ప్రాంజలి ప్రభ .. మధురిమలు
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తన్వంగి తప్పిదములకు
తన్వి తనువు తాపమునకు
తమ్మికింటి తన్మయముకు
తరళ లోచన నమ్ముటకు
లొంగని దెవ్వరే కళకు
ఇదియు తరుణి నడవడికకు
తరలేక్షణ ఒడి నడకకు
తలిరుబడి చురుకుదనముకు
లొంగని దెవ్వరే కళకు
తలోదరిగ తమకమునకు
తామరకంటి తపమునకు
తామరనేత్ర చూపులకు
లొంగని దెవ్వరే కళకు
తియ్య బడిన తలుపులకు
తీగబడిన కళ మెలికకు
కలసియే తెఱువ తెగువకు
తెలిగంటి కల వలపుకు
తొగవ కంటి తోపుకళకు
ఇక తొయ్యలి తమకమునకు
లొంగని దెవ్వరే కళకు
--((**))--
సీతాపతీ పద్య కావ్యము
సీసము
కాయము కంఠము కదలిక నిలిపియు
స్ధిరమున కూర్చొండి చిత్త ముంచు
దిక్కులు పయనింప దీయక మనసు నే
ఉదయించు సూర్యబింబ మును మల్లె
ఏకాగ్ర చిత్తము ఏర్పర్చి వీక్షించు
దైవము నిత్యము ధర్మ మార్గ
ధ్యానమార్గము లోన దేహము ఉంచుము
లక్ష్మణా దృష్టిసారించు నిలిపు
తేటగీతి
భౌతికము కాదు మానస బద్ర తుంచు
ప్రజ్ణ సహజము వెలుగు అంది పుచ్చు
దిక్కులకు మనస్సు చెదర నీయ కుండు
ధారణ నిలిపి జ్యోతిలా కనులు ఉంచు
**"*
సీసము
స్థితిని బట్టియె జీవి సమరమ్ము జరుపుటే
గతినిబట్టియె జీవి కాల మవ్వు
సుమతి ఏర్పడుటయే సంశయం ఎదురవ్వు
విధివిధానాన్ని యే అనుసరించు
జీవితం నడకగా తరుముతూ సాగేను
లక్ష్మణా జీవితం లోలకమ్ము
విధిఅహం బ్రహ్మాస్మి వాక్కు గా తరుణాన్ని
సద్వినియోగం మ్ము సమయమందు
తేటగీతి
లక్ష్మణా సంశయం ఎదురైన దైవ
నిర్ణయం అని తలచియు విధి అనుకొని
బాటసారిలా మోక్షసాధనకు యోగ
మార్గమేశరణ్య మని యే జీవితమ్ము
***
: సాందీపని మహర్షి
అవంతీపురంలో వేదజ్ఞులు, శాస్త్రజ్ఞులు, పురాణజ్ఞులు అయినటువంటి బ్రాహ్మణులుండే వాళ్ళు.
వారిలో సందీపని మహర్షి కొడుకు సాందీపుడు. సాందీపుడు చిన్నతనంలోనే అన్ని వేదశాస్త్రాలు నేర్చుకుని అన్ని వేదరహస్యాలు తెలుసుకుని దయాశాలి. ప్రియదర్శనుడు, మన_మహర్షులు
సాందీపని మహర్షి
సాత్వికుడు, విష్ణుపూజారతుడు, వివేకధనుడు అంటూ పిలవబడేవాడు. తండ్రికి తగ్గ తనయుడునిపించుకున్నాడు.
సాందీపనికి వివాహం చేశాక ఒక కొడుకు పుట్టాడు. అతడు ఏకసంథాగ్రాహి, తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అతడికి విష్ణు పాదపద్మాల దగ్గరే వుండాలని, సంసారం చావు, పుట్టుక ఇలాంటివి తనకిష్టం వుండదని అంటూండేవాడు.
ఒకరోజు మాఘ పౌర్ణమినాడు స్నానం చేస్తూ ఈ పుణ్యకాలం దాటితో మళ్లీ రాదు అనుకుని విష్ణుమూర్తిని తల్చుకుని నీళ్ళల్లో మునిగిపోయాడు. ఎంత వెతికించినా కనపడలేదు సాందీపని మహర్షి బంధాలుండకూడదని సరిపెట్టుకున్నాడు, కానీ ఆయన భార్య మాత్రం ఏడుస్తూనే వుండేది.
కంసుణ్ణి వధించాక దేవకీ వసుదేవులు బలరామకృష్ణులకి గర్గుడు మొదలైన మహార్షులతో ఉపనయనం చేయించి దానాలు, ధర్మాలు అన్నీ చేసి సాందీపని దగ్గర విద్యాభ్యాసం కోసం పంపించారు.
బలరామకృష్ణులు స్వతహాగా జగద్గురువులు, సంపూర్ణులు, సర్వజ్ఞులు అయినా కూడా గురుశుశ్రూషతో నేర్చిన విద్యే సరైన విద్యని లోకానికి తెలియచెప్పడం కోసం గురువు దగ్గర చేరి చదువుకున్నారు.
ఐలరామకృష్ణులు మహావైభవరాతియైన కాశీకి బ్రహ్మచారులై చేరి అక్కడ అవంతీపురంలో వున్న సాందీపని మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు.
సర్వజగత్తుని నియంత్రించగల బలరామకృష్ణులు తనకి సాష్టాంగపడ్డం ఎంత అపురూపం! ఎంత అద్భుతం ఎంత అదృష్టం! అనుకుని సాందీపని మహర్షి వాళ్ళని శిష్యులుగా అంగీకరించి విద్యాభ్యాసం మొదలుపెడితే రోజుకి ఒక విద్య చొప్పున చెప్పింది చెప్పగానే నేర్చేసుకున్నారు.
అదృష్టమంటే అందరినీ వరించదు. త్రిమూర్తుల్ని పరీక్షించే శక్తి భృగుమహర్షికి, త్రిమూర్తుల్ని చంటి పిల్లల్ని చేయగల శక్తి అనసూయకి, శ్రీరాముడికి గురువయ్యే అదృష్టం వసిష్ఠుడికి, విష్ణుమూర్తిని కొడుకుగా పొందిన యోగం కశ్యపుడిది, పద్నాలుగు లోకాల్ని సంరంక్షించే బలరామకృష్ణులకి పాఠం చెప్పే అదృష్టం వేలాది మహర్షుల్లో ఒక్క సాందీపనికే కలిగింది.
