులకు మరియు వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించినపుడు కులాల పేరుతో జరిగే గొడవలను మనం ఆపగలము.
గమనిక: పై రెండు కథలు పోతన భాగవతం లోని నవమ స్కంధం లోనివి.
అన్నదాతా సుఖీభవ.🙏
పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు.
వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.
'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.
అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.🙏
**
కష్టం అన్నా వో కష్టమే?
మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు.
ఓ రోజు ఒక వనం లో ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.
దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...
ఆ పాము కోతిని కాటు వేయబోయింది...
భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది...
గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టువున్న మిగతా కోతులన్నీ అక్కడకు వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి.
ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..
కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...
మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...
మనం దూరంగానే ఉండటం మంచిది అని అన్ని కోతులు వెళ్లిపోయాయి...
తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...
అలాగే భయంతో ఆ పాముని గట్టిగా పట్టుకుని కూర్చుంది.
అదే సమయంలో అటువైపుగా ఒక ముని వెళుతూ...
కోతి స్థితిని
అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.
' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది.
వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.
దాన్ని వదిలేయి" అన్నారు ఆ ముని...
ఆ ముని మాటలు విని కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు పైకి ఎక్కేసింది...
ఇందులోని నీతి ఏంటంటే...
నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...
కష్టాన్ని దూరంగా విసిరేసి కష్టానికి పరిష్కారం వెతకాలి.
అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఎవ్వరూ నిన్ను రక్షించడానికి ...
నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు అని గట్టిగా గుర్తు పెట్టుకోవాలి.
ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు...
నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు..
కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...
కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి...
అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ జీవితం సుఖమయం కాగలదు...
*****
*వినమ్రత కధ
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే గొప్పతనమని ప్రకృతి మనకు బోధిస్తోంది. ఆ లక్షణమే వినమ్రత.
మృదుమధురమైన ఫలసంపదను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో వంగి కనిపిస్తాయి. ప్రాణికోటికి జీవధారను అందించే మేఘాలు భూమాతకు దగ్గరగా ఉన్నట్లు వినయంగా కనిపిస్తూ వర్షధారలు కురిపిస్తున్నాయి. నీరు పల్లాన్ని ఆశ్రయిస్తూ సమస్త జీవులకు అందుబాటులో ఉంటోంది. ఇలా ప్రకృతి మొత్తం వినమ్రతతతో కనిపించి మానవాళికి సేవచేస్తోంది.లోకంలో సత్పురుషులు కూడా వినయవిధేయతలతో, వినమ్రతతో మహోన్నతమైన కార్యాలు పూర్తిచేశారు.
వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో శ్రీరాముని వ్యక్తిత్వాన్ని గురించి వాల్మీకి చెబుతూ 'శ్రీరాముడు చక్కని బుద్ధి కలవాడు, ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడు. తాను ఎంత బలవంతుడైనా ఏ మాత్రం బలగర్వంలేని వినయశీలి' అని ప్రస్తుతిస్తాడు.
వినమ్రత అంటే అందరిలోనూ భగవంతుని దర్శించే ప్రయత్నమే. వినయ విధేయతలున్నవారే భగవంతుడి కృపకు పాత్రులవుతారు.
మానవుణ్ని జ్ఞానపథంవైపు నడిపిస్తూ విజ్ఞానకాంతులు నింపే విద్య కూడా వినమ్రత లేకపోతే శోభిల్లదని పురాణాలు చెబుతున్నాయి.
ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ఏమేమి చదివావో చెప్పమని కొడుకైన ప్రహ్లాదుణ్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు గురువులు తనను బాగా చదివించారనీ చెబుతాడు. ధర్మశాస్త్రాలను చదివానని అంటాడు. ఇంకెన్నో చదివానని చెబుతూనే 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!' అని వినమ్రతతో అద్భుతమైన విశ్లేషణ ఇస్తాడు.