బలరామకృష్ణులు విద్యాభ్యాసం అయిపోయాక గురువుగారికి, గురుపత్నికి నమస్కారం చేసి గురు దక్షిణగా ఏంకావాలనడిగారు.
సాందీపని మహర్షి తన కొడుకు వృత్తాంతం చెప్పి నేనయితే ఇవన్నీ మాములే అని సరి పెట్టుకున్నానుగాని, నా భార్య కొడుకు కోసం ఏడ్వనిరోజు లేదు. మాకు తప్పకుండా గురుదక్షిణీవ్వాలని వుంటే నా కొడుకుని తీసుకురండని చెప్పాడు సాందీపని మహర్షి.
బలరామకృష్ణులు సముద్రుడి దగ్గరకెళ్ళి మా గురుపుత్రుణ్ణివ్వమని అడిగారు.
సముద్రుడు అతణ్ణి నాలో వున్న పంచజన్య అనే రాక్షసుడు మింగేశాడని చెప్పాడు.
అప్పుడు కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి రాక్షసుడి పొట్ట చీల్చాడు. లోపల గురుపుత్రుడు లేడుగాని ఒక శంఖం వుంది. అది తీసుకుని యమపురం వెళ్ళి శంఖారావం చేశాడు. యముడు భయపడి బయటకి వచ్చి, బలరామకృష్ణులకి నమస్కారం చేసి ఆ పిల్లవాణ్ణి వాళ్ళకి అప్పగించాడు.
బలరామకృష్ణులు గురుపుత్రుణ్ణి తీసికొచ్చి సాందీపని మహర్షికి అప్పగించి
నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు.
సాందీపని మహర్షి ఎంతోమంది శిష్యులకి విద్యాదానం చేస్తూ లోకకళ్యాణానికి పాటుపడ్డాడు.
సాధన సాధ్యతే సర్వం
****
: ఏది ముందు కావాలి?
'అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె! ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆ ఇంట్లో ఉండేవారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలో ఇంటిపెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు.
ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి బయల్దేరారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు. చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది.
ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు. మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు.
‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు.
వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు.
‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు.
‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను,’ అన్నాడు తండ్రి.
‘భలేవారే! మన అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఏవుండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య.
ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు.
‘మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది.
సాధన
చేతినిండా పని, మనసునిండా తగిన ఆలోచనలు... ఈ రెండూ మనిషి ప్రగతి రథానికి రెండు చక్రాలు. పనిలేక పోవడం వలన నిరాసక్తత ఏర్పడుతుంది. అలాంటివారిలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. ఆ నిర్లిప్తత వల్ల ఎన్నో అనర్థాలు. అందుకే 'పనిలేనివాడి బుర్ర దయ్యాల నిలయం' అనే నానుడి పుట్టింది.
ఎల్లప్పుడూ పని చెయ్యడానికి అలవాటు పడిన శరీరం చురుకుగా ఉంటుంది. మెదడూ ఉత్సాహం పుంజుకొంటుంది. శరీరాన్ని శ్రమ పెట్టకుండా సుఖాలు కల్పిద్దామని విశ్రాంతినిచ్చామో... శరీరం, మనసు రెండూ రోగగ్రస్తం కావడం మొదలు పెడతాయి.
చైతన్యపురంలో కృషీవలుడు అనే రైతు ఉండేవాడు. అతడికి ఉన్నది కొద్దిపాటి భూమి. అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలసాయం పొందుతూ ఉండేవాడు. అతడు విశ్రాంతిగా ఒక్కరోజైనా కూర్చునేవాడు కాదు.
ఒకసారి అతడు పొలం దున్నుతూ ఉండగా అటు వెళుతున్న ఆ ప్రాంత జమీందారు చూశాడు.
అది నడివేసవి కాలం. కృషీవలుడి గురించి, అతడి విజయాల గురించి అంతకుముందే విన్నాడతను. ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ- బండి ఆపించి దిగి అతడి దగ్గరకు వెళ్ళాడు.
పరస్పర పరిచయాలు అయ్యాక 'ఇంత ఎండలో పనిచెయ్యకపోతేనేం?... ఇది పంట పండే కాలం కూడా కాదాయె. ఇప్పుడెందు కింత శ్రమపడి పనిచెయ్యడం?' అన్నాడు జమీందారు.
ఆ మాటకు జవాబుగా కృషీవలుడు 'పండే కాలం కాదని మనం అనుకుంటున్నాం. భూమికి మాత్రం ఖాళీగా ఉండటం తెలియదు... దానికి తెలిసిందల్లా ఏదో ఒక మొక్కను తనలో నుంచి మొలిపించి పెంచడమే... నేను ఈ రోజు దున్నకపోయినా, విత్తులు వేయకపోయినా భూమి మాత్రం తనపని తాను చేసుకుపోతుంది. తన గర్భంలోనే ఇదివరకటి నుంచి ఉన్న ఏ రకమైన విత్తులనైనా మొలిపిస్తుంది. అలా జరిగితే నేను నిజంగా పంట వేసేవేళకు ఆ కలుపు మొక్కలతో ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది. ఆ పొలంలాంటిదే ఈ శరీరమూ... దీనికి పని చెప్పకుండా ఖాళీగా ఉంచితే ఏవో సుఖాలు కోరుతుంది. ఆలోచనలు చెయ్యడమే సహజ గుణమైన మెదడు సైతం అనేకమైన ఇతర ఆలోచనలు చేస్తుంది. ఫలితంగా పనిచెయ్యకుండా వదిలిన పొలంలో కలుపు మొక్కలు పెరిగినట్లే నా మనోక్షేత్రంలోనూ అనవసరమైన ఆలోచనలు సాగవుతాయి. శరీరానికీ, మనసుకూ హాని చేసే ఆలోచనలు నన్ను ఎటు తీసుకెళతాయో తెలియదు. అందుకే ఈ పొలానికి కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం, మనసుకు చెడు తలపులు కలిగే ఆస్కారం ఇవ్వకుండా ఈ భూమిని మెత్తగా దున్నుతున్నాను. దీనివల్ల రాబోయే వర్షకాలంలో నా పనులు అతి సులువుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది' అన్నాడు. కాబట్టి- ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర కృషి, పరిశ్రమ ఉండాలి. ఉన్నత స్థానానికి ఎదిగేవారి విజయరహస్యం ఇదే.
అందరికీ బయటకు కనిపించేది- ఎదుటివారి విజయపరంపరే. బయటకు కనబడని అంశాలు- వారి నిరంతర శ్రమ, సాధన.
పియానో వాద్యంలో ప్రపంచ ప్రసిధ్ధి పొందినవాడు పడెర్విస్కీ. అతడు కచేరీ ముగిశాక విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ కనీసం అయిదు గంటలు సాధన చేస్తూండేవాడు. అది చూసిన మిత్రుడొకడు 'నువ్వు ఇంత చక్కగా కచేరీ చేస్తున్నావు. అదీ కాక ఇంచుమించు ప్రతిరోజూ కచేరీ ఉంటూనే ఉంది. అయినా ఇంకా సాధన ఎందుకు?' అని అడిగాడు.
ఆ మాట విన్న పడెర్విస్కీ 'నేను ఒక్కరోజు సాధన చెయ్యకపోతే నా సంగీత సామర్థ్యం తగ్గిపోయిందని నాకు తెలిసిపోతుంది. రెండు రోజులు సాధన చెయ్యకపోతే తోటి విద్వాంసులు గుర్తించేస్తారు. వరసగా మూడు రోజులు సాధన చెయ్యకపోతే, నా సంగీత అభిమానులంతా నా సామర్థ్యం తగ్గినట్లు గుర్తిస్తారు. కళ పట్టుబడటం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం మరొకెత్తు. ఈ రెండింటికీ నిరంతర పరిశ్రమే ప్రధానం. అది లేకపోతే మనసు ఖాళీగా కూర్చోదు. మరొక పనిలో పడుతుంది. అప్పుడు అసలు పని సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మనం కోరి తెచ్చుకోకూడదు. దానికోసం నిరంతరం సాధన, కృషి చేస్తూనే ఉండాలి. సాధనతోనే సాఫల్యం కలుగుతుంది' అన్నాడు.
: గురువే దేవుడు
'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా.
యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని కొందరు 'జగద్గురువు'గా భావిస్తారు . అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.
అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.
గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.
క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.
మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!
దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.
గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.
'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.
గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,
పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.
దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
-కర్లపాలెం హనుమంతరావు
ఇంద్రియ నిగ్రహానికి, కోరికలు అణుచుకోవడానికి తేడా ఏమిటి?
--(())--
కోరికను వ్యక్తపరచడం లేదా అణచివేయడం ద్వారా దాని నుండి విముక్తి చేయదు . .
అర్థం చేసుకోండి, మీరు అణచివేసేది మీ స్పృహ యొక్క ఉపరితలం క్రింద వేచి ఉంటుంది, సరైన సమయంలో మీపైకి దూకడానికి సిద్ధంగా ఉంటుంది! మీరు ఒక కోరిక వచ్చినప్పుడు బయట ప్రపంచంలోవ్యక్త పరచకుండా మీ అంతర్ముఖం లో అటువంటి
క్షణంలో మీరు పూర్తి అవగాహనను కొనసాగించగలిగితే, కోరికను దాని ఆటలో చిక్కుకోకుండా సాక్ష్యమిస్తే, అ కోరికనునుండి మీరు విముక్తి పొందుతారు , అది మీపై దాని శక్తిని కోల్పోతుందని మీరు చూస్తారు. ఇదే ఇంద్రియ నిగ్రహం మీ నిజమైన కోరికను గుర్తించండి
మనిషి జీవితాన్ని నడిపే ముఖ్యమైన శక్తులలో కోరిక ఒకటి. మీరు మీ జీవితంలోనికి తొంగిచూస్తే చాలా సమయాలలో మీరు కోరికతోనో, భయంతోనో నడపబడతారు. మనకి చాలా కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకునే శక్తి మనకి లేదు అని మనం చాలా సార్లు అనుకుంటాం. జైన సంప్రదాయం ప్రకారం, భగవంతుడు మనని ఈ భూమి మీదకి పంపేటప్పుడు మన కోరికలు తీర్చుకోవటానికి సరిపడా శక్తిని ఇచ్చి పంపిస్తాడు. కాని మనలో చాలా మంది అలా అనుకోం. ఎందుకు? మన నిజమైన కోరికలకి, అప్పుతెచ్చుకున్నకోరికలకి చాలా తేడా ఉన్నది. మన నిజమైన కోరికలని అవసరాలు అంటారు. అవసరాలుతీర్చుకోవటానికి కావలసిన శక్తి మనందరికీ ఉన్నది. మన అవసరాలు ఏమిటి? ధ్యాన కార్యక్రమంలో ఒక సెషన్‌లో, అందులో పాల్గొన్న వారిని,వారి అవసరాలు, కోరికల లిస్టు రాయమని చెబుతాం. ఆ తరువాత వాళ్ళు ఆ కోరికల మీద ధ్యానం చేస్తారు. తరువాత వారిని తమకోరికలని గుర్తుతెచ్చుకోమని చెబుతాను. వాళ్ళు రాసిన దానిలో చాలా కొద్దిగా మాత్రమే గుర్తుతెచ్చుకోగలరు, అన్నీ గుర్తురావు. ఇది ఎలా ఉంటుందంటే నిండా ఆకులతో ఉన్న చెట్టు మెడిటేషన్ తరువాత ఆకులని రాల్చినట్టు అయ్యి, ఆ చెట్టుకి కేవలం బంగారు ఆకులు మాత్రమే మిగులుతాయి. మీరు అర్ధం చేసుకోగలిగితే ఏది మీ స్వభావ సిద్ధమైన కోరిక, ఏది మీరు కావాలి అని తెచ్చుకున్న కోరికో తెలుస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి అప్రయత్నంగా ముందుకి సాగుతుంది.అప్పుడు మీలో మిగిలిన కోరికలు బంగారంలా ప్రకాశిస్తాయి. అవి తీరగల శక్తిని ఆ కోరికలు కలిగి ఉంటాయి. అవి నిజమైన కోరికలు. మీరు తెలుసుకునే తత్త్వంతో ఈ పని చేస్తే ఈ కోరికలు నిస్వార్ధంగా ఉంటాయి. అవి ఆ వ్యక్తికి కచ్చితంగా ఉపయోగపడతాయి, అదే విధంగా మానవజాతికి ఉపయోగపడతాయి.