వినమ్రంగా ఉండటం ఆత్మన్యూనతగా భావిస్తారు కొందరు. కానీ విధేయత అనేది ఓ మానవీయమైన సౌజన్య లక్షణం. స్వాభిమానాన్ని పెంచుకున్నప్పుడు మనిషిలో గర్వం, అహంకారం అధికమవుతాయి. మనకంటే సద్గురువులు ఎంతోమంది ఉన్నారని, వారి వద్దనుంచి నేర్చుకోవలసినది చాలా ఉందని తెలుసుకున్నాక- హృదయంలో అహంకార పొరలు కరిగి వినమ్రతాభావం ప్రవేశిస్తుంది.
మహాభారతంలో మానవ సంబంధాలకు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన చిన్న కథలెన్నో ఉన్నాయి. అవి అద్భుతమైన సందేశాలు అందిస్తాయి.
ఒకసారి సముద్రుడు నదులతో సమావేశమై ఒక ప్రశ్న అడిగాడు. 'నదులారా! మీరు వరదలతో వేగంగా ప్రవహించేటప్పుడు, కొండలపైనుంచి దూకేటప్పుడు పెద్ద పెద్ద చెట్లను పడగొట్టేస్తారు. వూళ్ళకు ఖీ000ళ్ళు ముంచెత్తుతారు. కాని అల్పమైన తుంగ మొక్కలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటున్నాయి. వాటిని మీరెందుకు కదిలించలేకపోతున్నారు?' అని అడుగుతాడు.
అప్పుడు అన్ని నదుల పక్షాన గంగానది సముద్రుడితో 'మేము వేగంగా ప్రవహించేటప్పుడు కొండలు, చెట్లు అహంకారంతో మాకు అడ్డుగా నిలుస్తాయి. అందువల్ల మా బలాన్ని చూపించి వాటిని పడగొట్టేస్తాం. ప్రబ్బలి, తుంగవంటి మొక్కలు మా రాకకు స్వాగతం చెబుతున్నట్లు వినయంతో తలవంచుతాయి. కనుక మేము వాటిమీదుగా ప్రవహించి నీ దగ్గరకు చేరుకుంటాం. తరవాత అవి తలలు ఎత్తి మునుపటిలా బతుకుతాయి. అంతే తప్ప వాటిమీద మాకు ప్రత్యేకంగా ప్రేమ ఏమీ లేదు' అని చెబుతుంది.
శత్రువు బలవంతుడైతే బలహీనుడు ఏ ఉపాయంతో ఆపదనుంచి తప్పించుకోవాలో వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు. ఈ విధంగా వినమ్రతలోని గొప్పతనాన్ని లోకానికి వెల్లడిస్తాడు.
వినమ్రత మానవ జీవితానికి ఆభరణం వంటిది. దానివల్ల మనిషి గుణాలు మరింతగా పరిమళిస్తాయి. విద్వాంసుడి పాండిత్యం, ధనవంతుడి ధనం, బలవంతుడి బలం, గుణవంతుడి నమ్రత అనే గుణాలు లోకహితం కోసం వినియోగించడం మంచిదని నీతికోవిదులు చెబుతున్నారు.
వినమ్రత మనిషి జీవితాన్ని మంచిమార్గం వైపు నడిపిస్తుంది. విలువలతో కూడిన జీవనమార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఉత్తముడైన మనిషి ఎవరినీ ఎగతాళి చేయకూడదు. అసభ్యకరంగా ఏనాడూ ప్రవర్తించకూడదు. పెద్దలను, గురువులను గౌరవించాలి. ఏ మనిషైనా ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాడు.
పోల్చి చూసుకోవడం, పోటీపడటం- ఈ రెండూ ఈర్ష్యాసూయలకు సంబంధించినవి. వీటివల్ల మనిషి ఎదగలేడు. మంచి ఆలోచనలతో ముందుకు సాగి మనమేమిటో మనం గ్రహించి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి.
సభ్యసమాజం మనిషి గుణశీలాలకు, వినయవిధేయతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే వినమ్రతను ఓ సంపదగా భావించి ఏ మనిషైనా ముందుకు సాగితే, ఎల్లప్పుడూ అతడే విజేత
No comments:
Post a Comment