కేవలం అటువంటి కోరికలే అవి తీరే విధంగా విశ్వశక్తినితమతో ఉంచుకుంటాయి కోరికలు మన నిజమైన కోరికలైనప్పుడు అవి అవసరాలు అయినప్పుడు, అవి మన అంతరంగ శక్తిని వెల్లడి చేసినప్పుడు వాటిని సాధించే క్రమంలో మనం అలసిపోం.
వాటిని అతి సహజంగా కాలంతో పాటు సాధించగలం అని తెలుసుకుంటాం. మనం సమస్యల్లో ఇరుక్కోం. జరిగిన వాటిని స్వీకరించగలుగుతాం.
--((())--
ఆత్మ నిగ్రహం
మనలోని అంతశ్శత్రువులను జయించాలంటే మహత్తరమైన మనోబలం తప్పనిసరి. చిత్తశుద్ధితో మనసును ఒక బిందువు వైపు కేంద్రీకృతం చేస్తేనే ఏకాగ్రత కుదురుతుంది. దీన్నే ప్రస్తుతం యోగా అంటున్నాం. ధ్యానం, తపస్సు అన్నా ఇదే
మనోబలానికి ఆత్మనిగ్రహం ఇంధనం. ఇది సాధించడం అంత సులువేమీ కాదు. భృగు, దూర్వాస, విశ్వామిత్రుల వంటి మహర్షులే కొన్ని సందర్భాల్లో కామ, క్రోధాది రాగద్వేషాలకు లోనయ్యారు. ఆత్మనిగ్రహానికి నిలువెత్తు దర్పణం శ్రీరాముడు. మానవుడు ఈ సమాజంలో ఎలా మసలుకోవాలో ఆచరించి చూపిన దైవస్వరూపుడాయన. లీలా మానుష విగ్రహధారి శ్రీకృష్ణుడు మానవాళి ఏం చేయాలో చెప్పి గీతాచార్యుడయ్యాడు. దృఢసంకల్పంతో ఆత్మనిగ్రహం సాధించినవారు ఈ కాలంలోనూ ఉన్నారు. సత్యమార్గంలో అహింస అనే ఆయుధంతో అతిపెద్ద దేశాన్ని బంధవిముక్తం చేసినవాడు మహాత్మాగాంధీ
ప్రపంచాధిపత్యం కోసం అర్రులు చాచిన అలెగ్జాండర్, హిట్లర్ వంటివారు లోపలి రాగద్వేషాలను జయించలేక పరాజితులయ్యారు. సాధనతో సాధ్యం కానిది లేదు ఎంతటి వారికైనా క్రోధం, స్వార్థం వంటి గుణాలు వెన్నంటే ఉంటాయి. అవి ప్రకోపించినప్పుడే ఆత్మనిగ్రహం అవసరమవుతుంది. వ్యక్తిత్వ వికాస బోధకులు ఈ అంశాన్నే తరచూ ప్రస్తావిస్తుంటారు.
మన దైనందిన జీవితాల్లో ఉద్యోగ, వ్యాపార సంబంధాల కారణంగా అనేకమందితో మాట్లాడవలసి వస్తుంది. వారందరూ మునులు, యోగులు కారు! అది గుర్తెరిగి మనమే ఆత్మనిగ్రహం పాటించాలి ఆవేశం అనర్థదాయకం- సహనం సర్వజనామోదం' అన్న సూక్తి అందరికీ తెలిసిందే. అయినా ఆచరణలో ఇది కనిపించదు. కారణం ఆత్మనిగ్రహ లోపం! ఆవేశం వల్లనే కోపం వస్తుంది. బుద్ధి మసకబారుతుంది. మాటలు పెళుసుబారుతాయి. పర్యవసానంగా అవతలి వ్యక్తుల్లోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఫలితం అనర్థం! అందుకే మనం శాంత స్వభావులం కావాలంటే మనోబలం పెంచుకోవాలి. ఏకాగ్రతతో ఆత్మనిగ్రహ సంకల్ప సాధనకోసం ఆలస్యం ఎందుకు? ఈ క్షణమే శుభముహూర్తం****
-#రాజేష్ యాళ్ల
#ఉదయం ఆరున్నరకే కాలింగ్ బెల్ మోగింది! "థూ... థూ..." అని ఛాతీ మీద ఊసుకున్నాడు సుబ్బారావ్! చలికి రగ్గు కప్పుకుని హాయిగా పడుకున్న అతనికి ఆదివారం పూట ఆ కాలింగ్ బెల్ ఉలికిపాటునే కాదు కోపాన్ని కూడా రప్పించింది.
'ఎవడ్రా పొద్దున్నే?' అని అడగాలనుకుని మంచం మీదనుండి గబగబా దిగే సరికి జారిపోయిన లుంగీని ఎగలాక్కుని కట్టుకుని తలుపు తెరిచాడు.
ఎదురుగా పళ్ళికిలిస్తూ పలకరించారు నలుగురు వ్యక్తులు "గుడ్ మాణింగ్ సార్!" అంటూ ముక్త కంఠంతో!
'గూండాల్లా వచ్చి గుడ్ మాణింగ్ ఏంటో' అనుకుంటూ తల ఊపుతూ ఏమిటన్నట్టుగా చూసాడు సుబ్బారావ్.
"మేం కాలనీలో ఉన్న బ్యాంక్ నుండి వచ్చామండీ!" అన్నాడు వాళ్ళలో కాస్త పెద్దగా ఉన్నాయన కళ్ళజోడును సవరించుకుంటూ.
"నాకు అప్పులేం లేవండి!" ముక్తసరిగా చెప్పి తలుపు వేసెయ్యబోయాడు సుబ్బారావ్.
"అబ్బే బాకీల వసూళ్ళ కోసం కాదు సార్, మేం బయల్దేరింది..."
అందుకున్నాడు అతని వెనకే ఉన్న ఓ నడివయసాయన.
"నాకు క్రెడిట్ కార్డు కూడా వద్దు!" అన్నాడు సుబ్బారావ్ అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండానే.
"అది కూడా కాదు సార్. మా బ్యాంక్ లో మీరొక్క ఎకౌంట్ ఓపెన్ చేస్తారని అడిగేందుకొచ్చాం." అన్నాడు మరో ఇరవయ్యేళ్ళ కుర్రాడు పక్క నుండి.
"ఎకౌంట్ ఓపెన్ చెయ్యమని అడిగే పద్ధతి ఇదా? ఆదివారం హాయిగా పడుకున్న వాళ్ళను ఎలా పడితే అలా లేపేసి అడుగుతారా?!" విసుక్కున్నాడు సుబ్బారావ్. అతని మనసులో ఇందాక జారిపోయిన లుంగీ జ్ఞాపకం ఇంకా మెదులుతూనే ఉంది!
"సారీ సార్! మా బ్యాంక్ వాళ్ళు దేశమంతా ఒకేసారి ప్రారంభించిన మహాత్తర ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ ఫ్లాట్స్ కి వచ్చాం. ఇవాళంతా మాకిదే పని." మొట్టమొదటిగా పలకరించినతను చెప్పాడు.
"గవర్నమెంట్ బ్యాంకే అంటున్నారు. మీకు జీతాల్లేవా? ఇలా రోడ్డు మీద పడి అడుగుతున్నారేంటి? కొంపదీసి మీ బ్యాంక్ నష్టాల్లో ఉందా?!" అనుమానంగా అడిగాడు సుబ్బారావ్.
వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే సరికి సుబ్బారావ్ కి అనుమానం పెరిగిపోయింది. నలుగురూ తెల్లబోయి చూసినా అంతలోనే ఆ పెద్దాయనే తేరుకుని చెప్పాడు, "అదేం లేదండి, మా బ్యాంక్ చాలా పెద్ద బ్యాంక్. ఎకౌంట్స్ పెంచుకుందామని ఇలా వస్తున్నాం అంతే! నేను ఇక్కడి బ్రాంచ్ మేనేజర్ని."
"లేదండి నాకు మా శాలరీ ఎకౌంట్ వేరే ఉంది. ఎకౌంట్ అక్కర్లేదు." తలుపు వేసెయ్యబోయాడు.
"అలా అనకండి సార్. మా బ్యాంక్ లో సర్వీస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎకౌంట్ ఓపెన్ చేశాక మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీ శాలరీ అకౌంట్ కూడా మా దగ్గరికే మార్చేస్తారు. ఇంకా డిపాజిట్లు వేసుకోవచ్చు. లాకర్ తీసుకోవచ్చు... ఇంకా..." అంటూ పెద్ద చిట్టా విప్పాడు మరో కుర్రాడు.
వాళ్ళు అంత తేలిగ్గా వదిలేలా లేరని అర్ధమైంది సుబ్బారావ్ కి. సబ్బులు, ఫినాయిలు అమ్మే వాళ్ళు బ్రతిమాలినట్టుగా ఈ బ్యాంక్ వాళ్లకు ఈ గతి పట్టిందేమిటో అనుకుంటూ, "సరే ఎకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ ఇవ్వండి. నాకు వీలైన రోజు వచ్చి చేస్తాను." అని చెప్పాడు.
వాళ్ళందరి ముఖాలు విప్పారిపోయాయి. "థాంక్స్ సార్, ఇదిగోండి ఫార్మ్. మీరు ఇవ్వాళ చేస్తానన్నా చేసెయ్యొచ్చు. అవసరమైన పేపర్స్ రేపివ్వొచ్చు. మీ పేరు, వివరాలు చెప్పండి." తన దగ్గరున్న నోట్ బుక్ రెడీగా పెట్టుకుని అడిగాడు రెండో కుర్రాడు.
ముఖం చిట్లించి అడిగాడు సుబ్బారావ్, "ఎలానూ వస్తాను కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు?"
"ఎంత మందిని కలిసామో, ఎన్ని ఎకౌంట్స్ ఓపెన్ అవుతాయో సాయంత్రానికి మేం హెడ్డాఫీసుకు రిపోర్ట్ చెయ్యాలి సార్, చెప్పండి." బ్రతిమాలినట్టుగా అన్నాడు సుబ్బారావ్.
"చాలా థాంక్స్ సార్" అంటూ వెలిగిపోతున్న ముఖంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు మేనేజర్. అతని అనుచరులు అప్పటికే పక్క ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కినట్టున్నారు, తలుపు మూయబోయిన సుబ్బారావ్ కి గయ్ మంటూ వినిపించింది పక్కింటావిడ పెద్ద నోరు, "బుద్దుందా... ఆదివారం పూట పనీపాటా లేని సన్నాసుల్లా బయల్దేరారు... వెళ్ళండి వెళ్ళండి... బ్యాంకట బ్యాంక్. సెలవు పూట అందరి పనులూ పాడు చేస్తూ!"
తర్వాతి రోజు తెల్లవారుతూనే సుబ్బారావ్ సెల్ మోగింది. "సార్ నేను ఫలానా బ్యాంక్ నుండి సతీష్ ని మాట్లాడుతున్నా. నిన్న ఆదివారం మీ బ్యాంక్ కి వచ్చాం. మా బ్యాంక్ లో ఎకౌంట్ తీసుకుంటానన్నారు కదా, ఎప్పుడొస్తున్నారు?"
'ఏమిటో వీళ్ళు అప్పుడే ఫోన్లో ఫాలో అప్ కూడా మొదలు పెట్టేసారు' అనుకుంటూ చెప్పాడు సుబ్బారావ్, "రేపో ఎల్లుండో వస్తాను. నాకూ కుదరాలి కదా?!"
ఆ ఫోన్ ముగించగానే మరో సారి మోగింది. ఎత్తగానే వినవచ్చిందిలా, "నమస్కారం సుబ్బారావ్ గారూ, నిన్న మీ ఇంటికొచ్చాం. మీరు ఎకౌంట్ ఒకటి ఇస్తానన్నారు కదా, అది గుర్తుచేద్దాం అని నేను మేనేజర్ని చేస్తున్నా."
"తప్పకుండా ఇస్తాను సార్, నాకు వీలు చూసుకుని వస్తాను." సుబ్బారావ్ చెప్పాడు.
ఆ కాల్ అయిన రెండు నిమిషాలకే మళ్ళీ మోగింది ఫోన్. "గుడ్ మాణింగ్ సర్, నేను ప్రదీప్ ను మాట్లాడుతున్నా. మీరు మా ఫలానా బ్యాంక్ కి ఎప్పుడొస్తున్నారు, ఎకౌంట్ తీసుకుంటానన్నారు కదా?!"
చిర్రెత్తుకొచ్చింది సుబ్బారావ్ కి. "ప్రదీప్ గారూ, ఎంతమంది చేస్తారు ఒకే మనిషికి మీ బ్యాంక్ వాళ్ళు?! ఇప్పటికి మూడో ఫోన్ మీ వాళ్ళనుండి!" విసురుగా చెప్పాడు సుబ్బారావ్.
"సారీ సార్! మీరు వచ్చినప్పుడు నా దగ్గరికే రండి ప్లీజ్" అంటూ ఫోన్ పెట్టేసాడు ప్రదీప్.
ఆ రోజు మధ్యాహ్నానికల్లా దాదాపు ముఫ్ఫై కాల్స్ ఆ బ్యాంక్ సిబ్బంది నుండే అందుకున్నాడు సుబ్బారావ్. చివరకు కోపంతో ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసేసాడు.
తర్వాతి రోజు ఉదయం నుండి మళ్ళీ మొదలైన ఫోన్ దాడికి తట్టుకోలేక ఆఫీస్ లో పర్మిషన్ అడిగి ఆ ఫలానా బ్యాంక్ కి వెళ్ళాడు. అతన్ని చూడగానే ఆదివారం వచ్చిన కుర్రాళ్ళు ఇద్దరూ పలకరించారు. పేపర్స్ అన్నీ అతని చేతిలోంచి లాక్కున్నట్టుగా తీసుకుని, అన్నీ చూసి తలాడించి, "మీరు సాయంత్రం రండి సార్! మీ పాస్ బుక్, ఏటీయం కార్డ్ అన్నీ రెడీ చేసి ఉంచుతాను." అని చెప్పాడు ప్రదీప్.
సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ బ్యాంక్ కి వెళ్ళాడు సుబ్బారావ్.
అతన్ని చూసిన ప్రదీప్, "పాస్ బుక్ ప్రింటర్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. రేపొస్తే ఏటియం కార్డ్ తో సహా కలిపి ఇచ్చేస్తాను సర్! ఏమీ అనుకోకండి" అన్నాడు ప్రదీప్.
రెండో రోజు వెళ్ళాడు సుబ్బారావ్. ఎకౌంట్ ఓపెన్ చేసినపుడు అతని దగ్గరికి వెళ్లలేదని కోపమో ఏమో, అతన్ని చూస్తూనే సతీష్ ముఖం తిప్పుకున్నాడు. 'అత్తాకోడళ్ళలా బ్యాంక్ లో ఈ గొడవలు, పోటీలు ఏంటో ' అనుకుంటూ సతీష్ దగ్గరగా వెళ్ళి అడిగాడు, "ప్రదీప్ లేడా?"
ముక్తసరిగా చెప్పాడు సతీష్, "లేడండీ, ఏదో పనుందని వెళ్ళిపోయాడు."
"పాస్ బుక్, ఏటీయం కార్డ్ సాయంత్రం ఇస్తానన్నాడు. తయారయ్యాయా?" సుబ్బారావ్ అడిగాడు.
"ఏమోనండి. అతనికే తెలుస్తుంది. రేపు ప్రదీప్ దగ్గరకు వచ్చి తీసుకోండి." అదే తీరుగా సమాధానం చెప్పాడు సతీష్.
మేనేజర్ ఏమైనా సాయం చేస్తాడేమో అన్నట్టుగా వెళ్తూ ఆయన క్యాబిన్లోకి చూసాడు సుబ్బారావ్. తెచ్చి పెట్టుకున్న నవ్వు ముఖంతో రుబ్బురోలు పొత్రం లా బుర్ర, పూనకంలో వేపమండల్లా చెయ్యి ఊపాడు తప్ప బైటకు మాత్రం రాలేదాయన.
చేసేదేం లేక ఆ తర్వాతి రోజు మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాడు సుబ్బారావ్. అతని అదృష్టం కొద్దీ ప్రదీప్ ఉన్నాడు. కార్డ్, పాస్ బుక్ అతనికిచ్చి చెప్పాడు ప్రదీప్, "కార్డ్ పక్కనే ఉన్న ఏటీయం లో మీరొక్కసారి పెట్టగానే మీకొచ్చిన కోడ్ మార్చుకోవచ్చు."
ఏటీయం లోకి వెళ్ళి రెండు నిమిషాల్లోనే తిరిగి వచ్చి చెప్పాడు సుబ్బారావ్, 'కార్డ్ ఇంకా ఆక్టివేట్ అవ్వలేదని వస్తోంది" ప్రదీప్ కి రసీదు చూపిస్తూ.
కంప్యూటర్లో ఏదో చూసి చెప్పాడు ప్రదీప్, "ఇంకా ప్రోసెస్ లో ఉన్నట్టుండి సార్, రేపు మళ్ళీ ఏటీయం లో పెట్టి చూడండి!"
ఆ తర్వాతి రెండు రోజులూ సుబ్బారావ్ ఏటీయం కి, అక్కణ్ణుంచి బ్యాంక్ లోపల ప్రదీప్ దగ్గరకు వెళ్ళడం, మొత్తానికి మూడో రోజునుండి కార్డ్ పని చెయ్యడం జరగడంతో చివరకు 'హమ్మయ్య' అని నిట్టూర్చాడు సుబ్బారావ్.
వారం తర్వాత సుబ్బారావ్ మళ్ళీ వచ్చాడు ప్రదీప్ దగ్గరకు, "కార్డ్ ఏటీయం మిషన్ లోపలకు వెళ్ళిపోయింది. వచ్చి తీసి ఇస్తారా?" అంటూ.
"కోడ్ అంటే పాస్ వర్డ్ టైప్ చేసేటప్పుడు మీరు తేడాగా చేసినా, ఆలస్యం చేసినా కార్డును మెషిన్ తీసేసుకుంటుంది." ప్రదీప్ చెప్పాడు.
"మిగతా బ్యాంకుల్లో అలా లేదు. అసలు కార్డ్ ఇలా పెట్టి అలా తీసేస్తే చాలు." సుబ్బారావ్ అన్నాడు.
"మా బ్యాంక్ లో ఇదే పద్ధతి" చాలా గొప్ప పద్ధతి అన్నట్టుగా సగర్వంగా అన్నాడు ప్రదీప్.
"సరే, కార్డ్ తీసి ఇస్తే వెళ్తాను." సుబ్బారావ్ విసుక్కున్నాడు.
"లేదు సర్. ఏటీయం వేరే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వచ్చి డబ్బు పెట్టేటప్పుడు కార్డ్ తీసి ఇస్తారు. రేపు సాయంత్రం రండి." తాపీగా అన్నాడు ప్రదీప్.
"మీ బ్యాంక్ ఏటీయమ్మే కదా ఎవరో వచ్చి కార్డ్ తీసి ఇవ్వడం ఏంటి? మీకు తెరిచే వీలుండదా?!" సుబ్బారావ్ కోపంగా అడిగాడు.
"లేదండీ మా బ్యాంక్ వాళ్ళకు అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ కి ఇచ్చేసింది. మాకు సంబంధం ఏమీ ఉండదు." ఇంకా తాపీగా చెప్పాడు ప్రదీప్.
సుబ్బారావు కి ఒళ్ళు మండిపోయినా ఎలానో తమాయించుకుని వెళ్ళి తర్వాతి రోజు కార్డ్ తీసుకుని వెళ్ళాడు.
మరో పదిరోజులకల్లా పరుగులు పెడుతూ ప్రదీప్ దగ్గరకొచ్చాడు సుబ్బారావ్. "ప్రదీప్, ఎకౌంట్లో ఉన్న పదివేల రూపాయలూ ఏటీయం నుండి తీసుకుందామంటే ఎకౌంట్లో తగ్గిపోయాయి కానీ నాకు డబ్బు రాలేదు." కంగారుగా చెప్పాడు.
"ఫర్వాలేదు మళ్ళీ మీకొచ్చేస్తాయ్!" అభయమిచ్చాడు ప్రదీప్.
"వచ్చేస్తాయా... ఎప్పుడు ఎలా?" అయోమయంగా అడిగాడు సుబ్బారావ్.
"తిరిగి మీ ఎకౌంట్లోకి పడిపోతాయిలెండి." నమ్మకంగా చెప్పాడు ప్రదీప్.
"ఎప్పటికి?" ఆదుర్దాగా అన్నాడు సుబ్బారావ్.
"ఎప్పటికి అంటే ఏమీ చెప్పలేం. కాసేపాగి పడిపోవచ్చు. లేదా రేపో ఎల్లుండో." ప్రదీప్ జవాబుకి సుబ్బారావ్ మతి పోయింది.
"అన్ని రోజులు పడితే ఎలా? నాకిప్పుడు డబ్బులు కావాలి." సుబ్బారావ్ చెప్పాడు.
"మీ ఎకౌంట్లో డబ్బులు లేవుగా? ఎలా తీస్తారు?" తిరిగి ప్రశ్నించాడు ప్రదీప్.
"డబ్బులు నాకు ఏటీయం ఇవ్వలేదుగా?!" సుబ్బారావ్ ఎదురు ప్రశ్నించాడు.
"కానీ ఎకౌంట్లో తగ్గిపోయాయిగా?!"
"అది మీ తప్పేగా! ఎలానూ తర్వాత వచ్చేస్తాయి అంటున్నారు కదా. ఇక్కడ తీసుకునే ఏర్పాటు చెయ్యాలిగా?!" కోపంగా అడిగాడు సుబ్బారావ్.
"అలా వీలు కాదు సార్. ఎకౌంట్లో ఉంటేనే మీకు ఇక్కడ క్యాష్ ఇవ్వగలం" ప్రదీప్ తాపీగా చెప్తుంటే తారాస్థాయిని అందుకుంటుంది సుబ్బారావ్ కోపం. కానీ అవసరం తనది. దానికి తోడు పోయిన పదివేలు ఎలా వస్తాయో అని బెంగ కూడా పట్టుకుంది కొత్తగా. ఆ బెంగతోనే అడిగాడు నీరసంగా, "ఒకవేళ మూడు రోజుల తర్వాత కూడా రాకపోతే ఏం చెయ్యాలి?!"
"కంప్లయింట్ రాసివ్వాలి మీరు. అప్పుడు నేను మా హెడ్డాఫీస్ కి మెయిల్ పెడతాను." ప్రదీప్ జవాబిచ్చాడు.
"మరి ఆ మెయిలేదో ఇప్పుడు పెడితే నా డబ్బు నాకు వచ్చేస్తుంది కదా!" అర్ధింపుగా అడిగాడు సుబ్బారావ్.
"మూడు రోజులవకుండా మెయిల్ పెట్టడానికి మాకు పర్మిషన్ లేదు సార్!" నిర్మొహమాటంగా చెప్పాడు ప్రదీప్.
మేనేజర్ని కలిసాడు సుబ్బారావ్. ఆయన కూడా వీలుకాదని చెప్పడంతో నిరాశాగా వెళ్ళిపోయాడు. పైగా ఓ ఉచిత సలహా పారేశాడు, శాలరీ ఎకౌంట్ ఇక్కడకు మార్చేసుకుంటే అప్పుడు తన సహాయం చెయ్యగలిగే వాడినని.
ఆ తర్వాత పదిరోజులకు గానీ సుబ్బారావ్ డబ్బులు అతని ఎకౌంట్లోకి రాలేదు.
మరో నెల తర్వాత బ్యాంక్ కి వచ్చాడు సుబ్బారావ్. "ప్రదీప్, ఏటీయం లో జనరేటర్ లేదా? డబ్బు తీసుకుంటూ ఉండగా మధ్యలో ఏటీయం కరెంట్ పోయి ఆగిపోయింది." గాభరాగా అడిగాడు.
"లేదండీ, దానికి యూపీయస్ ప్రాబ్లం ఉంది. మేం కంప్లయింట్ ఇచ్చాం. త్వరలో పెడతామని చెప్తున్నారు."
'వీడి నిదానం తగలెట్టా' అనుకున్నాడు సుబ్బారావ్, ప్రదీప్ సమాధానం విని.
"మరి ఈలోగా కరెంట్ వస్తే?" సందేహంగా అడిగాడు సుబ్బారావ్.
"అందుకే మీరు ఏటీయం దగ్గరే ఉండండి. కరెంట్ వచ్చాక మీ డబ్బు వచ్చేస్తే వచ్చెయ్యొచ్చు. వేరే ఎవరైనా వస్తే మీకు ప్రాబ్లం కదా! అందుకని కరెంట్ వచ్చే వరకూ అక్కడే ఉండి ఇంకెవ్వరూ ఏటీయం ముట్టుకోకుండా చూసుకోండి!" సతీష్ హెచ్చరికకు ఏటీయం లోకి పరుగుపెట్టాడు సుబ్బారావ్.
ఆ రోజు ఆ ప్రాంతంలో నాలుగు గంటల పాటు కరెంట్ పోయింది. ఆఫీసుకు సెలవు పెట్టి కరెంట్ వచ్చే వరకూ ఏటీయంలో నిలబడి చెమటలు కార్చుకుంటూ కాపలా కాసాడు సుబ్బారావ్. కరెంట్ వచ్చింది కానీ ఏటీయం పని చెయ్యలేదు. మళ్ళీ ప్రదీప్ దగ్గరకు పరుగు పెట్టాడు.
"దానికి బ్యాక్ అప్ లేదు కదా. ఓ పావుగంట పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. మిమల్ని అక్కడే ఉండమన్నా కదా!" ప్రదీప్ దబాయింపుకి నిర్ఘాంతపోయి మళ్ళీ ఏటీయంలోకి పరుగు తీసాడు సుబ్బారావ్.
మరో అరగంటకు చచ్చీ చెడీ ఏటీయం స్టార్ట్ అవ్వగానే సుబ్బారావ్ డబ్బులు సుబ్బారావ్ కి వచ్చేసాయి. 'బ్రతుకు జీవుడా' అనుకుంటూ ఏటీయం లోంచి బైటకు వచ్చి చెమటలు తుడుచుకున్నాడు సుబ్బారావ్.
తన స్కూటర్ దగ్గరకు వచ్చి కాసేపు దాని మీద కూర్చుని రిలాక్స్ అయ్యాడు సుబ్బారావ్. తళుక్కుమంటూ ఒక ఆలోచన రావడంతో బండిలో ఉన్న బ్యాంక్ పాస్ బుక్ బైటకు తీసాడు. లోపలకు వెళ్ళాడు. అక్కడ సీట్లలో ఎవ్వరూ లేరు.
"రెండు నుంచి లంచ్ అవర్ సార్! కాసేపు కూర్చోండి" లోపల నుండి వచ్చిన ఆఫీస్ బాయ్ చెప్పాడు. చాలాసేపు కూర్చున్నా ఎవరూ రాలేదు. అనుమానం వచ్చి బైటకు వెళ్లి బోర్డు చూసి వచ్చాడు. అరగంట సేపు లంచ్ అవర్. మూడు గంటలు కావొస్తుండగా తీరిగ్గా, విలాసంగా సీట్లలోకి వచ్చి కూర్చున్నారు సిబ్బంది. ప్రదీప్ దగ్గరకు వెళ్ళాడు. చెప్పమన్నట్టుగా చూసాడు ప్రదీప్.
"ఎకౌంట్ క్లోజ్ చేసేస్తాను." పాస్ బుక్ కూడా ఇస్తూ చెప్పాడు.
"మధాహ్నం ఎకౌంట్ క్లోజ్ అవ్వదు సార్, ఉదయాన్నే రావాలి." ప్రదీప్ చెప్పాడు.
"చూసావుగా ఉదయం నుండి ఎన్ని బాధలు పడుతున్నానో?!" సుబ్బారావు కోపంగా అన్నాడు.
"సరే, మేనేజర్ గారికి ఒక లెటర్ రాసి ఇచ్చి ఆయన సంతకం దాని మీద పెట్టించుకుని రండి." దయతలిచాదు ప్రదీప్.
రిక్వెస్ట్ లెటర్ రాసి మేనేజర్ని కలిసాడు. "ఇంత మంచి ఎకౌంట్ వదులుకోవడం మాకు బాధగానే ఉంది" అంటూ బోలెడు విచారాన్ని పులుముకుంటూ పాస్ బుక్ నీ, ఏటీయం కార్డునూ ప్రదీప్ దగ్గరకు పంపించాడు మేనేజర్.
మరో అయిదు నిమిషాల్లో ప్రదీప్ లోపలకు వచ్చాడు. మేనేజర్ వైపు చూస్తూ "సుబ్బారావ్ గారి ఎకౌంట్లో కనీస మొత్తం లేకపోవడం వల్ల రెండు నెలలకు రెండు వందలు కట్టయిపోయాయి సార్. ఎకౌంట్లో వందే మిగిలింది. ఎకౌంట్ క్లోజింగ్ చార్జెస్ నూట యాభై తీసుకోవాలి. ఆయన ఎకౌంట్లో ఒక యాభై కడితే ఎకౌంట్ క్లోజ్ అయిపోతుంది." తాపీగా చెప్పాడు.
ఆ మాటలు విన్న సుబ్బారావ్ కోపంతో పిచ్చెక్కి పోయాడు. "అసలు నాకు ఎకౌంట్ కావాలని మీ దగ్గరకు నేనొచ్చానా? మీరే వచ్చి ఓపెన్ చెయ్యమని బ్రతిమాలారు. వచ్చాక ఎన్నిసార్లు పాస్ బుక్ కోసం, ఏటీయం కార్డు కోసం ఎన్నిసార్లు తిరిగాను? అసలు మీ దరిద్రపుగొట్టు సర్వీసుకు విసిగిపోయే నేను ఎకౌంట్ క్లోజ్ చేద్దామని నిర్ణయించుకున్నా. పైసా కట్టను. ఏంచేసుకుంటారో చేసుకోండి. నీ..." తన్నుకొస్తున్న బూతులను ఆపుకుంటూ విసురుగా కుర్చీని వెనక్కి జరిపి బ్యాంక్ బైటకు నడిచాడు సుబ్బారావ్.
ఇప్పుడు అతని మనసెంతో ప్రశాంతంగా ఉంది, ఎకౌంట్ క్లోజ్ చేసినందుకు కాదు, శాలరీ ఎకౌంట్ ఆ బ్యాంక్ కి మార్చుకోనందుకు!
***
No comments:
Post a Comment